సుత్తివేలు మాటల్లో జంధ్యాల

జంధ్యాలతో ప్రయాణం:

‘ముద్దమందారం ‘ సినిమా టైంకి నేను వైజాగ్‌లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ చిన్నచిన్న నాటికలు వేసేవాణ్ణి! అదే సినిమాలో భాగంగా ఒక నాటిక ప్రదర్శన నిమిత్తం వచ్చిన నేను, ఆయన దృష్టిలో  పడడంతో, దానిలో నాకు ఒక చిన్న రిసెప్షనిస్ట్ క్యారెక్టర్ ఇచ్చారు. అలా ఆయనతో మొదలైన ప్రస్థానం, నాకు తెలిసి, ఒక్క సినిమా తప్ప దాదాపు అన్ని సినిమాల్లోనూ సాగింది. బిజీగా ఉండి, అమెరికా వెళ్ళలేక పోవడంతో ముందు రెండు సినిమాలు చేయడం మిస్సయ్యాను. ఒకటి – చిన్నికృష్ణుడు, రెండోది – పడమటి సంధ్యారాగం,  కాని ఆ రెండో సినిమాలో కూడా, రెండు మూడు ఆడిటోరియం సీన్స్ ఇక్కడ మద్రాస్‌లో తీసి, అవి సినిమాలో అతికించారు.

జంధ్యాలతో అనుబంధం..

ఎందుకో నేనంటే ఆయనకి అవ్యాజమైన ప్రేమాభిమానాలు! ఓసారి నాతో ఆయనన్నారు – ‘జనరల్‌గా ఒక డైరెక్టర్ ఒక ఆర్టిస్టుని పరిచయం చేస్తే, ఆ డైరెక్టర్ చేసిన అన్ని సినిమాల్లోనూ ఆ ఆర్టిస్టు చేయలేకపోవచ్చు! కాని, నేను డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ మీరు నాతో ఉన్నారు. అలా మనం 100 పూర్తి చేద్దాం’ అని! ఆని ఏం చేస్తాం, అది దైవికంగా సాగలేదు.

డైరెక్టర్ గాజంధ్యాల:

ఆర్టిస్టుని అసలు ఫోర్స్ చేసేవారు కాదు. తనకు కావల్సిన ఫలితాన్ని ఆర్టిస్టుకి కూడా తెలియకుండా రాబట్టుకునే నేర్పు ఆయనలోనే చూశాను, జస్ట్ డైలాగ్ ఇచ్చి, మాకు నచ్చినట్టు న్యాచురల్‌గా చెప్పమనేవారు. ఆయన సినిమాల్లో నాకు కనిపించే ప్రత్యేకత.. ఒక సినిమాని ఎన్ని వందలసార్లు చూసినా, ఒక సీన్ జరుగుతుండగా దాని తర్వాత సీనేంటో ఎవరూ ఊహించలేరు… సీన్ వచ్చిన తర్వాత ‘ఆహ! ఇదా ‘ అనుకోవ్డం తప్ప!

సుత్తి జంట గురించి ..

‘నాలుగు స్తంభాలాట ‘ లో రెండు – మూడు సీన్లు తీద్దామని మొదలైన మా ట్రాక్, ఆ సినిమాలో మెయిన్ ట్రాక్ అవడమే కాకుండా, తర్వాత దాదాపు 25 సినిమాల్లో హిట్ ట్రాక్‌గా నిలిచింది! నిజంగా మా ఇద్దరి జంట అంత అనూహ్యమైన జంటగా మారుతుందని ఎవ్వరం అనుకోలేదు!

జంధ్యాల హాస్యం…

ఎవ్వర్నీ నొప్పించకుండా, ఆబాలగోపాల్లాన్ని మెపించే హాస్యం ఆయనతోనే మొదలైంది! తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళేవారు అరుదయ్యారు! ఒకరో ఇద్దరో ఉన్నా వాళ్ళు కడదాకా తీసుకెళ్ళలేకపోయారన్నది నిజం!

———————————

ఫామిలీ పత్రిక సౌజన్యంతో…  

యూనీకోడీకరించినవారు: రమణి రాచపూడి

 

 

Be the first to comment

Leave a Reply