ఈ రోజు జంధ్యాల వర్ధంతి. ఆ సందర్భంగా ఆయనతో పరిచయమున్న ప్రముఖులు ఏమంటున్నారో చూడండి
కె విశ్వనాథ్
ప్రతి సినిమాకి, ఏ రైటరైతే డైలాగ్స్ రాస్తారో అయన్ని చర్చల్లో ఉంచుకోవడం నాకలవాటు. అలానే ‘ఆపద్భాంధవుడు ‘ టైంలో జంధ్యాల నిత్యం మాతోనే ఉండేవాడు. అంతా అయ్యాక, ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వర్ రావుగారికి ఓ లెటర్ రాసి పంపించాడు. ‘నాకీ సినిమాలో రాయుడి పాత్ర వేయాలనుంది, కాని డైరక్టర్గారికి చెప్పలేకపోతున్నాను. మీరు కాస్త చెప్పరా ఆయనకి ‘ అని! నాగేశ్వర రావు గారు ఆ సాయంత్రం నా దగ్గరికొచ్చి, విషయం చెప్పగానే, నాకు నవ్వొచ్చింది.. ‘అరే! రోజు కలుస్తూనే ఉన్నాడు, నాతో ఎన్నడూ అనలేదే ‘ అని! మర్నాడు జంధ్యాల వచ్చినప్పుడు విషయం అడగ్గానే ఏం మాట్లాడకుండా నిలుచున్నాడు. ‘దానిదేముంది శుభ్రంగా వేయ్యి ‘ అన్నాను. రాయుడు పాత్రకి సరిపోతాడో లేదో అని మొదట్లో డౌట్ పడ్డా, అతని నటన చూశాక ఆశ్చర్యానందాలకు గురయ్యాను.
కె రాఘవేంద్రరావు
నాకు గుళ్ళకెళ్ళినా, పెళ్ళిళ్ళకెళ్ళినా రైటర్స్ ని తోడు తీసుకెళ్ళడం ఆనవాయితీ. అలా చాలాసార్లు సత్యానంద్‌తో కలిసి తిరుపతి వెళ్ళాను. ఒసారి సడన్‌గా జంధ్యాలని కూడా తీసుకెళ్ళాలనిపించి, అతని ఇంటికెళ్ళి, బట్టలు కూడా మార్చుకోనీయకుండా, కాఫీ అని చెప్పి కారులోకి ఎక్కించేశాం. తర్వాత పూర్తిగా మాటల్లో పెట్టేశాం. ఓ అరగంట ముప్పావుగంట తర్వాత అతనికి డౌట్ వచ్చి – ‘కాఫీకన్నారు, ఎక్కడికెళ్తున్నాం? పొలాలు కనిపిస్తున్నాయేంటి?’ అన్నాడు, ‘ఇప్పుడు పొలాలు కనిపిస్తున్నాయి, కాసేపు ఆగితే కొండలు.. ఆ తర్వాత వస్తుంది కాఫీ ‘ అన్నాను. విషయం తెలుసుకున్నాక గొడవ గొడవ చేశాడు. జంధ్యాలని తలుచుకున్నప్పుడల్లా అలాంటివి ఎన్నో గుర్తొస్తాయి.. (దర్శకేంద్రుడు ఏదో సందర్భంలో కలిసినప్పుడు పంచుకున్న మాటలివి.)
ప్రదీప్
జంధ్యాల గారు మా మేనమామ (విన్నకోట విజయరాం) చిన్నప్పట్నుంచీ మంచి స్నేహితులు, కాలేజి రోజుల్లో కలిసి చదువుకున్నారు కూడా! ఆ పరిచయం వల్ల నేను జంధ్యాల అంకుల్ని విజయవాడ వెళ్ళినప్పుడల్లా కలుస్తుండేవాణ్ణి! అలానే ఓసారి 1976-77 లో అనుకుంటా.. ‘అడవి రాముడు ‘ సినిమా రిలీజయ్యాక ఆయన్ని కలిసినప్పుడు నేను చాల ఎక్జైటై… ‘ అంకుల్ నాకు ఎన్టీఆర్ అంటే ప్రాణం! మీరు ఆ సినిమాలో చాలా బాగా రాశారు ‘ అని చెప్పాను. వెంటనే ఆయన ‘ఒకరోజు నిన్నుకూడా హీరోగా పెట్టి సినిమా తీసి ఆయన సిన్మాతో పాటు నీదీ రిలీజ్ చేస్తాను చూడు ‘ అన్నారు. ఆయన అలా అన్నా ‘ఏదో క్యాజువల్‌గా అనుంటార్లే, అదెలా సాధ్యం?’ అనికున్నాను. కాని ఐదేళ్ళ తర్వాత దాన్ని ఆయన నిజం చేస్తారని ఊహించలేదు.
నరేష్
జంధ్యాలగారితో నేను చాలా సినిమాలు చేయడం వల్ల ఆయనతో నాకు చాలా అనుబంధం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఆయన నన్ను కొడుకులాగా చూసుకున్నరు. జీవితంలో నేను రెండు సంఘటనలు ఎప్పటికీ మరిచిపోలేను. ఒకటి ఆయనకి కవలలు పుట్టినప్పుడు.. బారసాల ఫంక్షన్ అయ్యాక జంధ్యాల దంపతులు పిల్లలిద్దరినీ తీసుకుని కారులో కూర్చుని వెళ్ళిపోతుంటే నాకు ఆనందభాష్పాలు ఆగలేదు. కారు సడెన్ గా వెనక్కి వచ్చి, ఆగింది. జంధ్యాల గారు అద్దాలు దించి – ‘మా అబ్బాయి లేకుండా నేనెక్కడికెళ్తానయ్యా? దా కారెక్కు ‘ అని నన్నుకూడా ఎక్కించుకెళ్ళారు, రెండోది – ఆయన పోయే కొన్నేళ్ళముందు ఓసారి ఆయన బర్త్‌డేకి.. నేను షూటింగ్ పూర్తిచేసుకుని, మేళతాళాలతో పాటు యూనిట్‌ని అందర్నీ తీసుకెళ్ళి సన్మానం చేశాను. అదంతా చూసి ఆయన ఏడుపాగలేదు!
శ్రీలక్ష్మి
జంధ్యాలగారు ఏ క్యారెక్టరూ ఎక్స్ ప్లెయిన్ చేసేవారు కాదు. డైలాగ్స్ ని మనం కరెక్ట్ గా చేస్తే చాలు అనేవారు, బాగా గుర్తు, నేను చాలా పిక్చర్స్ చేసిన తర్వాత, ‘చంటబ్బాయి ‘ టైంలో అనుకుంటా – ‘ఈ క్యారెక్టర్ ఎలా చేయాలండీ?’ అని పొరపాటున అడిగాను. ఇక అంతే! ‘నువ్వు ఇప్పటికి ఇన్ని క్యారెక్టర్లు చేశావు, అన్నీ నేనెలా చేయాలని చెప్తేనే చేశావా?’ అని క్లాస్ పీకారు. తల తిరిగిపోయిది! ‘ఒర్నాయనోయ్, ఎందుకురా బాబు అడిగాను, నా గొయ్యి నేను తవ్వుకునట్టు అయ్యింది ‘ అని తర్వాత బాధ పడ్డాను. ‘ఇలా చెయ్, అలా చెయ్ ‘ అనరు సరే, పోనీ చేసిన తర్వాత ఏమన్నా రియాక్షన్ ఉంటుందా అంటే, అదీ ఉండదు. మనమెంత బాగా చేసినా సింపుల్‌గా ‘కట్’ చెప్పి ముఖానికి టవల్ అడ్డుపెట్టుకుని వెళ్ళిపోయేవారు.
సుత్తివేలు
జంధ్యాలగారు మంచి స్నేహపాత్రుడు. ఆయన ఎక్కడున్నా చుట్టూ పదిమంది ఉండేవారు.. అది విజయవాడయినా, వైజాగయినా, రాజమండ్రయినా, మద్రాసయినా, హైదరాబాదయినా ఆయనచుట్టూ వాతావరణం ఎప్పుడూ కళకళలాడుతూ ఉనండేది. పదిమందికి పెట్టడం, పదిమందితో తినడం ఆయనకు చాలా కోరిక. ఓసారి బాగా గుర్తు, నేను హైదరాబాద్‌కు ఫ్యామిలీని ఇంకా షిఫ్ట్ చేయని రోజుల్లో, నాకు ఉన్నట్టుండి కాల్చేసి, ‘కమాన్.. నాకు దోసకాయ ముక్కల పచ్చడి, వంకాయ అల్లం పచ్చిమిరప కూర తినాలని ఉంది, మీరేమైనా చేసిపెట్టగలరా? ఎంత టైం పడుతుంది?’ అని అడిగారు. ‘అలవాటు లేని వాళ్ళకయితే కష్టంగాని, నాకెంత సేపు పావుగంటలో చేస్తాను, కమాన్ ‘ అని నేను అన్నాను. అలా ఆరోజు రూంకు వచ్చి సరదాగా, కబుర్లు చెబుతూ గడిపారు.
———————————————-
సాక్షి-ఫామిలీ పత్రిక సౌజన్యంతో (చిన్న చిన్న మార్పులతో)
Leave a Reply
You must be logged in to post a comment.