జంధ్యామారుతం పుస్తకం గురించి సమీక్ష

జంద్యాల అభిమానులకు “జంధ్యావందనం” సభ్యుల తరపున సంక్రాంతి శుభాకాంక్షలు.

ఈ రోజు హాస్య బ్రహ్మ జంధ్యాల జన్మదినం. భౌతికంగా అమరుడయినా ఆయన తన సినిమాలు/సంభాషణల ద్వారా మనమధ్యే చిరంజీవి గా ఉంటారని ఉండాలని కోరుకుంటూ…….

శ్రీ పులగం చిన్నారయణ గారు జంధ్యాల సినిమాలపై వ్రాసిన “జంధ్యామారుతం” విశ్లేషణాత్మక పుస్తకం పైన ఒక సమీక్ష మీ కోసం…

జంధ్యాల సినిమాలు చూడడం, వాటి గురించి మాటాడుకోవడం మాత్రమే కాదు, ఆ సినిమాల గురించి చదవడంలోనూ ఓ ఆనందం ఉంది. ఆ ఆనందాన్ని అందించే పుస్తకం ‘జంధ్యా మారుతం.’ దర్శకుడిగా తన పద్దెనిమిదేళ్ళ కెరీర్లో జంధ్యాల తెరకెక్కించిన ముప్ఫై తొమ్మిది సినిమాలలో, ఇరవై ఎనిమిది సినిమాల గురించి సినీ జర్నలిస్ట్ పులగం చిన్నారాయణ సవివరంగా రాసిన వ్యాసాల సంకలనమిది. పేరుకి తగ్గట్టే, పుస్తకం చదువుతున్నంతసేపూ, ఓ పిల్ల తెమ్మెర స్పృశించి వెళ్తున్న అనుభూతి కలుగుతుంది పాఠకులకి. 

జంధ్యాల సినిమాలన్నింటినీ మళ్ళీ మళ్ళీ చూడడంతో పాటుగా, ఆయన పరిచయం చేసిన నటులు, కలిసి పనిచేసిన సాంకేతిక నిపుణులని ఇంటర్యూలు చేసి, అలనాటి సినిమా పత్రికల నుంచి ఆయా సినిమాల షూటింగ్ విశేషాలని సేకరించీ రాసిన కథనాలు ఆద్యంతమూ ఆసక్తిగా చదివిస్తాయి. తెరవెనుక సంగతులని సేకరించడానికి రచయిత పడ్డ శ్రమ ఎంతటిదన్నది సులభంగానే అర్ధమవుతుంది.  కొన్ని సినిమాల వర్కింగ్ స్టిల్స్ ని జతచేయడం, పుస్తకం చదివే సిని ప్రియులకి కనువిందు. 

“ఓ చేత్తో ‘సిరిసిరిమువ్వ’ లాంటి క్లాస్ సినిమాకి, మరో చేత్తో ‘అడవిరాముడు’ లాంటి మాస్ సినిమాకి ఏకకాలంలో మాటలు రాసి ‘శభాష్’ అనిపించుకున్న జంధ్యాలకి సిని రంగ ప్రవేశం చేసిన నాటినుంచీ దర్శకత్వ శాఖ మీద యెనలేని ప్రేమానురాగాలున్నాయి. 1976 లో ‘దేవుడు చేసిన బొమ్మలు’ చిత్రం ద్వారా సంభాషణల రచయితగా తొలిసారి కలం ఝుళిపించిన జంధ్యాల… ఐదేళ్లలోనే దాదాపు 85 చిత్రాలకు మాటలు రాయగా, అందులో 80 శాతం సినిమాలు ఘన విజయాన్నిసాధించాయి,” అంటూ జంధ్యాల దర్శకుడిగా మారడానికి పూర్వరంగాన్ని వివరించిన చిన్నారాయణ, ఒక్కో సినిమా గురించీ వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. 

ఎక్కడా దర్శకత్వ శాఖలో పనిచేయకుండా, కేవలం పరిశీలనా సామర్ధ్యంతో దర్శకుడిగా మారిన జంధ్యాల, సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమా తీయాలనే కోరికతో ‘ముద్దమందారం’ మొదలు పెట్టారనీ, తన గురుపుత్రుడు విన్నకోట విజయరాం కి మేనల్లుడైన ప్రదీప్ ని హీరోగా ఎంచుకున్నారనీ ఈ పుస్తకం చదవకపోతే ఎలా తెలుస్తుంది? ఇక ‘మల్లెపందిరి’ షూటింగ్లో షేక్ మోసెస్ మూర్తి పాత్ర పోషించిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో జంధ్యాల షూటింగ్ అనుభవాలు చదివి నవ్వకుండా ఉండడం అసాధ్యం. 

‘నాలుగుస్తంభాలాట’ లో ఓ హీరోగా నరేష్ ని ఎంచుకోవడం వెనుకా, ‘నెలవంక’ సినిమా షూటింగ్ కోసం కృష్ణాజిల్లా ముక్త్యాల ని లొకేషన్ గా ఎంచుకోవడం వెనుకా ఉన్న ఆసక్తికరమైన సంఘటనలు మొదలు, ‘రెండు జెళ్ళ సీత’ ద్వారా హాస్యనటిగా శ్రీలక్ష్మికి బ్రేక్ వచ్చిన వైనం వరకూ ఎన్నెన్ని సంగతులో. అలాగే సుత్తి ద్వయం వేలు, వీరభద్రరావుతో జంధ్యాలకి ఉన్న ప్రత్యేక అనుబంధం, నూతన్ ప్రసాద్, కోట శ్రీనివాసరావు తదితర నటులు జంధ్యాలను గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇవన్నీ చదువుకుంటూ ముందుకు వెడితే, ‘అమరజీవి’ మినహా జంధ్యాల-అక్కినేని కాంబినేషన్ లో మరో సినిమా రాకపోడానికి కారణం, అప్పటివరకూ స్ట్రెయిట్ సినిమాలు తీస్తూ వచ్చిన జంధ్యాల ‘మూడుముళ్ళు’ సినిమా కోసం తమిళ కథని ఎంచుకోవడం లాంటి విషయాలు పేజీలని చకచకా తిరిగేలా చేస్తాయి. 

‘శ్రీవారికిప్రేమలేఖ’ ‘ఆనంద భైరవి’ ఈ రెండూ జంధ్యాల కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమాలు. వీటిని గురించి ప్రత్యేక శ్రద్ధతో వ్యాసాలు రాశారు చిన్నారాయణ. “ఈనాడు గ్రూపు నుంచి ఓ కొత్త వింగ్ మీతో ప్రారంభమవుతోంది. మున్ముందు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు గర్వంగా ఫీలయ్యేట్టుగా సినిమా తీయమని తనతో రామోజీరావు చెప్పిన మాటలని చేతల్లో నిజం చేసి చూపించారు జంధ్యాల” అంటూ ‘శ్రీవారికి ప్రేమలేఖ’ గురించీ, ‘ఆనంద భైరవి’ లో భైరవిగా మెప్పించిన బెంగాలీ అమ్మాయి మాళవికా సర్కార్ కి తెలుగు రాదనీ, కూచిపూడి నృత్యం అస్సలు తెలీదనీ చదువుతున్నప్పుడు జంధ్యాలలో మరోకోణం తెలిసినట్టు అనిపించింది. 

ఎన్టీఆర్ నటించిన ఓ సినిమాలో కీలకమైన పాయింట్ ని బేస్ చేసుకుని అల్లుకున్న కథతో, బాలకృష్ణ హీరోగా ‘బాబాయ్-అబ్బాయ్’ సినిమా తీశారు జంధ్యాల! అప్పట్లో పేపర్లో వచ్చిన ఓ వార్త ‘సీతారామ కళ్యాణం’ సినిమాకి స్ఫూర్తి!! అలాగే, నరేష్-భానుప్రియ జంటగా నటించిన ‘మొగుడూ-పెళ్ళాలూ’ సినిమాలో ఓ సన్నివేశం, అప్పట్లో జంధ్యాల దగ్గర పనిచేసిన ఈవీవీ సత్యనారాయణ తర్వాతికాలంలో ‘జంబలకిడిపంబ’ సినిమా తీయడానికి స్పూర్తినిచ్చింది! హాస్య దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జంధ్యాల ‘ముద్దుల మనవరాలి’తో సెంటిమెంట్ పండించిన వైనాన్నీ, ‘రెండు రెళ్ళు ఆరు’ సినిమాలో సుత్తివేలు సీఎస్సార్ ని అనుకరించడం వెనుక తెరవెనుక కథనీ మాత్రమే కాదు, చిరంజీవి ‘చంటబ్బాయ్’ గా మారిన తీరునీ సవివరంగా చెప్పారు చిన్నారాయణ. 

ఎన్నిసార్లు చూసినా మరోసారి చూడాలనిపించే ‘పడమటి సంధ్యారాగం’ సినిమా షూటింగ్ విశేషాలు కూడా మళ్ళీ మళ్ళీ చదివించేవిగా ఉన్నాయి. బ్రహ్మానందం కెరీర్ ని మలుపు తిప్పిన ‘అహనా పెళ్ళంట!’ కబుర్లూ అంతే. క్రిష్ణగారబ్బాయి రమేష్ హీరోగా జంధ్యాల తీసిన ‘చిన్ని కృష్ణుడు,’ సుత్తి వీరభద్ర రావు ‘హైదరాబాదూ, సికిందరాబాదూ’ అంటూ బాదేసే ‘వివాహ భోజనంబు’ సినిమా గురించీ కొత్త సంగతులెన్నో ఉన్నాయ్ ఈ పుస్తకంలో. రాజశేఖర్ హీరోగా జంధ్యాల తీసిన ‘నీకూ నాకూ పెళ్ళంట’ గురించీ, సుత్తి వీరభద్ర రావు చివరి సినిమా ‘చూపులు కలిసిన శుభవేళ’ లో వీరభద్రరావు పాత్రకి జంధ్యాల డబ్బింగ్ చెప్పాల్సి రావడాన్ని గురించీ చెబుతూనే, తెలుగు మేష్టారి ఇమేజి పెంచిన ‘హైహై నాయకా!’ షూటింగుకి పాఠకులని తీసుకుపోయారు రచయిత. 

‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాలో కోట శ్రీనివాసరావు నైజం యాసతో సినిమా స్టోరీలు చెప్పడం గుర్తుందా? ఆ పాత్ర సృష్టీ, చివర్లో ‘పాండవ వనవాసం’ స్టోరీకి క్రికెట్ కామెంటరీతో కౌంటర్ ఇప్పించడం లాంటి తమాషాలని కోటే స్వయంగా పంచుకున్నారు పాఠకులతో. ‘బావా బావా పన్నీరు’ నాయిక రూపకళ గురించీ, ‘ష్…గప్ చుప్’ సినిమాలో తిట్ల దండకాన్ని గురించీ చదివేసి, ‘అహ నా పెళ్ళంట!’ తీసిన సంస్థకే జంధ్యాల ‘ఓహో నా పెళ్ళంట’ తీసిన వైనాన్ని గుర్తు చేసుకున్నాక కనిపించే జంధ్యాల ఆఖరి చిత్రం ‘విచిత్రం’ గురించిన కబుర్లతో ముగుస్తుందీ ‘జంధ్యా మారుతం.’ “చిత్ర విచిత్ర కథాంశంతో సాగిన ఈ ‘విచిత్రం’ చిత్రాన్ని పరిస్థితులకి రాజీపడి జంధ్యాల రూపొందించారని చాలామంది చెబుతుంటారు” అన్న నిష్టుర సత్యాన్ని దాచే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. 

ప్రతి సినిమాకీ షూటింగ్ విశేషాలతో పాటుగా, కథా సంగ్రహం, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, ఏ పాటలో ఎవరు నటించారన్న వివరాలతో పాటు బాగా ప్రాచుర్యం పొందిన సంభాషణలనీ అందించడం అభినందనీయం. అలాగే, ఆయా సినిమాలకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల అనుభవాలనీ క్రోడీకరించారు. అయితే, జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘రావూ గోపాల్రావూ’ ‘పుత్తడిబొమ్మ’ ‘శ్రీవారి శోభనం ‘ ‘రాగలీల’ ‘సత్యాగ్రహం’ ‘లేడీస్ స్పెషల్’ ‘ప్రేమ యెంత మధురం’ ‘విచిత్ర ప్రేమ’ ‘బాబాయ్ హోటల్’ ‘ప్రేమా జిందాబాద్’ ‘అ ఆ ఇ ఈ’ సినిమాల కబుర్లు కూడా వివరంగా ఇచ్చి ఉంటే, జంధ్యాల సినిమాల గురించిన సంపూర్ణమైన పుస్తకం అయి ఉండేది కదా అనిపించింది. రచయిత పులగం చిన్నారాయణతో పాటు, ప్రకాశకులు హాసం ప్రచురణలు వారినీ అభినందించాల్సిందే. 

Be the first to comment

Leave a Reply