హాస్య బ్రహ్మ జంధ్యాల…(వెలుగు నీడలు)6వ భాగం

తమ్ముడూ భరతా! పితృవాక్య పరిపాలనా దక్షుడిగా,  ఆడిన మాట తప్పని ఒక బాధ్యాయుతుడైన కొడుకుగా, ప్రజల సంక్షేమం ఎల్లప్పుడు కోరుకునే  ఒక ఆదర్శవంతమైన రాజు గా, ధర్మం నాలుగు పాదాలా నడపవలసిన ముగ్గురు తమ్ముల అన్నగా, నేను ఆ రాజ్య పదవి తీసుకోలేను తమ్ముడూ తీసుకోలేను.

అన్నయ్యా నేను రాను అని ఒక్క మాట చెబితే సరిపోదా, దీనికి అంత సుత్తి ఎందుకు?

సుత్తి అనే మాట త్రేతాయుగం లో భరతుడి సృష్టిగా, జంద్యాల మార్కు  చమత్కారం తో సుత్తివేలు చేత నాలుగు స్థంభాల ఆట  సినిమాలో చెప్పించారు. అప్పటినుంచి ఈ పదం సుత్తి ప్రజల కి ఒక వాడుక మాట గా ఆదరణ పొందింది. 

 

 

సుత్తి సినిమా, సుత్తి వేస్తున్నాడు, సుత్తి ఆపు, చాలా సుత్తిగా ఉంది, మొదలైనవి. ఇది  పురాతన కాలం నించి ఉన్న మాట లాగా ప్రజల్లోకి చొచ్చుకు పోయింది. విజయా పిక్చర్స్ కి చాలా సినిమాలకు వ్రాసిన రచయిత పింగళి నాగేంద్ర రావు  ఇల్లాంటి పదసృష్టి కి నాంది పలికారు.  ఇవి ప్రజల వాడుక భాష లో అతి సహజం గా , ఎప్పటినుంచో ఉన్న మాటలగా,  భాగమై పోయాయి, అస్మదీయులు / తస్మదీయులు, అలమలం, గిల్పం , వీరతాడు మొదలైనవి.  పింగళి తరువాత జంధ్యాల ఈ సాంప్రదాయాన్ని కొనసాగించారు.  ఇటువంటి పదాలు అప్పటిదాకా నిఘంటువు లో  కానీ వాడుకలో కానీ లేకపోయినా,  వాడుకలో అచిర కాలం లోనే సమున్నత స్థానం సంపాయించ గలిగాయి. సున్నితంగా అర్ధవంతమైన సినిమాలు తీసే నిర్మాతగా, ఆధునిక దృక్పధం తో కళాత్మకంగా చైతన్యవంతమైన సినిమాలు తీసే దర్శకుడిగా, జంధ్యాల  హాస్య బ్రహ్మగా  పేరు తెచ్చుకున్నారు. నాట్యం, సంగీతం మొదలైన కళలు  మీదా,  మన సంస్కృతి సాంప్రదాయాల మీదా ఒక తరానికి కె. విశ్వనాధ్ అభిరుచి, ఆసక్తి కలిగిస్తే , జంధ్యాల తన మాటల చమత్కారం తో  మరుగున పడుతున్న సున్నితమైన హాస్యానికి జవ సత్వాలు  ప్రసాదించి  ప్రాణం  పోసారు.

పొద్దున్నే లేచి పరగడుపున ఒక చుట్ట ముట్టించి, వర్షం వస్తే విస్కీ రాకపోతే రమ్ము పుచ్చుకుంటాడే తప్పితే మరే మాదక ద్రవ్యాల జోలికి పోడయ్యా, సాయం కాలం పూట సరదాగా ఒక సిల్క్ జుబ్బా వేసుకుని  అలా సానివాడల గుండా రాత్రికి  ఇంటికి చేరుకుంటాడే తప్పితే పిల్లవాడికి ఎలాంటి దురలవాట్లు లేవండయ్యా

అదేంటయ్యా,   పిల్లవాడు చూడడానికి మంచి వాడిలాగానే కనిపిస్తాడు

దాని దేముందయ్యా  మీరు కనపడరూ

సినిమాల్లో హాస్యం ముఖ్యం గా మూడు రకాలు గా ఉంటుంది, దేహ సంబంధమైనది, సన్నివేశ పరంగా, సంభాషణల పరంగా.  దేహ సంబంధమైనది కొంచెం మోటగా, నటుడి చాతుర్యం మీద ఆధారపడి ఉంటుంది,  ఉదాహరణ కి అరటి తొక్క మీద కాలు వేసి జారిపడడం, అంగ వైకల్యం మీద, దేహానికి బాధ కలిగించడం వల్ల ఇత్యాదులు.  వీటిలో సెన్స్ ఆఫ్ టైమింగ్ ఉన్న నటులు ఎక్కువగా రాణించ గలుగుతారు. సన్నివేశ పరమైన హాస్యం ఇప్పుడిప్పుడే బాగా జనాదరణ పొందుతోంది. ఇందులో ఒక పధకం ప్రకారం హాస్యం పెరుగుతూ ఉంటుంది. ఒక హాస్య నటుడు ఒక  బూటక వైద్యుడు దగ్గరికి వెళ్లడమే కొంచెం నవ్వు పుట్టిస్తుంది,  అక్కడనుంచి ఆ సన్నివేశం లో ఒక  ప్రణాళిక ప్రకారం హాస్యం పెరుగుతూ పోతుంది.  సంభాషణా పరమైన హాస్యం రచయిత సామర్ధ్యం మీదే ఎక్కువ ఆధార పడుతుంది. సన్నివేశాలు కానీ, మంచి నటుల హాస్య చేష్టలు కానీ ఎక్కువుగా పనికి రావు. 

అమ్మా ఇదిగో సూరిబాబు గారు వచ్చారే

ఎవరమ్మా సూర్యాకాంతమా ఆ  , చెవిటి తల్లి అడుగుతుంది

అబ్బా నేనండీ సూరిబాబుని,  మరీ లింగ బేధాలు కూడా తెలియక పోతే ఎలాగండీ ,

అని వాపోతాడు వచ్చినవాడు. ఇక్కడ చెమిటి  తనం వల్ల  కాకుండా చెమిటి తనం వల్ల వచ్చిన ఇబ్బంది వల్ల,   మాటలతో  హాస్యం పుట్టించారు.

ఏం మావయ్యా ఇదేనా రావడం, సామాన్లు ఏమైనా ఉన్నాయా?

లేవురా ఉన్నది ఈ ఒక్క సంచినే, ఇందులో కూడా ఉన్నవి మీ అక్క చేసిన విదేశీ అట్లు, మీ నాన్న తిట్టిన దేశవాళీ తిట్లు, ఆ అట్లు తినలేక ఈ తిట్లు వినలేక చచ్చాననుకో, అని బాధ పడతాడు. ఇదో రకమైన మాటల గారడీ.

జంధ్యాల కి సాహిత్యం మీదా వాడుక భాష మీద ఉన్న పట్టు ఈ రకమైన హాస్యాన్ని పుట్టించడానికి ఉపయోగ పడింది. ఈ రెంటినీ సమన్వయం తో ఉపయోగించి వాడుక భాషలోని వాచలత్వం తో హాస్యం సృష్టించడం జంధ్యాలకే చెల్లింది.

అయ్యా!  ప్రభువు వారి వ్యాకరణం లో తృతీయ తత్పురుష లేదు,  మచ్చుకి మొన్న వారిని కరిచిన కుక్క  కి పిచ్చి పట్టి  చచ్చిందనుకోండి, నన్ను కరిచి నువ్వు చచ్చిపోయావంటారు.

ఒరేయ్ ఒరేయ్ అలా చేతులు వణికించావంటే  నీ నవ రంధ్రాల్లోనూ మైనం కూరుతానురా కుంకా.

ఒరేయ్ మీ అయిదు తొమ్మిదుల నలభైఐదు పిండాకూళ్ళు పిచ్చికలకి  పెట్టా 

దీనికి వెంటనే ప్రతిసమాధానం వస్తుంది

అరే  నా అంతిమ కోరిక మీరెలాగ తెలుసుకోగలిగారు

ప్రతీ  భావానికి ఒక స్పష్టమైన భాష ఉంది (జంధ్యాల మాటలలో .. ఒక్కో అనుభూతికి ఒక్కొక్క  నిర్దుష్టమైన శబ్దం ఉంది)  ఆ భాష నుంచి కొద్దిగా పక్కకు వెళ్ళినా రసాభాస అవుతుంది, ఒక్క హాస్యం లో తప్ప.  హాస్యానికి ఒక ప్రత్యేకమైన భాష, పద జాలం  ఉంది.  పవిత్రమైన మహా భారతం ఎవరు వ్రాసినా శుద్ధమైన భాషలో పవిత్రమైన భావనతో వ్రాస్తారు. ఒక ప్రత్యేక యాస లో జంధ్యాల గారి మాటలలో 

సావిత్రమ్మని జూసి మిక్కిలినేని గాడు రాయే అన్నాడు, నేను రాను పోరా అన్నది. మళ్ళీ  రాయే అన్నడు మళ్ళీ రాను పోరా అన్నది.  గంతే భై సావిత్రమ్మ జుట్టు బట్టుకొని బర బరా ఈడ్చుకొచ్చేసిండు. జక్కడ మన భీముడు అదే మన ఎంటివోడు భై గద పిసకతా ఉన్నాడు పిసకతా ఉన్నాడు ఏం జేస్తాం అన్న ఆన.

సాధారణ సన్నివేశాలలో ఇటువంటి సమయోచితమైన  హాస్యాన్ని  వెతికి పట్టుకొనే  జంధ్యాల నేర్పు ప్రచురణ రంగంలో విశేషం గా ఉపయోగ పడింది,  మొదట హాస్యానికే కొత్త నిర్వచనం చెప్పిన ‘శ్రీ వారికి ప్రేమలేఖ’ తో (పొత్తూరి విజయ లక్ష్మి నవల ఆధారం గా), ఆ తరువాత  మల్లాది వెంకట కృష్ణమూర్తి  తో కలసి.  

వేటూరి ఇద్దరి మధ్య  ఉత్తరం వ్రాయడం లో సున్నితంగా కొత్త పుంతలు తొక్కితే

శ్రీమాన్ మహారాజ మార్తాండ తేజా, ప్రియానంద భోజా … …. మీ గురించి ఎన్నో కలలు కన్న కన్నె బంగారు” అంటూ వ్రాస్తే, జంధ్యాల తనదైన శైలిలో అటువంటి శుద్ధ  భాష లోనే తండ్రి  కొడుకు కు వ్రాసిన ఉత్తరం లో

ఖర్మ కాలి నిన్ను కన్న దిక్కుమాలిన తండ్రి వేయి చేతులతో వ్రాయునది. మీ అమ్మ కులాసాగానే అఘోరిస్తోంది.  నా కాళ్ళు చేతులు బానే కదిలి ఛస్తున్నాయి. …

ఇట్లు

శుంఠ  పరంధామయ్య“. 

 

ఇంకా ఉంది…. 

కంచిభొట్ల శ్రీనివాస్ గారు జంధ్యాల గురించి వ్రాసిన ఆంగ్ల వ్యాసానికి బులుసు సుబ్రహ్మణ్యం గారి స్వేచ్చానువాదం జంధ్యాల అభిమానుల కోసం.

కంచిభొట్ల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలతో

 

Comments:

 

swathi్… 16 weeks ago 

“వేటూరి ఇద్దరి మధ్య  ఉత్తరం వ్రాయడం లో సున్నితంగా కొత్త పుంతలు తొక్కితే
“శ్రీమాన్ మహారాజ మార్తాండ తేజా, ప్రియానంద భోజా … …. మీ గురించి ఎన్నో కలలు కన్న కన్నె బంగారు” అంటూ వ్రాస్తే, జంధ్యాల తనదైన శైలిలో అటువంటి శుద్ధ  భాష లోనే తండ్రి  కొడుకు కు వ్రాసిన ఉత్తరం లో
“ఖర్మ కాలి నిన్ను కన్న దిక్కుమాలిన తండ్రి వేయి చేతులతో వ్రాయునది. మీ అమ్మ కులాసాగానే అఘోరిస్తోంది.  నా కాళ్ళు చేతులు బానే కదిలి ఛస్తున్నాయి. …
ఇట్లు
శుంఠ  పరంధామయ్య”. ” 
మీ article బాగుంది .ఇంకా మీరు వ్రాసిన  దానికి కొనసాగింపు ఆ చిత్రంలోనే మరో సన్నివేశంలో  నరేష్  ముచెర్ల అరుణ   వుత్తరం రాసిందనుకుని   ఉత్తరం లో ప్రియనంద  భోజ  అంటే ఎన్టీ అన్నపుడు పక్కనుంచుని చూస్తున్న  నూతన్ ప్రసాద్   మిత్రవర్గం లో పొట్టి ప్రసాద్   
” ఆ మాత్రం తెలియదా  ప్రియా  పచల్లని ఆనందంగా భుజించేవాడా ” అంటాడు .నిజంగా jandhayalagaru  సమయస్పూర్తికి hatsoff . 
చాల మంచి ఆర్టికల్ about  jandhayalagaru


Be the first to comment

Leave a Reply