శ్రీ జంధ్యాల గారితో ఒక ఇంటర్వ్యూ

మంచి హాస్యం లేత ఆకుతో తట్టినంత మృదువుగా ఉండాలి, అంటారు శ్రీ జంధ్యాల

చార్టెడ్ అకౌంటెన్సీ చదివి ఆడిటర్ అవుదామనుకున్న జంధ్యాల ని,    దేముడు  తెలుగు సినిమా లలో  అనుపమానమైన హాస్య సృష్టి చేసి,  ప్రేక్షకులకు ఆహ్లాద కరమైన హాస్యం పంచమని హాస్య బ్రహ్మ గా  మార్చేసాడు. అన్ని రకాల ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న కళాత్మక సినిమాలు శంకరాభరణం, సాగరసంగమం, బాక్సాఫీసు బద్దలు కొట్టిన అడవిరాముడు, జగదేక వీరుడు – అతిలోక సుందరి  లాంటి కమర్షియల్  సినిమాల రచయితగా, విజయవంతమైన సినిమాలు ముద్దమందారం, నాలుగు స్థంబాలాట, ఆహా నా పెళ్ళంట, ఆనందభైరవి, పడమటి సంధ్యారాగం లాంటి సినిమాల దర్శకుడిగా జంధ్యాల, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయి గా నిలిచిపోయారు. సకుటుంబ సపరివారం గా చూడ దగ్గ హాస్య  సినిమాల రచయితగా, దర్శకుడిగా జంధ్యాల ముందు తరం వారికి మార్గ నిర్దేశకులయ్యారు.

ప్రేక్షకులకు ప్రీతిపాత్రుడైన జంధ్యాల గారితో HamaraShehar.com వారి ఇంటర్వ్యూ .

మీ చిన్నతనం గురించి ఏమైనా చెప్పండి.

మాది విజయవాడ. నేను మాంటెస్సోరీ హైస్కూల్ నుంచి SSLC, SRR గవర్నమెంట్ కాలేజీ నుంచి B.Com చదివాను. ఇక్కడ నేనో విషయం చెప్పాలి. నేను కలిగిన కుటుంబం నుంచే వచ్చాను, మా నాన్న గారు బుష్ రేడియోలకు ఆంధ్ర లో డిస్ట్రిబ్యూటర్. నా బాల్యం ఉల్లాసకరం గానే గడిచింది. చిన్నప్పటినుంచి నాకు నాటకాలంటే ఇష్టం ముఖ్యం గా పౌరాణిక నాటకాలు, వాటిలోని విస్తృత ఆహార్యం. నాకు స్కూల్లోనూ కాలేజీ లోనూ ఉత్తమ నటుడిగా చాలా బహుమానాలు  వచ్చాయి.

రచయితగా మీ మొదటి నాటకం ఏది?

‘ఆత్మాహుతి’ నా మొదటి నాటకం. ఇది నేను స్కూల్లో SSLC చదువుతున్నప్పుడు వ్రాసాను. రెండవది బహుకృత వేషం. కానీ  1968 లో వ్రాసిన ‘ఏక్ దిన్ కా సుల్తాన్’ నాకు రచయిత గా పేరు తెచ్చింది. అది సుమారు పది వేల మార్లు  ప్రదర్శించబడి, 15 మార్లు   ముద్రించ బడింది. అది తమిళం, మలయాళం, హింది & ఇంగ్లిష్ లలో కూడా  అనువదించబడింది.

మీరు సినిమాల్లోకి ఎలా వచ్చారు?

నాకు సినిమాలంటే మొదట్లో అంతగా అభిరుచి లేదు. నేను CA చదివి ఆడిటర్ అవుదామనుకున్నాను. కానీ ప్రముఖ సినిమానటుడు శ్రీ గుమ్మడి వేంకటేశ్వరరావు గారు నా నాటకం ‘సంధ్యారాగంలో శంఖారావం’  చూసి మెచ్చుకొని దాన్ని మద్రాస్  కళా సాగర్ లో ప్రదర్శింప చేయించారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు శ్రీ B.N రెడ్డి గారు చూసి, నన్ను వారి కొత్త సినిమాకు రచయిత గా ఆహ్వానించారు. ఆ విధంగా నేను మద్రాస్ సినిమా రంగం లో అడుగు పెట్టాను. 

ఆసక్తి దాయకం గా ఉంది. తరువాత ఏమైంది?

నా దురదృష్టం కొద్ది  కొన్ని రోజులలోనే శ్రీ B.N రెడ్డి గారు కీర్తిశేషులయ్యారు. నేను సందిగ్ధంలో పడ్డాను. కానీ విజయవాడ తిరిగి  వెళ్ళే లోగా కనీసం ఒక సినిమాకైనా వ్రాయాలని  కోరుకున్నాను.  నేను నిరుత్సాహంగా ఉన్న ఆ సమయం లో ప్రముఖ దర్శకుడు శ్రీ K. విశ్వనాధ్ నాకు నైతిక మద్దత్తు ఇచ్చారు.

మీ మొదటి సినిమా ఏది?

రచయితగా నా మొదటి సినిమా  1976 లో విడుదల అయిన శ్రీ హనుమాన్ ప్రసాద్ గారి,  దేవుడు చేసిన బొమ్మలు.  రెండవది,  పెళ్లికాని పెళ్లి.

అప్పుడు మీరు విజయవాడ తిరిగి వెళ్లిపోయారా

లేదు. 1977 లో  అఖండ విజయం సాధించిన శ్రీ K. విశ్వనాధ్ గారి,  సిరిసిరిమువ్వ తో  నేను సినిమా రంగంలో స్థిరపడ్డాను. 1976 – 1981 మధ్యలో నేను సుమారుగా రెండు వందల సినిమాలకి రచయితగా పని చేశాను. శ్రీ K. విశ్వనాధ్,  శ్రీ K. రాఘవేంద్ర రావు ల తో మొదలు పెట్టి  నేను చాలామంది గొప్ప దర్శకులతో పని చేశాను. శ్రీ విశ్వనాధ్ గారి సినిమాలు,  సిరిసిరి మువ్వ,  సీతా మాలక్ష్మి,  శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం,   శ్రీ రాఘవేంద్ర రావు గారి హిట్ సినిమాలు,  డ్రైవర్ రాముడు, అడవి రాముడు, వేటగాడు, అమర దీపం లాంటి సినిమాలకు ఆ కాలం లోనే వ్రాసాను. 

మీరు మొదటి సారిగా దర్శకత్వం వహించిన సినిమా ఏది?

1981 లో విడుదల అయిన ముద్దమందారం నేను దర్శకత్వం వహించిన మొదటి సినిమా. తరువాత ది నాలుగు స్థంభాలాట. రెండూ కూడా బహుళ ప్రజాదరణ పొందాయి.

మీరు మొత్తం ఎన్ని సినిమాలకు పని చేశారు?

350 సినిమాలకు రచయిత గా పని చేశాను. 42 సినిమాలకు దర్శకత్వం వహించాను. ఆనందభైరవి సినిమాకి ఉత్తమ దర్శకుడి గా  రాష్ట్రస్థాయి లో నంది బహుమతి వచ్చింది. అదే సినిమాకి  జాతీయ స్థాయి లో కూడా ప్రాంతీయ సినిమా (తెలుగు)   ఉత్తమ దర్శకుడి గాను బహుమతి వచ్చింది.

మీరు సినిమాల్లో ప్రవేశించడానికి బాగా కష్టపడ్డారా?

మొదట్లో కొంత కాలం  కష్ట పడ్డా ఆ తరువాత బాగానే సాగిపోయింది.

మీకు వ్రాయడానికి స్ఫూర్తి నిచ్చినదేమిటి

నాటకాలు వ్రాసిన అనుభవం. మొదట్లో పౌరాణిక నాటకాలు,  ఆ తరువాత సాంఘిక నాటకాలు. ఇదే కాకుండా నాకు హాస్యం అంటే అత్యంత అభిమానం. చిలకమర్తి, పానుగంటి, కందుకూరి, భమిడిపాటి కామేశ్వర రావు, శ్రీపాద మొదలైన వారి రచనలు నేను చాలా చదివాను. ఇంగ్లీష్ సాహిత్యం లో PG వుడ్ హౌస్ నా అభిమాన రచయిత. ఈ హాస్య రచయిత లందరు కూడా   నాకు స్ఫూర్తి కలిగించారు.

దర్శకత్వం వైపు మిమ్మలని ప్రోత్సహించినది ఎవరు?

వ్యక్తి గతం గా దర్శకుడు  శ్రీ విశ్వనాధ్ నన్ను ఎక్కువగా ప్రోత్సహించారు.   కుటుంబ పరమైన విలువలతో  మంచి సినిమాలు తీయాలనే  నా లోని బలమైన కోరిక  కూడా నన్ను ముందుకు నడిపించింది. ‘మంచి సినిమా మనలని ఆనంద పరుస్తుంది కానీ విలువలు లేని ఒక చెత్త సినిమా ఒక తరాన్ని పాడు చేయగలదు’ అనే నానుడి ని నేను బలంగా నమ్ముతాను.

సినీ రంగం లో మీరు  అభిమానించేవారు ఎవరు?

హీరోలు ; చార్లీ చాప్లిన్, రాజ్ కుమార్ , దిలీప్ కుమార్, NT రామారావు & A.  నాగేశ్వర రావు.

హీరోయిన్స్ ; సావిత్రి

దర్శకులు; K.విశ్వనాధ్, B.N. రెడ్డి, బాలచందర్, బాపు మరియు డేవిడ్ లెయిన్. నేను ఒకమాటు డేవిడ్ లెయిన్ కి వ్రాసాను అతని దగ్గర సహాయకుడిగా పనిచెయ్యాలని ఉంది అని.

రచయితలు; హాస్య రచయిత లందరని నేను అభిమానిస్తాను.

ప్రతినాయకుడు;  S.V. రంగారావు

సినిమా;  మాయాబజార్ , నిజానికి ఇది సినిమాలకి విజ్ఙాన సర్వస్వము .

మంచి సినిమాకి ఉండవలసిన లక్షణాలు ఏమిటి?

ఇది వ్యక్తి గతమైన అభిరుచి మీద ఆధార పడి ఉంటుంది. నా ఉద్దేశ్యం లో మంచి సినిమా అంటే సమాజానికి మంచి చెయ్యక పోయినా హాని చేయకూడదు అని. ఇది  సినిమా తీసే  ప్రతీ వారూ  గుర్తు  పెట్టుకోవలసిన మాట అని నేను భావిస్తాను.  

మీ పూర్వీకులలో ఎవరైనా రచయితలు ఉన్నారా?

లేరు. మా తాత గారు శ్రీ జంధ్యాల శివన్న శాస్త్రి గారు  తెలుగు నుంచి హింది కి డిక్షనరీ ఒకటి వ్రాసారు. సంస్కృత కవులు కాళిదాసు, భవభూతి ల గురించి కూడా వారు వ్రాసారు.

రచయితగా మంచి పేరు గడించిన తరువాత, దర్శకుడవ్వాలని ఎందుకు అనుకున్నారు.

దర్శకుడి నవడానికి  రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి.  సినిమా రంగంలో  కధ కి తగ్గుతున్న ఆదరణ.  రచయిత తో చర్చించకుండా సెట్ లో కధను దర్శకులు  ఇష్టానుసారం గా మార్చడం నాకు  బాధ కలిగించింది. రెండవ కారణం,  అఖండ విజయం సాధించిన శంకరాభరణం సినిమా. ఈ సినిమా విజయం తో,  ప్రేక్షకులు సదుద్దేశం తో తీసిన మంచి సినిమా లను ఆదరిస్తారన్న నమ్మకం కలిగింది. శ్రీ విశ్వనాధ్ గారి ఆశీస్సులతో దర్శకుడిగా అడుగులు వేశాను.

హాస్యం అంటే మీ కెందుకంత ఇష్టం?

నిజమే. నాకు హాస్యం అంటే చాలా ఇష్టం. నేను వ్రాసినవన్నీ హాస్య  నాటకాలే. ఇప్పుడు కూడా ఏదైనా పత్రిక తిరగేస్తే,  నేను మొదట హాస్యకధలే చదువుతాను.

ఈ మధ్య కాలం లో మంచి సినిమాలు ఎందుకు రావటం లేదు?

దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది, మంచి కధలను, రచయితలను సరిగ్గా ఉపయోగించు కోలేక పోవడం. రెండవ కారణం ఏమిటంటే,  తెలుగు సినిమా బడ్జెట్ విపరీతం గా పెరిగిపోవడం.  దీంతో నిర్మాతలు  కనీస పెట్టుబడి రాబట్టు  కోవడం కోసం రీమేక్ లను ఆశ్రయిస్తున్నారు.   మూడవ కారణం గా,  ఇంటింటి కి TV లు రావడం చెప్పుకోవచ్చు,   టి‌వి ల ప్రభావం తో మధ్య తరగతి (క్లాస్ ) ప్రేక్షకులు సినిమా హాల్ కి రావడం తగ్గించేశారు. దాంతో  సినిమాలు పూర్తిగా  మాస్ ప్రేక్షకుల ని ఉద్దేశించి తీయాల్సి వస్తోంది. ఇప్పటి సాహిత్యం లో కూడా సాంప్రదాయపు విలువలు , దేశీయత కూడా లోపిస్తోంది. 

మళ్ళీ మంచి సినిమాలు వస్తాయంటారా?  

తప్పకుండా వస్తాయి.  హాలీవుడ్ సినిమా కూడా ఇలాంటి పరిస్థితులనే, పదేళ్ళ క్రితం అధిగమించింది. తెలుగు సినిమా కి కూడా స్వర్ణయుగం మళ్ళీ వస్తుందని నేను ఘట్టిగా నమ్ముతున్నాను.

సినిమా రంగం నుంచి మీరేమి నేర్చుకున్నారు?

చాలానే నేర్చుకున్నాను.  ప్రతీ సినిమా ఒక సవాలు, ఒక హెచ్చెరిక. శారీరకం గానూ, మానసికం గానూ చాలా కష్టపడాలి. ఎవరూ కూడా గర్వం గా ఉండకూడదు. వినమ్రం గానూ, విధేయత తోనూ  ఉండాలి.  సామర్ధ్యము, సత్ప్రవర్తన కలిగి ఉంటేనే రాణించగలరు.

ఈ  రంగం లో సంతోషం కానీ విచారం కానీ కలిగించిన క్షణాలు ఎన్ని అనుభవించారు ?

చాలా ఉన్నాయి. సినిమా విడుదల అయిన తరువాత విజయవంతమైతే సంతోషం, అపజయం పాలైతే దుఃఖం కలగడం సహజం. అందుకనే సినిమా విడుదలయే ముందు సినిమాకు సంబంధించిన అందరూ ఉద్విగ్నం గా ఉంటారు. ప్రసవ సమయం లో స్త్రీకి ఉండే పరిస్థితే  సినిమా విడుదలయే ముందు సినిమా వాళ్ళకి ఉంటుంది. సినిమా విజయవంతం అవాలనే కోరుకుంటాం. సినిమా విజయం ప్రేక్షకుల నాడి ని సరిగ్గా అంచనా వేయడం పై ఆధార పడి  ఉంటుంది.

అదృష్టం గురించి మీ అభిప్రాయం ఏమిటి?

కష్ట పడి పని చేస్తేనే అదృష్టం వరిస్తుంది.  సోమరితనం ఎప్పుడూ అదృష్టాన్ని తీసుకు రాదు.

విజయానికి మీ నిర్వచనం ఏమిటి?

మంచి మార్గం లో విజయం సాధిస్తే చాలా గర్వం గా ఉంటుంది. అటువంటి విజయాన్ని చాలా కాలం ఆస్వాదిస్తాను.

ఈ నాటి సినిమాలు సమాజాన్ని  తప్పుదోవ పట్టిస్తున్నాయను కుంటున్నారా ?  

అవును. సినిమా నిర్మాత, దర్శకుడు సమాజం పట్ల తమ బాధ్యతను మరచి పోకూడదు.

 మీకు దేముడి మీద నమ్మకం ఉందా ?

అవును . నేను దేముడిని పూర్తిగా నమ్ముతాను.

నైతిక విలువలు పడిపోతున్నాయని ఎందుకు అనుకుంటున్నారు?

ప్రపంచ వ్యాప్తం గా ఈ నైతిక విలువలు దిగజారుతున్నాయి. ఎలా సంపాదించాము అన్నదానికన్నా ఎంత సంపాదించాము అన్న దానికే ఎక్కువ విలువ ఇవ్వడం వల్ల నే నైతిక పతనం జరుగు తోందని  అనుకుంటాను.

I. T.  గురించి మీ అభిప్రాయం ఏమిటి?

I. T గురించి నాకు ఎక్కువగా తెలియదు. 

మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చినవేమిటి?

రచయితగా, శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం, వేటగాడు, జగదేక వీరుడు –  అతిలోక సుందరి. దర్శకుడిగా, నెలవంక, ఆనందభైరవి,పడమట సంధ్యా రాగం.

మీరు పునర్జన్మ ని నమ్ముతారా?

నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు.

రచయితలకు కావల్సిన అర్హతలు ఏమిటి?

రచయిత కు సమాజం పట్ల, సామాజిక పరిస్థితుల పట్ల, సంఘటనల పట్ల పూర్తి అవగాహన ఉండాలి. షేక్స్పియర్ అన్నట్టు , సామాన్యుడు ప్రకృతి లోని అందాన్ని ఆరాధిస్తే, రచయిత అందులోని వికారాన్ని ఊహిస్తాడు.

మీకు నటన అంటే ఇష్టం ఉందా?

ఉంది. నేను ఆపద్బాంధవుడు లో నటించాను. మంచి పాత్ర దొరికితే మళ్ళీ నటిస్తాను.

మీ భాషలో ప్రేమ అంటే ఏమిటి?

అది ఒక గొప్ప అనుభూతి. మాటల్లో చెప్పలేనిది.

వివాహ బంధం మీద మీ అభి ప్రాయం ఏమిటి?

భార్యా భర్తలు ముఖ్యం గా స్నేహితులు గా ఉండాలి. ఆ తరువాతే మిగిలినవి.

మీకు నచ్చిన విహార స్థలాలు ఏవి?

ఇండియా లో అధ్యాత్మిక ప్రదేశాలు తిరుమల, శృంగేరి లాంటివి. విదేశాలలో స్విట్జర్లాండ్.

మీ అభిమాన రాజకీయ నాయకులు ఎవరు?

జవహర్ లాల్  నెహ్రూ , లాల్ బహదూర్ శాస్త్రి.

మీకు నచ్చిన కొటేషన్ ఏమిటి?

రామకృష్ణ పరమ హంస మాటలు  “నీకే మంచి జరగాలనుకుంటావో అది ప్రపంచానికి జరగాలని కోరుకో. నీకే చెడు జరగ కూడదనుకుంటావో అది అసలు ఎవరికి జరగకూడదని కోరుకో.

ప్రస్తుతం మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏమిటి?

జెమిని TV లో ఒక ప్రోగ్రామ్, జోక్ షో, ప్రతి ఆదివారం రోజున ఒక సంవత్సరం పాటు. రెండు సినిమాలు ఇంకా ప్రణాళిక దశలో ఉన్నాయి.

మీరెప్పుడైనా సినిమా రంగంలో అనాదరణ ఎదుర్కొన్నారా?

నేను ఒక మాటు ఢిల్లి ఫిల్మ్ ఫెస్టివల్ కి నేషనల్ యూనిటీ ప్రమోషన్ విభాగం లో పోటీకి   నా సినిమా నెలవంక పంపించాను.  కానీ ఎవరో దాన్ని ఢిల్లీ చేరకుండా అడ్డుకున్నారు. ఫెస్టివల్ లో పోటీలో పాల్గొన లేకపోయాము, ఆ సినిమా ప్రదర్శించ లేక పోయాము.  ఈ రాజకీయ కుతంత్రం నన్ను చాలా బాధించింది. 

మీకు వచ్చిన అతి పెద్ద ప్రశంస ఏమిటి?

నాకు ఇంకా రావాల్సి ఉందని అనుకుంటున్నాను.

హాస్యాన్ని మీరు ఎలా నిర్వచిస్తారు?

మంచి హాస్యం లేత ఆకుతో తట్టినంత మృదువుగా ఉండాలి కానీ బ్యాటు తో కొట్టినట్టు ఉండకూడదు.  నిజమైన హాస్యం ప్రేక్షకుడిని నవ్వించదు కానీ అతనికి సంతోషాన్ని కలుగ చేస్తుంది.

సినిమాలోకి వచ్చే కొత్తవాళ్ళకి మీ సలహా ఏమిటి?

అందరూ ఈ రంగం లో నిలదొక్కు కోలేరు. అంకిత భావం తో కష్టపడాలి. చాలా మంది యువతీ యువకులు సినిమా రంగం మీద వ్యామోహం తో  తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. వాళ్ళు రెండు మూడేళ్లు గడువు పెట్టుకొని, కష్టపడి ప్రయత్నించి,  విజయం పొంద లేకపోతే, వదిలి వెళ్లిపోవడం మంచిది.

ముందు ముందు సినిమా ఎలా ఉండబోతోంది?

ప్రేక్షకుల అభిరుచి మంచి సినిమా నుంచి విలువల్లేని సినిమాకి మళ్లినట్టే , మళ్ళీ మంచి సినిమా వైపుకు కూడా మారుతుంది. ఈ పరిభ్రమణం లోనే సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

హాస్యాన్ని విజయవంతం చేయటం చాలా కష్టం అని విన్నాము, మీరేమంటారు?

హాస్యం తన పరిధులను అతిక్రమిస్తే అభాసు పాలవుతుంది. అందుకనే హాస్య సన్నివేశాలు  వ్రాసేటప్పుడు, నటించేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి.

మీరు ఎటువంటి సినిమాలు నిర్మించాలను కుంటున్నారు?

పూర్తి నిడివి  కల (Full length), కుటుంబ  ప్రధానమైన  మంచి హాస్య సినిమాలు ,  విజయా  వారి గుండమ్మ కధ, మిస్సమ్మ లాంటి వి తీద్దామని అనుకుంటున్నాను. 

జీవితం లో మీ లక్ష్యం ఏమిటి?

నా జీవిత లక్ష్యం అని చెప్పే సాహసం చేయను కానీ జాతీయ స్థాయి లో బహుమతి పొంద గలిగే  సినిమా చేయాలని ఆకాంక్షిస్తున్నాను.  నాకు ఆ శక్తి,  సామర్ధ్యాలను ప్రసాదించమని భగవంతుడిని  ప్రార్ధిస్తున్నాను.

………………………………………..                           

జంధ్యాల గారు భౌతికంగా ఉన్న రోజుల్లో శ్రీ ఆదెళ్ళ శివకుమార్ గారు జంద్యాల గారిని చేసిన ఇంటర్వ్యూ ఆంగ్ల మూలానికి శ్రీ బులుసు సుబ్రహ్మణ్యం గారి తెలుగు స్వేచ్చానువాదం.

శ్రీ ఆదెళ్ళ శివకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలతో

శ్రీ ఆదెళ్ళ శివకుమార్ గారి ఇంటర్వ్యూ ఈ కింద లింకులో చూడవచ్చు.

http://ilovehyd.com/interviews/interviews-an-interview-with-the-humble-sri-jandhyala.html

 

Comments:

 

jjr .. 9 weeks ago 

very good

pravasarajyam 13 weeks ago

jandhyala gari antarangaanni avisharinchina vidhanam chala chakkagaa undi.

pravasarajyam 13 weeks ago 

very informative about ari jandhyala.

mbtsridevi 14 weeks ago

chaala baagundi

Be the first to comment

Leave a Reply