దర్శకులు కె. విశ్వనాధ్ గారి జ్ఞాపకాల్లో జంధ్యాల

జంధ్యాలతో  పరిచయం 

ఒక నాటక రచయితగా, రంగస్థల నటుడిగా మొదటిసారి జంధ్యాలను వాణీమహల్ లో చూసాను  . తర్వాత ఆయన 1972 లో మద్రాసు వచ్చాకా మా ఇంటికెదురుగానే అద్దెకుండేవారు. ఎదురుబొదురే  కాబట్టి ఇద్దరం రోజూ కలిసేవాళ్ళం . అలా మా ఇద్దరికీ పరిచయం పెరిగింది . తర్వాత బిఎన్ రెడ్డిగారికి ఏదో సబ్జెక్ట్ చేస్తున్నారని విన్నాను కానీ అనుకోకుండా ఆయన చనిపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం , అదే టైం లో నేను సిరిసిరిమువ్వ ప్లాన్ చెయ్యడం, అతనికి నా దగ్గర పని చెయ్యాలని కోరిక కలగడంతో దర్శక రచయితలుగా మా ఇద్దరి అనుబంధం మొదలైంది . చెప్పాలంటే అతను ఒక డైలాగ్ రైటరుకానే కాక , ఒక అసిస్టెంట్ డైరెక్టరుగా నిత్యం మాతోనే ఉండేవాడు . ఆ సినిమా తర్వాత పరిచయం ఇంకా గట్టిపడటం వల్ల ,తర్వాత  ఏ సినిమాకు స్క్రిప్ట్ రాయించుకోవాలన్నా జంధ్యాల చేస్తే బాగుంటుందేమో అన్నంత ఆత్మీయుడయ్యాడు.

జంధ్యాలతో అనుబంధం

జంధ్యాల నా అఫిషియల్  రైటర్ అని చెప్పుకునేకన్నా ( ఇద్దరూ 7-8 సినిమాలకు కలిసి పనిచేసారు)  ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పుకోవటమే ఇష్టపడతాను ! వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీలు అప్పటికీ  ఇప్పటికీ చాలా చనువుగా వుంటాయి . మద్రాసులో ఉన్నప్పుడు తనూ, నేనూ,  దేవదాసు , వేటూరి గారు షూటింగ్ లేనప్పుడు గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్ళం . అతనికి సిగరెట్ లాంటి అలవాట్లు ఉన్నాయని అందరూ అనడమేకానీ , నా ముందర ఒక్కరోజు కూడా బయటపడలేదు. ఆ పద్ధతి, అణకువ, సౌమ్యం నాకు అతనిలో చాలా నచ్చేవి .

రైటర్ గా జంధ్యాల  

అతని డైలాగుల్లో ఉండే క్లుప్తత, పంచ్, సటిల్ హ్యూమర్…నాకు బాగా నచ్చుతాయి ! ‘ శంకరాభరణం ‘ మొత్తం 10-15 పేజిల డైలాగులే అంటే నమ్ముతారా ! అసలు ‘ సిరిసిరిమువ్వ ‘ అయితే చెప్పనే అవసరం లేదు ! అతనిలో ఉన్న విశేషం…… అతని ధారణా శక్తి.! విశ్లేషణా శక్తి ! సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నప్పుడు , కీ డైలాగ్స్ అన్నీ టకటకా నోట్ చేసుకుని , వాటిని సీన్లో పెట్టేటప్పుడు ఆ స్పిరిట్ పోకుండా దానికి ఏ ఛలోక్తి ఏడ్ చెయ్యడమో , హాస్యంగా మలచడమో చేసేవాడు. ఇంకోటి …. అతని స్పెషాలిటీ తిట్లు . ఎన్ని వందల తిట్లు దండకం కింద తయారుచేసేవాడో ( నవ్వుతూ) మరది ఎక్కడినుంచి వచ్చిందో, ఏంటో తెలీదు    

డైరెక్టర్ గా జంధ్యాల …..

జంధ్యాల ఒక రైటర్ కూడా కావడంతో , తను అనుకున్నది , ఊహించుకున్నదీ, ట్రాన్స్ మిషన్ లాస్ లేకుండా తీయగలిగాడు . దానికి తోడు అతని అబ్సర్వేషన్ ! చుట్టూవుండే మనుషుల్లోని మ్యానరిజంస్ వీక్ నెస్స్ లను గమనించి వాటికి కొంత అతిశయోక్తిని జోడించి , వాటినే క్యారెక్టర్ ల కింద సృష్టించి , హాస్యానికి ఒక కొత్త నిర్వచనం సృష్టించాడు ! బేసిక్ గా అతను చాలా ఇండిపెండెంట్ స్పిరిట్ ఉన్న డైరెక్టర్ . రెండువైపులా పదునున్న కత్తి . ఒకవైపు  ‘ శ్రీవారికి ప్రేమలేఖ ‘ వంటి ఔట్ అండ్ ఔట్ కామెడీ తీస్తున్న సమయంలోనే , ‘ ఆనందభైరవి ‘ లాంటి ఒక మాస్టర్ పీస్ ని కూడా తీయగలిగాడంటే ,అతని సామర్ధ్యమేంటో  అర్ధమవుతుంది ! ఇక అతని సినిమాల్లో కామెడీ అయితే చెప్పక్కరలేదు . ఎప్పుడయినా స్ట్రెస్ గా ఉన్నప్పుడు కానీ , తోచనప్పుడుకానీ అతని సినిమాలే చూస్తుంటాను . నాకు తెలిసి హాస్య భరితమైన సినిమాలు తీసిన డైరెక్టర్ ల పేర్లు ఏరోజు చెప్పుకున్నా జంధ్యాల పేరే ముందొస్తుంది !

జంధ్యాల చివరిరోజులు …..

రానురానూ జంధ్యాల తాగుడికి బానిసయిపోతున్నాడని తెలిసి , అతన్ని రివైప్ చెయ్యడానికి ఒక సీరియల్ ( సర్వమంగళ) అప్పచెపుదామనుకున్నాను . బిజీ అయికొంతా , నేను ఎదురుగావుంటే కొంతా   ఇవన్నీ తగ్గుతాయని అలా చేయాలనుకున్నాను . దానికి సంబంధించి హైదరాబాదులో అయిదారు సిట్టింగులు కూడా జరిగాయి. తర్వాతర్వాత  ఆరోగ్యం బాగాలేదు , రాలేకపోతున్నాను అన్నాడు. అందుకని ఓసారి నేనే  తనని  పలకరించడానికి వెళ్ళాను . పాపం చాలా బ్యాడ్ గా ఫీలయ్యాడు. ‘ బాధపడొద్దు ఇప్పుడేం కొంపలు ముంచుకుపోవట్లేదు కొంచెం బాగయిన తర్వాత మళ్ళీ పనిచేద్దాం అని చెప్పాను . అలా కొన్నిరోజులు గడిచింది . ఒకరోజు నేను SIMLA లో  షూటింగ్  చేస్తుండగా అతను చనిపోయాడనే దుర్వార్త తెలిసింది. చాలా బాధపడ్డాను . నిజంగా నేనతన్ని ఏదో మార్చేస్తానని కాదు గానీ, అతను మళ్ళీ రాయాలని , మంచి సినిమాలు తీయాలని నాకు బలమైన కోరిక  ఉండేది.  తలుచుకుంటే ఇప్పటికీ బాధనిపిస్తుంది. కానీ, ఆత్రేయగారన్నట్టూ ‘ పోయినోళ్ళందరూ మంచోళ్ళు , ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగురుతులు”…… అతని దగ్గర పనిచేసిన ఆర్టిస్టులందరూ కలిసి , ప్రతి ఏటా అతని జయంతి టైం లో , అతన్ని తలుచుకొని ఒక పండుగలాగా ఈ హాస్యోత్సవం  చేయడం నిజంగా హర్షణీయం! మనదగ్గర ఎంతోమంది గొప్ప గొప్ప డైరెక్టర్లున్నారు ….కెవి రెడ్డి గారు, ఆదుర్తి సుబ్బారావుగారు , సి పుల్లయ్య గారు , వాళ్ళెవరికీ దక్కని యోగం ఇతనికి దక్కిందంటే అది మామూలు విషయం కాదు . నాకు తెలిసీ అంతటి యోగం గతంలో ఏ డైరెక్టర్ కీ దక్కలేదు. ఇకముందు ఎవ్వరికీ దక్కదు కూడా ! 

“ఫామిలీ” పత్రిక సౌజన్యంతో

Be the first to comment

Leave a Reply