నరేష్ మాటల్లో జంధ్యాల

జంధ్యాలతో పరిచయం

నాకు చిన్నప్పటినుండీ ఒకటే తెలుసు.. యాక్టరవ్వాలని! మా అమ్మకు మాత్రం నేను డాక్టరవ్వాలని! పెద్దయ్యాక ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఒక బంగళా కూడా ముందే కొనిపెట్టింది! కాని, నేను.. ‘ ఇక వీడు జన్మలో పాసవ్వడు ‘ అని వాళ్ళనుకునేందుకు వీలుగా కష్టపడి మూడుసార్లు ఫెయిల్ అయ్యాను. పదహారేళ్ళొచ్చాక ఓసారి మేడమీంచి దూకడానికి ప్రయత్నించాను. అమ్మ ‘ఒరేయ్! వద్దురా!’ అంటుందేమోరా అనుకున్నాను. కాని ఆవిడ – ‘కిందకైనా దిగు, లేకపోతే దూకు, పీడ వదిలొపోతుంది… హాస్పిటల్‌కు  నీ మెమోరియల్ బోర్డు పెట్టుకుంటాను ‘ అంది.

చేసేది లేక గమ్మున దిగొచ్చాను, రెండు పడ్డాయి! కాస్త కూలయ్యాక అడిగింది ఏం చేద్దామనుకుంటూనావు? అని! విషయం చెప్పగానే పదహారేళ్ళు లేవు, మీసాలు కూడా రాలేదు, నిన్నెవరు హీరోను చేస్తారు?’ అంది. నేను కూడా ‘ఎలా?’ అని ప్రశ్నించుకుంటున్న టైంలో రమేష్‌నాయుడుగారు – ‘జంధ్యాల  ‘ముద్దమందారం ‘ అనే సినిమా తీస్తున్నారు. దానికి హీరోగా నిన్ను రికమెండ్ చేద్దామనుకుంటున్నానూ అన్నారు. అన్నదే తడవు ఉన్న ఫెయిర్ అండ్ లవ్‌లీ పూసుకుని ఫ్రెష్ అయ్యాక, ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు – ‘ప్రదీప్ అనే అబ్బాయి హీరోగా ఫిక్సయిపోయాడు ‘ అని దాంతో ఇంకా కసి పెరిగింది ఇంతలో జంధ్యాలగారు ‘ నాలుగు స్తంభాలాట ‘ లో ఆఫర్ ఇవ్వడంతో చేశాను (నవ్వుతూ) ఆయన నాతో మొదట తీయించిన షాటేంటో తెలుసా? – నన్ను తలకిందులుగా పడుకోబెట్టినది! అది చూసి మా మామయ్య – ‘ఏరా ఫస్ట్ షాటే తలకిందులుగా తీశారు, నీ లైఫ్ తలకిందులవుతుందేమో ‘ అన్నాడు.  ఆయనకదే విషయం చెప్పగానే – ‘ నీ లైఫ్ తలకింద్లైనా నేనే బాధ్యుణ్ణి, బాగున్నా నేనే బాధ్యుణ్ణి, సరేనా?] అన్నారు! మొదటిరోజు ఆయనన్న ఆ డైలాగ్, నేను జీవితంలో మరిచిపోలేను!

ప్రతి మనిషికి టెస్ట్ పీరియడ్ ఆఫ్ దెయిర్ లైఫ్ 18 నుంచి 40 దాకా వుంటుంది. ఆ 20 ఏళ్ళ ముఖ్యమైన కాలం నేనాయనతోనే గడిపాను! ఆయనతో మొత్తం చేసినవి 15-20 సినిమాలు.. కాని గెయిన్ చేసింది లైఫ్‌టైం ఎక్స్‌పీరియన్స్! నేనేప్పుడూ చెప్తుంటాను – ‘ప్రతి మనిషి రెండుసార్లు పుడతాడు ఒకటి తల్లి గర్భంలో పడినప్పుడు, రెండోది వృత్తి ఎంచుకున్నప్పుడు… ఒకటి అమ్మ ప్రసాదిస్తే, రెండోది జంధ్యాలగారు. ఇద్దరు కేవలం జన్మలివ్వడమే కాదు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పారు! అందుకే వాళ్ళిద్దరూ నాకెప్పటికీ గురువులే!

జంధ్యాల క్యారెక్టర్స్..

ఎక్సెంట్రిసిటీకి – మ్యాడ్‌నెస్‌కి మధ్య ఓ చిన్న లైన్ వుంది. ఆ లైన్ మీద కాలు పెట్టడానికి 90 శాతం డైరెక్టర్లు భయపడతారు. కాని, జంధ్యాలగారు ఒక కాలు దానిమీద ఒక కాలు దీనిమీద పెట్టి మధ్యన నడిపేవారు.  ఆయన సృష్టించిన ఏ క్యారెక్టరైనా చూడండి, వింటే, ఏదోలా అనిపిస్తుంది. ‘ఇలా తీస్తే పిచ్చి అనుకుంటారెమో!’ అని ఒక్క నిమిషం ఆలోచిస్తే, అసలలాంటివి తీయలేరు! ఉదా: ‘అహ నా పెళ్ళంట ‘ లో చికెన్‌ని చూస్తూ కూర్చోవడం.. వినడానికే విచిత్రంగా అనిపిస్తుంది. కాని చూస్తే నవ్వకుండా ఉండలేం! ఆ కన్విక్షన్‌తో, ధైర్యంతో అలాంటి క్యారెక్ట్ర్లని సృష్టించడం ఒక్క జంధ్యాలకే చెల్లింది.

స్నేహితుడిగా జంధ్యాల

స్నేహానికి జంధ్యాల ఎంత విలువిచ్చేవారంటే మనుషులు ఉన్నప్పుడే కాదు, పోయిన తర్వాత కూడా వాళ్ళని నిత్యం తలుచుకునేవారు… ఎంతంటే సుత్తి వీరభద్రరావు పోయిన తర్వాత కూడా ఆయనకోసం ఒక పళ్ళెం పెట్టి వడ్డించేవారు.

జంధ్యాల మరణం…

జంధ్యాలగారు నన్నెప్పుడు పరిచయం చేసినా,  ‘ మా అబ్బాయండీ!’ అనేవారు అందుకే ఆయన్ని ఒక తండ్రిగా భావించి, చనిపోయిన తర్వాత నేను శిరోముండనం చేశాను. బాగా గుర్తు.. ఆయన చితి కాలుతున్నప్పుడు ఓ కవి ఉన్నట్టుండి ఆయనమీద పద్యాలందుకున్నాడు… అప్పుడనిపించింది ‘అసలిలా ఎంతమందికి జరుగుంటుంది? బతికున్నన్నాళ్ళు ఆయన రాజులా బతికితే, చనిపోయాక మహరాజయ్యారు ‘ అని!

————————————–

ఫామిలీ పత్రిక సౌజన్యంతో…

 
యూనీకోడీకరించినవారు: రమణి రాచపూడి

Be the first to comment

Leave a Reply