“చంటబ్బాయ్” సినిమాలోంచి

చంటబ్బాయ్ సినిమాలో తను అమ్మాయిగా నటించడాన్ని తల్చుకుని చిరంజీవి మాటల్లోనే:

నిజం చెప్పొద్దూ నన్ను నేను అమ్మాయిగా ఊహించుకోగానే నవ్వొచ్చేసింది.మళ్ళీ జంధ్యాల ధైర్యం చెప్పారు.ఆ ధైర్యం తోటే మీసాలు తీసేసి రంగం లోకి దిగాను. అమ్మాయిగా నటించడం చాలా సరదాగా థ్రిల్లింగ్ గా అనిపించింది. సాధారణంగా కాస్త ఓవర్ గా నటిస్తారు కానీ అలాంటి ప్రమాదం లేకుండా జాగ్రత్త పడ్డాను. నా పెర్సనాలిటీని అందుకు తగినవిధంగా మలుచుకున్నాను. సున్నితమయిన మూమెంట్స్ ఇస్తూ కళ్ళల్లో చిలిపితనం, నడకలో హొయలూ తెచ్చుకుని ఎక్కడా అతిలేకుండా జాగ్రత్తగా నటించాను.ఈ గెటప్ లో ఒక్కరోజు మాత్రమే షూటింగ్ చేసారు. ఆడవేషంలో ఉన్న నాతో ఫొటో దిగాలని  యూనిట్ లో ఉన్నవాళ్ళందరూ ఉత్సాహపడ్డారు. కొందరు నిర్మాతలు పెద్ద హీరోయిన్ల మీదే చెయ్యేసి ఫొటో తీయించుకున్నట్టే ఫీలయ్యారు. తర్వాత నేను ఆ గెటప్ తీసేసాక నిరుత్సాహపడిపోయారు.

సుహాసిని నన్ను ఆ గెటప్ లో చూసి ముందు సిగ్గుపడింది.తర్వాత నా మూమెంట్స్ చూసి నవ్వాపుకోలేక విరగబడి నవ్వేసింది. నవ్వి నవ్వి ఇంక నవ్వలేక  అసూయ పడ్డం మొదలెట్టింది.నన్ను చూడ్డానికి వచ్చినవాళ్ళంటా తన పెర్సనాలిటీ కంటే నాదే మెరుగంటే మరి అసూయ కలగదూ!

ఆ వేళ ఇంటికి కూడా ఆ గెటప్ లోనే వెళ్ళాను,ఎదురొచ్చిన పిల్లలు నన్ను చూసి “ఎవరు మమ్మీ-ఈ ఆంటీ” అని అడిగారు సురేఖను, నేను తొలుత ఆశ్చర్యపోయి తర్వాత లోలోన నవ్వుకున్నాను.నా శ్రీమతి సురేఖ కూడా ముందు కొంత కంగారు పడక తప్పలేదు.తర్వాత నేను నోరువిప్పితే కానీ అసలు విషయం అర్ధం కాలేదు. అయితే మీసాలు లేని నన్ను చూసి సురేఖ తలతిప్పుకుంది,మళ్ళీ మీసాలు వచ్చేదాకా నా దగ్గరికి వచ్చేదిలేదని సమ్మె చేసింది.ఆ విధంగా ఆరోజంతా సరదాగా గడిచిపోయింది అంటూ వివరించారు చిరంజీవి.

ఈ సినిమా షూటింగ్ లో యూనిట్ లోని 125 మందికీ మీసాలు తీసేసారు,అందుకు కారణం ఉంది. చిరంజీవి కొన్ని సీన్స్ లో మీసం లేకుండా నటించాలి.అది విని చిరంజీవి ‘అబ్బా’ అన్నారు. ‘తప్పదు’ అన్నారు జంధ్యాల, అయితే మీరంతా సహకరించాలి అన్నారు చిరంజీవి. ‘మీ కోసం ఏపనయినా చేస్తాం మీసం ఎంత’ అన్నారు అందరూనూ. అలా చిరంజీవి,జంధ్యాల,బుచ్చిరెడ్డి ఇంకా మిగతా వారంతా కూడా మీసాలు తీసేసారు.  

 

పులగం చిన్నారయణ గారు వ్రాసిన “జంధ్యామారుతం” నించి:

పులగం చిన్నారయణగారికి కృతజ్ఞతలతో

Be the first to comment

Leave a Reply