మా నాన్నగారు (హీరో అమర్నాథ్) మా చిన్నతనంలోనే చనిపోవడంతో, ఫ్యామిలీ కొన్ని కష్టాలు ఎదుర్కొంది. దాంతో నేను సినిమాల్లోకి రావాల్సివచ్చింది. తమిళ్, మళయాళంలో అయిదారు సినిమాల్లో హీరోయిన్గా చేశాక, పెద్దగా అవకాశాలు రాకపోవడంతో, ‘నివురుగప్పిన నిప్పు’ లో మొదటిసారి కమెడియన్ గా చేశాను. తర్వాత జంధ్యాలగారి ‘రెండు జళ్ళ సీత ‘ లో చిన్న అవకాశమైనా వచ్చినదాన్ని వదులుకోవడం ఇష్టంలేక ఒప్పుకున్నాను! కాని, అదృష్టం అనండి, టర్నింగ్ పాయింట్ అనండి… ఒక్క సీన్ చేయగానే, డైరెక్టర్ నా టాలెంట్‌ని గుర్తించి, నా క్యారెక్టర్ని టకటకమని పొడిగించుకుంటూ పోయారు! ఇక ఆ తరువాత చాలా సినిమాలు చేశాను. ‘శ్రీలక్ష్మి బ్రాండ్ ‘ అనేది ఒకటి క్రియేట్ అయింది.
ఇష్టమైన క్యారెక్టరు:
రెండుజళ్ళ సీత – దాన్లో నలుగురు హీరోలు, వాళ్ళింటి ఎదురుగా ఒక చిన్న పోర్షన్! నా భర్త సుత్తివేలు, వఠ్టి అనుమానపు మొగుడు! మాచేత ఇల్లు ఖాళీ చేయిస్తే, దాన్లోకి అందమైన పడుచుపిల్ల వస్తే , లైన్ వేయడానికి వసతిగా ఉంటుందని ఆ అబ్బాయిల ప్లాన్! అందుకని – నా భర్తకి నా మీద అనుమానం పుట్టించేలా ఆ అబ్బాయిలు నాతో ఆడతారు, దానికాయన మండిపడుతుంటే, వాళ్ళు ‘అదేంటండీ అలా మాట్లడతారు, మేం నలుగురం మీ తమ్ముళ్ళలాంటివాళ్ళం’ అంటారు వెంటనే ఆయన ‘అందుకే అన్ని పంచుకోవాలనుకుంటున్నారు… నేను ధర్మరాజుని, ఒట్టి వెధవని!’ అని వాపోతాడు! చివరికి వాళ్ళ టార్చర్ భరించలేక పాపం ఇల్లు ఖాళీ చేయాల్సొస్తుంది
శ్రీవారికి ప్రేమలేఖ: ఈ సినిమాలో కనపడ్డ ప్రతివాడికి టైటిల్ కార్డ్ నుంచి శుభం కార్డ్ పడేదాకా సినిమా కథలు చెప్తూ ఉంటాను! మొదలు పెట్టినప్పుడు మాములుగా ఉన్నవాడు కాస్తా, మెల్ల మెల్లగా గడ్డాలు, మీసాలు, చివరికి అవి పండిపోవడాలు లాంటివి జరుగుతుంటాయి.
ఆనందభైరవి – దీనిలో ప్రతిదానికీ ఈల వేసే క్యారెక్టర్ నాది! జంధ్యాల గారు దీన్ని నిజ జీవితంలో ఎవర్నో చూసి పెట్టారట! పెళ్ళి చూపుల్లో కిటికీలోంచి పెళ్ళికొడుకుని చూసి ఆనందం వచ్చి ఈల వేయడం, భర్త రాగానే ఈలేసి మంచం కింద దాక్కోవడం లాంటివి చేస్తూ ఉంటాను!
మొగుడుపెళ్ళాలు – దీనిలో నాక్యరెక్టర్ … ఫ్రీగా ఏదో ఇస్తానటే స్థలం కొనేయడం.. చిన్నచిన్న గిన్నెలకోసం, గరిటెలకోసం స్టీలు సామాను వాడికి పట్టుచీరలు అమ్మేయడం.. చివరికి పరిస్థితి ఎంతదాకా వెళ్తుందంటే మొగుడ్ని ఉరితీస్తే ఉంగరం ఫ్రీ అంటే, అందుకు కూడా సిద్ధపడతా!
బాబాయి అబ్బాయి: దీనిలో నాకు సినిమా పిచ్చి! అయినా నా గుణగణాలు నచ్చి, ఇష్టపడి పెళ్ళి చేసుకుంటాడు వీరభద్రరావు! కాని, పెళ్ళయ్యాక నా సినిమా పిచ్చి అతనికో పెద్ద తలనొప్పి అవుతుంది. సినిమాలకు పంపించడం మానేస్తాడు! కాని, పిచ్చి అక్కడితో పోతుందా? టివీల్లో వచ్చిన సినిమాలను చూసి, నెమరేసుకుని మరీ బాధపడుతుంటాను… ‘ఏం లేదండీ, జీవనజ్యోతి’లో వాణిశ్రీ గారి కొడుకు రధం చక్రాల కింద పడి చచ్చిపోతాడు…’ టైప్ లో తలుచుకుని , తలుచుకుని ఏడుస్తుంటాను.
చంటబ్బాయి: ప్రెస్ ఓనర్ కోడల్ని అని భ్రమపడి, భయపడి ఎడిటర్ పొట్టి ప్రసాద్ నన్ను, నా కవితల్ని చాలాకాలంపాటు భరిస్తాడు, ‘నన్ను కవిని కాదన్నవాణ్ణి కత్తితో పొడుస్తా! నేను రచయిత్రిని కాదన్నవాణ్ణి రాయెట్టి కొడతా ‘ అంటు కవితల్ని … బంగాళా భౌ భౌ ‘, ‘అరటిపండు లంబాలంబా ‘ లాంటి వంటకాల రెసిపీలే కాకుండా వండి మరీ ఇస్తూ ఉంటాను. పాపం పొట్టి ప్రసాద్ ‘మళ్ళీ మీరెప్పుడొస్తారో ముందుగా చెప్తే, ఆరోజున సెలవు పెట్టుకుంటాను ‘ అంటే ‘అబ్బే సెలవు పెట్టి మరీ వినాల్సిన అవసరం లేదండీ, ఆఫీసులోనే విందురుగాని ‘ అంటాను. నా కవిత్వం విని ఆయన ‘ మీ కవిత్వం వింటుంటే నా స్వేద రంధ్రాలన్నింటిలోను సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది.. నరాలన్నిటికీ నిప్పెట్టినంత ఆనందంగా ఉంది ‘ అంటూంటాడు!
చూపులు కలిసిన శుభవేళ:
నేను, బ్రహ్మానందంగారు ఇద్దరం తిండిబోతులం అని, ఒకరికొకరం సరిపోతామని సంబంధం ఫిక్స్ చేస్తారు మా పెద్దవాళ్ళు. పెళ్ళిచూపుల్లో కొంగుకి కట్టుకొచ్చిన లడ్డుని కలిసి పంచుకోడంతో మొదలయ్యి… ‘పనస పొట్టుతో కూర చేసుకుంటే ఉంటుంది… అహ నా రాజా అని నేనటే, ‘అవునవును, పప్పులో నెయ్యేసుకుని, ఆవకాయ నంజుకుని తింటే ఇంకా బాగుంటుంది ‘ టైప్‌లో బ్రహ్మానందం .. ఇద్దరం పూర్తిగా కాపురం గీపురం అన్నీ మర్చిపోయి, ఎంతసేపు తిండిమీదే ధ్యాసపెడుతూంటాం!
‘రెండు రెళ్ళు ఆరు ‘ :- శ్రీలక్ష్మికి సంగీతసాధనే ప్రపంచం అవడంతో భర్త వీరభద్రరావుకి వంటచేయక తప్పకపోవడం.. ఆ విషయం ప్రపంచమంతా తెలిసిపోవడం… ముష్టివాళ్ళు, గ్రైండర్ కంపెనీలవాళ్ళు, అప్పడాలు అమ్మేవాళ్ళు.. అందరూ ఆయన్నే సంప్రదించడం… వీటన్నిటితో ఆయనకి పిచ్చెక్కి, షర్ట్లు చించుకోవడం.. ఇది నేపధ్యం.. అప్పుడాయన చెప్పే డైలాగ్‌లు – శ్రీలక్ష్మితో… ‘నువ్వు సంగీతం వినిపించసరికి, వంకాయలు మాడి మసైపోయాయి… బెండకాయకు దడపుట్టి దొండకాయంత కుమిలిపోయింది. ముష్టివాడితో … ‘ఒకవైపు నాకు వంట చేసిపట్టని ఆడది, మరోవైపు నా వంట మాత్రమే అడుక్కుతినే మగాడు… వస్తున్నా నాయనా మళ్ళీ అరవకు నీరసమొస్తుంది ‘
లేడీస్ స్పెషల్:- దీనిలో నాకు మొత్తం 390 పెళ్ళిచూపులు జరుగుతాయి! పోస్ట్‌మాన్, కరెంటోడు.. అందరూ పెళ్ళిచూపులకి వచ్చి వెళ్ళిపోయినవాళ్ళే! ఎవడింటికొచ్చినా వాడ్ని, ‘నిన్నెక్కడో చూసినట్టుందే!’ అంటూంటాను! గుర్తుతెచ్చుకుని మరీ వాళ్ళని బాధిస్తూంటాను.. ‘నువ్వు 280వ పెళ్ళికొడుకివి కదూ! నువ్వొచ్చినప్పుడు నేను ‘లంబోదర…’ పాట పాడాను.. అది నీకు నచ్చక నువ్వు పారిపోయావు గుర్తుందా లాంటి డైలాగ్స్ చెప్పి మరీ వాళ్ళని బెదరగొట్టేస్తుంటాను. పాపం సుత్తివేలు నా 380వ బాధితుడు! దానిలోనాకు ఇంకో జబ్బు కూడా ఉంటుంది. రహస్యంగా చెప్పాల్సిన వాటిని గట్టిగా, మాములుగా చెప్పాల్సిన వాటిని రహస్యంగా చెప్తుంటాను. ‘నువ్వలా అరవకే, వీధిలో పోయే ప్రతివాడికీ నేను వంట చేస్తాననే విషయం తెలుస్తుంది!’ అని మొత్తుకుంటూ ఉంటాడు నా భర్త.
ఈ క్యారెక్టర్లన్ని ఎంత న్యాచురల్‌గా పండాయంటే, ప్రేక్షకులు అప్పుడప్పుడు ‘మీరింట్లో కూడా ఇలానే ఉంటారా?’ అని అడుగుతుంటే, ‘అవన్నీ కేవలం సినిమాలకే పరిమితమమ్మా..’ అని చెప్తాను.
జంధ్యాల వర్కింగ్ స్టైల్…
సెట్లో చాల స్ట్రిక్ట్ గా ఉండేవారు! ఆయనతో పనిచేస్తున్నప్పుడు స్కూల్ వాతావరణమే కనబడేది! నవ్వడానికి వీల్లేకుండా, ప్రయోగం చేస్తున్నట్టు చేయించేవారాయన! ఏదైనా తర్వాత తల్చుకుని నవ్వుకోడమే కాని, సెట్లో ఉన్నప్పుడు మాత్రం నవ్వాపుకుని చాలా సీరియస్‌గా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అదెంత అలవాటైపోయిందంటే ఇప్పటికీ అదే స్టైల్ అలవాటయింది!
జంధ్యాలతో చివరిసారి..
ఆయన చనిపోయే రెండు నెలముందు, నేను నంది అవార్డ్ తీసుకోవడానికి హైద్రాబాద్ వెళ్ళినప్పుడు ‘నేనొక సినిమా ప్లాన్ చేస్తున్నాను, మళ్ళీ మనం చేద్దాం ‘ అని చెప్పారు. మనిషిలో మునుపటికన్నా చాలా మార్పు వచ్చినా, కలలో కూడా అనుకోలేదు, అంత తొందరగా పోతారని, మేమందరం ఇంకెన్నో సినిమాల్లో ఆయనతో చేస్తామని అనుకున్నాను కాని, మాకా అదృష్టం లేకుండాపోయింది.
————————-
ఫామిలీ పత్రిక సౌజన్యంతో…
యూనీకోడీకరించినవారు: రమణి రాచపూడి
Leave a Reply
You must be logged in to post a comment.