హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు (మొదటి భాగం)

నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగంఅన్న హాస్య బ్రహ్మ జంధ్యాల హాస్యప్రియులకు అందించిన మరో వరంసుత్తి వీరభద్రరావు గారు. జంధ్యాల సృష్టించిన పాత్రలకు, ఆయన వ్రాసిన మాటలకు సుత్తివీరభద్రరావు తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరు. చిత్రమయిన పాత్రలలో మరింత విచిత్రమయినఅలవాట్లు, సంభాషణలతో హాస్యానికి కొత్త నిర్వచనాన్ని అందిచారు సుత్తివీరభద్రరావు.

విజయవాడలో కాలేజీలో చదువుకుంటున్నపుడే నటనపై ఆసక్తి పెంచుకున్నవీరభద్రరావు నాటకాలలో మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నాడు. జంధ్యాల దర్శకత్వం వహించిననాలుగు స్తంభాలాట” చిత్రంద్వారా తెరంగ్రేటం చేసి ఎన్నో మరిచిపోలేని పాత్రలతోప్రేక్షకులను నవ్వించారు. తన అలవాట్లతో పక్కవాళ్ళను ఇబ్బంది పెట్టడం, అవతలివాళ్ళుఉక్కిరిబిక్కిరయ్యేలా గుక్క తిప్పుకోకుండా  మాట్లాడడం, తిట్లు కాని తిట్లతోహింసించడం వీరభద్రరావుకే చెల్లింది. హాస్య బ్రహ్మ జంధ్యాల సినిమా అంటే హీరో ఎవరయినాముందుగా గుర్తుకొచ్చే ఈ హాస్య చక్రవర్తిని, పరోక్షంగా హాస్య బ్రహ్మను, స్మరించుకుంటూ ఆయన నటించిన కొన్ని చిత్రాలను గుర్తుచేసుకొనే ఓ చిన్న ప్రయత్నమే ఈవ్యాసాల ఉద్దేశ్యం.

దాదాపు అందరూ కొత్తనటులతో జంధ్యాల తీసిన నాలుగుస్తంభాలాటలో ఒక హీరో తండ్రి పాత్రతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టారువీరభద్రరావు. ఈయనకు భారతీయ సంస్కృతి, ఆచారాలు అంటే చాలా గౌరవం. కానీ కొడుకేమోఆధునికంగా ఉండాలనుకొంటాడు. ప్రపంచంలోని ప్రసిద్ధులంతా భారతీయులేనని ఈయన గాఠ్ఠినమ్మకం. అందుకే “పైథాగరస్ ఎవడంటే ఏ జర్మనీవాడో ఏ రష్యావాడో అంటావు. వాడి అసలు పేరుగిరీషుడనీ, కాకినాట్లో మన పైథాగారబ్బాయని తెలుసా? షేక్స్పియర్ ఎవడు? శేషప్పయ్య అనేతమిళుడు, రామనాథ జిల్లావాడు, మన భారతీయుడునూ. న్యూటన్ ఎవరు? నూతనుడని బెంగాలీయుడు, మన భారతీయుడునూ” అంటుంటాడు.

ఇవి పట్టించుకోని కొడుకును, మిగిలినవాళ్ళనూనిన్నూ ఈ దేశాన్ని బాగు చెయ్యడం నావల్ల కాదు, నావల్ల కాదు” అంటుంటాడు. ఈయనఅసిస్టెంటు సుత్తి వేలు వరండాలో కూర్చుకొని లెక్కలు వ్రాసుకుంటుంటే ప్రతిచిన్నవిషయానికి “అసలు ఈ విషయం తెలుసా నీకు” అంటూ చెప్పడం మొదలుపెడటాడు. మనకు తెరపైనసుత్తితో మేకును కొడుతున్న దృశ్యం కనిపిస్తుంది. ఇలా సుత్తికొట్టించే పాత్ర బాగాపాపులర్ అవడంతో వీరభద్రరావు కాస్తా సుత్తి వీరభద్రరావు అయ్యారు.

ఈ సినిమాతర్వాత శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో ధనవంతుడయిన తండ్రిపాత్ర పోషించినా పెద్దగాపేరు రాలేదు. అదే ఏడాది జంధ్యాల తీసిన “ఆనంద భైరవి” సినిమా ద్వారా సుత్తివీరభద్రరావు సత్తా ఏమిటో ప్రేక్షకులకు తెలిసివచ్చింది. ఈ సినిమాలో ఆయన ఒక పల్లెటూరివైద్యుడు. చాలా మంచివాడు, ఉన్నతాభావాలు కలిగిన పెద్దమనిషి. తెలుగు అభిమానమెక్కువ, ఎప్పటికయినా గొప్ప రచయిత కావాలని ప్రాసలున్న వాక్యాలను సృష్టిస్తుంటాడు. ఉద్యోగంలేని కొడుకు, ఆనందమేసినా బాధ కలిగినా కయ్‌య్‌య్‌య్ మని ఈలవేసే కోడలు ఈయన కుటుంబసభ్యులు. ఇక ఈయన ప్రాసల ప్రసహనం:

తన దగ్గరకు వచ్చిన రోగితో – “ఆయకాయలో వేడిఉంటుంది. ఆ వేడి నాలాంటి వాడికల వైద్యుడికి నాడిలో తెలుస్తుందిరా బోడి”.సినిమానుండి కోడలికంటే ముందే ఇంటికి తిరిగివచ్చిన కొడుకుతో – “కోడలేదిరా అంటేగోడలకేసి, నీడలకేసి చూస్తావేంట్రా ఊడలజుట్టు వెధవా”. తన భార్య సినిమాహాల్లోఈలవేసిందన్న సంగతి చెప్పిన కొడుకుతో –  “అబ్బా మనకా ఈలల గోల ఏల. ఈ ఈలన్నది ఇలలోకలలో మన ఇంటావంటా లేదే”

నిద్రపోతున్న కొడునులేపి “నానీ నానీ నీ నూనె నీనూనే నా నూనె నా నూనే. నేనే నేను, నీ నూనె నానూనెనని, నానూనె నీనూనని నేనన్నానా  నిన్నను నేనా? నో నో నో. నేనన్నానా నున్నని నాన్నా, నై నై నై. ఇందులో 56 నాలున్నాయిలెఖ్ఖ చూసుకో” అంటాడు. చిరాకేసిన కొడుకు “నాన్నా” అని “ఇవి కూడా కలుపుకో 58 అవుతాయి” అంటాడు.

నాట్య పోటీ రెండవసారి ఏర్పాటు చేయించి హీరోయిన్ నెగ్గినతర్వాత ” మీ సిగ్గు బొగ్గులవ్వ. ఆ రోజు శర్మగారి పైన నెగ్గిన గర్వంతో దిగ్గున లేచిభగ్గున మండిపడ్డారు కాదా. ఈ రోజు నిగ్గుతేలిన ప్రతిభతో ఈ మల్లెమొగ్గ నెగ్గింది. ఇకమీరు తగ్గేసి, మాటకు తల ఒగ్గేసి, ఊరంతా ముగ్గేసి, శర్మగారిని సన్మానించండి. ఆతర్వాత మీకు సిగ్గనిపిస్తే ఆ దగ్గు ఆపేసి నా దగ్గరకు రండి. ఓ ఉగ్గు గిన్నెడుమందిస్తాను, జగ్గు నీళ్ళు కలిపి ఉగ్గు తాగినట్లు తాగి రగ్గు కప్పుకునిపడుకుందురుగానీ” అంటూ అహంకారులయిన ఊరిపెద్దలకు బుద్ది చెప్తాడు.

కోడలిగురించి “మంచి మర్యాదగల మహా మగువ, మానవసేవయే మాధవసేవ అని మనసారానమ్మిన మహాఇల్లాలుమర్రిచెట్టు మహాలక్షమ్మగారి ముద్దుల మూడో మనవరాలు కదా అని మనువు చేసుకుంటే”అన్నపుడు కొడుకు “నానా నీ ప్రాసలాపు వినలేక ఛస్తున్నాము. ఈ జన్మలో నువ్వు కథరాయలేవు, రచయితవు కాలేవు” అంటాడు.










అంతే, – “మొక్కుబడికి బుక్కులెన్ని చదివినా బక్కచిక్కిన కుక్కగొడుగు మొక్కలా చెదలు కొట్టేసిన చెక్క ముక్కలా కుక్క పీకేసిన పిచ్చి మొక్కలా బిక్కమొహం వేసుకొని వక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ బెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ ఇక్కడే గుక్క పెట్టి ఏడుస్తూ ఈ చుక్కల చొక్కా వేసుకొని డొక్కు వెధవలా గోళ్ళు చెక్కుకుంటూ నక్కపీనుగులా చెక్కిలాలు తింటూ అరిటి తొక్కలా ముంగిట్లో తుక్కులా చిక్కు జుట్టేసుకుని ముక్కుపొడి పీలుస్తూ కోపం కక్కుతూ పెళ్ళాన్ని రక్కుతూ పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కుపక్షిలా నక్కి నక్కి ఈ చెక్కబల్ల మీద పక్కచుట్టలా పడుకోకపోతే, ఏ పక్కకో ఓ పక్కకెళ్ళి పిక్కబలం కొద్దీ తిరిగి నీ డొక్కశుద్దితో వాళ్ళను ఢక్కామొక్కీలు తినిపించి నీ లక్కు పరీక్షించుకొని ఒక్క చక్కటి ఉద్యోగం చేజిక్కించుకుని ఒక్క చిక్కటి అడ్వాన్సు చెక్కు చెక్కుచెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసీ. ఇందులో యాభయ్యారు కాలున్నాయి తెలుసా” అని కొడుక్కు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు

ఎంతటి కఠినమయిన వాక్యాన్నయినా అక్షర, ఉచ్చారణ దోషాలు లేకుండా అనర్గళంగా చెప్పడమే కాకుండా చక్కని నటనను జోడించి ఆ పాత్రకు జీవంపోయడం ద్వారా ఒక్కసారిగా అగ్ర హాస్యనటుడయి వెనువెంటనే “బాబాయ్, అబ్బాయ్” సినిమాలో రెండో హీరో పాత్ర చేజిక్కించుకున్నాడు.    

(మిగతా రెండవ భాగంలో)

బ్లాగర్ “జీడిపప్పు” గారికి ధన్యవాదాలతో 


Be the first to comment

Leave a Reply