తరలి రాని లోకాలకు
మరలెళ్లిన జంధ్యాలని
తల్చుకుంటే జారినట్టి
అశ్రు బిందువా!
ఏడే మా నవ్వుల గని
ఏడే మా నవ్వుల మణి
కక్షకట్టి కామెడీని
పట్టుకుపోయావా?
చలన చిత్ర మిత్రుడుగద!
సరస్వతీ పుత్రుడుగద!
ఏరుకునీ మంచివాణ్ణి
పట్టుకుపోయావా
చలన చిత్ర క్షేత్రంలో
హాస్యం పండిచినట్టి
పెద్దరైతు జంధ్యాలను
పట్టుకుపోయావా!
అశ్లీలపు హాస్యాలను
కలంతోటి ఖండించిన
వీరుడు గద జంధ్యాలను
పట్టుకుపోయావా
హాస్యకులానికి దళపతి
హాస్యదళానికి కులపతి
అనాథలను చేసి మమ్ము
పట్టుకుపోయావా
ఆయన నవ్వించినపుడు
వచ్చిందీ నువ్వేగద
అప్పుడు నీ పేరేంటి
అశ్రు బిందువా…..
కన్నీరా నీ అంతటి
కసాయిదింకేది లేదు
నవ్వించీ నమ్మించీ
గొంతును కోస్తావా…
తనికెళ్ళ భరణి గారికి ధన్యవాదాలతో
Leave a Reply
You must be logged in to post a comment.