హాస్యం చేయాలంటే ముఖాన్ని వికారంగా మార్చాలి. ఆడవాళ్లు ఆ పని చేయడానికి ఇష్టపడరు. అందుకే మనకు లేడీ కమెడియన్స్ తక్కువ’ అన్నాడు కమెడియన్ జావెద్ జాఫ్రీ. కాని- బహుశా- అలా ఆలోచించడానికి శ్రీలక్ష్మికి వీలు లేదు. అంత తీరుబడీ లేదు.కుటుంబ అవసరాలు శూలం పట్టుకొని తరుముతూ వుంటే పరిగెత్తుకొని వెళ్లి సినీ సముద్రంలో దూకింది. మునకలు వేసింది. గుటకలు మింగింది. ఆపైన కామెడీ అనే బల్లచెక్క దొరికితే ఎక్కి కూచుంది.ఇక అక్కణ్ణుంచి ఆమె చేసిన ప్రయాణం సుదీర్ఘమైనది.తెలుగు ప్రేక్షకులతో నవ్వులు పువ్వులుగా పెనవేసుకున్నది.
శుభం జరగాలంటే ఇంట్లో లాఫింగ్ బుద్ధ ఉండాలంటారు. అలాగే లాఫింగ్ శ్రీలక్ష్మి సినిమాలు కూడా.
ఎప్పుడైనా డస్సిపోయినప్పుడు బెంగటిల్లినప్పుడు నల్లమబ్బులు కమ్ముకున్నప్పుడు వీటన్నింటిని ఫెటీల్మని విరిచే ఒక్క నవ్వే రీఛార్జ్.
ఆ నవ్వుని శ్రీలక్ష్మి వడ్డిస్తే – బెస్ట్ రీఛార్జ్.
‘నేను కవిని కాదన్నవాణ్ణి కత్తితో పొడుస్తా…
నేను రచయితను కాదన్నవాణ్ణి రాయెత్తి కొడతా…’
ఎదురుగా పొట్టి ప్రసాద్ ఉన్నాడు. కిక్కురుమనకుండా చూస్తున్నాడు. ఎందుకైనా మంచిదని తన టేబుల్ మీద ఉన్న పండ్లు కోసే కత్తిని, పేపర్ వెయిట్‌గా పెట్టుకున్న రాయినీ లోపల దాచేశాడు.
********
‘ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుంది?
ఎర్రగా ఉంటే బాగుండదు కనుక
రక్తం ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుంది?
నీలంగా ఉంటే బాగుండదు కనుక’
పొట్టి ప్రసాద్ బిక్కుబిక్కుమని చూస్తున్నాడు.
నవ్వలేడు.
మనకేమో పొట్ట పగిలిపోతోంది.
********
‘బంగాళా భౌభౌ?’
‘అంటే?’
‘కొత్త రకం వంటలేండి. కాస్త తిని చూడండి.’
‘తినాలమ్మా. నేనమ్మా. తిని తీరవలసిందేనా అమ్మా’….
పొట్టి ప్రసాద్ కళ్లనీళ్లవుతున్నాడు.
బంగాళాభౌభౌ దెబ్బకి హాలు నవ్వులతో దద్దరిల్లిపోతోంది.
********
గుర్తొచ్చిందా శ్రీలక్ష్మి.
అమాయకమైన ముఖం. ఏమీ తెలియని మాలోకం. చీటికిమాటికి తన్నుకొచ్చే ఏడుపు. మనకు? నవ్వు.
********
‘కుర్రాడెవండీ చాకులా ఉన్నాడు?’
‘ఏమన్నావు బాబూ? చాకులా ఉన్నాడు అన్నావా?’
ఇంటికొచ్చిన అతిథి ఆశ్చర్యపోయాడు. చాకులా ఉన్నావు అనడంలో వింతేముంది అనుకొని- ‘అవునమ్మా… కుర్రాడెవడు చాకులా ఉన్నాడు అన్నాను’- అన్నాడు.
అంతే.
మేళం మీటినట్టుగా చప్పుడు వచ్చింది. సన్నాయి సవరించినట్టుగా సవ్వడి వినిపించింది. పి..పి.. డుం… డుం… శ్రీలక్ష్మి కళ్లల్లో నీళ్లు తన్నుకొని వచ్చాయి. ఏనాడో పోయిన ఆమె కన్నకొడుకు చిట్టి గుర్తుకొచ్చాడు. ఎదుటి వ్యక్తిలోనే చిట్టిని చూసుకుంది. ఆగలేకపోయింది.
‘బాబూ… చిట్టి’…
పరిగెత్తుకొని వెళ్లి వాటేసుకుంది.
‘మా చిట్టి కూడా ఇలాగే- కుర్రాడు చాకులా ఉన్నాడు అనే మాట వాడేవాడు నాయనా’ అని గట్టిగా దగ్గరకు తీసుకుంది.
మొగుడు బ్రహ్మానందం నెత్తి బాదుకుంటున్నాడు.
పక్కింటి కుర్రాళ్లయిన రాజేంద్రప్రసాద్ చంద్రమోహన్ ఎందుకైనా మంచిదని పారిపోయారు.
కౌగిలిలో ఇరుక్కున పెద్దమనిషి ఇదే చాన్సని తన్మయత్వం అనుభవిస్తున్నాడు.
మనం?
గిలిగింతల్లో చక్కిలి గిలిగింతల్లో పులకించిపోతున్నాం.
********
గుర్తొచ్చిందా శ్రీలక్ష్మి.
మనల్ని నవ్వించిన శ్రీలక్ష్మి.
కమెడియన్ అనగానే మగవాళ్ల పేర్లు మాత్రమే తలచి ఐదువందల సినిమాల్లో నటించినా, లక్షల మందిని నవ్వించినా ఎవ్వరూ పట్టించుకోని శ్రీలక్ష్మి.
ఇవాళ చెదురు మదురు అవకాశాలే వస్తున్నా- వేషాల కోసం దేబిరించకుండా- హుందాగా- తన జీవితం తాను బతకగలను అన్నట్టుగా- జూబ్లిహిల్స్‌కు దూరంగా- మణికొండకు ఆవల- చిన్న టూబెడ్ రూమ్ ఫ్లాట్‌లో- ఏడు వేల అద్దెకు నివాసం ఉంటున్న శ్రీలక్ష్మి.
నవ్వించిందా తను?
మనల్ని నవ్వించిందా తను?
అలా నవ్వించడానికి తానెన్ని ఏడుపులు ఏడ్చిందో మీకేం తెలుసు?
********
ఆర్టీసి క్రాస్‌రోడ్స్‌లో చిన్న పోర్షన్ అది. ఓనర్ ముక్కూముఖం తెలియని వ్యక్తి. కాని- ఆ ఇంట్లో మనిషిలా అయిపోయాడు. ఆ ఇంటి కష్టసుఖాలు పట్టించుకుంటున్నాడు. అద్దె అడగడం మానేశాడు. అప్పుడప్పుడు తనే ఏమైనా బియ్యం మూట కావాలా అని వాకబు చేసి వేయిస్తున్నాడు.
ఎందుకు?
ఆ ఇంట్లో ఉన్నది ఒకనాటి ప్రఖ్యాత హీరో అమర్‌నాథ్.
ఏఎన్నార్, ఎన్టీఆర్‌లాగా సూపర్‌స్టార్ కావలసిన అమర్‌నాథ్. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ‘అమర సందేశం’లాంటి సినిమాల్లో హీరోగా చేసిన అమర్‌నాథ్.
కాని క్లిక్ కాలేదు. హీరోగా ఇండస్ట్రీ తనను ఎలివేట్ చేయలేదు.
ఒకప్పుడు కార్లు బంగళా అన్ని సంపాదించాడు. ఇప్పుడు హీరో అవకాశాలు రాకపోవడంతో వెర్రెత్తి పోయాడు. అప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? సొంత సినిమా తీస్తారు. అమర్‌నాథ్ కూడా తీశారు. తానే హీరోగా ‘మగవారి మాయలు’ అనే సినిమా. రిలీజయ్యింది. పోయింది. బంగళా కూడా పోయింది. కాసిన్ని డబ్బులు మిగిలాయి. వాటినీ ఖర్చు పెట్టి ‘బాలయోగి’ అనే సినిమా మొదలెట్టాడు. ఐదు రీళ్లు తీసేసరికి ఆ డబ్బు కూడా అయిపోయింది. మిగిలిన సినిమా పూర్తి చేసి రిలీజ్ చేద్దామనుకునేలోపల కలర్ పిక్చర్‌ల యుగం మొదలయ్యింది. మూలపడిన బ్లాక్ అండ్ వైట్ సినిమా గురించి ఎవరూ ఆసక్తి చూపలేదు. అంతే. అమర్‌నాథ్ కుంగిపోయాడు. జబ్బు పడ్డాడు. కట్టుబట్టలతో పెళ్లాం బిడ్డలను తీసుకొని హైద్రాబాద్ వచ్చేశాడు. తొమ్మిది మంది సంతానం. అందులో రెండో అమ్మాయి శ్రీలక్ష్మి. ఇప్పుడు బతకడం ఎలా? ఇక్కడ వేషాలు రావు. ఇంకో సంపాదన తెలియదు. పిల్లలు చిన్నవాళ్లు. శ్రీలక్ష్మి ప్లస్ టు చదువుతోంది. ఆమెకు కొంచెం కొంచెం ఇంటి పరస్థితి అర్థం అవుతోంది.
ఏదో చేయాలి. ఏదో ఒకటి చేయాలి. ఇంటిని నిలబెట్టాలి. ఇంటిని నిలబెట్టడం అంటే? ఏం లేదు… పప్పులూ ఉప్పులకూ సరిపడా సంపాదించాలి. అంతే. అంతకుమించి ఏం లేదు. అన్నిసార్లు పస్తులు ఉండడం అన్నిసార్లూ సాధ్యం కాదు.
శ్రీలక్ష్మి ఆలోచించింది.
అద్దంలో చూసుకుంది.
మళ్లీ ఆలోచించింది.
అద్దంలో చూసుకుంది.
ఏం… అందంగా లేనా… వయసులో లేనా… రంగులూ హంగులూ… ఇవి సినిమాలకు పనికిరావా… నాన్న అక్కడే పోగొట్టుకున్నాడు… నేనూ అక్కడే సంపాదిస్తాను… అనుకుంది.
ఇండస్ట్రీకి వెళతాను నాన్నా అంది ఒకరోజు అమర్‌నాథ్‌తో.
ఆయన ఏం మాట్లాడలేదు. కాని పై కండువా కన్నీటితో తడిసిపోయింది. ఆడపిల్ల. మగతోడు లేకుండా ఇండస్ట్రీలో. ఏం జరుగుతుందో తెలుసు. నమిలేస్తారు. మింగేస్తారు. ఊసేస్తారు.
‘వద్దమ్మా.. వద్దు… కూపంలోకి వెళ్లొద్దు’ అన్నాడు అమర్‌నాథ్.
‘నాన్నా… ఆకలితో ఉండటం కంటే వేంప్‌గా తెర మీద డాన్స్ చేయడం బెటర్’ అంది శ్రీ లక్ష్మి.
అమర్‌నాథ్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
అప్పుడు శ్రీలక్ష్మి- పదహారు పదిహేడేళ్ల శ్రీలక్ష్మి- ఇల్లూ వాకిలీ తప్ప వేరే ఏమీ ఎరగని శ్రీలక్ష్మి తల్లిని తీసుకొని మద్రాసు చేరుకుంది.
మద్రాసులో శ్రీలక్ష్మి.
ఇప్పుడు ఏం జరగబోతోంది?
జీవితం ఆమెను ఏడ్పించబోతోందా? ఆమె జీవితాన్ని నవ్వించబోతోందా?
********
అద్వయిత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానమూ…..
శంకరాభరణం షూటింగ్ జరుగుతోంది. డెరైక్టర్ కె.విశ్వనాథ్. షాట్ తీస్తున్నారుగాని అప్పుడప్పుడు దృష్టి తీయబోయే సినిమా మీద ఉంది. దాని పేరు శుభోదయం. అందులో హీరోయిన్ కావాలి. కొత్త అమ్మాయైతే బాగుంటుందని విశ్వనాథ్ ఆలోచన. అప్పుడే ఎవరో శ్రీలక్ష్మి గురించి చెప్పారు. ఆమెను విశ్వనాథ్ పిలిపించారు.
‘ఏమ్మా. యాక్ట్ చేయగలవా?’ అడిగాడాయన.
‘ప్రయత్నిస్తానండీ’ అంది శ్రీ లక్ష్మి.
‘ఎవరమ్మాయివి?’
చెప్పాలా వద్దా అని శ్రీలక్ష్మికి సంశయం. సినిమా వాళ్ల అమ్మాయైతే ఒక్కోసారి ఇవ్వరు. ఒక్కోసారి సినిమా వాళ్ల అమ్మాయైతేనే ఇస్తారు.
‘అమర్‌నాథ్ గారి అమ్మాయినండీ’
‘హీరో అమర్‌నాథ్‌గారి అమ్మాయివా. అలాగైతే తప్పకుండా నీలో యాక్టింగ్ ఉంటుంది. నిన్ను సెలెక్ట్ చేస్తున్నా’ అన్నాడాయన.
శ్రీలక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వంద రూపాయలు పారితోషికం ఇచ్చినా ఎంతో ఎక్కువ తనకు. అలాంటిది హీరోయిన్ వేషం అంటే…
‘థ్యాంక్యూ’ అని చెప్పి వచ్చేసింది.
ఆ తర్వాత బాపుగారి దృష్టిలోకి ఈమె ఫొటోలు వెళ్లాయి.
వంశవృక్షం కోసం తీసుకోవచ్చేమోనని ఆలోచించారు బాపు. ఆఫర్ దాదాపు ఖరారైనట్టే.
మద్రాసులో అడుగు పెట్టాక ఇద్దరు పెద్ద డెరైక్టర్ల నుంచి ఆఫర్. అవి కూడా ముఖ్యపాత్రలు. శ్రీలక్ష్మి హీరోయిన్‌గా లాంచ్ అయి ఉంటే ఆ రెండు సినిమాలలో యాక్ట్ చేసి ఉంటే కథ ఎలా ఉండేదో. కాని జరగలేదు.
మరికొన్ని రోజుల్లో ఏదో ఒక సినిమా మొదలవుతుందనగా ఫోన్. శ్రీలక్ష్మి రిసీవర్ అందుకుంది. హైద్రాబాద్ నుంచి కబురు- నాన్నకు సీరియస్‌గా ఉంది.
********
జాండీస్ ముదిరిపోయాయి. శ్రీలక్ష్మి పరిశ్రమలో ఏమైనా రాణిస్తుందేమో చూసుకుందాం అనుకున్న తండ్రి ఆ కోరిక తీరకుండానే చనిపోయాడు. ఆ ఏడుపులు… దుఃఖం… అయోమయం… శ్రీలక్ష్మి హైద్రాబాద్‌లోనే ఉండిపోయింది. తీరా కోలుకొని మద్రాసు వెళ్లేసరికి వేషాలూ పోయాయి. ప్చ్. రాత. లేదు. ఏం చేయాలి. ఏవో చిన్నా చితకా వేషాలు వస్తున్నాయి. వెయ్యి… రెండు వేలు… పారితోషికం. ఇప్పుడు మొత్తం కాపురం మద్రాసు మారిపోయింది. అందరికీ శ్రీలక్ష్మి సంపాదనే ఆదరువు. శ్రీలక్ష్మి సంపాదించాల్సిందే తప్పదు. ఏ వేషమైనా వేసి.
ఒకరోజు ‘గోపాలకృష్ణుడు’ షూటింగ్. అక్కినేని హీరో. సినిమాలో ఆయన గోపాలకృష్ణుడు. ఒక పాటలో పల్లవికో పిల్లతో కనిపిస్తాడు. ఆల్రెడీ ముగ్గురి సెలెక్షన్ అయిపోయింది. ఇంకో అమ్మాయి కావాలి. ఎవరెవరో ఎవరెవరి ఆల్బమ్సో చూపిస్తున్నారు. శ్రీలక్ష్మికి ఆశ. తను సెలెక్టయితే… పాటకు డాన్స్ చేస్తే… డబ్బులొస్తాయి కదా..
అక్కినేనికి ఈ విషయం తెలిసింది.
‘అమరనాథ్‌గారి అమ్మాయినే పెట్టండి. వాళ్ల కుటుంబానికి సాయం చేసినవారం అవుతాం’ అన్నాడాయన.
పాట మొదలయ్యింది. అక్కినేని పక్కన పంజాబీ డ్రస్ వేసుకొని శ్రీలక్ష్మి డాన్స్ చేసింది. కాని ఆ తర్వాత ఏం జరగలేదు. ఏమీ బ్రేక్ రాలేదు.
శ్రీలక్ష్మి ఖాళీ.
కాని- జరగవలసింది అప్పుడే మొదలయ్యింది.
********
కె.బాపయ్య సీనియర్ డెరైక్టర్. ఎన్టీఆర్‌తో యుగపురుషుడులాంటి సూపర్‌హిట్స్ ఇచ్చారు. ఆయన తాజా సినిమా ‘నివురుగప్పిన నిప్పు’. అందులో కామెడీ వేషం ఉంది. అది కూడా నగేశ్ పక్కన.
ఎవరున్నారయ్యా అని ఆయన వాకబు చేస్తుంటే ఎవరో శ్రీలక్ష్మి పేరు చెప్పారు.
శ్రీలక్ష్మి వచ్చింది. వేషం తెలుసుకొని వణికిపోయింది.
‘సార్. నాకు కామెడీ చేయడం రాదు. పైగా నగేష్‌గారి పక్కనంటే నా వల్ల కాదు’ అంది.
బాపయ్య వొప్పుకోలేదు.
‘చూడమ్మా. ఇంకెప్పుడూ నీ నోట వెంట రాదు అనే మాట రాకూడదు. అలా అన్నవంటే అది నీ ఫెయిల్యూర్ కిందే లెక్క. మాలాంటి డెరైక్టర్లు ఉన్నది ఎందుకు? మేం చెప్పి చేయించుకుంటాం. ఫాలో అవ్వు చాలు’ అన్నారు.
‘నివురుగప్పిన నిప్పు’… సినిమా హిట్టు కాలేదు కాని శ్రీలక్ష్మి పాత్ర సూపర్‌హిట్టయ్యింది.
తెలుగు తెరకో కొత్త కమెడియన్ దొరికినట్టే.
తాజా అద్దం.
కాని దీనిని తళతళా మెరిపించే చేయి ఇంకా శ్రీలక్ష్మికి దొరకాల్సి ఉంది.
********
‘రెండు జెళ్ల సీత… తీపి గుండె కోత’….
అరవం వాళ్లది ఇదో ఫార్ములా. నలుగురు కుర్రాళ్లుంటారు. ఒక హీరోయిన్. ఏదో ఒక కథ. జంధ్యాల కూడా అదే స్టయిల్‌లో ‘రెండు జెళ్ల సీత’ సినిమాను మొదలెట్టారు. అందులో ఒక హీరో రాజేష్. అతడు శ్రీలక్ష్మి తమ్ముడు. అచ్చం వాళ్ల నాన్నలాగే అందగాడు. ఇంతకు ముందు జంధ్యాల దర్శకత్వంలోనే ‘నెలవంక’ చేశాడు. ఇప్పుడు ‘రెండు జెళ్ల సీత’లో.
ఇదన్నా హిట్ అయితే తమ కుటుంబం దారికి వచ్చినట్టే అనుకుంది శ్రీలక్ష్మి. తనకు తగిన గుర్తింపు రాకపోయినా రాజేష్‌కు అయినా వస్తే మేలు కదా అని ఆమె ఆశ. అయితే అప్పుడే ఒక వింత జరిగింది. అదే సినిమాలో ప్రొడ్యూసర్ జయకృష్ణ ద్వారా వేషం వచ్చింది. జయకృష్ణ ఒకప్పుడు అమర్‌నాథ్‌కి పర్సనల్ మేకప్ మేన్. ఆ అభిమానంతోటే- ‘ఏమ్మా… ఇందులో గెస్ట్ కేరెక్టర్ ఉంది చేస్తావా?’ అని అడిగాడాయన.
వైజాగ్‌లో షూటింగ్.
జంధ్యాలను శ్రీలక్ష్మి పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. సరే. చిన్నవేషం. ప్రొడ్యూసర్ రికమండ్ చేశాడు కదా అని తీసుకున్నాడు. సుత్తివేలుతో రెండు సీన్లు. అనుమానపు మొగుడైన సుత్తివేలును తన అమాయక చేష్టల ద్వారా శ్రీలక్ష్మి కంగారు పెట్టేయాలి.
మొదటిరోజు షూటింగ్ ముగిసింది.
సీన్లు బాగా వచ్చాయని అందరూ అనుకున్నారు. రెండో రోజు షూటింగ్ ముగింది. షాట్స్ తీస్తుంటేనే షూటింగ్‌లో అందరూ నవ్వుతున్నారు. జంధ్యాల ఇది గమనించారు. శ్రీలక్ష్మిని నిశితంగా పరిశీలించారు. ఆయనకు ఏదో స్ఫురించింది. తన గ్యాంగ్‌లో అన్ని రకాల కమెడియన్‌లు ఉన్నారుగాని లేడీ కమెడియన్ లేదు. ఈమెను ఫుల్‌టైమ్ కమెడియన్‌గా మారిస్తే?
రెండు జెళ్ల సీతలో అలా శ్రీలక్ష్మి వేషం పెరిగింది.
సినిమా రిలీజైంది. రిజల్ట్ సోసో అయినా శ్రీలక్ష్మి పేరు మోగిపోయింది.
అప్పటివరకూ శ్రీలక్ష్మి మంద తప్పిన గొర్రె. గురుబోధ ఎరగని శిష్య. దారం ఎరగని గాలిపటం.
ఇన్నాళ్లకు జంధ్యాల దొరికారు.
ఇక శ్రీలక్ష్మి సినిమాల వరద మొదలైంది.
అమరజీవి, శ్రీవారికి ప్రేమలేఖ, రావూ గోపాల్రావు, బాబాయ్ అబ్బాయ్, చంటబ్బాయ్…. జయమ్ము నిశ్చయమ్మురా నాటికి శ్రీలక్ష్మి సూపర్‌స్టార్.
బాబూ… చిట్టి… అని శ్రీలక్ష్మి యాక్షన్ చేస్తూ ఉంటే చాలా రేర్‌గా తన సీన్లకు తాను నవ్వే జంధ్యాల కూడా పడీ పడీ నవ్వడం మొదలుపెట్టారు.
ఇటువంటి నవ్వుల పువ్వుల కెరీర్ అందించినందుకు శ్రీలక్ష్మి కళ్లల్లో జంధ్యాల పట్ల కృతజ్ఞత.
‘ధ్యాంక్యూ సర్… ధ్యాంక్యూ వెరీమచ్’
********
శ్రీలక్ష్మి ఇప్పుడు సంపాదించే మెషిన్‌లాగా మారిపోయింది. రోజూ నాలుగైదు షూటింగులు. రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, రేలంగి నరసింహారావు, ఈవీవీ… డెరైక్టర్స్ ఎవరైనా సరే శ్రీలక్ష్మి కామెడీ ఉండాల్సిందే. ఆమె కోసమే ట్రాకులు రాసేవాళ్లు. రెండు మూడు రోజుల్లో ఆ పాత్ర పూర్తయ్యేది. సినిమా పేరేమిటో హీరో ఎవరో కూడా శ్రీలక్ష్మికి తెలిసేది కాదు. బిజీ. బిజీ బిజీ. ఒక్కోసారి భోంచేయడానికి కూడా ఖాళీ దొరకని ఎడతెరిపి. ఒక సంవత్సరంలో ఆమె చేసిన 32 సినిమాలు విడుదలైన రికార్డు.
కాని-డబ్బు పెద్దగా వచ్చేది కాదు.
పర్ డే లక్షన్నర అడిగే రోజులూ కావు.
ఇచ్చినంత తీసుకోవడం. పుచ్చుకున్నదానితో సరిపుచ్చుకోవడం.
అందులోనే తల్లి అందరికీ అన్నీ అమర్చిపెట్టేది. ఆ సంపాదనలోనే చదువు, పెళ్లిళ్లు, బారసాలలు… సవాలక్ష. సంపాదన మొత్తం ఇందుకే అయిపోతుంది. ఇందుకే ఖర్చయిపోతుంది.
తల్లి ఆలోచించింది.
ఆడపిల్ల- కొవ్వొత్తి- గ్లామర్ ఫీల్డులో ఎన్నాళ్లని వెలుగుతాయి. అందుకే శ్రీలక్ష్మి కోసం ఏదైనా చేయాలనుకుంది. ఆమె కోసం రూపాయి రూపాయి దాచిపెట్టి మద్రాసులో ఒక స్థలం కొన్నది. అది శ్రీలక్ష్మి ఆస్తి. సినిమాలు ఉన్నా పోయినా అది ఆమెదే. బతుకుకొక గ్యారంటీ.
ఏదో కాసింత నిశ్చింత వచ్చింది కదా అనుకున్నంతలో- మళ్లీ!
********
ఆ రోజు శ్రీలక్ష్మికి- ఏదో షూటింగ్‌లో ఉండగా మళ్లీ ఫోన్ వచ్చింది.
రాజేష్‌కు సీరియస్‌గా ఉందట.
రాజేష్- హీరోగా ఒక వెలుగు వెలగాల్సిన రాజేష్… బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో సమానంగా చిన్న సినిమాల్లో వెలుగుతున్న రాజేష్… మత్తుకు బానిసయ్యాడు… మత్తుకు లోబడిపోయాడు. అందుకే తండ్రి భయం అంటుంటారు పెద్దలు. తండ్రి లేని పిల్లలు… చిన్న వయసులోనే తమ కాళ్ల మీద తాము నిలబడాల్సి వచ్చిన పిల్లలు కొంచెం బేలెన్స్ తప్పినా చాలు… పడిపోతారు!
రాజేష్ పడిపోయాడు.
మృత్యుఒడిలోకి జారిపోయాడు.
ఆ వార్త తెలిసేటప్పుడు శ్రీలక్ష్మి ఏదో కామెడీ సీన్‌లో యాక్ట్ చేస్తోంది.
గుండెల్లో భయంకరమైన విషాదం. కాని కాల్షీట్లను గౌరవించాల్సిందే. కన్నీళ్లు కంటి నుండి జారకుండా యాక్ట్ చేసి ఇల్లు చేరుకుంది.
రాజేష్ జీవితం ముగిసింది.
తమ ఇంట్లో మగవాళ్లకు దేవుడు ఆయువు రాసిపెట్టినట్టు లేదు.
మరికొన్నాళ్లకు మరో తమ్ముడు… ఆత్మహత్య చేసుకున్నాడు.
మరికొన్నాళ్లకు రాజేష్‌కు పుట్టిన ఇద్దరు మగపిల్లలు- ఒకరు ఆత్మహత్య, ఒకరు యాక్సిడెంట్‌లో చనిపోయారు.
శ్రీలక్ష్మి ఇవన్నీ వింటూ ఉంది.
శ్రీలక్ష్మి ఇవన్నీ వింటూ నవ్విస్తూనే ఉంది.
శ్రీలక్ష్మి ఇవన్నీ వింటూ అలసిపోయింది.
శ్రీలక్ష్మి ఈ అలసట నుంచి బయటపడాలనుకుంది. ఈ అలసట నుంచి పారిపోవాలనుకుంది. అందుకే నచ్చిన తమిళవ్యక్తిని వివాహం చేసుకొని కొంతకాలం విరామం తీసుకుంది.
వెండితెర మీద నుంచి శ్రీలక్ష్మి తాత్కాలికంగా మిస్ అయ్యింది.
********
కట్ చేస్తే శ్రీలక్ష్మి మద్రాసు టీవీలో ప్రత్యక్షమయ్యింది. హైద్రాబాద్‌కు షిఫ్ట్ కాలేక మద్రాసు టివితోనే కాలక్షేపం చేసింది. బోలెడన్ని సీరియల్స్. కాని ఇండస్ట్రీ అంతా హైద్రాబాద్‌లో కళకళలాడుతుంటే తనుమాత్రం మద్రాసులో ఏం చేయాలి?
అందుకే నాలుగేళ్ల క్రితం హైద్రాబాద్‌కు షిఫ్ట్ అయ్యింది. కాని- అప్పటికే ఇక్కడంతా మారిపోయింది.
శ్రీలక్ష్మా… అని కొత్త డెరైక్టర్లు బుగ్గ గీరుకుంటూ ఆలోచనల్లో పడుతున్నారు. కమెడియన్లుగా సూపర్‌బిజీగా ఉన్నవాళ్లు శ్రీలక్ష్మిని గుర్తు చేయడం మానేశారు.
వాళ్లంతా శ్రీలక్ష్మి ముందు జూనియర్లు.
కాని- ఇవాళ శ్రీలక్ష్మి సెట్‌లో ఉంటే జ్యూసులు వాళ్లకే వెళతాయి.
కాని- శ్రీలక్ష్మి బాధ పడదు. తన హక్కు కోసం పోరాడదు. తనకు వేషం ఇమ్మని బతిమిలాడదు. హుందాగా ఉండిపోతుంది. తండ్రి చావు బతుకుల మధ్య ఉంటే ధైర్యంగా వేషాల కోసం మద్రాసు రెలైక్కింది శ్రీలక్ష్మి.
ఇప్పుడు ఇంత జీవితం చూశాక తన జీవితాన్ని తాను నిర్మించుకోలేదా?
********
శ్రీలక్ష్మి చాలా పొదుపుగా చక్కగా జీవిస్తూ ఉంది.
మద్రాసులో ఇల్లుంది. దాని మీద అద్దెలొస్తాయి. ఇక్కడ నడిచిపోతుంది.
మొన్నెవరో ఒక స్టార్ కమెడియన్ ఇంటర్వ్యూ ఇస్తూ- శ్రీలక్ష్మి… అనీ చాలా మంచి కమెడియన్. నా పక్కన చేసింది. ఇప్పుడెక్కడుందో అన్నాడట.
ఎక్కడుంది శ్రీలక్ష్మి.
పక్కనే ఉంది. మణికొండలో.
********
శ్రీలక్ష్మి మళ్లీ రీఛార్జ్ కావాలి.
ఒక మంచి నవ్వు కోసం పిడచగట్టుకొని ఉన్న మనలాంటి వారి కోసం శ్రీలక్ష్మి రీఛార్జ్ కావాలి.
ఎందుకంటే- ఆరోగ్యకరమైన హాస్యానికి శ్రీలక్ష్మి ఒక కొండగుర్తు.
ఒక మోస్తరు గుట్టలూ మెట్టలూ ఎన్నయినా ఉండొచ్చు… కొండ కొండే!
నరకంలో ‘స్వర్గం’
ఇంటికి పెద్ద దిక్కు అయిన తండ్రి పోవడంతో శ్రీలక్ష్మి కుటుంబం నడిసంద్రంలో నావలా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో శ్రీలక్ష్మి నటనలోకి అడుగుపెట్టారు. ఎమ్జీఆర్‌కి సన్నిహితుడైన నిర్మాత లక్ష్మణ్ తమ ఉదయం ప్రొడక్షన్స్ బేనర్‌లో తెలుగులో ‘స్వర్గం’ సినిమా మొదలుపెట్టారు. దాసరి శిష్యుడైన దుర్గానాగేశ్వరరావు దర్శకుడు. అందులో జయసుధ అక్క వేషానికి శ్రీలక్ష్మిని ఎంపిక చేశారు. తొలి వేషం. నటన కొత్త. ఏం చేయాలో తెలియదు. ఎలా చేయాలో తెలియదు. డెరైక్టర్ చెప్పినట్టుగా చేసి ఫస్ట్ షాట్ ఒకే అనిపించుకుంది. పారితోషికం చేతిలో పడగానే ఎంతగానో సంబరపడిపోయింది. చాలా రోజుల తర్వాత ఆ ఇంట్లో పండగ వాతావరణం కనిపించింది. నరకప్రాయం అనుకున్న జీవితంలోకి ‘స్వర్గం’ ప్రవేశించింది. ఈ సినిమా విడుదల కాకుండానే శ్రీలక్ష్మికి వేషాలు రావడం మొదలుపెట్టాయి. చిన్నా పెద్దా తేడా చూసుకోకుండా అన్ని సినిమాల్లో చేసేసింది. ‘రాజు-రాణి-జాకీ’లో రాధిక అమ్మవేషం వేసింది. మధ్యలో తమిళం, మలయాళం సినిమాల్లో హీరోయిన్ ఆఫర్లు. తెలుగులో కూడా ఓ సినిమాలో హీరోయిన్‌గా చేశారు. గుమ్మడి కొడుకు హీరో, దేవదాసు కనకాల డెరైక్టర్. ఆ సినిమా పేరు ‘పుణ్యభూమి కళ్లు తెరిచింది’.
అసలు పేరు : మానాపురం లక్ష్మి
పుట్టింది : జూలై 20న మద్రాసులో
తల్లిదండ్రులు : సరళాదేవి, అమరనాథ్
సొంత ఊరు : రాజమండ్రి
చదివింది : ఇంటర్
తొలి చిత్రం : స్వర్గం (నటిగా)నివురుగప్పిన నిప్పు (హాస్యనటిగా)
మొత్తం చిత్రాలు : 500కు పైగా (ఇప్పటి వరకూ)
కథానాయికగా చేసిన సినిమాలు : పుణ్యభూమి కళ్లు తెరిచింది (తెలుగు) స్పర్వకు (తమిళం) జిగిజిగి రైలు (తమిళం) జోడిపురా (తమిళం) జంబులింగం (మలయాళం) పౌరుషం (మలయాళం) సముద్రం (మలయాళం)
ప్రత్యేక కృతజ్ఞతలు సాక్షి పత్రిక వారికీ,ఖదీర్ గారికీ.
ఖదీర్ గారు సాక్షి కి ప్రత్యేకంగా వ్రాసిన ఈ వ్యాసం క్రింద లింకులో చూడవచ్చు.
http://sakshi.com/Main/WeeklyDetails.aspx?Newsid=27682&Categoryid=11&subcatid=25
Comments:
రసజ్ఞ … 17 weeks ago
లలిత… 17 weeks ago
Leave a Reply
You must be logged in to post a comment.