అప్పుడే చూసి వచ్చిన సినిమా అక్షరం పొల్లుపోకుండా మొదటినుంచి చివరి పతాక సన్నివేశం శుభం దాకా వివరంగా వర్ణించి చెప్పే స్త్రీ (శ్రీ లలితా శివ జ్యోతి పిక్చర్స్ వారి లవకుశ, తారాగణం N.T. రామారావు, అంజలి దేవి ….. సౌండ్ రికార్డింగ్ వెస్ట్రేక్స్ ఆడియో …దుస్తులు పీతాంబరం…. ఔట్ డోర్ యూనిట్ ఆనంద్ సినీ సర్వీసెస్ …. పోరాటాలు జూడో రత్నం…), దేశ విదేశీ వంటకాల మీద వివిధ రకాల ప్రయోగాలు చేస్తూ , చికెనవా ఉస్తిమోవ్ అనే రష్యా వారి పాయసం, బెట్టిబోని సెమి అనే జపాన్ వారి వంటకం తయారు చేసే స్త్రీ, పెళ్లి చేసుకున్న పడతి తనతో పాట పాడక పోయినా, తనకు వండి పెట్టక పోయినా సర్దుకు పోయే దురదృష్టవంతుడు (ముష్టివాడు కూడా వీళ్ళ ఇంటిదగ్గర అయ్యా మాదాకోళం అయ్యా అనే అరుస్తాడు, ఆయన టెలిమార్కెటింగ్ వాళ్ళ వంటింటి పరికరాలికి, వంట సామాగ్రి కి కూడా బలి అవుతాడు), మార్నింగ్ వాక్ లో దోవలో కనిపించిన దురదృష్ట వంతులు అందరికీ తన జీవిత కధ చెప్పి ఆనందించే ఒక పెద్దమనిషి ( ఏమిటీ నీకు కస్తూరి గురించి తెలియదా, పద అలా నడుస్తూ మాట్లాడుకుందాము), తన రచనలు పత్రికా సంపాదకులు తిరిగి పంపినా , ప్రచురించటానికి తిరస్కరించినా సరే , తను గొప్ప కవయిత్రి నే అని నమ్మే స్త్రీ (నేను కవయిత్రిని కానన్నవాడిని కత్తితో పొడుస్తా, నేను రచయిత్రిని కానన్నవాడిని రాయితో కొడతా … అంటూ సాధించే ఆవిడ),చిన్న తనం లోనే తప్పి పోయిన తన కొడుకు జ్ఙాపకాలను ఎవరైనా గుర్తు చేస్తే తన్మయత్వం చెందే తల్లి (బాబూ చిట్టీ , మా చిట్టి కూడా అలానే కత్తి బాకు అని అంటుండే వాడు బాబు అని అనేది ఎవరైనా కుర్రాడు కత్తిలా ఉన్నాడు అని అంటే).
విపరీతమైన భావాలు, స్వభావాలే కాక పైన పాత్రలన్నిటికి ఒక సారూప్యం ఉంది. ఆ పాత్రలన్నీ అప్పటికే ప్రచురించబడిన రచనలలో స్థానం సంపాదించుకున్నవే. వార, మాస పత్రిక లలో ప్రచురించబడిన నవలలో ఇలాంటి పాత్రలను జంధ్యాల ఉపయోగించడానికి ముందు, ఇటువంటి అనేక రకాల విపరీత ప్రకృతి గల్గిన పాత్రలని విస్తారం గా ఎవరూ ఉపయోగించ లేదు. దశాబ్దాలనుంచి సినిమా చరిత్ర లో ఇటువంటి పాత్రలని పిచ్చాసుపత్రి సన్నివేశం లోనే పెట్టేవారు. అప్పటికే పేరు తెచ్చుకున్న హాస్య నటులు అందులో భాగం పంచుకొని కొన్ని నిముషాలు హాస్యం పంచేవారు. సినిమా కధతో సంబంధం లేక పోయినా కేవలం హాస్యం కోసం పెట్టిన సన్నివేశాలలో మొదటిది పిచ్చాసుపత్రి. నిజ జీవితం లో లాగా కొంచెం అతిగా కొండోకోచో కొంచెం మూర్ఖం గా ప్రవర్తించే స్వభావాలు కల పాత్రలను సృష్టించి వాటికి కొంచెం అతిశయం జోడించి కధలో అంతర్భాగాలు గా ఉపయోగించు కున్నారు జంధ్యాల. చరిత్ర బోధించే ఉపాధ్యాయుడు తన కూతురి పెళ్లి చూపులు చెడిపోబోతున్నప్పుడు కాబోయిన పెళ్ళికొడుకు వాళ్ళతో ఏమంటాడో చూడండి.
“అరే తళ్ళికోట యుద్ధం లో కూడా ఇంత అన్యాయం జరగలేదే, చూడ బోతుంటే మీరంతా తుగ్లక్ వారసులల్లే ఉన్నారే, మర్యాదగా లేచి వెళ్లకపోతే అలెగ్జాండర్ సామంత రాజులని తరిమి కొట్టినట్టుగా చేయ వలసి వస్తుంది. గెట్ ఔట్!!”
పిచ్చి వాళ్ళు పరిపాలించే పిచ్చాసుపత్రి లోని హాస్యం తో సరి సమానమైన హాస్యం.
జంధ్యాల సృష్టించిన పాత్రలను పోలిన పాత్రలతో మల్లాది వెంకట కృష్ణ మూర్తి చేసిన రచనలు చాలానే ప్రచురించ బడ్డాయి. కళాత్మక విలువలతో బాటు కొండొకచో రసానుభూతి కలిగించిన ఆయన రచనలు వ్యాపార పరం గానూ విజయవంతమయ్యాయి. సాధారణ మధ్య తరగతి జీవితాలను చిత్రిస్తూ , వ్యాపారాన్ని కూడా దృష్టి లో పెట్టుకొని , హాస్యం మేళవించి వ్రాసిన రచనలు , ఒడ్డున పడ్డ చేప (ష్ గప్ చుప్), పొరపాటు పడిన పోలికలు (రెండు రెళ్ళు ఆరు), సఫలము కాని ప్రేమలు (కనీసం చివరి వరకు) (నీకూ నాకు పెళ్ళంట ), మొదలైన వి జంధ్యాల రచనలను పోలి ఉన్నాయి. మల్లాది కూడా కొన్ని అసాధారణ పాత్రలను తన రచనలలో సృష్టించారు. సైన్యం నుంచి రిటైర్ అయిన, వివిధ భాషలు మాట్లాడ గల వంటవాడు ‘తికమక’, తను పుట్టిన ఊరు(బందరు) మీద వీరాభిమానం తో పాటు మరే ఊరి గొప్పతనాన్ని ఒప్పుకోని మధ్య వయస్కుడు, ఇంటింటి కి తిరిగి వాక్యూమ్ క్లీనర్ ల ప్రత్యక్ష ప్రదర్శనలు చేయడం కోసం ముందుగా చెత్త చల్లే సేల్స్ మన్ , ప్రసిద్ధి చెందిన పాత్ర జేమ్స్ బాండ్ తో తన పేరును పోల్చే డిటెక్టివ్ పాండు రంగారావు, లాంటి పాత్రలు జంధ్యాల హాస్య పంధాలో సరిగ్గా ఇమిడిపోయాయి. జంధ్యాల, మల్లాది కలయిక స్వర్గం లోనే నిర్ణయించ బడిందా అన్నట్టు గా మల్లాది రచనలను కొన్ని జంధ్యాల తెర కెక్కించారు. జంధ్యాల సినిమా శ్రీవారికి ప్రేమ లేఖ తో సరి తూగ గలిగిన, ‘రెండు రెళ్ళు ఆరు’ నుంచి జంధ్యాల ఇష్ట పది ‘విచిత్రం’ దాకా. తన ఉద్యోగ ధర్మంగా అనేక భాషలను నేర్చుకొని వాటిని అలవోకగా జీవితం లో వాడే వంటవాడు తికమక తో “క్షమించండి అమ్మా, ఆ గుండెలని పిండేసే మాటలు అన్ని భాషలలోనూ ఆయనకు చెప్పలేను” అని అనిపించగలవారు మల్లాది.
అంతా మంచి అయినవి అప్పుడప్పుడు చెడుగా పరిణమించ వచ్చు అన్న సామెత అక్షరాల జంధ్యాల హాస్యం విషయం లో నిజమైంది. ఆహా నా పెళ్ళంట చిత్ర విజయం తో హాస్య దర్శకుడిగా, హాస్య రచయిత గా ముద్ర పడిన జంధ్యాల బహుశా ఆ ఇమేజ్ నిలుపు కోవటానికి అవే కధలని మార్చి, తిరిగి వ్రాసి, అక్కడక్కడ అసంబద్ధము అయిన విధంగా సన్నివేశాలు జోడించి ఒకటి తరువాత ఒకటి తీసిన కొన్ని సినిమాలు అసంతృప్తి ని మిగిల్చాయి. వృత్తి లో చరమాంకానికి చేరుకునేటప్పుడు ప్రతి వ్యక్తి కొన్నికఠినమైన వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. గతం లోనూ భవిష్యత్తు లోనూ తను ఏ విధం గా గుర్తింప బడాలన్నది ముఖ్యమైన విషయం. ఆశావహకం గా ప్రారంభమయిన సినిమా జీవితం అచిర కాలం లోనే అత్యున్నత స్థాయికి ఎదిగి, చాలాకాలం అక్కడ నిలబడి, మెల్లిగా క్షీణ దశ లో సాగడం అన్నది ఎవరికైనా నిభాయించుకోవడం కష్టం. జంధ్యాల కూడా ఈ మార్గం లో పయనించక తప్పలేదు.
కానీ కాలగతి లో సినిమా చరిత్ర పుటలు తిరగేసి నప్పుడు జంధ్యాల పేరు దర్శకుడిగా, రచయితగా (హాస్యం అయినా, సెంటిమెంటు అయినా, కళాత్మకం అయినా), హాస్య సృష్ట గా, చిన్న సినిమా లను కొత్త పుంతలు తొక్కించిన భావుకుడి గా, ఇంకా అనేక చోట్ల సమున్నత స్థానం లో కనిపిస్తుంది. దర్శకుడిగా, రచయితగా, హాస్య బ్రహ్మ గా జంధ్యాల తెలుగు ప్రేక్షక హృదయాలలో కలకాలం నిలచిపోతారు.
జంధ్యాల వారి మాటలలోనే చెప్పాలంటే,
నవ్వడం ఒక భోగం
నవ్వించడం ఒక యోగం
నవ్వకపోవడం ఒక రోగం.
ఇది ఆయన అనుసరించారు, ఆచరించారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయం. హాస్య బ్రహ్మ అన్న బిరుదు ఆయనకు సరిగ్గా సరిపోతుంది. ఆయనకే సరిపోతుంది. చిన్న పలకరింపు లో అంత హాస్యం సృష్టించడం ఆయనకు కాక మరెవరికి సాధ్యం అవుతుంది.
ఏం నాన్నా ఇప్పుడే వచ్చావా?
లేదు, నిన్నే వచ్చి మెట్ల కింద దాక్కున్నా !
“శ్రీమాన్ మహారాజ మార్తాండ తేజా, ప్రియానంద భోజా…” అంటూ వ్రాసిన ప్రేమలేఖ హీరో చదువుతూ అందులో “ప్రియానందభోజ” అంటే ఏమిటీ అన్నపుడు పక్కనుంచుని చూస్తున్న నూతన్ ప్రసాద్ మిత్రవర్గంలో పొట్టి ప్రసాద్
“ఆ మాత్రం తెలియదా ప్రియా పచ్చళ్ళని ఆనందంగా భుజించేవాడా” అంటాడు. నిజంగా జంధ్యాల గారి సమయస్పూర్తికి జోహార్
శుభం.
కంచిభొట్ల శ్రీనివాస్ గారు జంధ్యాల గురించి వ్రాసిన ఆంగ్ల వ్యాసానికి బులుసు సుబ్రహ్మణ్యం గారి స్వేచ్చానువాదం జంధ్యాల అభిమానుల కోసం.
కంచిభొట్ల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలతో
Comments:
శశిధర్ పింగళి… 14 weeks ago
Leave a Reply
You must be logged in to post a comment.