సప్తపది సినిమా సంభాషణలు

 

ఆచారావ్యవహారాలన్నవి మనస్సుల్ని క్రమమయిన మార్గం లో పెట్టడానికే గానీ కులమనే పేరుతో మనుషుల్ని విడదీయడానికి కాదు అన్న శంకరాభరణం శంకరశాస్త్రి మాటలే ఈ చిత్ర నిర్మాణానికి ప్రేరణ.

 

 

 

 

 

 

 

రాజు గారూ హారతికి మా నాన్నగారొచ్చేదాకా ఆగుదామా లేకపోతే…

ఆ ఆ ఆగుదాం ఆగుదాం దేవాలయం మా తాతల సొత్తయినా అమ్మవారు ఆయన సొంతమయ్యా,ఆయనకి కోపమొచ్చి శాపం పెట్టాడంటే ఏడు తరాలకి శాపం పెడతాడు అమ్మమ్మో అయ్యయ్యో ఆగుదాం ఆగుదాం ఆగుదాం 

ఎవరూ ముక్తా?

ముక్త మూడు,నాలుగు నవనీతం,ఐదు అంబుజాక్షి,ఇది ఆరు అరవింద,వీళ్ళు పడవకి బయల్దేరుతున్నారూ, ఆశీర్వదించాలి మరి.

 

 

రాజు గారూ కారణం ఏదయినా నవరాత్రి మహోత్సవాలకి మీరు ఏర్పాటుచేసిన కార్యక్రమాలు…

అద్భుతంగానూ ఉత్తమోత్తమంగానూ ఉందని చెప్పడానికి నాకూ…

నోరెలా వస్తుందిలెండి పాపం,అంత అద్వాన్నంగా ఉంటేను.

నా మనసులో మాట మీరు చెప్పారు,ఏ కార్యక్రమం ఎలా ఉన్నప్పటికిన్నూ కూడా నిన్న జరిగిన హరికధాకాలక్షేపం ఉంది చూసారూ…

అసలన్నిటికంటే అదే అసహ్యంగా ఉంది.

బేడ్ గానే ఉందండి మరి.  

పరమ పవిత్రమయిన ఆ హరినామస్మరణలో ఆ మ్లేచ్చ భాషాప్రయోగం సినిమా పాటలూ ఏమిటండీ?

“జిహ్వాగ్నీ వర్తతే లక్ష్మీ” అని వాక్కు తెలియని వాళ్ళేం పండితులండీ,నిజమే…కానీ యాజులు గారూ ఇవ్వాళ జరిగే కార్యక్రమానికి మాత్రం మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడకూడదు మాట్లాడవద్దు.కాదని మాట్లాడారా మనం మౌనమే.

ఏం, ఎందుచేత?

హ్హహ్హహ్హ చూడండి…చూసారా…సాక్షాత్తూ మీ మనవరాలు హేమ నాట్యప్రదర్శన

మడిబట్టలతో ఉన్నాను ఆ మైల మనుషుల గురించి గుర్తుచెయ్యకండి 

************

ప్రసాదమండయ్యా…  

ఆ చైనులూ…ఈ పెద్దాయనకి వయసు పెరగడంతో పాటు చాదస్తం కూడా పెరిగిపోతోందయ్యా

మరేసుమండీ తప్పదీ..అయినా యాజుల గారి మనసు తెలిసిన వారూ చిరకాలమిత్రులూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయించకుండా ఉండాల్సిందండయ్యా

చేస్తే ఏంటయ్యా, యాజులు గారి కూతురు జానకమ్మ కులం తక్కువ వాడ్ని చేసుకుందా గుణం తక్కువ వాడ్ని చేసుకుందా?ఒక నాట్యాచారుడ్ని పెళ్ళి చేసుకుంది,తప్పా? అంతమాత్రం చేత కన్న కూతురితో శాశ్వతమయిన తెగతెంపులు చేసుకుంటాడా ఈయన.

మరేసుమండీ తప్పదీ…

ఆ కూతురుపోయినా కోపంపోలేదయ్యా..మనవరాలు హేమ పేరు భారద్దేశమంతా మారుమ్రోగిపోతోందా…నా చెవుల్లో సీసమయినా పోసుకుంటాను గానీ ఆ మనవరాలు పేరు నా దగ్గరెత్తద్దంటాడేవిటయ్యా అయ్యయ్యయ్యయ్యో

మరేసుమండీ తప్పదీ…  

అసలు రహస్యం చెప్పనా చైనులూ,యాజులు గారు నామీద కోపగించినా నన్ను శపించినా విడిపోయిన ఈ రెండు కుటుంబాల్నీ కలిపేయాలన్న సత్సంకల్పం చేతనే ఈయన మనవరాలి కార్యక్రమాన్ని నేనిక్కడ ఏర్పాటుచేసాను.

మరేసుమండీ తప్పదీ….

ఏమిటదీ ఏది తప్పూ?

ఆ అదే యాజులు గారిది,ఇంకా ఆ కుటుంబం మీద కోపం పెంచుకోడం అదీ…తప్పదీ…

*******************

ఏమండీ మీరాయి మా దొడ్లో పడింది…

*******************

ఏవండీ అమ్మాయి అచ్చం జానకమ్మ లాగానే ఉందికదండీ,ఆ కనుముక్కు తీరూ అదీనూ.

ఊ ఊ నా కూతురేం ఇలా ఉండేదికాదు,జీర్ణోపవీతంలాగా జిడ్డోడుకుంటూ. జాతి వజ్రంలా మెరిసిపోయేది.

హేమ కూడా మరీ నువ్వనుకుంటున్నంత ఇది కాదు నాన్నా,ఏదో ఇంతదూరం రైల్లో పడవలో ప్రయాణం చేసొచ్చీ ఎండనపడొచ్చీ ఊ అలా ఉందికానీ…

మరే ఇంత పసుపు రాసి తలంటుపోస్తే కుందనపు బొమ్మలా ఉంటుంది పిల్ల

ఎవరు పొయ్యాలట తలంటి,నేనా మా వాడా? మీరిక్కడ మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే అక్కడ స్నానపానాదులై చక్కాపోతాయి.

ఏమండీ…అంటే నన్ను వెళ్ళమనా?

అంతేగా మరి చస్తున్నాం శ్లేషతో, మళ్ళీ మనసుమార్చుకుంటాడేమో మరి,త్వరగా బయల్దేరు వాళ్ళు ఆ రాజుగారి దేవిడీలో ఉన్నారు.   

*********************

ఊ ఊ నొప్పి లేదు కదా

లేదు బాబూ,

నొప్పి లేదు కదా

లేదు బాబూ,

నొప్పి లేదు కదా

లేదు బాబూ,

ఉహ్ నొప్పుంది కదా

ఉంది బాబూ

ఉంటుంది మరి ఎవరిమీదా చెయ్యిచేసుకోకూడదు మరి,ప్రాయశ్చిత్తం ఇంకో రెండు కట్లేయవయ్యా..

అయ్యా అయ్యా అయ్యా..

ఏమిటయ్యా ఎవరీ ముసుగువీరుడూ?

ముసుగువీరుడు కాదయ్యా మా మేనమామ కుమారుడు జ్యోతిర్లింగం.

ఆ ఆ

ఆ నోరేమిటీ బాలకృష్ణుడిలా ప్రపంచం అంతా నోట్లో చూపిస్తాడేటీ

కాదండీ,నిన్న పట్నం నుంచొచ్చాడూ  అడ్డమయినవి అవీ ఇవీ తిన్నాడు,ఉదయం నుంచీ ఒకటే డోకులు,ఇందాకా ఓఓఓఓఓ అని పేద్ద వాంతి చేసుకున్నాడు. అప్పట్నించీ తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది,ఏమయిందిరా అంటే ఏమీ చెప్పడూ…

ఉహ్ అంత నోరంతా తెరిచి వాంతి చేసుకోడానికి ఏంటి తిన్నాడేంటీ?

ఆ ఆ ఆ

ఏమిట్రా ఆ నోరు తెరిచి నువ్వూనూ అన్నీ తిన్నాడండీ సర్వం సహా నానా గడ్డీ

అబ్బబబ్బాబబ్బా నువ్వుండవయ్యా రోగిని చెప్పనీవయ్యా  రోగిని చెప్పనీ, లేకపోతే నువ్వు మందేసుకో అతనికి తగ్గిపోతుంది అతన్ని పంపించెయ్యి అయ్యయయ్యయయ్యో ఆ 

వా వా అంటం తప్ప ఇంకేం చెప్పగలడు బాబూ

పోనీ అదేనా చెప్పనీ మధ్యలో నువ్వు ఖంగారు పడిపోతావేటీ,అసలు నువ్వు నోరు విప్పక అతను తెరుస్తాడు అయ్యయ్యో

అయ్యా అయ్యా మీరే మా జ్యోతిర్లింగాన్ని రక్షించాలి

రచ్చిందాం రచ్చిందాం…ఒరే నుప్పట్రా ఆ

ఇక్కడ నొప్పీ

ఆ …

ఇక్కడ నొప్పీ

ఆ…

ఇక్కడ నొప్పి

బాబూ నిప్పూ…

రోగిని గట్టిగా పట్టుకోండి

ఇదిగో ఇదీ పిప్పరమెంట్ బిళ్ళలాగా నోట్లో వేసుకునీ చప్పరిస్తూ ఊట మింగేయ్ ఆ

ఆ ఆ ఆ ఆ ఆ

అప్పనంగా వచ్చింది కదాని ఆబగా తింటే దవడ్లే కాదు కాళ్ళూ చేతులూ పడిపోతాయి ఆ తీసుకెళ్ళు ఆ…

**********************

ఆహహా ఆ ముద్రపట్టిన తీరూ ఆ భావప్రదర్శనా సాక్షాత్తూ పార్వతీదేవి ప్రత్యక్షమై నృత్యం చేసిందా అనిపించింది మరి.చూడండి యాజులు గారూ ఇక మీరా చాదస్తాలూ అవీ కట్టిబెట్టీ మాట్లాడకుండా చిరంజీవిని మనవడికిచ్చి పెళ్ళిచేసెయ్యండి.చేసెయ్యండి మాట్లాడకూడదిక ఆ…

పదిమందిలో గజ్జె కట్టి భాగోతం ఆడే పిల్లని పవిత్రమయిన కుటుంబంలోకి ఎలా తీసుకురమ్మంటారు

అసలు యాజులు గారూ మీరు పూజా సమయంలో నృత్యం దర్శయామీ అంటున్నారా లేదా?

అంటాం,అదీ భగవంతుడికి ఒకవిధమయిన సేవ

అమ్మాయి నృత్యం చేస్తూ భగవంతునికి సేవ చేస్తూంది కదామరి అంచేత ఇకనేమీ సంశయించక ఈసారికిలా కానిచ్చెయ్యండి మరి ఆ

 

 

 

మీరు ఒడ్డున వున్నవారు,చాలా తేలిగ్గా సలహాలివ్వగలరు,నేను నీళ్ళల్లో మునిగున్నవాడ్ని,అడుగుతీసి అడుగుపెట్టాలంటే పదిరకాలు ఆలోచించాలి

ఏమండోయ్ యాజులు గారూ నాకీ జలగండం ఉండడం చేత ఇలా గట్టున కూర్చుని మాట్లాడుతున్నాను కానీ లేకపోతే మీతోపాటు నీళ్ళల్లో మునిగే సలహా చెప్పుండేవాడ్ని ఆ …(ఏయ్ ఇదిగో పరిక్షిత్తు మహరాజుని పాము పండులోంచొచ్చి కరిచిందట ఆ నీళ్ళలో జలగలుంటాయ్ చూసి పొయ్యండి ఆ…పొయ్యమంటే కుమ్మరించడమేనా మెల్లగా పొయ్యి)

ఇంకేం సంశయించకండే వేదాల్లో పుట్టిన నాట్యాన్ని వేదపండితులు మీరే కాదండం భావ్యం కాదండే అబ్బే,ఇంక మీమాంశలూ తర్కాలు ఏమీ పెట్టుకోకండి మరీ,మీరు యాజులూ మేము రాజులమూనూ పరస్పరం ఒకరిమాటొకరు గౌరవించుకోవాలి మరి ఆ ఈ సారికిలా కానిచ్చెయ్యండి మరి నే ప్రొసీడయిపోతున్నా ఆ.

 

 *******************

ఏమిటదీ?

అదా బాబు..పెళ్ళై పదేళ్ళు దాటినా ఆ యమ్మకి బిడ్డలు పుట్టలేదట,ఆ చెట్టుకి ఉయ్యల కడితే బిడ్డలు పుడతారనీ మా ఊరోళ్ళ నమ్మకం

ఓహో మరి పెళ్ళి కాని వాళ్ళు కడితే

వెంటనే పెళ్ళయ్యి ఏడాదిలోపు పండటి బిడ్డ పుడతాడు

అయితే ఈ ఉయ్యాలియ్యి

మనిద్దరం ఒకటి కావడానికి ఈ మూఢాచారాలూ వింతనమ్మకాలే అడ్డుపడుతున్నాయి కదా,నిజంగా ఆ చెట్టుకి అంతటి మహిమే ఉంటే పెద్దల మనసు మార్చి మనల్ని జంట కలుపుతుందేమో చూద్దాం ఊ..

 

 

***********************

అమ్మాయి గారూ దీన్ని కూడా తీసుకోండి.

ఏమిట్రా ఇదీ

ఇదా కొత్త పిల్లంగోవి,మా గురువుగారు దీన్ని మీ చేతులమీదుగా తీసుకోమన్నారు

గురువుగారా

అవునమ్మాయి గారూ నిన్న కొండమీద వాయించారూ ఆయనే మా గురువుగారు హరిబాబు గారు

నిన్ను నా చేతులమీదుగా తీసుకోమన్నారా

అవునమ్మాయిగారూ మా గురువుగారికి మీరన్నా మీ నాట్యమన్నా ఎంతిష్టమో చెప్పలేను

నిన్న మీ గురించి మూడుసార్లో మూడొందలసార్లో పొగిడారనుకోండి,భలే మంచారు లెండి నాకు పిల్లంగోవి నేర్పేందుకు అచ్చంగా ఎప్పుడూ ఇక్కడే ఉండిపోతాన్నారు.అసలదేంటో అమ్మాయిగారూ ఆయన మాట్లాడుతుంటే పిల్లంగోవి వాయించినట్టే ఉంటుంది,చిన్నప్పుడు చిన్న పిల్లంగోవి మింగేసారో ఏవిటో పాపం

ఆహా ఓహో ఓహోహో

హ్హహ్హహ్హ బాగానే వాయిస్తున్నావ్ కానీ ముందిది తిను,

కాదులెండి గురువుగారికిస్తా,మేం చిన్నోళ్ళం కదండీ మా ఇంట్లో చేసినవి పెద్దోళ్ళు తినరు కదా,మీ ఇంట్లోవంటే తింటార్లెండి

ఆయనకయితే వేరే కట్టిస్తా గానీ నువ్వు తిను ముందు

ముందు నాకు మామూలుగా పలారం పెట్టారు గురువుగారూ,మీకు తీసుకెళ్తానని చెప్పేసరికి ఇవన్నీ కట్టిచ్చారు.

అమ్మాయిగారే

ఆయ్ మీగురించి ఎన్నడిగారో తెలుసాండీ

ఏంచెప్పావ్ ?

మా గురువుగారికి మీ డేన్సూ అంటే బోల్డిష్టం అని చెప్పాను…ఇలా చూసారు

మీరంటే కూడా మహా ఇష్టం అని చెప్పాను…ఇలా తలకాయ దించుకున్నారు

మా గురువుగారు ఎప్పుడూ ఇక్కడే ఉండిపోతారన్నాను…ఇలా నవ్వారు

*********************

మీరు తొందరగా తయారయితే ఇయ్యాల తిరునాళ్ళకి వెళ్దాం గురువుగారూ,డ్రైవర్ గారితో చెప్పి మీకు బస్ లో ముందర సీటిప్పిస్తాగా

ఏంతిరునాళ్ళు

శివరాత్రుంది కదండీ ఈ మూన్నాళ్ళు తిరునాళ్ళే,హరికధలూ బుర్రకధలూ బెమ్మాండంగా రధోత్సవం,మరి దేవుడి పెళ్ళి కదా

రాతివిగ్రహాల పెళ్ళికి నేనెందుకులేరా

అదేంటండీ ఎంతపుణ్యం వస్తుందో,మీ పేరుతో అర్చన చేయించచుకోవచ్చు,అమ్మాయిగారి పేరుతో అర్చన చేయించచ్చు ఆ తర్వాతేమో రధం లాగచ్చు,ఊ ఆ మీరొద్దులేండి పుణ్యమేగానీ ఆ ఎండలో కొంచం కష్టం,ఆ పెద్ద పూజారి గారి అల్లుడూ మా ఊరే ఆరితో చెప్పి మిమ్మల్ని రధమ్మీదే కూర్చోబెడతాల్లెండీ

నేనెవర్నో తెలిస్తే దేవుడికి ఆమడ దూరంలో నిల్చోబెడతారు

భలేవారే మా గురువుగారని చెప్తే ఆ దేవుడే రధమెక్కమంటాడు

నిజమె దేవుడికి ఆ బేధం లేదు,ఈ మనుషులకే

వాళ్ళకి మాత్రం ఎందుకండీ

హుం ఎందుకంటే నేను హరిజనుడ్ని…

*****************

అమ్మాయి గారూ అమ్మాయి గారూ

ఏమిట్రా

మా గురువుగారు లేరూ ఆయన హరిజనుట్ట

******************

 

నామీద ఆగ్రహించినా అసహ్యించుకున్నా నా కులం అది నేను హరిజనుడ్ని,నీకు దగ్గర కావాలన్న బలమైన కోరిక అణచుకోలేక ముందుగా ఈ విషయం నీకు చెప్పలేదు.అసలు మొదట్నించీ ఎంతబద్ధమయినా ఆడి ఏదయినా సాధించుకునే తత్వం నాది. చిన్నప్పుడు గుళ్ళో వేదం చదుకునే పిల్లల్ని చూస్తే నాకూ నేర్చుకోవాలని ఉండేది,అయితే అప్పుడు మమ్మల్ని గుళ్ళొకి కూడా రానిచ్చేవారు కాదు,అందుకని ఇంకో ఊరు పారిపోయి వాళ్ళల్లాగే యజ్ఞోపవీతం వేసుకుని ఒక పండితుడి దగ్గర వేదం నేర్చుకున్నా,కొన్నాళ్ళకి ఆయనకి నిజం తెల్సిపోయింది,వాతలు పెట్టి తరిమేసారు.

 

 

 

 ******************

 

ఊ బుగ్గ కొంచం ఎర్రపడిందీ.అసలూ నిన్న రాత్రే నేను జడా అదీ వేసి అలంకారం చేద్దామనుకున్నానోయ్,మీ అత్తగారి ముచ్చటా అదీ చూసి పోనీలే పెద్దావిడా వారి మాటెందుకు కాదనాలి అని ఊరుకున్నా.మరీ మూసివాయనం ముత్తైదువులా తయారు చేసారు,శోభనం రోజున పెళ్ళి కొడుక్కి పెళ్ళికూతురు బొమ్మలా కనిపించాలోయ్ అమ్మమ్మలా కాదు.ఇవ్వాళ నేను తయారు చేస్తాను చూడు.

 

 

 

 

 ****************

 

అమ్మాయిగారూ గురువుగారు ఊరువదిలి వెళ్ళిపోతున్నారు అమ్మాయిగారూ.నేనెంత ఏడ్చిమొత్తుకుంటున్నా వింటంలేదు.మీతో మాట్లాడాలట వచ్చారు.రండమ్మాయిగారూ…

అక్కడున్నారు…

పెళ్ళైపోయిందానివి….ఇలా వచ్చి మాట్లాడ్డం కూడా తప్పే. కానీ నా దేవత నించి ఓ వరం కోరుకోడానికి వచ్చాను, రేపట్నించీ నీకు గజ్జెలతో అవసరం ఉండదు,అవి నాకు ప్రసాదిస్తే నే ఆరాధించే దేవీ ప్రసాదంలా గుండెల్లో దాచుకుంటాను. ఆ వరమిస్తావా?

 

 

 

*********************

గౌరీనాథా గౌరీనాథా…ఏమిట్రా ఇది,ఎపుడొచ్చావ్?అమ్మాయీ వాళ్ళేరీ?

ఒక్కడ్నే వచ్చేసాను.

ఏంజరిగింది?

అక్కడుండడానికి మనస్కరించలేదు.కన్ను మూసినా తెరిచినా అమ్మవారే కనిపిస్తోంది,అందుకే వచ్చేసాను.

*********************

సరిపోయింది…..మా బాగుంది యాజులు గారూ అత్తవారింట్లో కూడా అమ్మవారే కనిపిస్తోందంటే కనిపించదూ మరి.కుర్రాడికేమైనా ఓ ఊరు చూపించామా, లేక బాహ్యప్రపంచం గురించి ఎరుగునా?కూపస్థ మండూకంలా గుడి నాలుగు గోడల మధ్యా అదే ప్రపంచం అనుకుంటున్నాడు పాపం. తడి బట్టలూ మడిబట్టలూ తప్ప ఓ చొక్కా గుడ్డేసుకుని ఎరుగునా, ఓ బనీను ముక్కేసుకుని ఎరుగునా ఎప్పుడైనా? అమ్మా అమ్మవారితో పరాయి ఆడదానితో మాట్లాడి ఎరుగునా? ఏమండోయ్ హ్హహ్హ రేప్పొద్దున్న పెళ్ళమే అమ్మవారిలా కనిపిస్తోందన్నా మనమేం ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.  అమ్మాయిని కవురంపించేసీ ఇద్దర్నీ హనీమూన్ కి పంపించేసెయ్యండి,బాహ్య ప్రపంచం ఏమిటో చూసొస్తారు.గుళ్ళో దేవుడికి కూడా బాహ్యప్రపంచం తెలీదు కదా అని పాపం ఏడాదికొకసారి ఊరేగింపు అనే పేరుమీద బయటికి తీసుకొచ్చి ఊరు చూపెడతాం. ఆ…మీరు యాజులూ మేం రాజులమూనూ ఆ… పరస్పరం ఒకరిమాటొహరు గౌరవించుకోవాలి మరి, ఈ సారికిలా కానిచ్చెయ్యండి, ఇద్దర్నీ హానీమూన్ కి పంపించసెయ్యండి మరి నే ప్రొసీడయిపోతున్నాను మరి.   

 

*******************

అక్కా అక్కా మొన్నిచ్చిన పుస్తకం ఇదిగో 

అమ్మేం చేస్తోందిరా

ఉట్టిలో …బయల్దేరుతోంది అదిగో వస్తోంది రా రా

రామ్మా వదినా రా రా

నూరేళ్ళు

కూర్చో ఊ భోజనాలయ్యాయా

అవునూ అన్నపూర్ణమ్మ కోడలు కాపరానికొచ్చింది కదా

ఏమిటి విశేషం

ఏంలేదు అంతా శుభ్రంగానే ఉన్నారు

నువ్వు నోరుమూసుకుని గుడికెళ్ళు వెళ్ళూ..పెద్ద మాటలూ నువ్వూనూ..

ఊ ఆ ఏముందీ ఇన్నాళ్ళు తను గజ్జె కట్టుకుని తైతక్కలాడిందీ,ఇప్పుడు ఇంట్లోవాళ్ళని ఆడిస్తుంది.

నీకూ అనిపించిందీ నాకూ అట్లాగే అనిపించింది…ఆడిస్తుంది.

మనమూ చూస్తున్నం కదా ఇరుగుపొరుగు వాళ్లతో ఓ మాటలేదు ఓ పలకరింపు లేదు మరీ ఏంచూసుకుని ఆ గర్వమో ఊ

ఉష్ ఉష్…

చూడు చూడు పెట్టేవేమో వడియాలూ టింగ్ టింగ్ మంటూ ఆ నడకా ఆ ఠీవీ అచ్చం సత్యభామలాగ

నీకూ అనిపించిందీ నాకూ అట్టాగే అనిపించింది సత్యభామే .

**********************

 

ఇది నిజంగా క్లిష్టమైన సమస్యే యాజులుగారూ,అగ్నిపరీక్ష లాంటిది

నా భార్య నా కంటికి దేవతలా కనిపిస్తోంది తాతయ్యా అని చెప్పుకునే మనవడిచేత బలవంతాన కాపురం చేయించలేను, అలా అని తాళికట్టిన పాపానికి ఆ పసిపిల్లని జీవితాంతం కన్నవారింట్లో సమాధి కమ్మనీ చెప్పలేను. గౌరీనాధుడి నిర్ణయం కొంతవరకూ సబబే అని సర్దుకుపోయినా వాడు చేస్తున్న పని….అందునా హరిజనుడ్ని…

యాజులు గారు సర్వశాస్త్రకోవిదులు మీరనవలసిన మాట కాదండి ఇది…హరిజనులు ఆ హరి జనులు, తర్కాన్ని శాస్త్రాన్నీ కాచి వడబోసిన మీకు నేను చెప్పదగిన వాడ్ని కాకపోయినా ఒక్క విషయం మాత్రం మనవి చేసుకుంటాను. శంకరవిజయం లో ఆదిశంకరుల వారికి మాలకులస్తుడు ఎదురైన సంఘటన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి….

 

 

తప్పుకో…దారివిడు…  

దణ్ణాలు దొరా, ఎవర్ని తప్పుకోమంటున్నారు తమరు? నన్నా నాలోని పరమాత్మనా? నన్నయితే నా మట్టికుండలోని నీటిలోనూ మీ బంగారు పాత్రలోని నీటిలోనూ ఒకే సూర్యుడు ఒకేరకంగా కనిపిస్తాడు కదా స్వామీ. అలాగే తమలోనూ నాలోనూ ఒకే పరమాత్ముడున్నాడు.పాత్రల తేడాలాటిదే స్వామీ ఈ కులమతాల తేడా. అలా కాక నాలోని పరమాత్మనే తప్పుకోమంటారా, ఆ భగవానుడి దర్శనం కోసం దేశమంతా సంచారం చేస్తున్న మీరు మీకు ఎదురైన పరమాత్మని తప్పుకు పొమ్మంటారా స్వామీ. ఆత్మ పరమాత్మ స్వరూపమైన ప్రతిమనిషీ దేవుడే స్వామీ. దేవుడికి కులం మతం రంగూ రూపం తేడాలుంటాయా? కాదంటారా స్వామీ!!!

ఆదిశంకరులు ఆ వాదనా పటిమకు ముగ్ధులై ఆ ఛండాలుడులోని ఈశ్వరునికి పాదాభివందనం చేసారు 

లోకధర్మాన్నీ, సాంప్రదాయాన్నీ నిర్దేశించిన మహనీయుడూ, ఆదిపురుషుడూ, జగద్గురువూ అయినా ఆదిశంకరుడే హరిజనుడ్ని ఆదరించినప్పుడు మనమెంత యాజులు గారూ. అసలు నన్నడిగితే మనిషి ప్రగతికి అనుకూలమైనదే కులం, ఇంకేం ఆలోచించకండి ఆ శంకరులవార్నే ప్రార్ధించండి ఆయనే దోవ చూపిస్తారు.

******************

ఆపండి…

నా మనవరాల్ని అత్తవారింటికి సాగనంపడానికి ఇంతమంది పెద్దలు కదిలి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.

యాజులు గారూ ఏమిటి మీరు చేస్తున్న పని?

వివేకవంతులు చెయ్యవలసిన పని!!!

పెళ్ళైపోయిన ఆడపిల్లని ఇంకోహళ్ళకి అప్పచెప్పడమా?

పెళ్ళనేది ఇద్దరు మనుషుల్ని కలపడానికి కాదు రెండు మనసుల్ని కలపడానికి. త్రికరణశుద్ధిగా ఆచరించని పని వ్యర్ధమని శాస్త్రం చెబుతోంది. ఆ రోజు పెద్దల బలవంతంతో అడ్డుచెప్పే ధైర్యం లేని స్థితిలో తన మనసుకి నచ్చని మనిషి చేత మాంగల్యం కట్టించుకుంది నా మనవరాలు. తద్వారా ఇల్లాలే అయింది కానీ అర్ధాంగి కాలేకపోయింది. ఆ రోజు జరిగింది పెళ్ళి కాదు. అది మోసం, అందుకే ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడామె మనసుకి నచ్చిన మనిషికి ఆమెని అప్పగించాలని నిర్ణయించాం.  

పెళ్ళంటే మీకు అంత హీనమయిపోయిందన్నమాట!!!

అసలు పెళ్ళంటే ఏమిటి, పెళ్ళి మంత్రాలకి అర్ధమేమిటి? “అష్టవర్షాద్ భవేత్‌కన్యా పుత్రవత్ పాలికామయా, ఇదానీం తవ పుత్రశ్య తత్తా శ్రేవేణ పాలికా” అంటాడు కన్యాదాత వరుడి తండ్రితో. ఇన్నేళ్ళు కొడుకులా పెంచుకున్న నా కూతుర్ని నీ కొడుక్కి అప్పచెప్తున్నాను, వాళ్ళిద్దరూ స్నేహంగా సఖ్యతగా ఉందురుగాక అని. సర్వకాల సర్వావస్థలలోనూ ఆ స్నేహాన్ని కాపాడతానని వరుడు సర్వదేవతల సాక్షిగా అగ్ని సమక్షంలో ప్రమాణం చేస్తాడు. పెళ్ళంటే శోభనం ముందు జరిగే తంతు కాదు, ఒక పురుషుని స్త్రీని స్నేహితులుగా సన్నిహితులుగా చేసేది. ఆ స్నేహం సఖ్యతా లోపించిన జంట కలకాలం కలిసి బ్రతకలేదు.అందుకే వేరు చేస్తున్నా.ఆ స్త్రీ సాన్నిహిత్యాన్ని పొందే అర్హత గల వ్యక్తికి ఆమెని అప్పగిస్తున్నా. 

మీ మాటే శాస్త్ర సమ్మతం అనుకుంటే ఆమె పవిత్ర బ్రాహ్మణ స్త్రీ, అతను జాతీయ ఛండాలుడైన శూద్రుడు, వాళ్ళిద్దర్నీ జంట కలపడం సబబా?

మంచి ప్రశ్న. ఇన్నాళ్ళు అజ్ఞానాంధకారం లో ఉండిపోయి నేనూ అది సబబు కాదనే అనుకున్నా, కానీ ఒక్క క్షణం ఏకాగ్రతతో విషయావలోవకనం చేస్తే నా అవివేకం నాకే తెలిసొచ్చింది. “జన్మనా జాయతే శూద్ర: సంస్కారాత్ ద్విజర్షయే”.  జన్మము చేత మానవులందరూ శూద్రులే వారి వారి సంస్కారాల ఫలితంగా వర్ణాలేర్పడతాయన్న మనువు స్ఫురణకొచ్చాడు.

జన్మతో అందరూ శూద్రులెందుకవుతారండీ. “చాతుర్వర్ణం మయాకృత్వం” అనలేదా కృష్ణ భగవానుడు గీతలో!!!

అన్నాడు అని వదిలెయ్యలేదు “చాతుర్వర్ణం మయాకృత్వం” అని ఊరుకోలేదే “గుణఖర్మ విభాగయత” అని కూడా అన్నాడు. గుణాల్ని బట్టీ ఖర్మల్ని బట్టీ నాలుగు వర్ణాలని విభజించానన్నాడే తప్ప పుట్టుకని బట్టి కాదు.

తన విధిని తాను నిర్వర్తించక అరిషడ్వర్గాలకూ బానిసై భ్రష్టుడైన బ్రాహ్మణుడి కంటే పవిత్రమైన నడవడి గల శూద్రుడికి తలవంచి నమస్కరిస్తాను నేను. ఈ కర్మ ఛండాలుడి కంటే ఆ జాతి ఛండాలుడు లక్ష రెట్లు మేలు. దీనికి మన పూర్వ మహర్షులే ప్రత్యక్ష సాక్ష్యం. క్షత్రియుడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయినాడు, పల్లెపడుచుకి జన్మించిన వ్యాసుడు భగవానుడైనాడు, మతంగకన్య అయిన అరుంధతిని వివాహమాడిన వశిష్టుడు బ్రహ్మర్షి అయినాడు. కాదంటారా?  

ఏది ఏమయినా ఇంతటి అకృత్యానికి పాల్పడి కులభ్రష్టం చేస్తున్న మీరు పవిత్రమయిన దేవాలంలో అర్చకత్వానికి అర్హులు కారు.

పరమాతుడ్ని అర్చించుకోడానికి ఆ నాలుగు గోడల మధ్యనే కూర్చోక్కర్లేదు శాస్త్రి గారూ, సర్వాంతర్యామి అయిన విధాత మీలో ఉన్నాడు వీరిలో ఉన్నాడు మట్టిలో ఉన్నాడు గాలిలో ఉన్నాడు. నిరాకారుడయిన ఈశ్వరుడ్ని నా మనసులో చూసుకోగలను, ధ్యానించుకోగలను. ఇది నా అదృష్టం. గాఢాంధకారం అలుముకున్న ఈ ఒడ్డుని వదిలి వెలుగురేఖలు నిండిన ఆ ఒడ్డుకి చేరుకోనివ్వండి.

వేదమంత్రాలూ సప్తపది ప్రమాణాలూ అర్ధం లేనివని మీ ఉద్దేశ్యమన్నమాట. మేమూ మీలాగే మారిపోయి ఆచార వ్యవహారలన్నీ మంటగలిపేయాలని మీ కోరికన్నమాట.

పొరబడుతున్నారు.కాగితం గాలికి రెపరెపలాడకుండా బరువుంచినట్టు మానవసంఘం అవినీతివల్ల చిన్నాభిన్నం కాకుండా ఆచారాలనే బాధ్యత ఉంచబడింది. అంతేకానీ వాటిపేరుతో మనిషినీ మనిషినీ వేరుచెయ్యడానికి కాదు. సర్వ ప్రాణికోటీ ఆ విరాట్పురుషుని దేహంలోంచి ఉద్భవించినవే. సృష్టిలోని ప్రతీ వ్యక్తీ ఆ పరమాత్ముని ప్రతిరూపాలే. అన్యవర్ణాల బ్రాహ్మణుల్ని హేళన చేసి బ్రాహ్మణులు మిగతా వర్ణాల వార్ని చులకనచేసి చూడడం ఆ భగవంతుని దూషించినంతటి పాపం. పిపీలికాదిబ్రహ్మపర్యంతం సర్వం ఈశ్వరమయం, ఇన్ని కోట్ల ఈశ్వర ప్రతిరూపాల్ని అందించే ప్రతీ కులమూ గొప్పదే. అన్ని కులాలూ సమానమే. ఈ నా నిర్ణయానికి మీరు కట్టుబడాలనో మీరూ నాలాగ మారిపోవాలని నేను కోరుకోను, తప్పో ఒప్పో నా నిర్ణయం నాది….రా అమ్మా…

*********************

 

కొసమెరుపు:

రాగానికి కులమేది, తాళానికి మతమేది. సప్తస్వర బద్ధమైన సంగీతం వారి కులం, నవరసభరితమయిన నాట్యం వారి మతం. ఆ జంట వేసేవి ఏడడుగులు కావు, దాటినవి ఏడు అగడ్తలు. స్వరాలు సరిహద్దులుగా రాగాలు రాచబాటలుగా కల రసరాజధానిలోకి అడుగుపెడుతున్న ఆ జంటని మీరూ మనసారా ఆశీర్వదించండి.  

****************

జంధ్యాల

Be the first to comment

Leave a Reply