జంధ్యాలకు వేటూరి “అక్షర సంధ్యావందనం”

జంధ్యా వందనం

హాస్యం,సంగీతం కలిసి ఒకే జన్మ ఎత్తిన హాసం, నిన్నటి దరహాసం జంధ్యాల ఇతిహాసంలో చేరిపోయి రెండేళ్ళు గడిచాయి.ఎన్నేళ్ళు గడిచినా ఆయన మధుర స్మృతికి మరణం లేదు.ఎంత కాదనుకున్నా కన్నీళ్ళూ కళ్ళతోనే మింగటం కన్నా శరణం లేదు.

తెలుగు సినిమా అపహాస్యం పాలెక్కువై పరిహాస్యం పాలై పోతున్న ఈనాడు జంధ్యాల తన వంశవృక్షంతో సహా దర్శనమిచ్చి ఆదుకుంటాడు. పానుగంటి, కందుకూరి, గురజాడ, చిలకమర్తి, భమిడిపాటి, మొక్కపాటి, మునిమాణిక్యం మొదలయిన శాఖోపశాఖలతో విరాజిల్లే ఆ హాస్య కల్పవృక్షానికి మూల స్థానం లో కూర్చుని “ఫిబరే హ్యూమరసం” అని రస పిపాసులకు తన కలం నించి వెలువడిన హాస్య రస కలశాలను అందించిన తెలుగుజాతి చిరునవ్వు జంధ్యాల.

 

1972 లో బి.ఎన్.రెడ్డి గారి దగ్గర పనిచెయ్యాలని వచ్చి ఆ పని పనికి రాకపోవడంతో కె.విశ్వనాథ్ గారికి పరిచయం అయినారు జంధ్యాల. పరిచయం చేసింది ఆయన రాసిన నాటకమే-“సంధ్యారాగంలో శంఖారావం”. ఆ తరువాత సిరిసిరిమువ్వ చిత్రంతో ప్రత్యక్షంగా ఆయన రంగ ప్రవేశం చేసారు. అప్పట్నించీ పాటలు వేటూరి, మాటలు జంధ్యాల మార్కు చిత్రాలు ఎన్నో బాక్సాఫీసు పరిభాషలో సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. సప్తపదూలూ, సాగరసంగమాలూ, శంకరాభరణాలూ ఒక వంక,వేటగాళ్ళూ,జస్టిస్ చౌదరీలు, ఆఖరిపోరాటాలూ మరొక వంకా…ఎన్నో ఎన్నెన్నో.

జంధ్యాల దర్శకుడుగా తీసిన సినిమాలన్నీ సరసాల సాహితీ సంచికలే.  ఆయన తొలిచిత్రం ‘ముద్ద మందారం’ పాటలు రాయడానికి నాగార్జున సాగర్ వెళ్ళాం. జంధ్యాల, నేను వేరే సిట్టింగులకు అంతకుముందు అక్కడికి వెళ్ళడం రెండు మూడు సార్లు జరిగింది. మానవ నిర్మిత మంచినీటి సముద్రం, కృష్ణవేణమ్మ హృదయ వైశాల్యం కలసి సాక్షాత్కరించే ఆ చోట పుట్టిన పాటలు మధురాతి మధురాలు. అందులో జంధ్యాల వంటి సాహితీ కృషీవలుడితో సంగీత ప్రియుడితో నాగార్జున సాగర్ లో,కన్యాకుమారి లో, విశాఖ బీచ్ లో, ఫిషర్మన్స్ కోవ్ లో, కేరళలో గడపిన క్షణాలు మరపురానివి.

సీతాకోకచిలుక చిత్రానికి దర్శకుడు భారతీరాజా. తను తీసిన చిత్రాన్ని ఎక్కడైతే తీస్తున్నాడో అక్కడే ఆ పరిసరాల్లోన్నే మాటలూ పాటలూ రాస్తే బాగుంటుందని మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాడు. త్రిముఖాలుగా మహాసాగరం కలిసే చోట, స్వామి వివేకానందుడు సాగరంలో నిలబడి తపశ్చర్య ఆచరించిన చోట, సూర్యోదయాస్తమయాలు జనన మరణాల అద్వైతాన్ని చాటే చోట నేను పాటలు ఆయన మాటలు రాసిన చిత్రం సీతాకోక చిలక.

“జానకి కన్నుల జలధి తరంగం,

రాముని మదిలో విరహ సముద్రం,

చేతులు కలిసిన సేతు బంధనం-ఆ

సేతు హిమాచల ప్రణయ కీర్తనం,

సాగర సంగమమే ప్రణవ సాగర సంగమమే.”

అన్న గేయం- జంధ్యాల దృష్టిలో వాగ్గేయం- అక్కడే పుట్టింది.

“భారత భారతి పద సన్నిధిలో

కులమత సాగర సంగమ శృతిలో” జరిగిన కధ తియ్యడానికి రాయడానికి ఒకే ప్రదేశం ఎన్నుకున్న భారతీరాజా ఎంతటి కళాతపస్వి.

హాస్యమనే ఆచ్చాదనతో చిత్రాలు తీసి జీవన వేదాంతాన్ని బోదించిన రాజ్ కపూర్

“జీనా యహా మర్నా యహా,

ఇస్కే సివా జానా కహా” అని శైలేంద్ర మహాకవి ద్వారా ఆవిష్కరించాడు. ఒక ప్రేమగీతంలో ప్రేయసీ ప్రియులు రేపు నీవూ ఉండవూ నేనూ ఉండను కానీ లోకం కాలం ఇలానే ఉంటాయి. ప్రేమ ఎప్పుడూ ఉంటుంది, పాటా బ్రతికే ఉంటుంది, మనం మాత్రం ఉండము అని రాజ్ కపూర్ నర్గీస్ లు ఎన్ని సార్లు పాడుకోలేదు. జంధ్యాలకు ఆత్మగురువు రాజ్ కపూర్.ఈ సంగతి రహస్యంగా చెప్పాడు ఒకనాడు చెప్పాడు జంధ్యాల. తన ప్రతి చిత్రంలోనూ విధిగా ప్రేమ గురించి ఒక పాట ఉండాలని, అదే చివరకు మిగిలేదనీ ఆయన అనేవాడు. ‘అమరజీవి’ చిత్రంలో ‘విప్రనారాయణ’ రూపకం పెట్టినపుడు అందులో ‘నశ్వరమిది నాటకమిది నాలుగు గడియల వెలుగిది’ అనీ, ‘కడలిని కలిసే వరకే కావేరికి రూపు వున్నది’ అనీ రాసిన క్షణంలో ఆయన కన్నీళ్ళతో నవ్విన క్షణం మరువలేను.

 

‘చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిలా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ
నీ పేరే నా ప్రేమ
హిమములా రాలి సుమములై పూసి
ఋతువులై నవ్వి మధువులా పొంగు నీ ప్రేమ నా ప్రేమ
నీవేలే నా ప్రేమ
మౌనమై మెరిసి గానమై పిలిచి
కలలతో అలిసి గగనమై ఎగసె నీ ప్రేమ నా ప్రేమ నీవేలే నా ప్రేమ
భువనమైనా గగనమైనా ప్రేమమయమే సుమా ప్రేమ మనమే సుమా’

 

వంటి సుమాలను తన బ్రతుకు తోటలో పూయించుకున్న తోటమాలి జంధ్యాల. తనతో పాటూ నాకూ.. ఈ వాక్యం ఎలా ముగించాలో తెలియక.. అర్ధోక్తిగా.. ఆయనలా మిగిలిపోతుంది. పువ్వులా పుట్టి పవ్వులా రాలిపోయిన చంటబ్బాయి, అమరజీవి జంధ్యాల.

 

ఒక ప్రేమ అమృత శిల్పం
ఒక ప్రేమ బుధ్ధుడి రూపం
ఒక ప్రేమ రాముని శిల్పం
ఒక ప్రేమ గాంధీతత్వం

 

ఇవి శాశ్వత సత్యాలు, ప్రాణ కావ్యాలు. ఇవి రాయించడం ఒక ఎత్తు. ఆ రాసిన అక్షరాత్మలని ఆవిష్కరించడం మరో ఎత్తు. ఈ రెండు సందర్భాలలో అతను ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. చిత్రీకరణతో పదాలకు భాష్యం చెప్పిన భావుకుడు జంధ్యాల. రంగులనూ సెట్స్ మొదలైన హంగులనూ నమ్ముకుని జంధ్యాల ఏనాడూ చిత్రాలను తీయలేదు. లేలేత జీవితాల కలనేత, మమకారాల పడుగుపేకలవంటి భావాలను, ఆవేశాలను,ఆనందాలను, ఆగ్రహాలను, అనురాగాలను జంధ్యాలవలె గుర్తించినవారు, గుర్తుంచుకున్నవారూ అరుదు.

 

‘అలివేణీ ఆణిముత్యమా
నీ కంట నీటిముత్యమా
ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో
స్వాతివానా లేత ఎండలో ఇవి
జాలినవ్వు జాజిదండలో’

 

ముక్కుపచ్చలారని కుర్రబెంగల లేత గుండెల చప్పుడు వినిపించాలని ఇవాళ ఎవరనుకుంటున్నారు! అసూర్యంపశ్యల పరువాల పాల పొంగుల కెరటాల పవళించిన..వటపత్రశాయిగా పవళించిన.. బాలకృష్ణుడెవరిక్కావాలి? జయదేవుడి పదప్రయొగం ఏ శృంగారమహస్సు నుంచి కణకణలాడుతూ ఎగసివచ్చి కవితగా రగిలిందో (హుతాశరనతల్పం వంటి ప్రయోగాలు,వాటిలో ఉన్న పద అర్ధ వర్ణ శబ్ద విన్యాసాలు) చెబితే వినేవారెవరు? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పిన మహాజ్ఞాని జంధ్యాల. అతను తీసిన చిత్రాలు, వాటిలో మాటలు, పాటలు అన్నీ అతని సమాధానాలే.

 

‘నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా
నీ లాలి నే పాడలేనా
జాజి పూసేవేళ జాబిల్లి వేళ
పూలడోల నేనుకానా’

 

జంధ్యాల చిత్ర సాహితీ సంపుటాలు సవ్యాఖ్యానంగా వెలువడిన నాడు కులపతి, మధురమనస్వి అడవి బాపిరాజుతో బాటు మనకు మిగిలే మరో మానవుడు, మాననీయుడు జంధ్యాల అని తెలుస్తుంది.

 

జంధ్యాల మనసు వెన్నముద్ద, కళ్ళు వెన్నెలపొద్దులు, మాట అతిసున్నితం.. సారణి వీణ మీటినట్లు, ఊపిరి వేణువూదినట్లు లలితం – నవరసాలు అతనికి నవ్వురసాలే.

 

పెదకళ్ళేపల్లిలో తెలుగు వసంతోత్సవాలు జరిగిన మూడురోజులూ జంధ్యాల అక్కడే ఉండి హాస్యరసపు జల్లులలో శ్రోతలను ముంచెత్తడంతో పాటు ఎత్తిపొడుపుల మెరుపుల విమర్శల ఉరుములతో, పొట్టల్ని చెక్కలు చేసి నవ్వులని పండించు రసపిడుగులతో ఉర్రూతలూగించాడు.

 

సినీసాహితీప్రపంచంలో హాస్యాయుధాన్నిసవ్యసాచిలా ప్రయోగించినవారు శ్రీ పింగళి నాగేంద్రరావు గారు, శ్రీ జంధ్యాల గారే. భాషా వ్యాకరణ శాస్త్రాల నుంచీ, సాంఘిక దురాచారాల నుంచీ, వ్యంగ్య వైభవంతో హాస్యరసాన్ని జోడించి భాషను పెంచి వీరతాళ్ళు వేయించుకున్న మొనగాళ్ళు ఎందరున్నా వీరిద్దరి స్థానం మరొకరి దక్కదు. హాస్యరస ప్రయోగం చేసిన వారిలో శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు ప్రధములు. శాస్త్రిగారి ప్రాసక్రీడలు కొన్ని ద్విత్వాక్షరిగా సాగి ప్రజారంజకమైనాయి. ‘రహస్యం’ చిత్రంలో రాజసులోచన, రేలంగి సంభాషణ మరపురానిది.

‘ఎవరు మీరు..?
సిధ్ధులం..
సిధ్ధులకీ బుధ్ధులేమిటో!’

ఇత్యాదిగా సాగిన ప్రాసక్రీడ అందరికీ అర్ధమయ్యే భాషలో జంధ్యాల అనేక సందర్భాల్లో చేశారు. ‘వేటగాడు’ సినిమాలో గోపాలరావు, స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్, స్టేషన్ మాస్టరు సినిమాలలో ప్రాసక్రీడ అలాంటిదే. బ్రాహ్మణీకపు ప్రథమకోపాలు, గ్రంథాక్షరీశాపాలు, తిట్లు, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడాలు ఎన్నో జనాన్నీ విపరీతంగాఅకట్టుకునే విధంగా రాయగల జంధ్యాల హాస్యరచనకు కొత్త వరవడి దిద్దారు. ముళ్ళపూడి వారంటే గురుత్వంతో కూడిన అభిమానం ఆయనకి.

 

రచనలోనే కాక నిత్యజీవితంలో కూడా హాస్యరసానికీ, సరసానికీ పెద్దపీట వేశాడు జంధ్యాల. శ్రీనాథ మహాకవిలో ఎంత సరసం, భోజనశాలా పాండిత్యం వుండేవో అంతా ఉన్న చిరుకవి సార్వభౌముడు. తెలుగువారి వంటకాల మీద వాటి రుచుల మీద, పేర్ల మీద ఎన్నెన్ని రసగుళికల వంటి సంభాషణలు ఆయన రాశాడో!

 

‘రెండుజళ్ళ సీత’ చిత్రంలో

‘మాగాయే మహా పచ్చడి
పెరుగేస్తే మహత్తరి
అదివేస్తే అడ్డవిస్తరి
మానిన్యాం మహాసుందరి’

 

ఇలా ఊరగాయ స్త్రోత్రాలు, దండకాలు రాయించిన తెలుగు దర్శకుడు ఆయన. ఈ పట్టున ఆయనలో మాయాబజార్ లో ‘గోంగూరోపాఖ్యానం’ రాసిన పింగళివారి పట్టు మనకు చిక్కుతుంది. కురుసార్వభౌముడైన రారాజు ‘అది లేనిదే ముద్దైనా ముట్టరు’ అన్నత వరకూ వెళ్ళింది. అటువంటి శిఖరాగ్ర హాస్యం జంధ్యాలలోనూ కనిపిస్తుంది.

 

శ్రీవారికి ప్రేమలేఖ, నాలుగు స్థంభాలాట, ఆనంద భైరవి, రెండుజళ్ళ సీత, రెండు రెళ్ళు ఆరు, మూడు ముళ్ళు వంటి చిత్రాలలో ఆయన హాస్యరసంతోనూ, అది నింపిన పాత్రలతోనూ చేసిన ప్రయోగాలు అపూర్వం. తన కోరిక నెరవేరితే పక్కవాడికి గుండు గీయిస్తానని మొక్కుకోవడం, అల్లు రామలింగయ్య నటనలో విచిత్ర హిందీ భాషను ఉయోగించడం అటువంటి ప్రయోగాలే.

 

హాస్యరసం కోసం మిగతా రసాలను చిన్నచూపు చూడలేదు జంధ్యాల. ఉదాత్తమైన సన్నివేశాలు సృష్టించి ఉత్తమ సాహిత్యం గల పాటలను రాయించుకున్న రసహృదయం ఆయనది.

 

‘దొరలనీకు కనుల నీరు
దొరలదీలోకం మగదొరలదీ లోకం
కనులలోనే దాచుకోవె
కడలిలా శోకం – కన్నెపడుచులా శోకం’

అని నాలుగుస్థంభాలాట చిత్రంలోనూ

 

‘చైత్రము కుసుమాంజలి
పంచమస్వరమున ప్రౌఢ కోకిలలు
పలికే మరందాల అమృతవర్షిణి’  

 

అదే పాటలో

‘శయ్యలలో కొత్త వయ్యారమొలికె
శరదృతు కావేరిలా కొంత సాగి’  వంటి ప్రకృతి వర్ణనలతో ‘ఆనందభైరవి చిత్రంలోను.

 

‘మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
ఆ శుభ ఘడియ వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే తెలుసా మనసా’

 

అని కన్నెమనసు భాషలో తేతగా, తెలుగులో ‘శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రంలోను.
‘మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి’  వంటి మరెన్నో పాటలు ఏరికోరి తన చిత్రాలలో చలన శిల్పాలుగా మలచిన ఘనత జంధ్యాలదే.

 

రమేష్ నాయుడు, రాజన్ నాగేంద్ర, జంధ్యాల సంగమంలో పుట్టిన సంగీత గంగలో మునగని, మునిగి ముక్తి పొందని తెలుగు రసజ్ఞులు లేరంటే అతిశయోక్తి కాదు.

 

ప్రేమ అనే రెండు అక్షరాల మాటను నిర్వచించడానికి ప్రపంచభాషలన్నింటిలోనూ ఉన్న వేలాది అక్షరాలు కూడా చాలవు అని జంధ్యాల తరచు అంటుండేవారు. అందుకే ఆ ప్రేమకీర్తనగా నా చేత దాదాపు పది పాటలు రాయించాడు ఆయన. ప్రకృతి ఒళ్ళో తలదాచుకున్న పసితనం ఆయంది. నేను రాసిన

 

‘కొబ్బరాకు గాలి మబ్బుకేసింది
ఉలికి పడ్డ మబ్బు ఉరిమి చూసింది’
పాట ఆయనకు ఎంతో యిష్టం. ఈ పాట తన ‘నాలుగుస్థంభాలాట’లో ఎంతో సందర్భశుధ్ధితో ఉపయోగించుకున్నాడు.

 

పాటల రచయితగా నా జన్మకు ధన్యత చేకూర్చిన ద్రష్టలు, సృష్టికర్తలలో జంధ్యాల ఒకరు.

 

నన్ను, నా హావభావాలను, నా మాటలను మహమురిపెంగా చూసుకున్న ‘నా వాడు’ జంధ్యాల. నన్ను నటుడిగా చూడాలని ఆయన తపన పడేవాడు. తన చిత్రం ‘మల్లెపందిరి’ లో కకుమభంజకం స్వాములవారుగా నాచేత వేషం కూడా వేయించి మురిసిపోయాడు. 

 

ఆయన జీవితం ఎంత చిన్నదైనా అది కలకాలం మనుచరిత్ర! ఆ మనుచరిత్ర కృతిభర్త వెళ్ళిపోతే ‘కృష్ణరాయలతో దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబనగుచు ‘ అనుకున్న పెద్దన శోకసముద్రపు ఉప్పెన కెరటాలు ఈ కన్నీటి నీరాజనాలు- పెద్దన పాదధూళికి సైతం సరితూగే యోగ్యత నాకు లేదని తెలుసు. కాని వియోగంలో, విషాదంలో, విధిరాతలో అనుభవాలు మాత్రం ఒక్కటే కదా!

 

జంధ్యాల సభలలో అప్పుడప్పుడు విసిరిన చెణుకులు శ్రోతల హృదయాలకు చక్కిలిగింతలు పెట్టడమే కాక లోలోతుగా ఆలోచిస్తే నిగూఢమైన విమర్శలుగా గోచరించేవి. మామూలు గోష్ఠులలో, కథాచర్చలలో ఆయన వాక్చాతుర్యం సరేసరి. ఒకసారి ఒక కథాచర్చలో వేషం వెయ్యాలన్న దురద ఉన్న ఒక యువకుడిని పెట్టుబడి సగం నువ్వు భరిస్తావా అని అడుగుతాడు నిర్మాత. పెడతాను కానీ నువ్వు నాకు వేషమివ్వడమే కాకుండా పోస్టర్స్ అన్నిటిలోనూ నా పేరు, దానికింద ‘నటుడు- సహ నిర్మాత’ అని విధిగా వెయ్యాలంటాడు ఈ దురద రాజేశ్వరరావు. కథలో అతనికీ నిర్మాతకీ విరోధం రావాలి. ఏం చేయాలి అని చర్చ. వెంటనే జంధ్యాల నిముషం ఆలోచించకుండా ఏముందీ! తీరా పబ్లిసిటీ అంతా అయిపోయి దేశమంతా పోస్టర్స్ అంటించేస్తారు. ఆఫీసులోనూ, బయటా అందరూ నవ్వుతూ ఉంటారు. ఇతనూ చూస్తాడు ఏమిటా అని! అతని పేరు కింద ‘సహుడు- నహ నిర్మాత’ అని ఉంటుంది అన్నాడు. నిజంగా అందరూ పగలబడి నవ్వారు.

 

ఒకానొక సభలో బాలు, జానకి, శైలజ వరుసగా ప్రసంగించి శ్రోతల కళ్ళ వెంట ఆనందభాష్పాలు తెప్పిస్తే ఆ తరువాత ప్రసంగం మొదలుపెడుతూ జంధ్యాల ‘ఇంతవరకూ ‘పాడు’ మనుషులు ముగ్గురూ వచ్చి కంటతడి పెట్టించారు ‘ అనగానే సభాసరస్వతి పెద్దగా నవ్వింది.

 

జంధ్యాల ప్రసంగాలు సమయోచితంగా చెప్పే పిట్టకథలనవచ్చు. వేదాంత తత్వాన్ని బోధించడానికి భగవాన్ శ్రీరమణ మహర్షి ఇలాగే పిట్టకథల ద్వారా గోరుముద్దలు జ్ఞానశిశువుల చేత తినిపించేవారు. అవన్నీ రమణోపనిషత్తులుగా మిగిలిపోయాయి. అలాగే జంధ్యాల చమత్కారాలూ, చెణుకులూ ఒక పుస్తక రూపానికి వచ్చి శాశ్వతనిధిగా ఆంధ్రులకు మిగిలిపోవాలి. ఎవరు ఇందుకు పూనుకున్నా దానికి సర్వసహకారాలు అందించే జంధ్యాల అభిమానులు ఎందరో వున్నారు.

 

ఒకసారి మేమిద్దరం, మద్రాసు నుంచి తిరువనంతపురం వెళ్ళవల్సివచ్చింది. గాలివాన, వాతావరణం అనుకూలంగా లేదు. ఆవ్రో విమానం వాహనం. ఇద్దరం అలాగే విమానాశ్రయానికి చేరాం. ఇంతలో ప్రకటన. సాంకేతికలోపం వల్ల విమానం గంట ఆలస్యం కావచ్చునని! బయటపడ్డట్టు పైకి కనిపిస్తే నాగరికతాలోపం క్రింద కట్టి అందరూ నవ్వుతారేమో అని కూడా భయపడి బింకంగా విమానాశ్రయంలోనే తిరగడం మొదలుపెట్టాము. అంతలో అక్కడొక బోర్డ్ కనిపించింది. అది ఎయి ఇన్స్యూరెన్స్ కి సంబంధించినది. ఆ క్షణంలో ఒకరికి తెలియకుండా ఒకరం “ఇదేదో అవసరమయ్యేట్టే వుంది..” అనుకున్నాం. అనుకున్నది కాస్తా పైకి అనేసారు జంధ్యాల. ‘అయితే చేసేస్తే పోలా’ అన్నాను నేను. ‘పోతామంటారా?’ అన్నాడతను. ‘విమానం అనుమానంలో పడింది కదా’ అన్నాను. ‘ఇది అనుమానంలో పడ్డా అఖాతంలో పడ్డా మనం మాత్రం సేఫ్ గానే ఉంటాం. పైగా అనవసరంగా ఇన్స్యూరన్స్ చేసాం అని బాధపడతాం తర్వాత’ అంటూ నవ్వుతూ నవ్విస్తూ అన్నాడు. ‘ఏమిటి మీకంత నమ్మకం?’ అని అడిగాను. ‘ఆ నమ్మకం విమానం మీద కాదు. మన ఇంట్లో వాళ్ళ చేతి అదృష్టరేఖ మీద’ అని నవ్వుకుంటూండగానే విమానం రెడీ అని ప్రకటన వచ్చింది. కేరళ చేరాం.

 

ఇవన్నీ జీవితం జీవించి వున్న రోజుల్లో జరిగిన సంఘటనలు. సినిమాలు, వాటిలో సంగీతం, హాస్యం, కథ వగైరాల మీద పెద్ద జోక్ చేసి వెళ్ళిపోయాడు జంధ్యాల.

 

భగవంతుడు అంత త్వరగా ఇటువంటి జోక్ జంధ్యాల చేత వేయిస్తాడని అనుకోలేదు.

 

చాలాకాలానికి కరుణించి భగవంతుడు జంధ్యాలకు ఇద్దరు ఆడపిల్లలను, కవలలను ప్రసాదించాడు. సంగీత సాహిత్య బాల సరస్వతులల్లే వాళ్ళాయింట నడయాడుతుంటే చూసే కన్నులకు పండుగగా ఉండేది. వాళ్ళ బారసాలనాడు ఒక ప్రముఖ స్నేహితుణ్ణి ఆహ్వానిస్తూ జంధ్యాల అన్నమాటలు ‘వాళ్ళ పెళ్ళికి నేను ఉంటానో ఉండనో.. కనుక మీరు ఇప్పుడే వచ్చి వాళ్ళను ఆశీర్వదించి నన్ను ఆనందపరచండి.’

 

కాలధర్మాన్ని, జీవన తత్వాన్ని అంత చిన్నవయసులోనే గుర్తించి తృతీయ పురుషార్ధాన్ని దాటి వెళ్ళిపోయిన జంధ్యాల మహాజ్ఞాని. ఆయనకి అంజలిగా మిగిలిన జీవితాల్లో నాదీ ఒకటి.

 

చిరంజీవి జంధ్యాలకిదే నా అక్షర సంధ్యావందనం. 

**********************************************

“కొమ్మ కొమ్మకో సన్నాయి” లోని ఈ వ్యాసాన్ని ప్రచురించుకునేందుకు అనుమతి ఇచ్చినందుకు వేటూరి గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలతో వేటూరి.ఇన్  

Be the first to comment

Leave a Reply