ఎనభైల్లో (అనుకుంటా), జంధ్యాల గారు రాసి, తీసిన తెలుగు సినిమా, మల్లెపందిరి, ఆ తర్వాత కొన్నాళ్ళకు పుస్తకరూపేణా వచ్చింది. అది ఇన్నాళ్ళకు ఒక ఫ్రెండ్ పుణ్యమా అని నాకు దొరికింది. ఆ పుస్తక విశేషాలే ఇక్కడ!
సినిమా పరిజ్ఞానం దాదాపుగా శూన్యం అయిన నాకు, ఈ పేరున ఒక సినిమా ఉందని కూడా తెలీదు. తారాగణం అంతకన్నా తెలీదు. నూతన సంవత్సరం సంధర్భంగా తీసుకున్న రెసెల్యూషన్స్ లో జంధ్యాల గారి ఏ రచనైనా చదవాలని నిర్ణయించుకోవటంతో, అనుకోకుండా ఈ పుస్తకం దొరికేసరికి, మరో ఆలోచన లేకపోయింది.
సినిమా కథ..
ఈ సినిమాలో వెత్తుక్కోనవసరం లేకుండా, కథ స్పష్టంగా తేటతెల్లంగా తెలుస్తుంది. అది ఏమనగా..
సాధారణంగా, అచ్చ తెలుగు సినిమాల్లో కనిపించే హీరో-హీరోయిన్-విలన్ త్రయం మధ్య జరిగే ప్రేమ-పగ టైపు కథ. హీరో అన్నవాడు, నూటికి తొంభై మార్కులు తెచ్చుకునే వాడే! అందంలోనూ, బలంలోనూ, శక్తిసామర్ధ్యాల్లోనూ, తెలివితేటల్లోనూ ఆహో-ఓహో అనిపించుకోవాలి. ఇట్లాంటివేవో ఇంకొన్ని ఫార్ములాలు.
అట్లాంటిది, ఈ సినిమాలో కథానాయకుడు, అతి కష్టం మీద ముప్ఫై మూడు మార్కుల వరకూ దేకీ, పాకీ వచ్చి చతికలబడిపోతే, “గ్రేస్” మార్కులు వేసేవారుంటే “పాస్”, లేకపోతే తుస్స్ అనిపించుకునే శాల్తీ! చదువుసంధ్యల్లో కాని, అందచందాల్లో కాని, బతకనేర్వడంలో కాని పూర్తిగా వెనకబడిపోయిన ఇతడు, ముప్ఫై ఐదేళ్ళు వచ్చినా పెళ్ళి కాక, నానా మంది చేత, నానా మాటలూ పడుతూ కాలం వెళ్ళదీస్తున్న వేళలో, ప్రేమ పరీక్షలో స్లిప్పులిచ్చి సాయపడింది ఎవరు? ప్రేమ పరీక్ష పాసై, వైవాహిక జీవితంలో ఫెయిల్ అవుతున్న తరుణంలో గ్రేస్ మార్కులు వేసి పాస్ చేయించింది ఎవరు? అన్నదే కథాంశం.
జంధ్యాల అంటే హాస్యానికి మారుపేరు కాబట్టి, పైగా మాటలు రాసింది వారే కాబట్టి సినిమాలో హాస్యానికి కొదవలేదు. ఒక అర్భకుడి జీవితయాత్ర ఇంత హాస్యాయమానంగా నడిపించటం ఆయనకే సాధ్యం. ఆ నవ్వు పరదాలు మాటున చూసే ధైర్యం, ఓపికా ఉంటే, సగటు తెలుగువాడి జీవితాన్ని, ముఖ్యంగా మధ్యతరగతి జీవితాలను, ఆయన అర్థం చేసుకొని, ఆవిష్కరించటంలో కనబరచిన నేర్పరితనం తెలిసొస్తుంది. అసమర్థతా, అభద్రతాభావాలతో సమతమై, పక్కనున్న వారి జీవితాన్ని నరకప్రాయం చేస్తున్నవారి జీవితాల్లో నుండి కూడా ఇంతటి హాస్యాన్ని పండించగల ఆయన హాస్యదృష్టికి జోహార్లు.
సినిమాను నేను చూడలేదుగాని, పుస్తకం రూపేణ చదువుకోవడం భలేంటి అనుభవం. సినిమాను మనకు చూపిస్తూ, మనకి ఎవరో కథ చెప్తున్నట్టు ఉంటుంది; ఇంటరాక్టివ్ నరేషన్. రాసింది ఎవరో స్పష్టంగా తెలీదు. జంధ్యాల, దివాకర్లలో ఒకరు అయ్యుంటారని నా అనుమానం. కథను రాయడంలో నేర్పును ప్రదర్శించారు. కొన్ని వాక్యాలు, కొన్ని పదబంధాలు బాగున్నాయి. ముఖ్యంగా అప్పటి సామాజిక పరిస్థితులు తెల్సుకునే ఉన్నాయి.
ఉదాహరణకు, ఇద్దరు గబగబా మాట్లాడేసుకుంటున్నారని చెప్పటానికి, టైపు హైయ్యర్ భాషలో మాట్లాడేసుకుంటున్నారనడం లాంటివి. కథాపరంగా వచ్చే కొన్ని వర్ణనలు కూడా “టూ-మచ్” అనిపించేంతగా రాసారు. ఎలక్ట్రీషయన్ చాలా లావుగా ఉన్నాడని చెప్పడానికి, “అతడు ఎలక్ట్రిక్ పోల్ వైపు చూడగానే, ఇతడెక్కితే కష్టం కదా అని భయపడి, పోల్ కిందకు వంగి, తీగలు అందిస్తుంది.” అన్న విధంగా చెప్తారు.
చిత్ర షూటింగ్‍లో జరిగిన వింతలూ-విశేషాలూ, నట సహాయక వర్గాలతో తీసిన ఫోటోలూ కూడా ఉన్నాయి. ఇందులో వేటూరి గారు ఒక పాత్ర వేశారంటే, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన రాసిన పాటలూ ఒకట్రెండు ఇచ్చారు. బాగున్నట్టు అనిపించాయి. ఎస్పీబి కూడా ఒక ముఖ్య పాత్ర వేశారు. హీరోహీరోయిన్లు కొత్తవారు కావటంతో, ఈ సినిమా పెద్దగా పేరు తెచ్చుకోకపోవటం వల్ల అనామకులగానే ఉండిపోయారనుకుంటాను.
అప్పట్లో, మీడియా అంత బలంగా లేకపోవటం వల్లననుకుంట, ఇలాంటి సినిమా నవల్లు వచ్చేవి. ఇది ఒక సినిమా కథగా కాకున్నా, ఒక నవలికగా చదువుకున్నా బాగుంటుంది. పుస్తకాన్ని గాని, జంధ్యాల గారు రాసుంటే, సినిమా మరో మంచి రచయితను కోల్ఫోయినట్టేనని చెప్పుకోవచ్చు. కాకపోతే, ఆయన సినిమాలు లేకపోతే, మన జీవితాల్లో హాస్యం శూన్యమైయ్యుండేదేమో! పుస్తకం మాత్రం మంచి తెలుగును ఆస్వాదించే వీలు కలిపిస్తుంది.
ఎటూ తన దగ్గరకే రప్పించేసుకున్నాడు కాబట్టి, జంధ్యాల చేత కొన్ని స్ర్క్రిప్ట్లు రాయిస్తే బాగుణ్ణు దేవుడు! అలా అయినా, కొన్ని జీవితాల్లో ఆనందం తాండవిస్తుందేమో!
*****
పూర్ణిమ గారు రాసిన ఈ వ్యాసాన్ని ఇంతకుముందు పుస్తకం.నెట్ లో ప్రచురించారు.దాన్ని ఈ కింద లింకులో చూడవచ్చు.
Leave a Reply
You must be logged in to post a comment.