దర్శకులు కె. రాఘవేంద్ర రావు గారి జ్ఞాపకాలలో జంధ్యాల

జంధ్యాలతో ప్రయాణం ……

మొదట్లో  నా సినిమాలన్నిటికీ ఎక్కువశాతం సత్యానంద్ రాసేవాడు . ‘ అడవిరాముడు ‘ సత్యచిత్ర వాళ్ళు తీస్తానని ముందుకురావటం , వాళ్ళతో జంధ్యాల అంతకుముందరే ‘ జీవనజ్యోతి ‘ వంటి  సినిమాలకు  పనిచేయడంతో , ఆ అనుబంధంతో వాళ్ళు అడవిరాముడు కి కూడా అతన్నే తీసుకుంటామన్నారు . అదీకాక ,  అంతకుముందరే  సత్యానంద్ కీ జంధ్యాలకీ మంచి పరిచయం ఉండటంతో( జంట రచయితలుగా కొన్ని సినిమాలకు కూడా పని చేసారు ) అందరం కలిసి చాలా సరదాగా కథ డిస్కషన్ లో కూర్చున్నాం . ఇక ఒకసారి అడవిరాముడు హిట్ అయేసరికి , దాని తరువాత న్యాచురల్ చాయిస్ అతడే అయ్యి, ‘ వేటగాడు ‘ నుంచి ‘ జగదేకవీరుడు అతిలోకసుందరి ‘ దాకా దాదాపు 15 సినిమాల దాకా చేసాడు. నాతో చేసినవి తక్కువ సినిమాలే  అయినా  చేసినవన్నీ  పెద్ద పిక్చర్లే , అన్నీ దాదాపు సెన్సేషనల్ హిట్సే .

జంధ్యాల ప్రతిభ….

రైటర్ గా నాకు తెలిసి అతని ప్రత్యేకత ….అత్యంత వేగంగా రాయటం!  చాలా తక్కువమందిలో చూస్తాం అంత స్పీడు ! బహుశా అతను   రంగస్థలం నుంచీ రావడం వల్లనేమో అతనికి భాషమీద మంచి పట్టుంది.  చాలామంది  రైటర్స్ కి  దొరకని అరుదైన అవకాశం అతనికి దొరికిందనేచెప్పాలి . ఒకవైపు విశ్వనాధ్ గారి ‘ సిరిసిరిమువ్వ ‘ వంటి ఆర్టిస్టిక్ సినిమాకి డైలాగ్స్ రాయటం, అదే టైం లో అడవిరాముడు వంటి కమర్షియల్ సినిమాకి డైలాగ్స్ రాయగలగటం అతని అదృష్టమే కాదు అతని ప్రతిభకి కూడా నిదర్శనం ! వేటగాడు లో నోరు తిరగని ప్రాసతో కూడిన డైలాగులు , మొదట అతను సంస్కృతంలో అద్భుతంగా రాసాడు . కానీ – సంస్కృతం తెలిసినవాళ్ళు చాలా తక్కువమంది , డైరెక్టర్నయ్యుండి   నాకే సరిగా అర్ధం కాకపోతే , ఒక మామూలు రిక్షావాడికేం అర్ధమవుతుంది ? మనమెంత అద్భుతంగా రాసినా అది జనాలకు ఎక్కనంతసేపూ దండగ ! అని నేనూ , ‘ సంస్కృతం తెలిసినవాళ్ళు చాలా మందే వుంటారు, ఎందుకు అర్ధం కావనుకుంటారు ? నా మాటవిని ఉంచుదాం ‘ అని తనూ….ఇద్దరం బాగానే ఆర్గ్యుమెంట్లు కూడా చేసుకున్నాం. కానీ, ఫైనల్లీ నాకు కావల్సినట్లే క్షణాల్లో మార్చేసాడు . అవి సినిమాకి ఎంత హైలెట్ అయ్యాయో అందరికీ తెలిసిందే . ‘ జగదేకవీరుడు అతిలోకసుందరి ‘ లో అల్లురామలింగయ్య గారి పోలీస్ స్టేషన్ ట్రాక్ అంతా అతను రాసిందే.

జంధ్యాలతో అనుబంధం ……

సత్యానంద్, జంధ్యాల ఇద్దరూ మొదటినుంచీ మంచి ఫ్రెండ్స్ అవడంతో , ఎవరు నా సినిమాకి పనిచేసినా , ఇద్దరూ వచ్చి చర్చలో పాల్గొనేవారు. వాళ్ళిద్దరికీ ఇగోలు కానీ, జలసీ ప్రాబ్లెంస్ కానీ ఉండేవికావు. పైగా ఇద్దరూ ఒకరినిమించి ఒకరు జోకులేసేవారు . ఇద్దరికీ బాడీ అంతా ఫన్నే. ఏ టాపిక్ నయినా ఫన్నీగానే చెప్పేవారు . వాళ్ళిద్దరితోవుంటే నాకు చాలా సరదాగా గడిచిపోయేది. సాయంత్రం ఆరింటి తర్వాత నాకు షూటింగ్  చేసే అలవాటు లేకపోవటంతో , ప్యాకప్ అవ్వగానే ముగ్గురం కూర్చొని తొమ్మిదింటిదాకా కబుర్లు చెప్పుకునేవాళ్ళం ! అప్పుడప్పుడూ విజిపి కి కలిసి వెళ్ళినపుడు , రాత్రిళ్ళు డిస్కస్ చేసి పడుకునేవాళ్ళం . పొద్దున్న లేచి చూస్తే జంధ్యాల ఒక్కడే కనిపించేవాడు. ఎక్కడున్నాడా అని వెతికితే బీచ్ లో మార్నింగ్ రన్నింగ్  చేసేవాడు.. ‘ ఏం నీ ఒక్కడికేనా ఆరోగ్యం మీద అంత శ్రద్ద ‘ అని సరదాగా ఏడిపించేవాళ్ళం. జంధ్యాలలో నాకు బాగా నచ్చే విషయం , ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనయినా నవ్వుతూనే ఉండేవాడు. అవన్నీ తలుచుకుంటే కళ్ళముందు కనపడుతుంటాడతను !

 

“ఫామిలీ” పత్రిక సౌజన్యంతో

Be the first to comment

Leave a Reply