శ్రీ విన్నకోట రామన్న పంతులు ఇల్లు విజయవాడలో, మా సందు చివర ఇల్లే. అది 1968 వ సంవత్సరం. వారింటి ఎదురుగా చిన్న స్టేజ్ కట్టి ఓ నాటకం ఆడుతున్నారు. నా క్లాస్మేట్ ఒకరు వచ్చి, ఆ ఆడేవారు మేం చదివే ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్ ప్రభుత్వ కళాశాల విధ్యార్థులేనని, చూద్దాం రమ్మని పిలిచాడు. ఆ నాటకం పేరు గుర్తులేదు కాని దాని రచయిత జంధ్యాల అని గుర్తు. నాటకాలంటే నాకు మొదటి నించీ అంతగా ఆసక్తి లేదు కాబట్టి నేనా నాటకానికి వెళ్ళనేలేదు. ఆ తర్వాత కాలేజ్ డే రోజున జంధ్యాల, రఘ(కెమేరామన్) సుబ్బరాయశర్మ, వీరభద్రరావు మొదలైనవారు కలిసి ఆడిన ఆ నాటకాన్ని చూసాం. దాని పేరు ‘గుండెలు మార్చబడును.’
“ఇదే ఆరోజు వాళ్ళు వేసింది” చెప్పాడు నా మిత్రుడు.
కాలేజి రోజుల్లో మా ఇద్దరికీ ముఖాముఖీ పరిచయం లేదు.
జంధ్యాల సినిమా పరిశ్రమకి వచ్చాక నేనాయన్ని తొలిసారిగా కలిసింది 1976 లోనో ఇంకాస్త ముందో. ఓ రోజు నేను, జ్యోతి మంత్లీ ఎడిటర్ శ్రీ వేమూరి సత్యనారాయణ మద్రాసులో డైరెక్టర్స్ కాలనీలో, జ్యోతి కార్యాలయం నించి మెయిన్ రోడ్‌మీది హోటల్‌కి భోజనానికి వెళ్తూంటే ఓ చోట సత్యనారాయణగారు ఆగి చెప్పారు.
“జంధ్యాల అని ఒక కొత్త రైటర్ పాపులర్ అవుతున్నాడు. అదే ఇల్లు, చూద్దాం పదండి.”
డైరెక్టర్ కె. విశ్వనాధ్ ఇంటి పక్కనే ఉన్న, చందమామ పబ్లికేషన్స్‌లో అకౌంటెంట్‌గా పనిచేసే శ్రీ రామారావు గారింట్లో ఓ భాగంలో అద్దెకి ఉంటున్న జంధ్యాల ఇంటికి తీసుకెళ్ళాడాయన. సమయం మధ్యాహ్నం ఒంటిగంట. వారి నాన్నగారు చెప్పారు ‘భోజనం చేస్తున్నాడు, ఆగండి’ అని. నాలుగైదు నిముషాల్లో భోజనం అవగానే ఒంటిమీద ధోవతితో బయకి వచ్చిన జంధ్యాలని నేను, అతను నన్ను మేం ఇద్దరం ఒకే కాలేజ్‌లో చదివిన వాళ్ళంగా గుర్తుపట్టాం. ఒకరి మొహాలు మరొకరికి మావి సుపరిచితం అవడానికి కారణం అతను స్టేజ్ ఆర్టిస్టు. మా కాలేజీలో కళ్ళజోడు ధరించిన అతి తక్కువమందిలో నేనొకడ్ని కావడం, నన్ను మల్లాది వెంకట కృష్ణమూర్తి, రచయితగా సత్యం జంధ్యాలకి పరిచయం చేస్తే జంధ్యాల సంతోషం వ్యక్తం చేసారు. అప్పటికే రచయితగా నేను పాపులర్ అయాను. డిస్కషన్‌కి వెళ్ళాలని, తను తయారవాలని మృదువుగా మమ్మల్నిక వెళ్ళమన్న సూచనగా చెప్పారు.
1982లో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు శ్రీ ప్రత్యగాత్మ దర్శకుడిగా కొత్త తారలతో ఓ చిత్రాన్ని తీయడానికి సంకల్పించారు. ప్రత్యగాత్మ గారు దానికి డైలాగ్ రైటర్ గా నన్ను అనుకుని మద్రాసు పిలిపించారు. వాళ్ళ ఆఫీసులో ఫస్ట్ ఫ్లోర్‌లోనే నా మకాం. అదే ఆవరణలో వెనక పక్క వారి ఎడిటింగ్ గదులుండేవి. ఓ రోజు అసిస్టెంట్ డైరెక్టర్ షిండే మా ముందు నించి వెళ్తున్న అంబాసిడర్ కారులోని వ్యక్తిని చూపించి చెప్పాడు, అతనే దర్శకుడు జంధ్యాల అని. మర్నాడు పి.ఎ.పి లో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసే శ్రీ మోహన్ గాంధిని, నాకు ఎడిటింగ్ రూంస్ చూపించమని ప్రొడక్షన్ వ్యవహారాలు చూసే ‘ఇంజనీర్ సుబ్బారావు’ గారు పురమాయించారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో మేం ఎడిటింగ్ గదులు చూస్తుంటే, ఓ గదిలో ఎడిటింగ్ కి కూర్చున్న జంధ్యాలకి నన్ను పరిచయం చేసారు మోహన్ గాంధి.
“మల్లాది నాకు తెలియకపోవడం ఏమిటి?” అని నన్ను తన ఎడిటర్ శ్రీ గౌతంగారికి ‘మగ సులోచన రాణి నవలలు బాగా రాస్తాడు” అని జంధ్యాల పరిచయం చేసారు. అప్పటికే ఆంధ్రభూమిలో నా నవలలు కొన్ని సీరియలైజ్ అయి కమర్షియల్ రచయితగా నాకు ముద్రపడింది. నా కొత్త నవల ఆరంభం కానుంది కాబట్టి దాన్ని జంధ్యాల చేతివ్రాతతో ఆరంభిస్తే బావుంటుందనుకుని జంధ్యాలని రిక్వెస్ట్ చేసాను. దానికాయన వెంటనే ఒప్పుకున్నారు. అంధ్రభూమి మద్రాసు విలేఖరి ద్వారా తర్వాత జంధ్యాలతో ఫెయిర్ చేయించి ఆ నవల మొదటి పేరాలని ఎడిటర్ సికరాజు జంధ్యాల చేతివ్రాతతో ఆరంభించారు.
ఆ చిత్ర కథా చర్చలు పూర్తయి ఒన్‌లైన్ ఆర్డర్ వేసుకున్నాం. ఓ రోజు మోహన్ గాంధి నిర్మాత సుబ్బారావు గారికి ఆ కథని వినిపించారు. ఆయనకి అది నచ్చడంతో నేను డైలాగ్ వర్షన్‌ని పూర్తిచేసాను. షూటింగ్ ఏర్పాట్లు మొదలయ్యాయి. శ్రీ వేటూరి పి.ఏ.పి ఆఫీసుకి వచ్చి నా డైలాగ్ వర్షన్ మొత్తం విన్నారు. ఓ సిట్యువేషన్‌కి తగ్గట్టుగా, ‘మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి….’ అనే పాటని రాసారు. శ్రీ చక్రవర్తి దానికి ట్యూన్‌ని కట్టి రికార్డు చేసారు. అయితే ఇంకో వారంలో షూటింగ్ వైజాగ్‌లో ఆరంభం కానున్నదనగా, ఓ రోజు సుబ్బారావుగారు ప్రత్యగాత్మగారిని పిలిచి ఆ సినిమా నిర్మాణం విరమించుకుంటున్నానని చెప్పారు. అది నాకు, డైరెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పెద్దా షాక్. ప్రత్యగాత్మ గారు ఫైల్‌ని విసిరికొట్టి విసవిస ఆఫీసులోంచి బయటకి వెళ్ళిపోయారు. అది చూసిన మా అందరికి ఎంతో బాధేసింది. ఎవరం కిక్కురుమనలేదు. పి.ఏ.పికి ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన ప్రత్యగాత్మగారు తిరిగి మళ్ళీ ఎన్నడూ పి.ఏ.పి. ఆఫీసులో కాలు పెట్టలేదు. దీని వెనక ఓ ప్రముఖ దర్శకుడు, నటుల హస్తం ఉందని తర్వాత తెలిసింది. ఆ విధంగా నేను డైలాగ్స్ రాసిన మొట్టమొదటి స్క్రిప్టే ఆగిపోయింది. అయితే రికార్డయిన ఆ పాటని జంధ్యాల పి.ఏ.పివారి నించి తీసుకుని తను దర్శకత్వం వహించిన “అమరజీవి” సినిమాలో ఉపయోగించుకున్నారు.
***
1985లో ఓ రోజు నేను మిథానిలో ఆడిట్ వర్క్ లో ఉండగా మద్రాసు నించి ఫోన్ వచ్చింది. శ్రీ రవికళా మందిర్ బేనర్ నిర్మాత శ్రీ ఎం. ఎస్. ప్రసాద్ నించి తనకి నేను రాసిన నవల ‘పెద్దలకి మాత్రమే’ సినిమా చేసే ఉద్దేశం ఉందని, జంధ్యాలని దర్శకుడిగా అనుకున్నామని, సికింద్రాబాద్ బసేరా హోటల్‌లో ఉన్న జంధ్యాలని కలవమని చెప్పారు. సాయంత్రం జంధ్యాలని ఓ అరగంట పాటు కలిసాను. తర్వాత స్టోరి డిస్కషన్‌కి రాజమండ్రికి నేను ప్రసాద్‌గారు వెళ్ళాం. అప్పుడు జంధ్యాల అక్కడ షూటింగ్‌లో ఉన్నారు. శ్రీ వేటూరికి, జంధ్యాలకి మనస్పర్థలొచ్చి కలిసి పనిచేయడంలేదు. శ్రీ ప్రసాద్ గారు పూనుకుని ‘శ్రీవారి శోభనం’ చిత్రానికి వాళ్ళిద్దరినీ కలిపారు.
విశేషం ఏమిటంటే అది జంధ్యాల అప్పటికే నిరాకరించిన సబ్జెక్ట్. వరంగల్ చెందిన కృష్ణారెడ్డి అనే ఫైనాన్షియర్ అప్పటికే నాకు అడ్వాన్స్ ఇచ్చి, జంద్యాల దగ్గరకి వెళ్ళి దాన్ని తనకి చేసి పెట్టమంటే, ‘ముందర మళయాళంలో చేయండి. తర్వాత తెలుగులో చూద్దాం’ అని జంధ్యాల ఆయన్ని పంపించేసారు. తను యం.ఎస్. ప్రసాద్ గారితో మాత్రం ఆ మాట అనలేకపోయానని తర్వాత జంధ్యాల నాతో అన్నారు. సెక్స్ ధోరిణి గల కథలన్నా, దృశ్యాలు, పాత్రలన్నా జంధ్యాల అసహ్యించుకునేవారు. సమాజం పట్ల జంధ్యాల బహుజాగ్రత్తగా ఉండేవారు. అందుకు కారణం ఆయన తల్లి తండ్రుల ధార్మికమైన పెంపకం.
జంధ్యాల తండ్రి శ్రీ నారాయణ రావు బుష్ రేడియో డిస్ట్రిబ్యూటర్‌గా చాలా అర్జించారు, పోగొట్టుకున్నారు కూడా. జంధ్యాల కాలేజి చదువు పూర్తయ్యేసరికి వారు నిలువ నీడలేని పరిస్థితిలో ఉన్నారు. జంధ్యాల దూరదర్శన్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అందువల్ల తనకి దూరదర్శన్ అంటే చిన్న సైజు ద్వెషం కూడా ఉందని ఓ సందర్భంలో జంధ్యాల దూరదర్శన్ ఉద్యోగి అయిన నా సమీప బంధువు సమక్షంలో నాకు చెప్పారు. ‘మీకు వాళ్ళు ఉద్యోగం ఇచ్చి ఉంటే, మంచి రచయిత, దర్శకుడిని మేం మిస్ అయేవారం కదా’ అంటే ‘వంకాయ్’ అని కొట్టి పారేసారు. అది జంధ్యాల తన ఆప్తమిత్రుల సమక్షంలో ఉపయోగించే ఊతపదం.
జంధ్యాల తనని ఎవరైనా ఏమైనా అన్నా, పెద్దగా కోపం తెచ్చుకునేవారు కారు. చాలా విషయాలని పట్టించుకునేవారు కారు. కొన్ని చిన్న విషయాల వల్ల మాత్రం ఉగ్రులయ్యేవారు. ఇంక దానికి కాంప్రొమైజ్ అనేదే ఉండదు. నా విషయంలో ఓ సందర్భంలో అలాంటిది ఒకటి జరిగింది. నేను ఆంధ్రజ్యోతి వీక్లీ లో వారనికో మిని కథని రాస్తూండేవాడ్ని. ఓ కథ సినిమాల్లో వేషాలకోసం వచ్చేవాళ్ళని రేగింగ్ చేసే ఇతివృత్తం కలది. అది రాసినప్పుడు నా దృష్టిలో జంధ్యాల లేరు, కాని దాన్ని చదివిన ఓ మిత్రుడు జంధ్యాలకి ఆ కథ గురించి చెప్పి నేను ఆయన్ని ఎద్దేవా చేస్తూ దాన్ని రాసానని చూచించాడు. ఓ రోజు తెల్లారి ఆయన నాకు ఫోన్ చేసి తన అసంతృప్తిని తీవ్రంగా తెలియచేసారు. నేను ఆయన్ని ఉద్దేశించి అది రాయలేదంటే వినరే. ఆంధ్రజ్యోతి అధినేత శ్రీ జగదీష్ ప్రసాద్ గారికి ఫోన్ చేసి నా సీరియల్ ఆపేయమన్నారు. పురాణం గారిమీద కూడ విరుచుకు పడారు. తర్వాతి వారం ఆ కథని మెచ్చుకుంటూ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ రాసిన ఉత్తరం ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. దాంతో తనని అవమానిచడానికే ఆయన ఆ లెటర్ రాసారన్న భ్రమతో ఆయన మీదా ద్వేషం పెంచుకున్నారు. అది ఆయనిక వదల్లేదు. ఆయన మరాణానికి ఏడాది ముందు ఓ సందర్భంలో జంధ్యాల నాతో అన్నారు, తనా కథని ఇంకా మర్చిపోలేదని, మర్చిపోలేనని, ఆ తర్వాత నా కథలు సినిమాలుగా తీసినా శ్రీకాంత్ శర్మతో మళ్ళీ పాటలు రాయించలేదు. మాకిదో చేదు ప్రహసనం.
మద్రాసులోని ఆయన స్వంతింటి గృహాప్రవేశానికి రమ్మని నాకు ఫోన్ చేయలేదాయన, దాంతో నేను వెళ్ళలేదు.
***
జంధ్యాలకి ఆలస్యంగా కవల ఆడ పిల్లలు పుట్టారు. ఆయన్ని అభిమానించే బంధు మిత్రులంతా ఇందుకు ఎంతో సంతోషించాం. వారి మొదటి జన్మదిన వేడుకని ఎంతో ఘనంగా జరిపారు. ఒంటెలు, ఏనుగులు, జోకర్‌లు… ఆయన్ని అభిమానించేవారంతా ఆ వేడుకకి హాజరయ్యారు. నా నవల ఆధారంగా జంధ్యాల తీసిన ఆఖరి సినిమా “విచిత్రం” నిర్మాతని నేను ఆ రోజు జంధ్యాలకి పరిచయం చేసాను. ఆయన అడ్వాన్స్ కూడా అదే రోజు ఇచ్చారు.
***
ఓ రోజు మధ్యాహ్నం ప్రదీప్ ఆఫీసులో కూర్చుని నేను ‘మేఘమాల’ స్క్రిప్ట్ రాస్తున్నాను. అప్పటికే జంధ్యాలకి అనారోగ్యంగా ఉందని ప్రదీప్ నాన్నగారు ఓ రోజు చెప్పారు. ప్రదీప్ నా గదిలోకి వచ్చి విషాద కంఠంతో చెప్పారు.
“బేడ్ న్యూస్ సర్.”
“ఏమైంది?” అడిగాను.
“జంధ్యాల మనకిక లేరు.”
జంధ్యాల మరణించిన రెండో గంటలో నేను రాజ్‌భవన్ రోడ్ ప్రాంతంలోని వారింట్లో ఉన్నాను. అక్కడంతా ఏడుపులు. ఆయన ద్వారా పైకొచ్చిన కమేడియన్స్, హీరోలు, ఇతర నటీనటులు ఉన్నారు. హృదయ విదారకరమైన విషయం ఏమిటంటే జంధ్యాల నాన్నగారికి ఆ సంగతి ఎవరూ చెప్పాలా అని. పండుటాకులా ఉండే ఆయనకి జరిగింది చెప్తే తట్టుకోలేరేమోనని అందరి భయం.
“హాస్పిటలో జంధ్యాలకి ఆపరేషన్ జరుగుతోంది. మీరు ఎలాంటి వార్తకైనా సిద్దంగా ఉండండి” అని పదే పదే అబద్దం చెప్పారు. అనేక మంది వచ్చి ఏడుస్తుంటే మెల్లిగా ఆయన జరిగింది ఊహించగలిగారు. ఇతర ఊళ్ళనించి రావాల్సిన వారు చాలామంది ఉండటంతో, మర్నాడు గాని జంధ్యాల శరీరాన్ని హాస్పిటల్ నించి ఇంటికి తీసుకురాలేదు.
మర్నాడు ఆయన దేహాన్ని స్మశానానికి తీసుకెళ్ళే ఊరేగింపులో నేను పాల్గొనలేదు. ఆ సమయంలో మాతా అమృతానందమయి ఆశ్రమంలో మౌనంగా ఆయన ఆత్మశాంతికి ప్రార్థించాను. నేను ఆఖరిసారి చూసిన జంధ్యాలే నాకు గుర్తుండి పోవాలనుకున్నాను తప్ప జీర్ణించిన ఆయన శరీరాని చూడదలుచుకోలేదు. అందుకే టి.విలో ప్రసారం అయిన ఆయన అంతిమ యాత్రని కూడా నేను చూడలేదు.
-మల్లాది వెంకట కృష్ణమూర్తి.
మల్లాది వెంకట కృష్ణమూర్తి గారికీ శ్రీ అట్లూరి గారికి,తెలుగుసినిమా వారికీ కృతజ్ఞతలతో…
మల్లాది గారి వ్యాసాన్ని ఈ కింద లింకులో చూడచ్చు
http://www.telugucinema.com/c/publish/starsprofile/malladi-jandhyala.php
Leave a Reply
You must be logged in to post a comment.