హాస్యబ్రహ్మ జంధ్యాలగారి చివరి ముఖాముఖి (శ్రీ అట్లూరి)

హాస్యబ్రహ్మ జంధ్యాలగారి చివరి ముఖాముఖి ఇదే (ఇదేమొదటి, చివరి వెబ్ ఇంటర్వ్యూ కూడా). నేను జనవరిలో ఆయన్ని కలిసి ఒక గంటపైనే మాట్లాడాను. ఆయన ఎంతో మృదుస్వభావి, అహం అన్నది తెలియనివారు. ఆయనతో ఒక ఫొటో తీయించుకోవాలనుకున్నాను. ఆయనకి నేను బాగా నచ్చానని చెప్పి మళ్ళీ తప్పకుండా కలుద్దాం అన్నారు. నేను నాపనులలో బిజీగా ఉండి మళ్ళీ కలవలేకపోయాను. అలా ఆయన ఫొటో తీసుకుని జ్ఞాపకంగా దాచుకునే అవకాశము చేజారిపోయింది.

గురువారం ఉదయం జంధ్యాలగారికి ఫోన్ చేసి ఆయనతో “ముఖాముఖి” కావాలని అడిగాను. ఆ రోజువాళ్ళింట్లో ఏదో పూజ ఉన్నదని చెప్పి శుక్రవారం పొద్దున్న 10.00 గంటలకి రమ్మన్నారు. మర్నాడు, అనుకున్న సమయానికి ఐదు నిముషాల ముందే వాళ్ళింటికి చేరాను. ఇద్దరు ముద్దులొలికే చిన్నారులు “సాహితి”,”సంపద”లను గుమ్మంలోనే కలిసాను. వారిద్దరూ ఒక చిన్న కుక్కపిల్లను పట్టుకుని ఆడుకుంటున్నారు. ముందుగది సాధారణ ఎగువ మధ్యతరగతి జీవన విధానాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. అక్కడ జంధ్యాలగారి కీర్తిని చాటుతూ అనేకానేక ప్రశంసలు, బహుమతులు కొలువుదీరి ఉన్నాయి.సగం గదినిండా నిన్నటి పూజాసామాగ్రి పరచి ఉంది (తరువాత మాటల్లో ఆయన, పుట్టపర్తిసాయిబాబాకి గొప్పభక్తులని, విధిగా ప్రతీ గురువారమూ సాయిబాబా పూజ గావిస్తారని చెప్పారు). పలకరింపులు అయ్యాక జంధ్యాలగారితో నా ముఖాముఖి ఇలాసాగింది….. 

– By శ్రీ

శ్రీ: నమస్కారం మాష్టారూ! మాకోసం మీ సమయాన్ని వెచ్చిస్తున్నందుకు ధన్యవాదాలు. దయచేసి మీ పూర్తి పేరు తెలియజేయగలరా?

జం: (నవ్వుతూ) అదేమంత పెద్ద రహస్యం కాదులెండి నేను ఎవరికీ చెప్పకపోడానికి, అదొక కొండవీటి చాంతాడంత ఉంటుంది. నేను కధలు రాయడం మొదలుపెట్టినప్పటినుండీ నా ఇంటి పేరు “జంధ్యాల”తోనే అందరికీ పరిచయమయ్యాను. నా బ్యాంక్ ఖాతాలు కూడా అదే పేరుతో ఉంటాయి. ఒక్కోసారి నాకే అనిపిస్తూ ఉంటుంది నా పూర్తి పేరు నాకు గుర్తుందా అని…

శ్రీ: మీరు సినీపరిశ్రమకి ఎప్పుడు ఎలా పరిచయం చెయ్యబడ్డారు?

జం: 1974 లో కళాసాగర్ గారి నుండి ఒక నాటిక వెయ్యడానికి వచ్చిన ఆహ్వానం పురస్కరించుకుని నేను మద్రాసు వెళ్ళాను. అప్పుడు అక్కడ శ్రీ బి.ఎన్.రెడ్డి(మల్లీశ్వరి దర్శకుడు)గారిని కలిసే అవకాశం వచ్చింది. ఆ నాటకంలో నాపనితనం నచ్చిన ఆయన నాకు బీనాదేవి రాసిన “ఓ పుణ్యభూమీ కళ్ళు తెరు” అన్న నవల ఆధారంగా తీసే సినిమాకోసం పనిచెయ్యడానికి అవకాశం ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తూ ఆయన అనారోగ్యంతో ఆసుపత్రి పాలయి మరికొద్దిరోజులకే కన్నుమూసారు. అలా ఆ సినిమా ఆగిపోడంతో నేను ఇంక విజయవాడ వచ్చేద్దామని అనుకున్నాను. అప్పుడు నిర్మాతలు శ్రీయుతులు ఆనందమోహన్, హనుమాన్ ప్రసాద్ గార్లు  వారి చిత్రాలకి పని చెయ్యమని అడిగారు. రెండు చిత్రాలకీ పనిచేసాను. అందులో మొదట “దేవుడుచేసినపెళ్ళి”, తరువాత “పెళ్ళికానిపెళ్ళి” విడుదల అయ్యాయి. ఆ తరువాత శ్రీ కె.విశ్వనాథ్ గారు “సిరిసిరిమువ్వ” సినిమాకి, ఆపైన శ్రీ రాఘవేంద్రరావు తదితరులు అవకాశాలు ఇచ్చారు. నేను కొన్నిటికి కథలు, మరికొన్నిటికి చిత్రానువాదమూ (స్క్రీన్ ప్లే), కొన్నిటికి సంభాషణలూ రాసాను. ఆ ఐదేళ్ళల్లో సుమారుగా 200 చిత్రాలకు రాయడం జరిగింది. 1981 లో నేను “ముద్దమందారం” సినిమాకు మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించాను. 1981 నుండి ఇప్పటివరకూ మొత్తం 42 సినిమాలకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టాను. 150 సినిమాలకు సంభాషణలు రాసాను.

శ్రీ: మీఉద్దేశ్యంలో నాటకానుభవం సినిమాలకి ఎలా పనికొస్తుందంటారు?

జం: చాలా పనికొస్తుంది. నటన విషయంలోగానీ, ఇతర నిర్మాణాత్మక విషయాల్లోగానీ నాటకానుభవంసినిమాలకి చాలావరకూ పనికొస్తుంది. నాటకాల్లో మనకి నటనలో ప్రాథమికానుభవం వస్తుంది. థియరీ కంటే ప్రాక్టికల్ గా చేసినప్పుడు ఎక్కువ అనుభవం వస్తుంది కదా. నాటకాల్లో ప్రేక్షకుల స్పందన వెంటవెంటనే తెలుస్తుంది, తద్వారా నటీనటులకి ఏది తప్పో ఏది ఒప్పో వెంటనే తెలిసిపోతుంది. అలాగే రచయితకి కూడా ఏ దృశ్యం, సంభాషణ ప్రేక్షకులకు నచ్చింది, ఏవి నచ్చలేదు అనేది కూడా తక్షణం తెలుస్తుంది. తద్వారా రచయిత తన రచననలను, నటీనటులు తమ నటనను మెరుగుపర్చుకోవచ్చు. కానీ ప్రాథమికంగా రెంటిలోనూ పనిచెయ్యడమనేది ఒక్కటే.

శ్రీ: సినిమా రంగానికి వచ్చిన తర్వాత నాటకాలేమన్నా రాసారా?

జం: సినీరంగానికి చెందినవారు నటించినవే కొన్ని రాసాను. 1976-81 మధ్యకాలంలో నేను చాలా బిజీగా ఉన్నాను. ఆ కాలంలో ఒకేసారి 4-5 సినిమాలకి రాస్తూ ఉండేవాడిని, అందువల్ల తీరిక చిక్కేది కాదు. ఆయా సినిమాలకిసంబంధించిన కథ, సంభాషణలకోసం వారితో కూర్చోవాల్సి వచ్చేది కూడా. ఉదాహరణకి సిరిసిరిమువ్వ, అడవిరాముడు సినిమాలకి ఒకేసారి పని చేస్తున్నప్పుడు కథ కోసం విశ్వనాథ్గారితో పొద్దున్న, సంభాషణల కోసంరాఘవేంద్రరావుతో సాయంత్రం, మిగతావారితో ఆమధ్య సమయాల్లోనూ కూర్చోవాల్సి వచ్చేది. అలా అసలు తీరిక లేకుండా పని చెయ్యాల్సి వచ్చేది. నేను దర్శకుడ్ని అయ్యాక కొంత తీరిక చిక్కింది అని చెప్పాలి, అప్పుడే మరికొన్నినాటకాలు రాయడం జరిగింది. ఇప్పటికీ నాకు నాటకాలు రాయడమంటే చాలా ఇష్టం. ఈమధ్య నేను రాసిన ఒక హాస్యనాటికను (కోట శ్రీనివాసరావు తదితరులు నటించిన)మన ముఖ్యమంత్రిగారు చూసి మెచ్చుకోడం జరిగింది.

శ్రీ: మీరు దర్శకత్వం వైపు మొగ్గుచూపినప్పుడు రచయితగా కొన్ని సినిమాలను కోల్పోవలసి వచ్చించేమో కదా? అందునా 1976-81 మధ్య కాలంలో రచయితగా మీరు మంచి గిరాకీ (డిమాండ్) ఉండేది మరియు ఎక్కువపారితోషకం లభించేది కూడా కదా!

జం: అవును నిజమే, కానీ నాకు దర్శకుడిగానే ఎక్కువ సంతృప్తి ఉండేది. ఎందుకంటే ఒక దర్శకునిగా ఆ సినిమా బాధ్యత మొత్తం నాది, అన్న భావనవల్ల. రచయిత సినిమా మొత్తంలో ఒక చిన్నభాగం మాత్రమే అయితే దర్శకుడుమొత్తం సినిమా అంతటికీ బాధ్యుడు. ఒక చిత్రానికి దర్శకత్వం వహించినప్పుడు వచ్చే సంపూర్ణమయిన తృప్తి ఒక రచయితగా అందుకోలేము. ఒక రచయితగా ఆర్ధికమయిన సంతృప్తిని పొందచ్చు, కానీ అది మనసుకి పూర్తిసంతృప్తినివ్వదు నాకు.

శ్రీ: ఇంతకుముందు మీరే చెప్పినట్టు, ఇద్దరు వైవిధ్యమయిన ఆలోచనలు, నిర్మాణశైలి కలిగిన దర్శకులతో (విశ్వనాథ్, రాఘవేంద్రరావు) ఒకేరోజు పనిచేస్తున్నప్పుడు మీరు అంత త్వరగా ఎలా వారి ఆలోచనలతో, భావాలతోకలిసిపోయేవారు?    

జం: ఇద్దరిలోనూ ఒక సారూప్యం ఉంది. విశ్వనాథ్ సృజనాత్మకతో కూడిన వ్యాపార విలువలు కలిగిన దర్శకుడయితే, రాఘవేంద్రరావు వ్యాపార విలువలు కలిగిన సృజనాత్మక దర్శకుడు. రాఘవేంద్రరావు హాస్యాన్ని అపహాస్యంచేసికానీ , ప్రేక్షకులని ఆకర్షించడానికి దిగంబరత్వాన్నిగానీ చూపించలేదు. ఇద్దరూ తమ తమ ప్రత్యేకమయిన పద్ధతుల్లోనే పనిచేసారు తప్ప మేఘాల్లో తేలిపోలేదు ఎప్పుడూ. వారిద్దరితో కలిసి పనిచెయ్యడం అన్నది నాకు ఎప్పటికీసంతోషదాయకమే, ఎందుకంటే వారిద్దరితో పనిచేసినప్పుడు నేను ఎంతో నేర్చుకోగలిగాను. ప్రత్యేకించి చిత్రానువాదం చేసేటప్పుడు, కథ చేసేటప్పుడు వారిద్దరూ నాకు గురువులు.

శ్రీ: మీ మొదటి రెండు సినిమాలలోనూ, కొత్తవాళ్ళను అందునా యువతి/యువకులను పెట్టుకున్నారు. అనుభవజ్ఞులైన సీనియర్ నటులను పెట్టుకోకుండా కొత్తవాళ్ళతో చెయ్యాలని మీకెందుకనిపించింది?

జం: అవును, నేను చిన్నవాళ్ళను, కొత్తవాళ్ళను నాసినిమాలలో నటింపజేసాను. అంతకుముందు ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్, శోభన్బాబు తదితరులు వయసులో ఉన్నవారి పాత్రలను ధరించేవారు. వారు అలా నటిస్తున్నప్పుడు”అమ్మా నేను బి.ఏ పాస్ అయ్యాను” అంటూ డైలాగులు చెబుతుంటే హాస్యాస్పదంగా ఉండేది. అప్పట్లో ఎక్కువమంది హీరోలు ఉండేవారు కాదు, ఇప్పుడు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్ తదితరులు ఉన్నట్టు. 1970లలోనో, 80లలోనోగానీ ఎన్.టి.ఆర్ సినిమాలో “నేను మొన్ననే ఎస్.ఎస్.ఎల్.సి పాస్ అయ్యాను” అనే డైలాగు ఒకటుంటుంది! అప్పట్లో దర్శకులకి వేరే ప్రత్యామ్యాయం లేదు, నటులకు కూడా వేరే మార్గం లేదు, వాళ్ళు అన్నిరకాల పాత్రలనూ ధరించవలసినదే! నేను ఒక ప్రేమకథ తియ్యాలనుకున్నప్పుడు కథకు సరిపోయేటట్టుగా వయసులో ఉన్నవాళ్ళను పెట్టుకోవాలని అనుకున్నాను. అలా చెయ్యడంవలన నారెండు సినిమాలు అప్పటివరకూ ఉన్న ట్రెండునిమార్చేసాయి. ఆరెండు సినిమాలు బాగా ఆడాయి. కమర్షియల్గా కూడా విజయం సాధించాయి.

శ్రీ: మీ మొదటి రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి అన్నది వాస్తవమేగానీ, యువతను పక్కదోవపట్టిస్తున్నాయన్న విమర్శలు వచ్చాయి?

జం: ఆ సినిమా చేస్తున్నప్పుడు పూర్ణిమకి పదహారేళ్ళ వయసు. తను అందులో పదహారేళ్ళపిల్లగానే నటించింది. అటువంటి విమర్శలు ఎందుకొచ్చాయంటే, ఇంతకుముందు వాణిశ్రీలాంటి వాళ్ళు అలా పదహారేళ్ళపిల్లగా నటించేవారు.ఇప్పుడు అదే వయసున్న పిల్ల ఆపాత్రలో నటించడం అన్నది అంత తేలికగా ఒప్పుకోలేకపోయారు. ఇంతమార్పుని ఒక్కసారిగా అంగీకరించలేకపోయారు. వాస్తవాలను గ్రహించడానికి కొంత సమయం పడుతుంది, నిజమేకానీ ఆ రెండు సినిమాలు కమర్షియల్గా విజయం సాధించడంవలన ఈమార్పుకి తొందరగా అలవాటుపడిపోయి మరిన్ని కొత్త ప్రేమకథలు పుట్టుకొచ్చాయి. ఇదంతా ఒక కథని తెరపై ఎలా చూపించగలిగాము అన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది.నాలుగు స్తంబాలాట చిత్రంలో ఒక కొత్తజంట తమ జీవితంలో వచ్చిన సమస్యలను వాళ్ళ సొంతంగా ఎలా పరిష్కరించుకోగలిగారో చూపించాము.ఈకాలంలో అదంతా మామూలేగానీ ఒక ఇరవై సంవత్సరాల క్రితం అది ప్రజలకి కొత్త.

శ్రీ: నాలుగు స్తంబాలాట కొంచం సీరియస్ గా ఉండే సినిమా, కానీ తరువాత మీరు హాస్య ప్రధానమైన సినిమాల వైపు మొగ్గుచూపారు. ఎందుకు?

జం: నా మొదటి పూర్తి హాస్యభరిత చిత్రం “శ్రీవారికి ప్రేమలేఖలు”. అది చాలా పెద్ద విజయాన్ని సాధించింది, ఏమంత పెద్ద సీరియస్ విషయాలు లేకపోయినా కూడా. పరిశ్రమలో ఒక అలవాటు ఉంది. మనుషులకు ఒక ముద్ర వేసేస్తారు.ఉదాహరణకి ఎవరైనా సంప్రదాయ కళారీతులపై చిత్రాలు చెయ్యాలనుకుంటే మొట్టమొదట విశ్వనాథ్ గారిని తలుచుకుంటారు. ఇదే దోవలో శ్రీవారికి ప్రేమలేఖ తరువాత నాకు అన్ని హాస్య ప్రధానమైన చిత్రాలే వచ్చాయి. దానితో నేనూ వాటికే పట్టం కట్టాను. హాస్యభరిత చిత్రాల దర్శకుడిగా రూపాతరం చెందాను. కానీ దేన్నైనా అదేపనిగా చేస్తూ ఉంటే ఉత్పత్తి అయిన సరుకు నాణ్యత తగ్గుతుంది. తాజాదనం కోల్పోతుంది.నేను ఆ సంగతి ముందే గ్రహించాను. ప్రేక్షకులకు వైవిధ్యం కావాలి. నాకు ముందే తెలుసు ఈ హాస్యప్రధాన చిత్రాల ట్రెండ్ ఓ పదేళ్ళ పాటు సాగుతుంది, తరువాత నేను కొత్తరకమైన గమనాన్ని ఎంచుకోవాల్సి వస్తుందని.  “రెండు రెళ్ళు ఆరు”, “అహ! నా పెళ్ళంట” లాంటిచిత్రాలను హాస్యానికి పెద్దపీట వేస్తూ వరుసగా తెరకెక్కించాను. రేలంగి నరసింహారావు గారు కూడా అదే సమయంలో పరిశ్రమకి వచ్చారు. ఆయన కూడా హాస్య ప్రధానమైన చిత్రాలు తియ్యడం ప్రారంభించారు. కానీ త్వరలోనే ట్రెండ్ మారిపోయింది. హాస్యం తో పాటు మరోరకమైన అంశాలను జతచేయవలసి వచ్చింది.

శ్రీ: మీరు హాస్యప్రధాన చిత్రాలను తీస్తున్నప్పుడు మధ్యలో ఒక్కసారిగా పంథా మార్చుకుని సంప్రదాయ నృత్యాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుంటూ ఆనందభైరవి లాంటి గొప్ప సినిమాని తీసారు. మీలో ఉన్న ఆ భావుకత్వాన్ని,ఇటువంటి సినిమాలు తీసే కళాపిపాసని అన్నాళ్ళుగా ఎక్కడా దాచేసారోనని అందరూ ఆశ్చర్యపోయారు!

జం: అలాంటి సినిమా చెయ్యాలని చాలారోజులుగా అనుకుంటూ ఉండేవాణ్ణి. శంకరాభరణం, సప్తపది, సాగరసగమం వంటి సినిమాలకు నేను సంభాషణలు సమకూర్చాను. అలాగే ఒక సంప్రదాయ కళను ఆధారంగా చేసుకుని ఒకసినిమాకు దర్శకత్వం వహించాలని నాకు కోరికగా ఉండేది. అనుకోకుండా నేను శ్రీ కొండముది శ్రీరామమూర్తి గారి నవల చదవడం, ఆ కథను తెరకెక్కించాలనే నా ఆలోచనకు తగ్గ నిర్మాత దొరకడం నా అదృష్టం. బి.ఎ.వి. శాండిల్యగారు, మిగతావాళ్ళలా హాస్య ప్రధాన చిత్రాన్ని కాకుండా, ఈ ఆనందభైరవి సినిమాని తీద్దామనే ప్రతిపాదనను నా ముందుకి తీసుకొచ్చారు. ఈ సినిమాలో గిరీష్ కర్నాడ్ గారు ప్రధాన పాత్ర ధరించారు. ఆయనతో పనిచెయ్యడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తాను. ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. హాస్యభరిత చిత్రాల దర్శకుడు అన్న పేరుని పక్కనబెట్టి నాకు మంచి కీర్తిని తీసుకొచ్చింది. కొన్ని అవార్డులు కూడా లభించాయి. కానీ నేను తీసిన మరో చిత్రం”నెలవంక” నాకు మిగతావాటన్నిటికంటే కూడా చాలా ఇష్టం. అది అపజయం పొందింది. ఈ నెలవంక సినిమాకి నేషనల్ అవార్డ్ రావలసి ఉంది. కానీ పరిశ్రమలో ఉన్న కొన్ని కుత్సిత శక్తులు, కుళ్ళు రాజకీయాలు ఆ అవకాశాన్ని అడ్డుకున్నాయి. వాటి గురించి మాట్లాడడం కూడా నాకిష్టం లేదు. ఈ సినిమాకున్న ప్రధానమైన అసౌకర్యం ఏమిటంటే జె.వి.సోమయాజులు గారిని ఒక ముస్లిం గా ప్రేక్షకులు అంగీకరించలేకపోయారు. శంకరాభరణం శంకరశాస్త్రి పాత్ర ప్రజల మనసులను వీడడం దుస్సాధ్యమయ్యింది. అయినా కూడా ఏవో కొన్ని అవార్డులు లభించాయి. 

శ్రీ: ఆనందభైరవి సినిమాలో “కొలువైతివా రంగశాయి”, “చైత్రము కుసుమాంజలి” లాంటి అద్భుతమైన పాటలున్నాయి. వాటి చిత్రీకరణ అంతకంటే దివ్యంగా ఉంది.

జం: వేటూరివారు గొప్ప పాటలను రాసారు. చైత్రము కుసుమాంజలి అన్నపాట కర్నాటక సంగీతంలో కొన్ని కీర్తనల పక్కన నిలబడవచ్చు. ఈ పాటలు నా చిత్ర విజయానికి గొప్ప సహకారాన్ని అందించాయి. 

శ్రీ: అన్నమయ్య సినిమాని తియ్యాలకునున్నారు కదా, అదేమయ్యింది? ఎందుకు ఆ ప్రయత్నం విరమించుకున్నారు?

జం: ఏం శాపమో ఏమో తెలీదు. ఒక్క రాఘవేంద్రరావు మాత్రమే పూర్తి చెయ్యగలిగారు ఈ సినిమాని. నాకు ముందే శ్రీ పుల్లయ్యగారు, శ్రీ. C.S. రావు గారు వంటి ప్రముఖులు అన్నమయ్య కథను సినిమాగా తియ్యాలని పూనుకున్నారు. కానీ వారెవ్వరూ విజయం సాధించలేకపోయారు. తరువాత ఆత్రేయ గారు ఈ కథను తెరకెక్కించాలనుకున్నారు. కానీ కుదరలేదు. రాఘవేంద్రరావు గారు, ఆత్రేయ గారు రాసుకున్న కథను యథాతథంగా తీసుకుని చిన్న చిన్న మార్పులు చేర్పులతో సినిమా గా తీసారు. నేను అన్నమయ్య సినిమా ఆలోచనలో ఉన్నప్పుడు, మేము దాదాపు ఒక 50 పాటలను సమకూర్చుకున్నాము. రమేష్ నాయుడు గారి సంగీత దర్శకత్వంలో ఆశాభోంస్లేగారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, బాలు, జానకి తదితరులు ఈ పాటలన్నిటినీ పాడారు. ఇప్పుడు ఆ పాటలు సిడి ల రూపంలో తిరుపతిలో లభ్యమవుతున్నాయి. ఈ సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చిన శాండిల్యగారు ఆకస్మికంగా లోకాన్ని విడిచిపెట్టడంతో సినిమా నిలిచిపోయింది. జె. కె. భారవి అప్పట్లో ఆత్రేయ గారి దగ్గర అసిస్టెంట్ గా చేసేవారు. అదే కథను రాఘవేంద్రరావు గారు సినిమాగా తీసారు.

శ్రీ: మీ ప్రతి సినిమాలోనూ ఒక “ప్రేమపాట” తప్పకుండా ఉంటుంది. మిగతా దర్శకులకంటే విభిన్నంగా మీరు ఆ పాటని చిత్రీకరించేవారు కూడా. దీనికి ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా?

జం: కొన్ని పాటలు విభిన్నంగా తియ్యాలని అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు ప్రేక్షకులకి స్టెప్స్ కావాలి, పాటలో ఉన్న భావాన్ని ప్రతిబింబించడం ముఖ్యం కాదు. ప్రతీ పాటకి 20 మంది డాన్సు చెయ్యాలి. అన్నమ్మయ్య కీర్తనలకు కూడా వేగవంతమైన స్టెప్స్ వెయ్యాలి. అన్నీ ఆ ంట్వ్ లో పాటల్లాగ ఉండాలి. నా చిత్రాలో చాలావాటికి నేనే కొరియోగ్రాఫర్ గా ఉండేవాణ్ణి. ఎప్పుడోగానీ, ఏదైనా ప్రత్యేకమైన భంగిమలు కావాలనుకుంటే తప్ప వేరే డాన్సుమాస్టర్ని పిలిపించేవాణ్ణికాదు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది.

శ్రీ: మీ కమర్షియల్ సినిమాలు కొన్ని ఎందుకు విజయం సాధించలేకపోయాయి? వాటిల్లో కమర్షియల్ గా హిట్  చెయ్యగలిగే నటులు ఉండి కూడా ఎందుకు చతికిలబడ్డాయి?

జం: ఎందుకంటే ఈ కమర్షియల్ చిత్రాల పోకడని నేను సరిగ్గా అనుసరించలేకపోయాను. అది నాకు పట్టుబడలేదు. బాలకృష్ణ తో చేసిన సీతారామకల్యాణం ఒక్కటే బాగా ఆడింది. బాబాయి-అబ్బాయి సినిమా ప్రేమకథ కాబట్టి ఓమాదిరిగా ఆడింది. అమరజీవి, చంటబ్బాయి లాంటి సినిమాలు అస్సలు ఆడలేదు, ఫ్లాప్ అయ్యాయి.

శ్రీ: అమరజీవి ఎందుకు ఆడలేదు? ఎక్కడ పొరపాటు జరిగింది?

జం: సినిమా మొదటి భాగం బావుంటుంది కానీ రెండో భాగంలోనే ఎక్కడో పొరపాటు జరిగింది. బహుసా చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పలేదేమో! ఒక సినిమా విజయాన్ని సాధించిందంటే దానికి సవాలక్ష అంశాలుదోహదపడతాయి. కానీ అపజయం సాధించిందంటే దానికి రెండే రెండు కారణాలు: సరి అయిన కథ లేకపోవడం లేదా కథని సరిగ్గా చెప్పలేకపోవడం.

శ్రీ: చంటబ్బాయికేమయ్యింది? నవలలో ఉన్న కథని చివర్లో మార్చడం వల్ల ఆడలేదా?

జం: అవునేమో! సినిమా పేరులో హీరో పాత్ర ప్రతిబింబించాలని అనుకున్నాం. అక్కడే మానిర్ణయం తప్పైపోయింది. ఇదీ ఒక కారణం కావొచ్చు. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించనప్పుడే మాకా విషయం తెలిసింది. కానీ అప్పటికేఆలశ్యమైపోయింది. చిరంజీవి ఎన్నోసార్లు చెప్పేవారు తను చేసిన హాస్యప్రధాన చిత్రాల్లో ఇది మకుటంలాంటిదని. కానీ ఒక్కోసారి దారితప్పి తప్పుదోవపడుతుంటాము. అలా జరిగిపోతుంటుంది, అంతే.

శ్రీ: మీవి చాలామటుకు నవలాధారిత చిత్రాలు, ఎందుకని?

జం:  అవును, ఎందుకంటే నవలలను తెరకెక్కించడం వలన ఒక ఉపయోగముంది. ఆ కథ అప్పటికే ఆదరణ పొంది ఉంటుంది అంతేకాకుండా సినిమాకి కావలసిన సగం సంభాషణలు సమకూరిపోతాయి. ఎక్కువగా నేను మల్లాది,యండమూరి నవలలను తీసుకున్నాను. ఆదివిష్ణులాంటి మరికొందరు రాసిన నవలలను కూడా తెరెక్కించాను.  సాధారణంగా నవలలను సినిమాగా తియ్యాలంటే కొద్దిపాటి మార్పులు చెయ్యాల్సి వస్తుంది. ప్రేక్షకులు ట్రెండ్ ప్రకారంమారుతూ ఉంటారు. పబ్లిసిటీ వంటి మిగతా అంశాలు చిత్రవిజయానికి దోహదపడతాయి.

శ్రీ: వేటగాడు, ఘరానా దొంగ వంటి పెద్ద పెద్ద కమర్షియల్ చిత్రాలకు మీరు కథలను రాసారు. కానీ మీరెందుకు అటువంటి సినిమాలు ఒక్కదానికీ దర్శకత్వం వహించలేదు?

జం: నా మొట్టమొదటి సినిమా ప్రారంబిస్తున్నప్పుడు శ్రీ ఎన్.టి.ఆర్ కూడా ఇదే ప్రశ్న అడిగారు. ముద్దమందారం సినిమా ప్రారంభోత్సవానికి ఆయనని ఆహ్వానిద్దామని ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఆశ్చరపోయారు. “నన్నడిగితే మీకోసంఒక మంచి కమర్షియల్ సినిమా చేసుండేవాడిని కద” అన్నారు. నన్ను అభినందించారుగానీ కమర్షియల్ సినిమాలు తియ్యడానికి ప్రయత్నించమని చెప్పారు. “కొత్త నటులతో ప్రయోగాలు చెయ్యాలని ఉంది” అని ఆయనకు చెప్పాను.  అందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. నాకు ఈ ఫక్తు ఫార్ములా, కమర్షియల్ చిత్రాలు తియ్యడం ఇష్టం లేదు. అప్పట్లో శ్రీ భారతీరాజా చిత్రాల నుండి నేను గొప్ప స్ఫూర్తిని పొందాను. తమిళ సినిమాలలో ఆయన కొత్త ఒరవడిసృష్టించారు. కథలను పల్లెటూరి వాతావరణాంలోనికి తీసుకొచ్చి కొత్త నటులతో మంచి మంచి చిత్రాలను తీసారు. నేను వారిని ఆదర్శంగా తీసుకున్నాను. ఆ రోజుల్లో మనకి ఆ ఐదుగురు పెద్ద హీరోలు తప్ప ఇంకెవ్వరూ లేరు.ఈపంథాని మార్చి కొత్తదనాన్ని తీసుకురావాలని ప్రయత్నించాను. విశ్వనాథ్ గారు నాకు చాలా ఆప్తుడు, ఆయన ప్రభావం కూడా నా మీద ఉండేది. ఆయన కూడా మొదట్ళో కొత్తవాళ్ళతో సినిమాలు తీసి తరువాత తరువాత సీనియర్ నటులతో సినిమాలు తీసారు.

శ్రీ: మీకెవరైనా “అజ్ఞాత రచయిత (Ghost writer)” ఉన్నారా?

జం: ఎప్పుడూ లేదు. నేను ఎవరి రచనలనైనా సినిమాగా తియ్యాలనుకున్నప్పుడు ఆ రచయితలతోనే సమగ్రంగా చర్చించేవాడిని. కానీ నేనే కథ రాసుకున్నప్పుడు ఎవరితోనూ చర్చించేవాడిని కాదు. నేనే పూర్తిగా ఆలోచించి రాసుకునేవాడిని. అలా ఎవరైనా అజ్ఞాత రచయిత ఉంటే నేను నా వృత్తికి అన్యాయం చేస్తున్నట్టు లెక్క. ఒకవేళ నాసినిమాలో ఎవరివైనా హాస్య సన్నివేశాలు వాడుకుని ఉంటే ఆ గౌరవాన్ని వారికే ఇచ్చేవాడిని. అజ్ఞాత రచయిత ఉండడంతప్పనో, ఒప్పనో నేను చెప్పట్లేదు – నా ఉద్దేశం ఇది…ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కోలా ఉంటాయి. 

శ్రీ: మీరు పనిచేసిన చిత్రాలలో మీకు బాగా నచ్చినవి ఏవి?

జం: నాకన్నీ చిత్రాలు ఇష్టమే. అన్ని సినిమాల్లో అన్నీ ఉన్నాయి. ఎవరికి ఏది కావాలో అది చూస్తారు.క్లాసికల్ సినిమాలలో శంకరాభరణం, సప్తపది, ఆనందభైరవి, నెలవంక మున్నగునవి. కమర్షియల్ సినిమాలలో వేటగాడు, అడవిరాముడు మున్నగునవి, హాస్యప్రధాన చిత్రాలలో శ్రీవారికి ప్రేమలేఖ, అహా! నా పెళ్ళంట మున్నగునవి చెప్పొచ్చు. అహా! నా పెళ్ళంట సినిమా బి,సి సెంటర్లలో కూడా బాగా ఆడింది. ప్రతీ సినిమాలోను ఒక విలక్షణమైన అంశంఉంటుంది, వాటన్నిటినీ లెక్క వెయ్యడం కష్టం. అలా వేస్తే చాతాడంత లిస్ట్ తయారవుతుంది. కొన్ని చిత్రాలు సంభాషణల మూలంగా హిట్ అయ్యాయి. ఉదాహరణకు శ్రీవారికి ప్రేమలేఖ, వేటగాడు. ఆరోజుల్లో నా అదృష్టం బావుంది. ఈరోజుల్లో ఉన్నంతమంది రచయితలు ఆరోజుల్లో లేరు. కాబట్టి చాలామంది దర్శకులతో, అన్ని రకాల చిత్రాలకు పనిచేసే అవకాశం వచ్చింది. అది నాకు ఎంతో ఉపయోగపడింది కూడా. దర్శకుడవ్వాలనుకున్న నాకు వీళ్ళే ఆదర్శం. నేను ఏ దర్శకుడి దగ్గరా అసిస్టెంట్ గా పనిచెయ్యలేదు.

శ్రీ: మీ కుటుంబం గురించి కొన్ని వివరాలు మాతో పంచుకోగలరా?

జం: నా భార్య పేరు అన్నపూర్ణ, నాకు ఇద్దరు ఆడపిల్లలు-కవలలు- సాహితి, సంపద.

శ్రీ: చదువరులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?

జం: మనకు ఎన్నో వనరులు ఉన్నప్పటికీ ఒక్క నేషనల్ అవార్డ్ కూడా రాలేదు. జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందే చిత్రాలను తియ్యమని మనవాళ్ళందరినీ కోరుతున్నాను. అలాగే ప్రేక్షకులు కూడా మంచి చిత్రాలను ఆదరిస్తూ, పనికిరాని చిత్రాలను తిప్పికొట్టాలని కోరుతున్నాను. ఒక మంచి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వక్కర్లేదుగానీ సగటున ఆడినా చాలు. ఆ దర్శకుడికి ఇంకో గొప్ప సినిమా తీయాలనే ఉత్సాహం వస్తుంది. మళయాళ దర్శకుడైన శ్రీ అరవిందన్ స్థాయిలో మన తెలుగు సినిమా దర్శకులను చూడాలని ఆశ. మన ముందుతరం దర్శకులైన  శ్రీ కె.వి రెడ్డి, శ్రీ పుల్లయ్య వంటివారి గురించి చాలా గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఆ స్థాయిలో ఎవరి గురించీ అలాచెప్పుకోవట్లేదు. రామానంద సాగర్ కూడా టీవీ రామాయణం తీస్తున్నప్పుడు ఎన్.టి.ఆర్ తో చాలాసార్లు చర్చించేవారు. మనకి చాలా మంచి దర్శకులున్నారు. కానీ ప్రేక్షకులను ఆకర్షించలేమేమోనని వారు భయపడుతున్నారు. మనకి జాతీయ అవార్డ్ వచ్చే రోజు కోసం ఎదురుచూస్తున్నాను.

ఆయన పూర్తి పేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆయన ఈ లోకాన్ని విడిచివెళ్ళిపోయాకనే నాకు ఈ మొత్తం పేరు తెలిసింది. ఈ ఇంటర్వ్యూ ముగిసాక దాదాపు ఇంకో గంటసేపు మేమిద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాము. తల్లి పాత్రలకు ఎంతో పేరొందిన శ్రీమతి అన్నపూర్ణ తో కలిసి ఎన్నో నాటకాలలో నటించారని, ఆరోజుల్లో తాను హీరోగా, ఆవిడ హీరోయిన్గా చాలా నాటకాల్లో వేసారని, అప్పట్లో ఆవిడ పేరు ఉమ అని చెప్పారు. అంతేకాకుండా నెలవంక సినిమా బాక్సు ఢిల్లీ చేరకుండా తప్పిపోవడానికి కొందరు ఎలాంటి ప్రయత్నాలు చేసారో కూడా చెప్పారు. ఆయన మరణవార్త వినగానే నాకు దుఃఖం ముంచుకొచ్చింది, నా బద్దకంతో ఆయన ఇంటర్వ్యూని ప్రచురించడానికి ఆలశ్యం చేసినందుకు చాలా బాధపడ్డాను. నేను అలా చేసి ఉండవలసినది కాదు. ఎవరికీ హాని తలపెట్టని నైజం, నిరాడంబరమైన వ్యక్తిత్వం, మహోన్నతమైన హృదయం, ఘనమైన హాస్య చతురత  కలిగిన వ్యక్తుల స్నేహం కావాల్సి వచ్చిందేమో ఆ దేవుడికి….అందుకే ఆయన్ను తొందరగా తన దగ్గరకి పిలిపించుకున్నాడు!

…………………….

కృతజ్ఞతలు: శ్రీ జంధ్యాల ను కలుసుకునే అవకాశం ఇప్పించిన శ్రీ మల్లాది గారికి, ఈ వ్యాసం రాయడానికి సహాయాన్ని అందించిన శ్రీ నచకి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

 

శ్రీ అట్లూరి గారికి,తెలుగు సినిమా వారికీ “జంధ్యావందనం” సభ్యుల తరపున కృతజ్ఞతలు

Be the first to comment

Leave a Reply