జంధ్యాల గారి వర్ధంతి అని చెప్పి ఏదైనా ఆర్టికల్ రాయచ్చుగా అని ఓ జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు . నాకు నవ్వొచ్చింది. నవ్వేవాళ్ళు ఉన్నంతకాలం నవ్వించేవాళ్ళు ఉన్నంతకాలం సినిమాలో కామెడీ ఉన్నంత కాలం జంధ్యాల మన మధ్యనే వుంటారు. పడి చచ్చేంతగా మనల్ని నవ్వించి తన దారి తను చూసుకోటానికి అంతా ఆయన ఇష్టమేనాఏంటి ? ఎక్కడికెళతాడాయన? నవ్వులు మన ముఖాన కొట్టి ఆయన ముఖం చాటేస్తే మనం ఊరుకుంటామా ఏంటి ? నెవర్. ఒక దశలో కేరాఫ్ అడ్రస్ కూడా లేకుండా విలవిల్లాడుతున్న తెలుగు సినిమా కామెడీకి ఓ అధునాతన భవంతిని కట్టించి ఇచ్చాడు. నవ్వలేని వాళ్ళకు నవ్వులు నేర్పించాడు. నవ్వేవాళ్ళను పగలబడి నవ్వించాడు. గుర్తొచ్చి గుర్తొచ్చిమరీ నవ్వుకునేలా చేశాడు. ఒకటా … రెండా… ఎన్ని సినిమాలు… ఎన్ని పాత్రలు …ఎన్ని రకాల మ్యానరిజమ్స్ … మరెవరి వల్లాకాని పని … ఇంకెవరూ సాహసించలేని ప్రయత్నం.
జంధ్యాల గారిలో డైరెక్టర్ కంటే రైటర్ గొప్పవాడు … రైటర్ కంటే డైరెక్టర్ తెలివైనవాడు.జంధ్యాల గారి స్మైల్ చాలా బాగుంటుంది. ఆయన సిగిరెట్ కాలుస్తుంటేనేనూ అలవాటు చేసుకుందామా అని చాలా సార్లు టెంప్ట్ అయ్యాను. అంత స్టైలిష్ గా ఉంటుంది. ఆయన వాయిస్ మైండ్ బ్లోయింగ్. ఆ కంఠం ఆయనకు భగవదత్తం. నాకు తెలిసినంతవరకూ జంధ్యాల గారు తీసినన్నికామెడీ సినిమాలు ఆయన సృష్టించినన్ని పాత్రలు , మరెవరూ చేయలేదేమో. ఒక సభలో జంధ్యాల గారి ఇంటి అడ్రస్ చెప్పమని నన్నడిగారు. చెప్పాను.
శ్రీ జంధ్యాల.,
హాస్యనివాస్, నవ్వులోరివీధి ..,
హ్యూమర్ కాలనీ, స్మైల్ పేట.,
ఆనందపురం పోస్ట్, కామెడీ మండలం.,
మందహాసం జిల్లా, ఆరోగ్య ప్రదేశ్.
ఎ.వి.ఎస్ గారు వ్రాసిన ఈ వ్యాసం ఈ కింద లింకులో చూడవచ్చు.
http://avsfilm.blogspot.com/2010/06/blog-post_20.html
ఎ.వి.ఎస్ గారికి కృతజ్ఞతలతో…
Leave a Reply
You must be logged in to post a comment.