జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన “శ్రీవారికి ప్రేమలేఖ” సినిమాకి కథ అందించిన ఆంధ్రుల అభిమాన హాస్య రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారితో జంధ్యావందనం తరపున దాట్ల లలిత గారి చింటర్వూ (చిన్న ఇంటర్వూ)
నమస్తే విజయలక్ష్మిగారూ….మున్ముందుగా…..ఎవరీ అక్కుపక్షి అని విసుక్కోకుండా, చేయి ఖాళీలేదు ఎల్లెల్లవమ్మా అని తోలెయ్యకుండా ……అడగ్గానే మాకోసం , కాసిన్ని కబుర్లు , మరికాసిన్ని జ్ఞాపకాలు పంచడానికొచ్చిన మీకు “జంధ్యావందనం” టీం తరపున మనః పూర్వక ధన్యవాదాలు .
మరి మొదలుపెడదావాండీ ………” శ్రీ లలితా శివజ్యోతీ ప్రొడక్షన్ వారి ….” ఆ..హా..హా అంతఓపిక లేదంటారా ! సరే అయితే ఈసారికి ఇలా కానిద్దాం !
ప్ర: ముందుగా రచయిత్రిగా మీ ప్రారంభం, హాస్య రచయిత్రిగా మీ ప్రస్థానం గురించి కొన్నిమాటలు?
జ: రచయిత్రిగా నా ప్రారంభం ‘స్క్రిప్టు సిద్ధంగా వుంది సినిమా తియ్యండి ’అనే వ్యంగ్య రచనతో, అదీ మూడు వారాలు ఆంద్ర ప్రభలో వచ్చింది. హాస్యం అంటే నాకు చాలా ఇష్టం, నేను రాసిన హాస్యం అందరికి నచ్చింది కాబట్టి, నేను రాయడం వాళ్ళు చదవటం ఈ సందట్లో నేను హాస్య రచయిత్రి గా సెటిల్ అయిపోయా అంత కంటే నేనే పాపం ఎరగను :))
ప్ర: ప్రేమలేఖ నవలకి ముందు మీరు హాస్య రచనలు చేసారా? ఆ నవల సినిమాగా మారాకా, సినిమా కథలు రాయాలని సీరియస్ గా ప్రయత్నించలేదా?
జ: మొట్ట మొదటి నవలే ప్రేమలేఖ. అప్పట్లో నేను ఎక్కడో వెస్ట్ బెంగాల్ లో చిత్తరంజన్ లో వుండేదాన్ని, సినిమాలేమో ఇక్కడ తీసేవాళ్ళు. నామీద సినిమా వారి దృష్టి పడలేదు. నాకై నేను ప్రయత్నం చెయ్యడమా? అలా చెయ్యాలని కూడా తెలీదు.
ప్ర: ‘ప్రేమలేఖ’ నవల రాయడానికి మీకు ప్రేరణ?
జ: అప్పట్లో వచ్చిన నవలల్లో యెంత సేపూ హీరో హీరోయిను చుట్టూ తిరిగేది కధ. మిగిలిన పాత్రలకి అంత ప్రాధాన్యత వుండేది కాదు. అలా కాకుండా ఓ కుటుంబం మొత్తాన్ని ఓ చోట చేర్చి నవల రాయాలని సరదాగా రాసేసాను.
ప్ర: మీ నవల జంధ్యాల గారి దృష్టికి ఎలా వెళ్ళింది? జంధ్యాల మీ నవలని సినిమాగా తీస్తారని తెలిసినప్పుడు మీకు ఏమనిపించింది?
జ: ప్రేమలేఖ నవల చతుర లో వచ్చింది. ఆ పత్రిక ఈనాడు రామోజీ రావు గారిది. ఆ తరువాత వారే ఉషా కిరణ్ మూవీస్ బానర్ మీద సినిమాలు తియ్యాలని శ్రీకారం చుట్టారు. వారికి నా నవలను సూచించారుట. వారి తరఫున జగదీష్ బాబు గారు చిత్తరంజన్ వచ్చి హక్కులు తీసుకున్నారు. కాబట్టి నాకూ నిర్మాతలకీ మద్య డీల్ జరిగింది, అంతే తప్ప జంధ్యాల గారికి ఈ నవల గురించి ఎవరు చెప్పారో నాకు తెలియదు. అప్పటికీ నాకు జంధ్యాల అంటే ఎవరో కూడా తెలియదు. దూరాన వున్నాను, అప్పటికింకా టి వి లు, వీడియోలు లేవు. ఇక్కడి సినిమాల సంగతి నాకెలా తెలుస్తుంది….కాబట్టి తెలియదు.
ప్ర: ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమా కథా చర్చల్లో మీరు పాల్గొన్నారా? షూటింగ్ కి వెళ్ళారా? అప్పటి అనుభవాలు?
జ: లేదు…అలా పాల్గొంటారని కూడా నాకుతెలియదు. షూటింగ్ విషయానికొస్తే, షూటింగ్ కోసమని వెళ్ళలేదు, కాకతాళీయం గా మావారికి అరకు లో పని వుంటే నేనూ పిల్లల్లూ వెళ్లాం. వైజాగ్ లో షూటింగ్ జరుగుతోందని అక్కడ తెలిసింది. వైజాగ్ వచ్చాక మా సరదా కొద్దీ ఫోన్ చేస్తే రమ్మన్నారు. అక్కడ మొదటి సారి జంధ్యాల గారితో పరిచయం. “మనసా తుళ్ళి పడకే” పాట తీస్తున్నారు…ఓ గంట సేపు వున్నాం.
ప్ర: సినిమా ప్రివ్యూ చూశారా?
జ: లేదు…చూడలేదు. ప్రివ్యూ మాట దేవుడెరుగు సినిమా విడుదల అయిందని కూడా చూసొచ్చిన వాళ్ళు చెప్తే తెలిసింది. మళ్లీ మా సరదా కొద్దీ చిత్తరంజన్ నుండి వైజాగ్ వెళ్లి మద్యాహ్నం మేటినీ చూసి వెంటనే రైలేక్కాం. సినిమా కోసం అంత దూరం వెళ్ళటం మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ కి ఎక్కాల్సిన విషయం, ప్రయత్నించి వుండాల్సింది. మరో తమాషా చెప్పనా? మాకు టికెట్లు దొరకలేదు మానేజేర్ దగ్గరికి వెళ్లి నేను ఫలానా అని చెప్తే అనుమానం గా చూసి టికెట్లిచ్చారు, బెంచీ క్లాస్స్ లో కూర్చుని సినిమా చూడ్డం అదే మొదలు అదే ఆఖరు.
ప్ర: తొలిసారి మీ అక్షరాలను చిత్రం గా చూసుకుంటూ మీరు పొందిన అనుభూతి మాకోసం మరోసారి గుర్తుచేసుకోగలరా?
జ: అప్పుడేం అనిపించలేదు బుర్ర మొద్దుబారిపోయింది
ప్ర: నవల సినిమాగా మారేటప్పుడు మార్పులు అనివార్యం. అలా మీ నవల సినిమాగా మారినప్పుడు జరిగిన మార్పులు మీకు సంతృప్తిని ఇచ్చాయా లేక కష్టం కలిగించాయా?
జ: కధ విషయం కంటే కూడా వీరభద్ర రావు వాడే ఒక పదం నాకు నచ్చలేదు. ఆ పదం మీరే కనిపెట్టగలరు.
ప్ర: దర్శకుడి పని తీరుని గురించి మీ అభిప్రాయం? అలాగే జంధ్యాలగారికి సంబంధించిన జ్ఞాపకాలు ఏవైనా మాతో పంచుకోగలరా?
జ: దర్శకుని గురించి నేను వేరేగా చెప్పాలా! ప్రతిభాశాలి జంధ్యాల గారు సినిమాలకు రాసిన సంభాషణలు అజరామరాలు. దర్శకులుగా కూడా మనందరికీ ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించింది ఆయనేగా. జంధ్యాల గారు నేను కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ. శ్రీవారికి ప్రేమలేఖ శతదినోత్సవం లో కలుసుకున్నప్పుడు నాకు మళ్ళీ కధ ఎప్పుడిస్తున్నారు అని అడిగారు.
ప్రస్తుతం ఒక నవల రాస్తున్నా అన్నాను. పూర్తవగానే నాకు పంపండి అన్నారు పంపించాను. “రెండు కుటుంబాల కధ” ఆయన ఏం చెప్పలేదు. ఆ నవలని సంపూర్ణ గోలాయణం పేరుతో ఉదయం కి పంపాను. ఆతర్వాత కొన్ని ఏళ్ళు గడిచాక మేము బెంగుళూరులో వుండగా జంధ్యాల గారు ఫోన్ చేసి రెండు కుటుంబాల కధ మొదలెడుతున్నాం ప్రొడ్యూసర్ మనిషి వచ్చి మీకు అడ్వాన్సు ఇస్తాడు అన్నారు. ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను మరి, అదీ నవలగా వచ్చింది అన్నా. అలాగా సారీ మీతో ఓ మాట చెప్పి వుండాల్సింది అప్పుడే తీద్దామనుకున్నాఆలస్యం అయింది. సరేలెండి, నవలలో ఇంకా మంచి మార్పులేమైనా చేసారా అన్నారు, లేదన్నాను, అయితే సరే అన్నారు అదే ‘ప్రేమ యెంత మధురం’ సినిమా.
తరువాత ఒక కొత్త పత్రిక లో నవల మొదలు పెట్టా, రెండు నెలలకే ఆ పత్రిక మూత పడింది. ఇది జరిగిన కొద్ది రోజులకి జంధ్యాల గారి అసిస్టెంట్ N.B.శాస్త్రి మా ఇంటికి వచ్చారు. ఆ కధ పూర్తిగా కావాలని లెటర్ రాసి పంపించారు. అది మొదట్లోనే ఆగి పోయిందిగా ఇంకా రాయలేదు అంటే, సినాప్సిస్ పంప మన్నారు పంపించా. క్లియర్ గా లేదు మీరు పూర్తిగా రాయండి ఇప్పటికి వేరే స్టొరీ తీసుకుంటా అది మీరు రాసాక తీసుకుందాం అన్నారు. లక్ష్మీ కల్యాణం నవల రాసాను రచన పత్రికలో వచ్చింది.
సేం స్టోరీ రిపీట్ అయింది. ఒక రోజు సడన్ గా ఫోన్ చేసి నా స్టొరీ రెడీ గా ఉందా మనిషిని పంపిస్తున్నా అన్నారు. రచనలో వచ్చేసింది అన్నా…. వివరాలు అడిగారు. సరే లెండి, నేను తెప్పించుకుంటా అన్నారు. చదివి అబ్బా ఇందులో చాలా భాగాలు మా వాళ్ళు లేపెసారు రాయగానే నాకు పంపాల్సింది అన్నారు. అప్పుడు నేను మళ్ళీ చిత్తరంజన్ వెళ్ళిపోయా బెంగుళూరు నించి.
సీన్ కట్ చేస్తే…ఓ రోజు చెన్నై కి ఫోన్ చేసి మీరు హైదరాబాద్ ఎప్పుడొస్తారు అని అడిగారు చెప్పాను. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను నాకు కధ కావాలి ఈ లోగా ఏమైనా కొత్త ఐడియాలు వుంటే రాసి వుంచండి, మీరు రాగానే నాకు ఫోన్ చెయ్యండి అన్నారు…అలాగే చేసాను. మాఇంటికి వస్తారా నేను రానా అన్నారు. నేనే వస్తాను అన్నాను. కాస్త తీరిగ్గా కూర్చునేలా రండి అన్నారు, అడ్రస్ చెప్పారు.
వారి అమ్మాయిలు సాహితి, సంపద లకు కేకులు బిస్కెట్లు కొని పట్టుకెళ్ళాను. మనిషి చాలా డల్ గా వున్నారు. ఈ మధ్య ఆరోగ్యం బావుండలేదు, జ్వరం వచ్చి తగ్గింది అన్నారు. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక అసలు విషయం మాట్లాడుకున్నాం. నేను రాసిన స్టొరీ ఆర్డర్ అందించాను, పెర్‌ఫెక్ట్ గా వుంది, అదివరకు ఇలా రాయలేదు మీరు అన్నారు. మరి ఆ తరువాత పండిపోయానుకదా అంటే నవ్వేసారు. ఇక ఇది మీరు నవల గా రాయద్దు ఇలాగే వుంచండి ఏకంగా సినిమాకే రాసుకుందాం అప్పుడంటే దూరంగా వుండేవారు ఇప్పుడు దగ్గరేగా…మనం కలిసి వర్క్ చెయ్యచ్చు అన్నారు. సరే అన్నా.
నాదో సందేహం ఇక మీరు హాస్యం తప్ప ఇంకోటి చెయ్యరా? అని అడిగాను. అదేం లేదు నా దగ్గర నుండి అదే ఆశిస్తారు జనం అన్నారు. అలా ఎందుకు అనుకుంటున్నారు?
మీ పేరు మీకుంది, వేరేవి కూడా చెయ్యచ్చుకదా అన్నాను కాస్త చనువు తీసుకుని.
ఏం? ఏదైనా సబ్జెక్ట్ ఉందా? అన్నారు ఏమీ చెప్పలేదు నేను.
ఏదో వుంది లేకపోతె మీరు ఇలా అడగరు చెప్పండి అన్నారు.
నాదగ్గర ఒక సబ్జక్ట్ వుంది అన్నాను మొహమాటం గానే…
చెప్పండి నేను కాకపొతే వేరేవాళ్ళకి చెప్దాం అన్నారు. చెప్పాను, ఓ గంట పట్టింది.
ఎప్పుడూ నవ్వే జంధ్యాల గారు కంట నీళ్ళు పెట్టుకున్నారు, కాసేపు ఏమీ మాట్లాడలేదు. తరువాత ఇది నాకు కావాలి. లీడ్ రోల్ నేనే చేస్తాను…మీరు ఎవ్వరికీ మాట ఇవ్వద్దు, రాయద్దు ఇది మాత్రం నాకే అన్నారు కాస్త ఉద్వేగంగానే.
సరేలెండి అన్నాను. అప్పటికే చాలాసేపు అయింది ఇక వెళ్తాను అని లేచాను. పాపని ఎత్తుకుని కిందికి వచ్చి ఆటో పిలిపించారు. ఆటో ఎక్కుతుంటే నేను చెప్పింది గుర్తు ఉందిగా అన్నారు. అదే ఆఖరుసారి జంధ్యాల గారిని చూడటం.
సాయంత్రం ఫోన్ చేసారు సారీ మిమ్మల్ని భోజనం చేసి వెళ్ళమని చెప్పాల్సింది, ఆ కధలో అంతగా ఇమ్మర్స్ అయిపోయాను. మా కుర్రాడిని పంపిస్తున్నాను టోకెన్ అడ్వాన్సుగా తీసుకోండి… మీరు చెప్పిన రెండో కధకి ఇది. పర్వాలేదండీ అంటే, అలాకాదు ఉండనివ్వండి…ఒక అండర్ స్టాండింగ్ అన్నారు. అలాగే ఓ కుర్రాడు వచ్చి ఓ చిన్న మొత్తం ఇచ్చివెళ్ళాడు. అదే జంధ్యాల గారితో నా ఒకే ఒక్క ఫేస్ టు ఫేస్ మీటింగ్. ఆ తరువాత ఆయన అనారోగ్యం…అకాల మరణం… అప్పుడు జంధ్యాల గారికి చెప్పిన మొదటి కధ ఇటీవల తవ్వకాల్లో బయట పడింది, రాసాను. ఇప్పుడు ఆంద్రభూమి లో వస్తున్న ‘శ్రీరస్తు శుభమస్తు’ సీరియల్ అదే. మాటిచ్చి టోకెన్ అడ్వాన్సు తీసుకున్న కధ మాత్రం కాయితం మీద పెట్టలేదు.
ప్ర: ఆ (శ్రీవారికి ప్రేమలేఖ) కథలో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ, తల్చుకోగానే నవ్వొచ్చే పాత్రల్లో ఏవైనా మీకు నిజజీవితంలో తారసపడ్డాయా? ముఖ్యంగా టైటిల్స్ నుండీ శుభం కార్డు వరకూ గుక్కతిప్పుకోకుండా సినిమా కథ చెప్పి హింసించే శ్రీలక్ష్మి లాంటివాళ్ళు?
జ: ఆహా వుంది.ఇంకో తమాషా చెప్పనా…..ఆవిడ ఓ కన్నడం డాక్టరు గారి భార్య…తెలుగురాదు. ఆయనకీ ఆంధ్రా లో ఉద్యోగం. పొడి పొడి ముక్కలు నాలుగు నేర్చుకుని తెలుగు సినిమాలు చూసి తెలుగు వాళ్లకి కధ చెప్పేది. ఆ పల్లెటూరు లో డాక్టరు గారంటే చాలా గౌరవం…చచ్చినట్టూ వినేవాళ్ళు. డాక్టరు గారికి జాలి వేసి చంటి అనే ఓ పదేళ్ళ పిల్లని కుదిర్చారు. నెల జీతం కూడా ఏర్పాటు చేసారు అది వచ్చి కధ విని వెళ్ళేది.
ప్ర: ఇప్పటికీ ‘శ్రీవారికి ప్రేమలేఖ’ తలచుకోగానే ‘మాదీఫల రసాయనం’ ‘లలితా శివజ్యోతి ప్రొడక్షన్స్’ ‘పట్టుచీర విప్పేయనా’ లాంటి ప్రహసనాలన్నీ గుర్తొస్తాయి..మీ కథలో వీటిని చేర్చడం మీకేమనిపించింది?
జ: అద్భుతంగా వుంది!!! చాలా ఎంజాయ్ చేసాను .
ప్ర: అచ్చతెలుగు హాస్య రచయిత్రిగా ప్రస్తుతం తెలుగు సినిమా పండిస్తున్న హాస్యం పై మీ అభిప్రాయం?
జ: బాగానే వుంది. ఆరోగ్యం గా ఆహ్లాదం గా వున్న హాస్యమూ వస్తోంది, వల్గర్ కామెడీ కూడా ఉంటోంది. తమాషా ఏవిటంటే, కమేడియన్ కన్నా హీరోలే చక్కగా హాస్యాన్ని పండిస్తున్నారు. మహేష్ బాబు,వెంకటేష్, రవితేజ వీళ్ళు చక్కగా నవ్విస్తున్నారు.
బావుందండీ విజయలక్ష్మిగారు…నవలకీ సినిమాకీ సంబంధించిన చక్కటి జ్ఞాపకాలను మాతో పంచుకున్నారు. జంధ్యాలగారు సంపూర్ణ ఆయుష్షుతో ఈనాటికీ మనమధ్య వుండి ఉంటే మీ ఇద్దరి కాంబినేషన్ తో శ్రీవారికి ప్రేమలేఖ వంటి మరెన్నో క్లాసిక్ కామెడీలు తెలుగు ప్రేక్షకులను అలరించి వుండేవి. అలాగే జంధ్యాలగారి గురించి తెలిపే ప్రతీ మాట ఆయన అభిమానులుగా మాకెంతో విలువైనవి, వారిని మరోసారి తలుచుకునే భాగ్యం కలిగించిన మీకు మా కృతజ్ఞతలు.
శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారికి అభినందనలు తెలియచేయుకోరువారు ఈ pvlakshmi8@gmail.com ఐడీ కి మెయిల్ చెయ్యవచ్చు
Comments:
murali …
18 weeks ago ·
Leave a Reply
You must be logged in to post a comment.