జంధ్యాలతో అనుబంధం……
జంధ్యాల గారు రాసిన ‘ ఓ చీకటిరాత్రి ‘ నాటికనే నేనోసారి ప్రదర్శిస్తుంటే , ఆయనే చీఫ్ గెస్ట్ గా వచ్చారు . దాన్లో నా పెర్ఫార్మెన్స్ ఆయనకు నచ్చి హీరోగా అవకాశమిస్తానన్నారు . దెన్, వన్ ఫైన్ డే చెన్నై రమ్మని పిలిచారు. నేనూ మావయ్యా వెళ్ళాం. నమ్మరు- వెళ్ళిన గంటలోపల నా షేపులన్నీ మార్చి, నన్ను ట్రిం గా స్టైలిష్ గా తయారుచేసారు. హార్స్ రైడింగ్ , స్విమ్మింగ్ అన్నీ నేర్పించారు . ఓ వారం రోజులపాటు ‘ మరోచరిత్ర ‘ చూపించి, నటనలో మెళకువలు తెలుసుకోమనేవారు. అలా నాకు ‘ ముద్దమందారం ‘ లో మొదటి అవకాశాన్నిచ్చారు. రెండో సినిమా బ్రేక్ పడకూడదని , ‘ మల్లెపందిరి ‘ లో గెస్ట్ రోల్ చేయించారు. మూడోది ‘ నాలుగు స్థంభాలాట ‘ ! అదే నేను చేసిన ఆఖరు సినిమా . నేను మొదటినుంచీ చదువులో టాపర్ని అవటంతో , నాకు ఎప్పటికయినా సిఏ చేయాలని ! అదే విషయం చెప్పగానే , నేనయితే సినిమా చేయమనే అంటాను , కానీ …నీకు చదువుమీదే ఎక్కువ ఇంట్రస్ట్ కాబట్టి, రెండు పడవలమీద కాళ్ళు పెట్టకుండా అదే చెయ్యి అన్నారు. దాంతో విజయవాడ తిరిగొచ్చి చదువు పూర్తిచేశాను. తరవాత మళ్ళీ సినిమా వైపు వెళ్ళలేదు. టివి రంగంలోకి వెళ్ళాను. అక్కడ కావలిసినంత పేరు తెచ్చుకున్నాను ! గొప్ప విషయం ఏమిటంటే, తర్వాత్తరవాత నేను ప్రొడ్యూస్ చేసిన సీరియల్ కి (సంధ్యారాగంలో శంఖారావం ) జంధ్యాల గారు డైరెక్ట్ చేశారు. అది నేనెప్పటికీ మర్చిపోలేని అనుభవం.
జంధ్యాల వర్కింగ్ స్టైల్ …….
ఆయనకి ఎక్కడ చనువివ్వాలో ఎక్కడ స్ట్రిక్ట్ గా ఉండాలో బాగా తెలుసు . బాగా గుర్తు …’ ముద్దమందారం ‘ సినిమాలో షాటొచ్చి -నేనూ పూర్ణిమ ఇంట్లోనుంచీ పారిపోతాం .మూడురోజులపాటు తిండి దొరకదు .నేను హీరోయిన్ వంక చూస్తూ ‘ భోంచేసి మూడురోజులైంది….. ‘ అని బాధగా చెప్పాలి. అది టాప్ యాంగిల్ కెమెరాలో పెట్టి తీస్తానన్నారు జంధ్యాలగారు . లంచ్ పూటుగా తిన్నాకా షాట్ మొదలెట్టారు. తిండి ఎక్కువై నిద్దరొస్తున్న మాచేత , ఆ ‘ ఆకలి ‘ డైలాగ్ చెప్పించడానికి ఎంత ట్రై చేసినా రాకపోవడంతో ఉన్నట్టుండి జంధ్యాల గారు అరవడం మొదలుపెట్టారు. అప్పటిదాకా బాగా చూసుకున్న ఆయన అందరిముందరా నన్నలా అరవడంతో , కన్నీరాగలేదు. కానీ అవేవీ పట్టించుకోకుండా టేక్ అన్నారు. అదే మూడ్ లో చేయడంతో షాట్ వెంటనే ఓకె అయింది. షాటవ్వగానే ఆయనొచ్చి, ‘ ఈ రియాక్షన్ కోసమే నిన్ను ఆమాటన్నాను ‘ అన్నారు.
వక్తగా జంధ్యాల ……
టకటకమని శబ్ధం చేసే ఫ్యానుకి , రెండు నూనెచుక్కలేస్తే ఎలా స్మూత్ గా రన్నవుతుందో, ఫిక్షన్ తో కూడుకున్న మన యాంత్రిక జీవితంలో నవ్వు అలా పనిచేస్తుంది అని జంధ్యాల గారు ఎప్పుడూ అనేవారు. ఆయన ఏది మాట్లాడినా నవ్వు కోటింగ్ ఇచ్చే మాట్లాడేవారు .ఉదా- ఒకసారి లయన్స్ క్లబ్ వాళ్లు నిర్వహించిన ఫంక్షన్ కు లేట్ గా వెళ్ళినపుడు – ‘ రోడ్డుకి అడ్డంగా ఓ దున్నపోతు కూర్చోవడం తో ట్రాఫిక్ జాం అయింది . దాన్నెంత బ్రతిమలాడినా , కొట్టినా అది కదల్లేదు . చివరికొక్క మాట అడిగాను …లయన్స్ క్లబ్ సెక్రటరీగా ఉంటావా ? అని , అంతే కదలడం కాదు పరిగెట్టింది …అని చెప్పుకుంటూ వచ్చారు.
జంధ్యాల హాస్యోత్సవం ……
జంధ్యాల గారు చనిపోయిన తర్వాత ,ఆయన పది కాలాలపాటు గుర్తుండిపోవాలంటే ఏం చేయాలి ? అని ఆలోచిస్తుండగా ….ఆయనకు నలుగురు కూర్చొని నవ్వుకుంటూ ఉంటే చాలా ఇష్టం ! ఆయన జయంతి టైం లో ఒక హాస్యోత్సవం లాంటిది పెడితే ఎలా వుంటుంది అనిపించి, 2002 నుండీ ప్రతీ ఏటా 3 రోజులపాటు ( జనవరి 13-15) అందరి ఆర్టిస్టుల సహకారంతో చేస్తున్నాం .
(ఫామిలీ పత్రిక సౌజన్యంతో)
———————————-
జంధ్యాల స్మారక సభ చిత్రాల్లో: ప్రదీప్,కృష్ణభగవాన్,ఏవీఎస్,గీతాంజలి, జయలలిత, గణేష్, గుండు హనుమంత రావు,రమాప్రభ,కోట శ్రీనివాస రావు,
తనికెళ్ళ భరణి, చిట్టిబాబు,దువ్వాశి మోహన్,రఘుబాబు,రాళ్ళపల్లి,ఆలి,అనంత్,వేణు మాధవ్, బ్రహ్మానందం, శ్రీనివాస రెడ్డి, జై వేణు,రాజేష్, గౌతంరాజు.
Leave a Reply
You must be logged in to post a comment.