ఆయనతో పరిచయం ఎలాజరిగిందో గుర్తురావడం లేదు. ఆయనో లాయరు. మహాకాయానికి తక్కువగా , స్తూల కాయానికి ఎక్కువగా వుండేవారు. పేరుమాత్రం కురచగా ప్రసాద్. వయస్సులో నాకంటే రెండు పదులు తక్కువే. బుద్ధిలో బృహస్పతి. రాజ్యాంగ విషయాలు ఆయనకు కొట్టిన పిండి. ప్రాచీన ధర్మ సూక్ష్మాలు, శాస్త్రీయ సూత్రాలు ఆయనకు కరతలామలకం. భారత, భాగవత, రామాయణ గ్రంధాలన్నీ ఆపోసన పట్టిన వ్యక్తి. అష్టాదశపురాణాల్లో ఏ అంశంపైన అయినా తడుముకోకుండా తర్కించగలిగిన సామర్ధ్యం ఆయన సొంతం. సూర్యోదయం కాకముందే నిద్రలేచి, నిష్టగా అనుష్టానాలన్నీ పూర్తిచేసుకుని, ఇంటినుంచి బయటపడడం తరువాయి, ఆయన జీవన శైలి ఆధునిక కాలానికి తగ్గట్టుగా మారిపోయేది.
ఎమర్జెన్సీ తరవాత జనతా సర్కారు ఇందిరాగాంధీపై పెట్టిన కేసుల్లో ఆమె తరపున వాదించిన లాయర్లలో తానొకడినని ఆయనే ఎన్నోసార్లు చెప్పుకున్నారు. జ్వాలానరసింహారావుతో కలసి నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అందుకు దాఖలా అన్నట్టుగా అనేకమంది పెద్దలను పరిచయం చేసారు. పలువురితో అంతంత పరిచయాలు వున్న ఈ వ్యక్తి హైదరాబాదులో మాత్రం స్కూటరుపై తిరిగేవాడు. మాకు స్కూటరు కూడా లేకపోవడంవల్ల అప్పుడు మాకది సందేహించాల్సిన అంశంగా అనిపించేది కాదు. అంత పెద్ద శరీరంతో స్కూటరుపై మా ఇంటికి వస్తుంటే, మా పిల్లలు వినాయకుడు ఎలక వాహనంపై వస్తున్నాడని ఆట పట్టించేవారు.
ఎక్కడ తిరుగుతున్నా త్రికాల సంధ్యాదులు సక్రమంగా నిర్వర్తించడం ఆయన అలవాటు. ఒకరోజు న్యూఢిల్లీ లో కుతుబ్ మినార్ చూసివస్తూ, సూర్యాస్తమయం కావొస్తుండడం గమనించి, దారిపక్కన నీటి చెలమ వున్నచోట కారు ఆపించి, సంధ్యావందనం చేసివస్తుంటే, మాతో పాటు టాక్సీ డ్రయివర్ కూడా ఆశ్చర్యపోయాడు. జనాలని ఆకర్షించడం కోసం ఆయన అలా చేస్తున్నారేమోనన్న అనుమానం కలగకపోలేదు. కానీ పైకి వ్యక్తం చేసేంత చనువు లేక మిన్నకుండి పోయేవాళ్ళం.
అల్లా, ఆయనతో కలసి తిరుగుతూ ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లి ఆ హోటల్లోని బుక్ స్టాల్లో పుస్తకాలు చూస్తూ మాలో మేము తెలుగులో మాట్లాడుకుంటున్నాము. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఓ నియమం వుండేది. ఎంతమందిలోవున్నా సరే – తెలుగులోనే మాట్లాడుకోవాలని.
అది కలసి వచ్చింది. ఒకాయన మా వైపు తిరిగి తెలుగువాళ్ళా అన్నట్టు చూసారు. ఒక్క క్షణం ఆగి “మీరు శ్రీనివాసరావు కదూ!” అన్నారు. ఆయన ఎవరో కాదు విజయవాడ ఎస్సారార్ కాలేజీలో బీకాం చదువుతున్నప్పుడు నా క్లాస్ మేట్. అప్పటికే బాగా పేరుతెచ్చుకున్న సినీ రచయిత, దర్శకుడు జంధ్యాల. చదువుకునే రోజుల్లో పేరు జె వి డి ఎస్ శాస్త్రి.
అందరం కలసి ఆ హోటల్లోనే వున్న జంధ్యాల రూముకి వెళ్ళాము. వెళ్లీవెళ్ళగానే, మాతోవచ్చిన లాయరు గారు ఏమాత్రం మొహమాటపడకుండా, కొత్త చోటని సందేహించకుండా “ఒకసారి మీ బాత్రూం వాడుకోవచ్చా “ అని అడిగి జవాబు కోసం ఎదురు చూడకుండా లోపలకు దూరిపోయి స్నానం చేసి బయటకు వచ్చారు. రావడం రావడమే, అక్కడవున్న తివాసీపై తల కిందకు పెట్టి కాళ్ళు పైకి లేపి లిప్తమాత్రంలో శీర్షాసనంలో దర్శనమిచ్చారు. మా అందరికీ కళ్ళు తిరిగినంత పనయింది. చిన్న తలతో, పెద్ద బొజ్జతో అంత లావు శరీరంతో ఆయన వేసిన ఈ ఆసనం చూసి జంధ్యాల కూడా నివ్వెరపోయినట్టు కనిపించారు. తర్వాత వారిద్దరిమధ్య చాలా సేపు కవి పండిత చర్చ సాగింది. అప్పటికే శంకరాభరణం సినిమాకి సంభాషణలు సమకూర్చిన జంధ్యాల – విశ్వనాద్ గారిదే మరో సినిమా సప్తపదికి మాటలు రాస్తున్నారు. అనేకానేక అంశాలను స్పృశిస్తూ వారిద్దరి నడుమ సాగిన సంభాషణ నిజానికి ఇద్దరు పండిత శ్రేష్టులమధ్య జరిగే వాదోపవాదాన్ని తలపించింది. ఏమాత్రం స్వరం పెంచకుండా, ఎదుటివారి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ఒకరినిమించి మరొకరు అక్షరలక్షలుచేసే విద్యను అమోఘంగా ప్రదర్శించారు.ధర్మాధర్మ విచక్షణకు సంబంధించిన వీటిల్లో కొన్నింటిని సప్తపదిలో జంధ్యాల పొందుపరిచినట్టున్నారు కూడా.
ఈ చర్చ సాగిన తీరుచూస్తున్న నాకు – చదువుకునే రోజుల్లో నాకు తెలిసిన శాస్త్రి, ఈ జంధ్యాల ఒక్కరేనా అన్న అనుమానం కలిగింది. ఆ రోజుల్లో – మొత్తం కాలేజీకి ఆయనొక్కడే ‘కారున్న’ కుర్రకారు. ప్రిన్సిపాల్ కూడా రిక్షాలోవస్తుంటే, జంధ్యాల మాత్రం కారులో కాలేజీకి వచ్చేవాడు. ’సంధ్యారాగంలో శంఖారావం’ వంటి నాటకాలు రాస్తూ, వేస్తూ సరదాగా వుండేవాడు. అలాటి జంధ్యాలలోని మరో రూపాన్ని ఆరోజు చూడగలిగాను. అల్లాగే మావెంట వచ్చిన లాయరుగారు. ఆయనకువున్న విషయ పరిజ్ఞానాన్నికళ్ళారా చూసి, చెవులారా విన్నతరవాత, ఆయనపై నాకున్న దురభిప్రాయం దూదిపింజలా ఎగిరిపోయింది. వినదగునెవ్వరు చెప్పిన అన్న సూక్తి బోధపడింది. మనం చెప్పిందే ఇతరులు వినాలనే ఆత్రంలో యెంత నష్టపోతున్నామో అర్ధం కావాలంటే యిలాటి సజ్జన సాంగత్యం ఎంతో అవసరం.
ఇప్పుడు ఆ ఇద్దరూ లేరు. వారి జ్ఞాపకాలే మిగిలాయి.
పాత్రికేయులు భండారు శ్రీనివాసరావు గారి కబుర్లు.
Comments:
Rajesh Maram …
16 weeks ago · 0 replies · 0 points
Leave a Reply
You must be logged in to post a comment.