హాస్య బ్రహ్మ జంధ్యాల…(వెలుగు నీడలు) 4 వ భాగం

సర్వ సాధారణంగా రచయిత, సినిమాలో ఒక సన్నివేశం దర్శకుడి అభిరుచులు, దర్శకుడు కధను చిత్రీకరించే విధానం లను దృష్టిలో పెట్టుకొని వ్రాయాల్సి ఉంటుంది.  దర్శకుడి ఆదేశాను సారం వ్రాయడం వల్ల  రచయిత తన భావాలను, సృజన ను పూర్తిగా పలికించలేకపోవచ్చు. రచయితే దర్శకుడిగా కూడా ద్విపాత్రాభినయనం చేయాల్సి వచ్చినప్పుడు, రెండు  పాత్రలకు న్యాయం చేయడానికి ప్రయత్నించే టప్పుడు  స్వల్ప ఘర్షణ బహుశా తప్పక పోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో వైవిద్యభరితమైన , ఇదివరలో ఎవరూ సాహసించని కొత్త వరవడి ని కధా క్రమం లో కానీ, చిత్రీకరణలో కానీ, చిత్రం జయాపజయాల తో నిమిత్తం లేకుండా ఎంచుకోగలడా? జంధ్యాల ఇవి అన్నీ చేసి చూపించారు. అటు మాస్ కమర్షియల్ సినిమాలు ఇటు కళాత్మకమైన సినిమాలకు కూడా, విజయ వంతంగా వరుసగా ఒక దాని తరువాత ఒకటి శతదినోత్సవ చిత్రాలకు  రచిస్తూ కూడా  తనలోని సృజనాత్మకతను వెలికి తీసి ఒక కొత్త తరహా సినిమాలకి నుడికారం చుట్టారు జంధ్యాల. మధ్యే మార్గంలో కళాత్మక సినిమాల్లోని ఆలోచనా ధోరణులని  సున్నితత్వాన్ని మాస్ సినిమాల్లోని జనాకర్షణ పద్ధతులని మేళవించి ప్రేక్షకులను మెప్పించారు. 

జంధ్యాల ఎంచుకున్న పంధా అప్పటిదాకా ఎవరు చూపించలేదు.  ముద్ద మందారం కానీ నాలుగు స్థంబాల ఆట కానీ అటు పూర్తిగా కమర్షియల్ సినిమాలు కావు అల్లాగని వాటిని  ఆర్ట్ సినిమాలు గా కూడా గణించలేము.  70 ల్లో వచ్చిన సినిమాల్లోలాగా మనోభావోద్వేగాలతో కూడిన కళాత్మకతో  బాటు 80 ల్లో వచ్చిన  మాస్ కమర్షియల్ అంశాలు జోడించి కొత్త తరహా కుటుంబ కధా చిత్రాలు గా వాటిని తీశారు జంధ్యాల. ఇవి కౌమార దశలోని యువతి యువకుల ప్రేమ కధల ఆధారంగా పెద్ద పెద్ద స్టార్స్ లేకుండా సామాన్య కుటుంబం లోని పరిస్థితుల తో సమన్వయ పరచి తీసిన కొత్త తరహా చిత్రాలు. ఇటువంటి చిత్రాలు  తమిళ సినిమా రంగం లో బాల చందర్ , భారతి రాజ్ లు 70 లలో మొదలు పెట్టారు. ప్రేమ కధా చిత్రాలయినా మనసును శరీరాన్ని ఉత్తేజపరిచే విధం గా మాస్ విషయాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా  జంధ్యాల తీశారు.  ధనిక కుటుంబాలలో కొరవడుతున్న అప్యాయతలు,అనురాగాలు, మనుషుల మధ్య పెరుగుతున్న దూరాలు  వలన చిన్న వయసు లో ఆప్యాయత నోచుకోని  యువతీ యువకులమధ్య  ఆకర్షణ పెరగడం, పరిస్థితుల ప్రభావం వల్ల ఇంట్లోంచి లేచిపోవడం, అటువంటి తెలివి తక్కువ పనుల వల్ల జరిగే పర్యావసనాలు  ముద్ద మందారం సినిమాలో చూపించారు.  ఇటువంటి కధా విషయం సాధారణ ప్రేక్షకుడిని ఆకర్షించదు, అందుచే సినిమా విజయవంతం కాకపోవచ్చు  అని తెలిసినా వాటిని ప్రేక్షక రంజకం గా మలచటానికి తగు శ్రద్ధ తీసుకున్నారు జంధ్యాల. 

నాలుగు స్థంబాల ఆట లో కూడా వైవిధ్యభరితమైన కధాంశాన్నే ఎన్నుకున్నారు. ఇందులో నాలుగు పాత్రలు పరిస్థితుల ప్రభావం వల్లనో ,విధి చిన్న చూపు చూడడం వల్లనో ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటారు.  ఇందులో ప్రతి నాయకులు ఎవరు లేకపోయినా, విషమ పరిస్థితులు కాటేయడం వల్ల ప్రేమ త్యాగానికి దారి తీస్తుంది. పెద్ద దర్శకులు రచయితలు ఇటువంటి కధలు ఇష్టపడని కాలం లో, జంధ్యాల ఈ పరిస్థితులలోనే కొత్తదైన నాటకీయత సృష్టించగలిగారు. క్లిష్ట పరిస్థితుల నధిగమించి ప్రేమ కధ విజయవంతం కాగానే ముగిసి పోయే కధని  ఇంకో రెండడుగులు ముందుకు తీసుకెళ్లి  ఆ తరువాత వచ్చే సంబంధ సందిగ్ధాలని విశ్లేషించారు జంధ్యాల. ఈ రెండు సినిమాల్లోనూ కౌమారంలో గర్భధారణ, ఆ పై పర్యవసానాలు సహజం గా ఉండేటట్లు చిత్రీకరించారు. ముద్దమందారం లో సామాజిక కట్టుబాట్లు కలిగించిన అవరోధాలు ప్రాధాన్యం గా చూపిస్తే, నాలుగు స్థంబాలాట లో నాలుగు  పాత్రల మనస్తత్వాలు, ఒకే పరిస్థితుల్లో ఎలా స్పందించాయో, వారి మధ్య అనురాగం, త్యాగం, క్షమా గుణం, స్వంతం కావాలనుకొనే తపన, ప్రేమను నిర్వచించే   నాలుగు స్థంబాలు గా చిత్రీకరించారు.  

పిగ్మాలియన్ అనే రచన  జార్జ్ బెర్నార్డ్ షా  రచనలలో ఆణిముత్యం అనదగినది.  హెన్రీ హిగ్గిన్స్ అనే ఒక భాషా యాస  సంబంధమైన విషయాలలో విశేష పరిశోధనలు చేసే ప్రొఫెసర్, ఎలిజా డులిటిల్ అనే ఒక పల్లెటూరి పిల్లను విజ్ఞానవంతురాలిగా చేయగలనని  తన మిత్రుడితో పందెం కడతాడు.  ఆ అమ్మాయిని తన ఆశ్రయం లోకి తీసుకొని నేర్పడం మొదలుపెడతాడు. ఆ అమ్మాయితో సాన్నిహిత్యం కారణంగా ఆమె మీద ఆపేక్ష,  అనురాగం  ఆ తరువాత ప్రేమ పెంచుకుంటాడు.  కానీ ప్రేమ ని వ్యక్తం చేయడానికి అతని అహం అడ్డువస్తుంది. ఎలిజా ఆమాయకురాలు, రీతి రివాజు తెలియనిది అవటం చేత గ్రహించలేకపోతుంది. వీరిరువురి  సంస్కృతి,  సాంప్రదాయాలు సమన్వయ పరుచుకొనే క్రమంలో ఘర్షణ ఆ నాటకంలో అందంగా వర్ణింపబడింది. జంధ్యాల గారు  ఆనంద భైరవి లో ఇటువంటి కధాంశమే తీసుకున్నారు. కొండముది శ్రీరామమూర్తి గారి నవల “చిరుమువ్వల మరుసవ్వడి”ఆధారంగా తీసిన ఈ సినిమాలో కూడా ఒక దొమ్మరి పిల్లను  శాస్త్రీయ నృత్యం లో ప్రవీణురాలిని చేయడానికి  ఒక నాట్య  గురువు సంకల్పిస్తాడు. పిగ్మాలియన్ లో గురువు గారు శిష్యురాలి ప్రేమలో పడితే , ఇందులో  గురుపుత్రుడు  తన సహాధ్యాయి అయిన దొమ్మరి పిల్లతో ప్రేమలో పడతాడు. ఇందులో పాత్రల మధ్య ఘర్షణ పిగ్మాలియన్ లో కన్నా క్లిష్టంగా ఉంటుంది. ఒక సాంప్రదాయ కుటుంబంలోంచి వచ్చిన అగ్ర కులస్థుడైన  గురువు తన కూతురిగా అభిమానించిన  నిమ్న కులస్థురాలైన శిష్యురాలిని కోడలిగా అంగీకరించాల్సిన  పరిస్థితులు సృష్టించబడ్డాయి. 

జంధ్యాల సృష్టించిన చిత్రాలలో ఆనంద భైరవి సమున్నత స్థానం లో ఉంటుంది. ఇందులో కళాత్మక విలువలతో పాటు జీవితంలోని నాటకీయత కూడా  సహజం గా చిత్రీకరించారు. ఈ సినిమాకి ప్రజాదరణ కలిగించిన సాంప్రదాయ  నృత్యాలు, సంగీతం కూడా తీసివేసినా, సినిమా లోని పాత్రలు, వాటిన తీర్చి దిద్దిన విధానం, పాత్రల మధ్య అంతర్లీనంగా ఉన్న విబేధాలు, నాటి సామాజిక పరిస్థితులను  చిత్రీకరించిన తీరు ఇవన్నీ కూడా సినిమాని నిలబెట్టగలవు.  గురువు తన గౌరవము, శిష్యురాలి మధ్య కుమారుడిని అవరోధం గా అనుకుంటాడు. కుమారుడు తన తండ్రి శిష్యురాలిపై తన ప్రేమకి, గురువుకు నాట్యం మీద ఉండే అభిమానానికి మధ్యలో నలిగిపోతాడు. శిష్యురాలు తనని ప్రేమించినవాడికి, నాట్యం మీద,గురువుగారి మీద గౌరవాభిమానాలకి మధ్య సందిగ్ధంలో పడుతుంది. ఇన్ని చిక్కు ముడులను విడదీయడానికి  వీలైన ఒకే ఒక్క మార్గాన్ని చూపిన తీరు ప్రశంసనీయం. 

పడమటి సంధ్యారాగం లో  కూడా ఇటువంటి కధాంశమే. ఇందులో సంస్కృతి సాంప్రదాయాలకి తోడు జాతీయత కూడా కధను సంక్లిష్టం చేస్తుంది. సంకుచిత భావాలు, సంకుచిత దృక్కోణాల వల్ల సమస్యకు సరైన సమాధానం దొరకడం కష్టం. ఈ రెండు సినిమాల్లోనూ జనామోదం పొందగలిగిన సమాధానం ఒక్కటే అనిపిస్తుంది. సంస్కృతి సాంప్రదాయాలకు అతీతంగా మనిషి తను గీసుకొన్న పరిధులను అధిగమించ  గలడు అనే సందేశం ఇస్తుంది.  జంధ్యాల వ్రాసి విశ్వనాధ్ దర్శకత్వం వహించిన సప్తపది లో కూడా ఇంచుమించు ఇదే చెప్పబడింది. 

విజయవంతమైన కధలను మార్చి మార్చి కానీ, జనాదరణ పొందిన అంశాలతో, పద్ధతులతో కానీ  సినిమాలు తీయడం పరిపాటి. కానీ ఆ చట్రం లోంచి బయటపడి తన ఆశయాలకు, అభిరుచులకు తన మేధా శక్తి ని  జోడించి సినిమా తీయడానికి ధైర్యం కావాలి.  జంధ్యాల అటువంటి వారిలో ఒకరు. సవాలు గా తీసుకొని  అరుదైన కల్పనా శక్తి తో  తన దైన శైలి లో రచయితగా దర్శకుడిగా విజయవంతమైన సినిమాలెన్నో తీశారు.

ఇంకా ఉంది…. 

కంచిభొట్ల శ్రీనివాస్ గారు జంధ్యాల గురించి వ్రాసిన ఆంగ్ల వ్యాసానికి బులుసు సుబ్రహ్మణ్యం గారి స్వేచ్చానువాదం జంధ్యాల అభిమానుల కోసం.

కంచిభొట్ల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలతో

Be the first to comment

Leave a Reply