హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు (రెండవ భాగం)

ఆనందభైరవి చిత్రం తర్వాత బాలక్రిష్ణ హీరోగా నటించిన “బాబాయ్ అబ్బాయ్” చిత్రంలో సుత్తి వీరభద్రరావు రెండో హీరో పాత్ర పోషించారు. కనిపించినవాడినల్లా అప్పు అడుగుతూ, అబ్బాయికి సలహాలు ఇచ్చే పాత్ర ఇది. అనాధలయిన వీరిద్దరి కలయికే తమాషాగా ఉంటుంది. సినిమాల్లో ఏడుపు సన్నివేశాలు చూసి ఏడుస్తూ ఇంటికి వెళ్ళి తన తల్లికి సినిమా కథ చెప్పే అరుణ (శ్రీలక్ష్మి) ని “పేరులోనే రుణం” కూడా ఉందని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు కానీ, ఉద్యోగం సద్యోగం లేదని కూతురిని కాపురానికి పంపనంటాడు ఈయన మామ. దాంతో తప్పనిసరయి ఈయన అబ్బాయితోనే ఒక ఇంట్లో అద్దెకుంటూ అద్దె కట్టలేక ఓనరుకు మస్కా కొడుతూ అపుడపుడు పట్టుబడుతూ ఉంటారు.

ప్రతిదానికీ “త్తరై, నా త్తరై” అనడం ఈయన ఊతపదం. తమిళంలో “ఇస్తా, నేను ఇస్తా” అని దీనర్థం. అప్పు ఎప్పుడు తీరుస్తావు అని అప్పులిచ్చినవాళ్ళు అడిగినపుడల్లా “త్తరై, నా త్తరై” అంటూ ఇంటిదగ్గరున్న బీచ్‌లో ఓ మీటింగు పెట్టి  “శ్రీక్రిష్ణదేవరాయలవంటి కళాహృదయుడు తన మంత్రికి అప్పాజీ అని పేరు పెట్టుకున్నాడంటే అప్పు ఎంతవిలువయిందో గ్రహించండి. ఇంగ్లీషులో కూడా డౌను కంటే అప్పు ఉన్నతమయిందా కదా” అంటూ అప్పు గురించి స్పీచ్ ఇస్తాడు.

తనకు దారిలో కనిపించిన ఒక వ్యక్తితో జరిగే సంభాషణ:
“గుడ్మార్నింగ్ సార్, మీరు వైద్యుడా”
“భూతవైద్యుడిని”
“ఆహాహా అప్పిచ్చువాడు వైద్యుడు అన్న సుమతి శతకంవారు ఎంత గొప్పవారండీ”
“ఇంతకీ మీరూ..”

“దేశభక్తి వీరభద్రాన్ని. ఒక భారత పౌరుడిగా దేశభక్తి కలిగి ఉండడం తప్పంటారా?”
“అబ్బెబ్బెబ్బే తప్పెలా అవుతుందండీ”
“అన్నారా, అయితే దొరికిపోయారన్నమాటే. నా త్తరై”

“మన భారతప్రభుత్వం చేసిన పని మనమూ చేయడం తప్పు కాదు కదా. మన దేశం అహింసను పాటిస్తే మనమూ పాటిస్తాము. మన దేశం క్రమశిక్షణను అనుసరిస్తే మనమూ అనుసరిస్తాము. ఇప్పుడు మనదేశమేమి చేస్తూందీ? పరాయిదేశాలనుండి వీరలెవల్లో అప్పులు చేస్తోంది. ఈ ఏడాది ప్రపంచబ్యాంకుకు ఎక్కువ అప్పున్న దేశాల్లో మొదటిది భారతదేశమూ, రెండవది బెల్జియమూ. అంచేత అప్పు చెయ్యడం తప్పు చెయ్యడం కాదు. ఆ మాటకొస్తే అప్పుచెయ్యడం భారతీయుడి జన్మ హక్కు, ప్రథమ కర్తవ్యమూనూ.ఏడుకొండలవాడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకొని ఇప్పటికీ వడ్డీ కడుతున్నాడు. నేలనుంచి ఆకాశం నీరు అప్పు తీసుకుని వర్షం పేరుతో ఇన్స్టాల్మెంట్లలో బాకీ తీరుస్తోంది. చంద్రుడు సూర్యుడినుండి వెలుగు అప్పు తీసుకొని ప్రకాశిస్తున్నాడు. ఇంతెందుకు..మీరు భూతవైద్యులు కదా, పంచభూతాలేవో చెప్పండి”

“అయ్యా పంచభూతాల సంగతేమో నాకు తెలీయదు కానీయండి.. ఇప్పుడు నాకు ప్యాంటుభూతమొక్కటే కనపడుతున్నది”
“నీ సెన్సాఫ్ హ్యూమరుకి నిప్పెట్టా. భూత జోకులెయ్యకండి మేష్టారూ. అసలు పంచభూతాలేమిటీ? పృధ్వివ్యాప్పస్తేజోవాయురాకాశాలు. పృథ్వి, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశమని. అలా అప్పు అనేది మన పవిత్ర పంచభూతాల జాబితాలో ఉంది. ఏషియాడ్‌లో మన గుర్తు గున్నఏనుగు పేరు ఏమిటి? అప్పు. మన వైజాగ్ పక్కనున్న సిమ్హాచలం దేవుడి పేరేమిటి? సింహాద్రి అప్పన్న” ఇలా అప్పులగురించి “అప్పోదేశం” చేస్తుంటాడు.

 ఈ సినిమా తర్వాత జంధ్యాల సినిమా అని ప్రేక్షకులకు పెద్దగా తెలియని నరేష్, భానుప్రియ జంటగా నటించిన “మొగుడు పెళ్ళాలు” చిత్రంలో నరేష్ తండ్రి పాత్ర పోషించాడు. ఇందులో ఈయన పాత్ర బాగా డబ్బున షావుకారు పాత్ర. తిట్లు కాని తిట్లతో, వింత వింత పదాలతో అందరికీ తిక్క పుట్టిస్తుంటాడు. అందులో కొన్ని:

“ఏమిటా కంగారు.. గుడిమెట్లమీద ఎండుచేపలమ్ముకొనే మొహం నువ్వునూ. పగటికలలు కంటావా కిష్యోటికా” “కిష్యోటికానా? అంటే?” “తెలీదు. మాట బాగుందని వాడాను” “శీతాకాలంలో కూజాలమ్ముకొనే మొహం నువ్వునూ. నన్ను స్క్రూలూజు అనే లెవలుకు వచ్చేశావట్రా ఇతియోకినారా” “మల్లెపూలకోసం వేపచెట్టే మొహం అదీనూ”  “పెరుగులో నెయ్యేసుకొని తినే మొహం వాడూనూ” “లతసుమపినాకీ. అంటే ఏమిటని అడగకు. ఆ మాటకూడా నీలాగే అందంగా ఉందని వాడాను” “అనకాపల్లి వెళ్ళడానికి విశాఖపట్నంలో ఓడ ఎక్కే మొహం”  “పండు పడేసి తొక్క తినే తిక్కసన్నాసీ” “మొజాయిక్ ఫ్లోర్ పైన ఆవాలు పోసి కొత్తిమీర మొలవలేదని ఏడ్చే మొహం”

ఈ సినిమా జంధ్యాల సినిమాలా అనిపించదు. అందుకే ఎవరికీ పెద్దగా తెలియదు. అన్నట్టు ఈ సినిమా ప్రారంభంలో దాదాపు 10 నిమిషాలపాటు భవిష్యత్తులో ఆడవాళ్ళు మగవాళ్ళలా, మగవాళ్ళు ఆడవాళ్ళలా ప్రవర్తిస్తుంటే ఎలా ఉంటుందో హీరో కలకంటాడు. దీనినుండే జంధ్యాలగారి శిష్యుడు (క్షమించాలి..ఇది నిజం!)  ఈవీవీ స్పూర్తిపొంది “జంబలకిడిపంబ” తయారుచేసాడు!

సుత్తి వీరభద్రరావు నటించిన మరో మర్చిపోలేని పాత్ర “రెండు రెళ్ళు ఆరు” సినిమాలోనిది. ఈపాత్రకు సంగీతమంటే చాలా ఇష్టం. ఆ సంగతి తెలుసుకున్న అమ్మాయి తరఫున వారు చిన్న మోసం చేసి పెళ్ళి జరిపిస్తారు కానీ ఆ రోజు రాత్రే తన భార్యకు పాడడం రాదన్ని సంగతి తెలిసి కోప్పడుతాడు. ఎప్పటికయినా సంగీతం నేర్చుకొని తన భర్తను మెప్పించాలని ఆయన భార్య పగలనక, రాత్రనక పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ చిత్రహింసలు పెడుతుంటుంది. భార్య పైన కోప్పడలేక, తన కోపాన్ని ఆపుకోలేక బట్టలు చించుకొని శాంతిస్తుంటాడు. చివరకు బీవీ పట్టాభిరాం హిప్నాటిజం ద్వారా ఆమెను మార్పించగలుగుతాడు.

మిగతాది మూడవ భాగంలో ….

బ్లాగర్ జీడిపప్పు గారికి ధన్యవాదలతో
 

Be the first to comment

Leave a Reply