సినిమాలకి ముఖ్యమైన సంగీతం, పాటలు గురించి జంధ్యాల చాలా శ్రద్ధ తీసుకుంటారు.
కౌమార దశలో ఉన్న ప్రేమికుడు, ప్రేమికురాలు ఇంటిలోంచి పారిపోయి వచ్చేస్తారు. ఒక హోటల్ గదిలో ఇద్దరే మొదటిమాటు ఉంటారు. ఈ సందర్భంలో ఇద్దరి లోనూ ఆమాయకత్వం , తెలుసుకోవాలనే కోరిక ఉంటాయి. ఇద్దరిలోనూ స్వచ్ఛత, నిర్మలత్వం ఉంది కానీ వాంఛ కూడా ఉంది.
ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో
స్వాతి వాన లేత ఎండలో, జాలి నవ్వు జాజి దండలో
వేటూరి సందర్భానుసారంగా పలికించిన గీతం. ఆ క్షణం లో సందిగ్ధత, వారిలో లేత తనం ఇంకొంచెము ముందుకు వెళ్లడానికి సంశయం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి పాటలో.
అలివేణి ఆణిముత్యమా , నీ కంట నీటి ముత్యమా
అందాల అమ్మకి కుందనాల బొమ్మకి
అడుగు మడుగు లొత్తనా మెత్తగా
అవునంటే తప్పుగా….
వేటూరి గారి గొప్పతనాన్ని ఎంత పొగిడినా తక్కువే కానీ వ్రాయించుకున్న జంధ్యాల గారు అంతా అందంగానూ ఊహించి కల్పన చేశారు ఆ సన్నివేశం. కొంచెం అటు ఇటు అయితే అభాసు పాలు అయ్యే అవకాశం ఉన్నది. ఆ సందర్భం లో వారిలో ఉండవలిసిన అమాయకత్వం, చల్లగా హాయిగా గడిపే క్షణాలు, ఏ మాత్రం తొందరపాటు చూపినా వారి అనుభవా రాహిత్యం కనిపించేటట్టు తనమనసులో భావన వేటూరి గారి ద్వారా పలికించే నేర్పరితనం జంధ్యాలది. అందుకనే అంత మంచి గీతం పలికించారు వేటూరి.
కుదురైన బొమ్మకి కులుకు మల్లె రెమ్మకి
నుదుట ముద్దు పెట్టనా బొట్టుగా వద్దంటే ఒట్టుగా …
దర్శకత్వం అంటే స్క్రిప్ట్ ని యధాతధం గా తెరమీద కెక్కించడమే కాదు, పాటల రచయిత తో కలసి సందర్భానికి సరిగ్గా సరిపోయేటట్టుగా పాటలు వ్రాయించుకోవడం, పాటకు తగిన బాణీ కట్టించడం లోనూ తగు శ్రద్ధ చూపించాలి. తన ఊహలని తెరమీద కెక్కించడానికి ‘మాట పాట’ కోసం జంధ్యాల సరియైన సుస్వరాల జంటను , వేటూరి, రమేష్ నాయుడు (కొన్ని సినిమాల్లో రాజన్ నాగేంద్ర) లను ఎన్నుకున్నారు.
గొప్పగా బతకాలని కోరుకునే ఒక సాధారణ మధ్య తరగతి అమ్మాయి, కలలకి, ఆశలకి కళ్ళెం వేస్తూ నేల విడచి పైకెగరాలనే కోరికను అణుచుకుంటూ, ఆశల తరంగాలు ఊహల కెరటాలు ఎగసెగసి పడకుండా పాడుకొనే పాట, వేటూరి వారి కలం నుంచి జారువాలిన సుస్వరాల మూట. పాటలో సందిగ్ధ భావాలు పలికించారు. కొంత ఆశ అంతా తను అనుకున్నట్టు తనకు మంచిగా అనుకూలంగా పరిణమిస్తాయని, అంతలోనే సందేహం ఏమో ఏమౌతుందో ఆశలు అడియాసలై కట్టుకున్న గాలి మేడలు కూలిపోతాయేమో నన్న భయం
మనసా తుళ్లిపడకే అతిగా ఆశ పడకే
అతనికి నేను నచ్చానో లేదో ఆ శుభ ఘడియా వచ్చేనో రాదో
తొందర పడితే అలుసే మనసా తెలుసా
మనసా నిన్నే మహా అందగాడు తనుగా జతగా మన కందిరాడు
కలలాపవే కన్నె మనసా …
జంధ్యాల వ్రాయించు కొన్న పాటలలో మార్దవము ఎక్కువుగా పలుకుతుంది. మధ్యతరగతి మనస్థత్వాల లోని అద్భుతమైన, అద్వైతమైన ప్రేమ విషయాలలో కూడా ఉండే వాస్తవ దృష్టి ని మధురం గా ఆలాపిస్తుంది .
హిమములా రాలి సుమములై పూసి
ఋతువులా నవ్వి మధువులై పొంగు
నీ ప్రేమా నా ప్రేమా
శిశిరమైనా శిధిలమైనా
విడిచి పోబోకుమా విరహమై పోకుమా…
వేటూరి గారు బహుశా ఆణిముత్యాల లాంటి తన గీతాలు జంధ్యాల గారి కోసమే వ్రాసారేమో అనిపిస్తుంది.
అటు చూడకు జాబిలి వైపు కరుగుతుంది చుక్కలుగా
చలి చీకటి చీర లోనే సొగసంతా దాచుకో ( నీ కోసమే జీవితమంతా వేచాను సందెలలో)
చిరుగాలి దరఖాస్తు లేకుంటే
కరిమబ్బు చినుకల్లే రాలునా
వరదల్లె పొంగునా (కాస్తందుకో దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందు కో)
ఈ తూరుపు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యా రాగాలేవో పారాణి పూసేనులే
తూరుపులో ఉదయించే అరుణ వర్ణం పశ్చిమానికి పారాణి పూయడం అనే భావన, ఉషోదయ అరుణం పశ్చిమాన పచ్చటి బంగారు చాయ గా మారడం అనేది అద్భుతమైన శోభాయమానమైన వేటూరి వారి ఉపమాలంకారం, పడమటి సంధ్యారాగం అనే సినిమా కి.
పాటల లో వేటూరి, జంధ్యాల భాగ స్వామ్యం ఇంత అందంగా ఉండడం లో సంగీత దర్శకుడు రమేష్ నాయుడు గారిది కూడా ముఖ్యపాత్ర.. రమేష్ నాయుడు గారికి సినిమాల్లో ఉత్తినే పాటలు పెట్టడం అంతగా ఇష్టం ఉండదని అంటారు. సందర్భం లో పాట ఉండాలి అని దర్శకుడు ఆయనని నమ్మిస్తేనే స్వరం కట్టేవారుట. అందుకనే అన్ని మధురమైన పాటలు..
అలివేణి ఆణిముత్యమా…
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు…
చైత్రము కుసుమాంజలి…
లిపిలేని కంటి బాస…
కస్తూరి రంగయ్య కరుణించవేమయ్యా…
అలరులు కురియగా ఆడెనదే….లాంటివి అందించారు ఆయన.
జంధ్యాల రాజన్ నాగేంద్ర తో, చినుకులా రాలి నదులుగా సాగి, నీ కోసం జీవితమంతా వేచాను సందేలలో, విరహ వీణ నిదుర రాక మ్రోగే వేళలో;
చక్రవర్తి తో, ఓ ప్రియా ఒంటరి దానను రా, మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి;
మహదేవన్ తో, రాళ్ళల్లో ఇసుకల్లో రాశాను ఇద్దరి పేర్లు, ఏమని పాడను రెండు మనసుల మూగ గీతం; మొదలైనవి కొన్ని సినిమాల్లో అంత అందంగాను స్వరరాగాలు పలికించుకున్నా, రమేష్ నాయుడే ఆయన అభిమాన సంగీత దర్శకుడు. జంధ్యాల ANR తో అన్నమయ్య మీద ‘హరి సంకీర్తనాచార్య అన్నమయ్య’ అనే సినిమా తీద్దామనుకున్నప్పుడు రమేష్ నాయుడు తో సుమారు 75 జనబాహుళ్యం లో ప్రాచుర్యం పొందిన సంకీర్తనలను రాగబద్ధం చేయించుకున్నారు. రమేష్ నాయుడు అప్పటికే ప్రాచుర్యం లో ఉన్న ఈ సంకీర్తనలకు తన దైన స్వర రచనకు ఒప్పుకుంటేనే సినిమాకి చేస్తానని జంధ్యాలతో అన్నారని అంటారు. ఏమైనా ఇద్దరు కలిసి ఈ కీర్తనల సంకలనాన్ని సంగీతపు ఎల్లలను దాటించి తిరుమల దేవుని సన్నిధికి తీసుకెళ్లారు.
ఈ సంకలనం లో స్వర రచన అద్భుతంగా కుదిరింది. ముద్దుగారే యశోదా, చేరి యశోదకు శిశు వితడు, ఫాల నేత్రాలన ప్రబల విద్యుల్లత, అలరులు కురియగా ఆడెనదే, మొదలైన అన్నమయ్య పదాలకి అప్పటిదాకా ప్రాచుర్యం లో ఉన్న రాగ స్వరాలకి మార్పులు చేసి రమేష్ నాయుడు స్వర బద్ధం చేశారు. తేలిక పద్ధతిలో పాత ట్యూన్ లను కాలానుగుణం గా కొద్ది మార్పులు నేటి తరానికి సరిపోయేటట్టు (కీరవాణి అన్నమయ్య సినిమాకి చేసినట్టు) ట్యూన్ చేయకుండా, కొత్త తరహాలో, పాట లో మాధుర్యం, భక్తి భావావేశము అల్లానే ఉండేటట్టు ట్యూన్ చేసే సాహసం చేసి మెప్పించారు రమేష్ నాయుడు. భగవద్దర్శనం కోసం తపిస్తున్న ఒక మహా భక్తుడు భగవాత్సాక్షాత్కారం పొంది ఆనందోత్సా హాలతో, భక్తి పారవశ్యం తో గొంతెత్తి పాడిన పాట, అదివో అల్లదివో. ఇది అప్పటిదాకా ఉన్న సాంప్రదాయ పద్ధతిలో భక్తుని ఆనందం, సంభ్రమం, ఉత్సాహం ప్రతిఫలిస్తున్నట్టు ఉంటే, రమేష్ నాయుడు పాత భావాలను కోలుపోకుండా తనదైన శైలిలో కొత్త ట్యూన్ కి స్వరకల్పన చేసి బాలకృష్ణ ప్రసాద్ నోట మధురంగా పాడించాడు. 75 వైవిధ్య భరితమైన ట్యూన్ల తో ‘హరి సంకీర్తనాచార్య అన్నమయ్య’ బహుశా ఆసక్తి కరమైన ప్రయోగం అయి ఉండేదేమో. దురదృష్టవశాత్తూ సినిమా తీయడం జరగ లేదు కానీ ఈ పాటలు కాసెట్ల రూపంలో విడుదల అయ్యాయి.
కొన్ని దశాబ్దాల తరువాత కూడా ఒక పాట వింటే మనకి ఆ చిత్రము, పాత్ర, సన్నివేశము పాట ద్వారా దర్శకుడు ఉద్దేశించిన భావము కళ్ల ముందు కనిపించి, అప్పటి మధురానుభూతులు గుర్తుకు వస్తే, ఆ పాట అజరామరమైనదని చెప్పు కోవచ్చు. అది దర్శకుడి అసమానమైన ప్రతిభకి తార్కాణం.
ఇంకా ఉంది….
కంచిభొట్ల శ్రీనివాస్ గారు జంధ్యాల గురించి వ్రాసిన ఆంగ్ల వ్యాసానికి బులుసు సుబ్రహ్మణ్యం గారి స్వేచ్చానువాదం జంధ్యాల అభిమానుల కోసం.
కంచిభొట్ల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలతో
Leave a Reply
You must be logged in to post a comment.