హాస్య బ్రహ్మ జంధ్యాల…(వెలుగు నీడలు) 1వ భాగం

ఒక భావాన్ని వెయ్యి పదాల తో కన్నా ఒక చిత్రం లో బాగా పలికించ గలం.   అందుకనే సినిమా ని ఒక దృశ్యకావ్యం అంటారు.  మూకీ చిత్రాలనుంచి టాకీ చిత్రాల కెదిగేక్రమం లో  సినిమాల్లో అనేక మార్పులు  చోటు చేసుకొన్నాయి.  ఆధునిక కాలం లో ధ్వని, రికార్డింగ్  ప్రాధాన్యత పెరిగింది. సినిమా లో  తెరమీద సీను కి దూరం గా ఉన్న అతి చిన్న శబ్దాలు సైతం చిత్రీకరింపబడి  సినిమాలో మేళవింప బడుతున్నాయి.    చిత్రం,    వెయ్యిపదాల భావం తెలిపేదయినా, ఒక్కొక్కప్పుడు ఒక మాట  చిత్రం లోని భావానికి పదును పెడుతుంది, వన్నె తెస్తుంది, మనోభావాలని ఆకళింపు చేసుకొనే టందుకు ఉపయోగపడుతూ చిత్రానికి ఒక పరిపూర్ణతను తెస్తుంది.  చిత్రం మనకి అర్ధం అయ్యే ప్రక్రియ లో రెండు భాగాలున్నాయి. చిత్రం మన మెదడులో ముద్రించబడి ఆ పైన పదాలుగా మారి  భావం మనకు అర్ధం అవుతుంది. ఈ భావ వ్యక్తీకరణ  పరిపూర్ణం గా ఉండక పోవచ్చు. కానీ పలికిన మాటల  తో  వెంటనే అతి సహజం గా భావాన్ని   పూర్తిగా  అర్ధం చేసుకో గలుగు తాము.  ఉదాహరణగా దేవదాసు చిత్రం లో ఒక  సన్నివేశం చూద్దాం. అవసానదశలో  తమ ఊరికి చేరుకున్న మనిషి దేవదాసు అని తెలియగానే, పార్వతి ఘట్టిగా అతని పేరు అరచి పిలుస్తూ పరిగెడుతుంది.

కానీ ఇంటిగుమ్మం ముందు ఆమెను ఆపివేస్తారు. అప్పుడు అక్కడ పార్వతి మెల్లగా దేవదాస్ దేవదాస్  అంటూ ఆగిపోతుంది. చివరి సారి అతని పేరు పిలిచి మౌనంగా రోదిస్తుంది. అరుస్తూ పరిగెత్తడంలో,ఆ చివరి మాట  లో పార్వతి తన ఆవేదనను, ఆక్రోశాన్ని,  నిస్సహాయత ని,దేవదాసు మీద ఉన్న ప్రేమని  తెలియ చేస్తుంది. దృశ్య కావ్యమైనా  సినిమా లో  మాటలు   కనిపించని రాగాలై కమనీయం గా వినిపిస్తాయి. 

భారతీయ సినిమా మొదట్లో నాటక రంగం మీద  మీద ఆధార పడింది. క్రమ క్రమం గా నాటక రంగానికి దూరంగా జరుగుతున్నా, ఆ పాత వాసనలు, నాటకీయత, సంభాషణలు , పలికే రీతి, ఇంకా గణనీయమైన ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి.   నాటక రంగంలో విశేషానుభవం గడించిన కళాకారులు  సినిమాలను కూడా  త్వరగానే అర్ధం చేసుకొని నిర్మాతలు గా , దర్శకులు గా, రచయితలు గా , నటులుగా   తమ ప్రత్యేకతను జనరంజంకంగా  చాటుకున్నారు. ఆత్రేయ దాసరి, బాలచందర్, యండమూరి మొదలైన అనేక నాటక ప్రముఖులు సినిమా మీడియం కు అనుగుణంగా మారుతూనే తమ శైలి, గుర్తింపు విడనాడకుండానే  సినిమా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

నాటక రంగాన్నుంచి వచ్చిన ప్రముఖుల్లో శ్రీ జంధ్యాల ఒకరు. ఆయన నాటక రంగ మెళుకువులన్నీ  సినిమాల కనుగుణంగా అనువదించుకొని చూపించడం లో సిద్ధహస్తులు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో ప్రతి ఫ్రేమ్ లోనూ పాత్రల స్వభానానుగుణంగా , ఆ సీను లో ఆ యా పాత్రల ప్రాముఖ్యత,  తెలిసేటట్టుగా, చిత్రం తో ప్రేక్షకుడు లీనమయ్యే విధం గా   సరిచూసుకొనే వారు.సినిమాల్లో రచయిత గా అడుగుపెట్టిన జంధ్యాల దర్శకుడిగా కూడా  తన ప్రతిభ చాటుకున్నారు.  కెరీర్ మొదట్లో ఆయన కమర్షియల్ సినిమాలు, కొన్ని సీరియస్ సినీమాలు తీసినా అధ్బుతమైన హాస్యరస ప్రధానమైన సినిమాలు తీసి హాస్యబ్రహ్మ గా తెలుగు ప్రేక్షక హృదయాలలో  చిరస్థాయిగా నిలిచిపోయాడు.

ఈ సందర్భంలో సినిమాల్లో రచయిత స్థానాన్ని గురించి కొంచెం చెప్పుకోవాలి.  ఈ నాడు  రచయిత ఒక కధని నిర్మాత తో ఔననిపించుకొన్న తరువాత దర్శకుడి , హీరో, నిర్మాత ల అభిరుచి కి అనుగుణంగా కధను మార్చుతూ, కొండొకచో అసలు కధ తో పోలికలు లేకుండగానే మార్చి,  తన పారితోషకం  తీసుకోవాల్సి వస్తోంది.  రచయిత ప్రాముఖ్యత తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు నిర్మాతలు రచయితకు సమున్నత స్థానం, దర్శకుడితో సమాన స్థాయి ఇచ్చి వ్రాయించుకొనేవారు.  ఆగ్ర హీరో లు కూడా  రచయిత పనిలో ఎక్కువుగా జోక్యం చేసుకొనేవారు కారు.  జంధ్యాల ఆ కోవకు చెందిన రచయిత. ఆయన  కమర్షియల్ సినిమాల లో గానే , కళాత్మక సినిమాలో కూడా పేరు సంపాదించు కొన్నారు.  దర్శకుడిగా ఆయన కళాత్మక సినిమాలకే మొగ్గు చూపారు అంటే అది ఆయన కళాత్మక హృదయానికి నిదర్శనం  గా చెప్పుకోవచ్చు.  ఆయన సెంటిమెంటల్ సీన్లు ఎంత గా పండించేవారో అంతకన్నా ఎక్కువ ప్రతిభ కడుపుబ్బ నవ్వించే హాస్య సన్నివేశాలలో  చూపించేవారు. 

ఆయన  రచయితగా  రాసే చిత్రాలలో నటించడానికి అగ్రశ్రేణి కళాకారులు పోటీ పడేవారు.   ఆయన దర్శకుడిగా కమర్షియల్ సినిమాల నుంచి దూరంగా జరిగి  అర్ధవంతమైన, సున్నితమైన, కళాత్మక చిత్రాలు, ముద్దమందారం, నాలుగు స్థంభాల ఆట, ఆనంద భైరవి మొదలైనవి  తీశారు. స్వతహా గా కవి అవటం వల్ల, తన సినిమాలలో సంభాషణల లోను, పాటల లోనూ సాహిత్యానికి, సంగీతానికి  పెద్ద పీట వేశారు. రచయిత గా అడుగు పెట్టి దర్శకుడిగా ఎదిగిన అతికొద్దిమంది కళాకారులలో దాసరి సరసన ఉండ  దగ్గ ఒకే ఒక్కడు జంధ్యాల. జంధ్యాల సంభాషణల చాతుర్యం ఈ కింద వాటిలో చూడవచ్చు.

ఈస్ట్ కోస్ట్  మాష్టారు తనకిష్టమైన  అతి కష్టమైన బారిష్టర్ టెస్ట్ ఫస్ట్ లో పాస్ అయ్యి నందుకు తన పక్కింటి

వాడిని ఫీస్ట్ కని పిలిచి చికెన్ రోస్ట్ టేస్ట్ ను బెస్ట్ బెస్ట్ అనుకుంటూ సుష్టుగా లాగించి బ్రేవ్ మన్నాట్ట ……… …………….. వేట గాడు.

పాశ్చాత్య నాగరికత పెను తుఫాను లో రెపరెప లాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని కాపు కాయడానికి తన రెండు చేతులు అడ్డు పెట్టిన మహామనీషికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను ……………… శంకరాభరణం

ఆత్రేయ వ్రాసి ప్రేక్షకులని,  వ్రాయక నిర్మాతలనీ ఏడిపిస్తాడు,అని ఆత్రేయ గురించి జన వాక్కు. అదే విధం గా జంధ్యాల గురించి

జంధ్యాల హాస్యం తో హాస్య ప్రియులని, ఆర్ద్రత తో అందరినీ ఏడిపిస్తాడు అని అనుకోవచ్చు. 

ఇంకా ఉంది…. 

కంచిభొట్ల శ్రీనివాస్ గారు జంధ్యాల గురించి వ్రాసిన ఆంగ్ల వ్యాసానికి బులుసు సుబ్రహ్మణ్యం గారి స్వేచ్చానువాదం జంధ్యాల అభిమానుల కోసం.

కంచిభొట్ల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలతో

Be the first to comment

Leave a Reply