తెలుగు పాటలకు పట్టు పరికిణీలు

కొబ్బరి నీళ్ళ జలకాలాడినంత హాయిగా….

లిపి లేని కంటి భాషలేవో చదివి వివరించినట్టుగా…..
లేత చలిగాలులేవో చక్కిలిగింతలు పెడుతున్నట్టుగా
సరిగమపదని స్వరధారలో తడిసిపోతునట్టుగా…….

పై వాక్యాలు చదువుతుంటే, మనసులో ఏవో స్పష్టాస్పష్ట జ్ఞాపకాలు మెదులుతున్నాయా?  స్వప్న రాదారుల్లోకి పగలల్లా అలసిన మనసు పయనం మొదలెట్టబోయే క్షణాల్లో మీ చెవి పక్క రేడియో రహస్యంగా వినిపించిన రాగాలేమైనా గుర్తొస్తున్నాయా? నిజమే! ఇవన్నీ ఆ మళ్ళీ రాని, మదినొదిలి పోని రోజుల మధుర జ్ఞాపకాలే! అంతే కాదు,  ఆ అనుభూతులన్నింటి వెనుక, ఒకటే పాటల తోటలో పుట్టిన జట్టు ఉంది.

ఈ సరికే మీలో కొందరు సినీ అభిమానులకు ఇవి ఏ దర్శకుడి వర దానాలో అర్థమైపోయి ఉంటుంది .  సినీ గేయ రచయితలంటే అపార గౌరవం ఉండి, మనం ఒక పాటను తల్చుకున్న ప్రతి సారీ, సదరు రచయితనూ స్మరించి తీరాల్సిందేనన్న సూత్రాన్ని పాటించినవారందరికీ వేటూరి కలం కనపడి ఉంటుంది. మరి ఆ వెనకే దశాబ్దాల పాటు తెలుగు సినీ సంగీతానికి వన్నెలద్దిన ఒక అపురూప, అమృత గళం .. – బాలూ గుర్తొస్తున్నాడంటే..ఆశ్చర్యమొకింతైనా లేదు నాకు!

అందరి సంగతి తెలీదు కానీ, నా వరకూ – ఒక్కో పాట, జీవితంలోని ఒక సంధర్భంతోనో, ఒక మనిషితోనో, అనుభవంతోనో ముడిపడిపోయి, మమేకమైపోయి, ఎన్నేళ్ళ తర్వాత విన్నా, తిరిగి తీసుకు వెళ్ళి ఆ గతపు వాకిలి ముందే నిలబెడుతుంది. మస్తిష్కంలో మూలకు ఒదిగి మరుగునపడ్డాయనుకున్న ఆనాటి తీపి తలపులు, మర్చిపోయామనుకున్న జ్ఞాపకాలు.. చిమ్మ చీకటి ఆవరణలో వెలిగిన ప్రమిద చుట్టూ పరుచుకునే వెలుగులా, మళ్ళీ ఒక్కసారిగా  చుట్టుకుపోతాయి.

నా ఒరియా రూమ్మేట్, ఉత్కళిక, శనాదివారాల్లో పొద్దున్నే హాల్‌లో లాప్పీ బేబీని పెట్టుకుని గజల్స్ వినేది. ఫ్లాట్‌లో ఇద్దరమే ఉండేవాళ్ళం కాబట్టి, నేనూ నా రూం నుండి బయటకు వచ్చి, నచ్చకపోయినా సరే, సుప్రభాతం విన్నంత శ్రద్ధగా “గం కా ఖజానా తేరాభీ హైన్, మేరా భీ..” , “ఆజ్ జానే కీ జిద్ నా కరో..” అన్న పాటలు ఆమె పుణ్యమా అని కొన్ని నెలల పాటు విని ఉంటాను. ఇది జరిగి మూడేళ్ళు దాటిపోతున్నా, ఆ పాటలెక్కడైనా వినపడితే, వెనువెంటనే ఆ అమ్మాయి గుర్తొస్తుంది. అప్పుడే శనివారం వచ్చేసిందా అనిపిస్తుంది. లేదా ఆదివారపు ఉదయం ఆడవాళ్లలో సహజంగా కలిగే అందమైన బద్ధకం కమ్ముకుంటుంది. పాటైపోయాక నిరాశలూ, నిట్టూర్పులూ పరుగులూ మామూలే! 

అలాగే, నేను పైన ఉదహరించిన పాటలన్నీ, నా దృష్టిలో, నా మాటల్లో చెప్పాలంటే, రేడియో పాటలు. నేను చిత్రీకరణ ఎలా ఉండి ఉంటుందో అన్న ఆలోచన కూడా లేకుండా, ఒళ్ళంతా చెవులు చేసుకుని ఆనందంగా విని పాడుకున్న పాటలు. దర్శకుడు, సంగీత దర్శకుడు, గాయనీగాయకులు, గీత రచయితల అభిరుచులు-నైపుణ్యాలు-పరస్పర సహకారాల మీదే ఒక గీతం చలనచిత్ర చరిత్రలో ఎన్నాళ్ళు మనగలదన్న అంశం ఆధారపడి ఉంటుంది.

 “రెహ్మాన్ దగ్గర చక్కటి బాణీలను కొల్లగొట్టాలంటే మణిరత్నమే!” , “రాజమౌళికి చేసినట్టు కీరవాణి వేరెవ్వరికీ చెయ్యలేడేం చెప్మా!” , “ఇళయరాజా ఒక సంగీత సముద్రం, ఆణిముత్యాలు సాధించుకుంటారో, నత్తగుల్లలేరుకుని తృప్తిపడతారో..అది దర్శకుడి అభిరుచిని బట్టి ఉంటుంది..” , “వేటూరి బూతు పాటలు రాశారా? ఆ మహానుభావుడికేం ఖర్మ? దర్శకులలా కావాలంటూ వెంట పడ్డారేమో….”

 — ఇలా ఎన్నో కబుర్లు, అవాకులూ-చెవాకులూ చిత్ర పరిశ్రమలో వింటూనే ఉంటాం. ఏతా వాతా వారు చెప్పేదేమయ్యా అంటే, దర్శకుడి ప్రతిభను బట్టే, ఏ రంగంలోని వారికైనా పేరొచ్చేది అని!

ఇలాంటి మాటలనే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకుండా,  మన పక్కింటమ్మాయిలా కనపడే పూర్ణిమను కథానాయికగా చూపించడమూ, ఒక “గ్యాంగ్ లీడర్”ను “చంటబ్బాయి”గా మలచగలగడమూ, హాస్యంతో హృదయాలను కొల్లగొట్టడమూ, తనకు వెన్నతో పెట్టిన విద్యేమో అనిపించేంతలా రాణించిన దర్శకులొకరు తెలుగు పరిశ్రమకూ ఉన్నారు.

నేను ఇంత మంది దర్శకుల్లో ఈయన్నే ఎంచుకోవడానికి వెనుక ఒక కారణం ఉంది. ఆయన అసలు సిసలు తెలుగు దర్శకులు. తెలుగుతనాన్ని మాత్రమే తన చిత్రాల్లో నింపిన దర్శకులు. పరికిణీ అమ్మాయిలు, తెలుగు తిట్లు, తెలుగుతనం ఉట్టిపడే పాటలు, ఆరోగ్యకరమైన హాస్యాన్ని ఆంధ్రులకు పంచిన నిఖార్సైన ఆంధ్రావాలా! 

ఆనందాల ఊయలలో ఓలలాడించి, సంగీత సాహిత్యాలతో మెరుగులద్ది, తెలుగు చిత్రానికి కొత్త ప్రాణాన్నిచ్చిన హాస్య బ్రహ్మ — పరిచాయాలక్కరలేని పండిత పామర మనోరంజకుడు — జంధ్యాల!!

అటువంటి అభిరుచి ఉన్న దర్శకుల చిత్రాల్లోని పాటల సంగీతంతో పాటు, సాహిత్యం కూడా తెలుసుకోదగ్గదిగానే ఉంటుందని చెప్పేందుకు, చాటేందుకు ఈ చిరు ప్రయత్నం!

జంధ్యాల సినిమాల్లో ఎక్కువ పాటలు వేటూరే వ్రాశారు. అన్నీ వెన్నాడే గీతాలే! రేడియోలో మ్రోతమోగిపోయిన అజరామరమైన అద్భుతాలే ! మచ్చుకు కొన్ని :

నీ కోసం యవ్వనమంతా..” అన్న పాటలో, వేటూరి కలం చూడండి – చలి చీకటి చీర మీద చెక్కిన అక్షరాల్లో ప్రణయ భావనలను చూడమని తొందరపెట్టడం లేదూ :

అటు చూడకు జాబిలి వైపు – కరుగుతుంది చుక్కలుగా
చలి చీకటి చీరలోనే సొగసంతా దాచుకో
అటు వెళ్ళకు దిక్కుల వైపు – కలుస్తాయి ఒక్కటిగా
నా గుప్పెడు గుండెలోనే జగమంతా ఏలుకో…”

అలాగే నాకు బాగా చిలిపిగా, తమాషాగా అనిపించిన మరొక గీతం :

“కాస్తందుకో… దరఖాస్తందుకో..” అన్న గీతంలో,
చిరుగాలి దరఖాస్తు లేకుంటే కరిమబ్బు, మేరుపంత నవ్వునా చినుకైన రాలునా?
జడివాన దరఖాస్తు పడకుంటే సెలయేరు, వరదల్లె పొంగునా కడలింట చేరునా?
<…..>
చలిగాలి దరఖాస్తు తొలియీడు వినకుంటే, చెలి చెంత చేరునా చెలిమల్లే మారునా?
నెలవంక దరఖాస్తు లేకుంటే చెక్కిళ్ళు, ఎరుపెక్కిపోవునా? ఎన్నెల్లు పండునా?
దరి చేరి కూడా దరఖాస్తులేలా? ”           
                  – – – అంటూ ముగించడంలో, భామ అంగీకారాన్ని ప్రియుడికి చేరవేసిన పుణ్యం కూడా సంపాదించేసారు మన వేటూరి. ఇది నిజానికి ఒక హిందీ గీతాన్ని( “యాద్ ఆ రహీ హైన్…తేరీ యాద్ ఆ రహీ హైన్..”) అనుసరించి చేయాలని అనుకున్నారట. అయితే, ఆ రాగానికి, సంగీతానికి అనుగుణంగా, ఇంత అందంగా పదాలను పేర్చడం మాత్రం, వేటూరికి తప్ప వేరెవ్వరికీ సాధ్యపడకపోవచ్చు. ఇటువంటి పాటలు రాసినప్పుడల్లా, జంధ్యాల పసివాడిలా సంతోషపడిపోయి, “ఎవరయ్యా వేరే కవులున్నారన్నది, కవి అంటే వాడే! కవి అంటే వేటూరే!”  అంటూ అందరితోనూ అభిమానంగా చెప్పుకునేవారని, ఈ మధ్యనే “పాడుతా తీయగా” కార్యక్రమంలో బాలు చెప్తూంటే విన్నాను.

జీవితం సప్తసాగర తీరం
వెలుగు నీడల వేదం
సాగనీ పయనం”

అంటూ ‘కలా ఇలా కౌగిలించిన చోట” పాటలల్లడం వేటూరికి వెన్నతో పెట్టిన విద్య. ఆశాభోస్లే కి ఈ పాట ఇవ్వడం వెనుక ఉన్న కారణాలు తెలీవు కానీ, నాకెందుకో ఆవిడ గొంతీ పాటకి నప్పినట్టే అనిపించింది. అదో రకం తాత్విక చింతనను పరిచయం చేసే ఈ పాటకు, ఆవిడ గొంతులో ఉండే గమ్మత్తైన నిషా న్యాయం చేసిందన్నది స్వాభిప్రాయం.

“అలివేణీ ఆణిముత్యమా..- నా పరువాల ముత్యమా…”లో నుండి,  బాలు తీయ తేనియ గొంతులో అమృతంలా పలికిన కొన్ని అక్షర లక్షలు :

తొలి జన్మల నోముకి, దొరనవ్వుల సామికి
చెలిమై నేనుండిపోనా…చల్లగా
మరుమల్లెలు చల్లగా..”

ఇలా ఒకే పదాన్ని వెంట వెంటనే వేరు వేరు అర్థాల్లో వాడటం వేటూరి వారి పాటల్లో తఱచుగా కనిపించి మురిపించే మంత్రమే. అందులోనూ ఇవి సంగీతానికి తగ్గట్టుగా మెరుపులల్లే మెరిసినప్పుడు , “వాహ్ వేటూరి..వాహ్!” అని చేరవని తెలిసినా అభినందనలందించకుండా ఉండలేం.

మరో చోట “మల్లె పందిరి” నీడలో నింపాదిగా కూర్చుని,
సందె గాలి తావి చిందుల్లోనా..అందాలన్నీ ముద్ద మందారాలై..నావిగా
ఏ వంకా లేని వంక జాబిల్లీ..నా వంక రావే నడచే రంగవల్లీ...
” అంటూ పదాల అందాలతో విందు చేస్తారీ మాంత్రికుడు.

“కన్నెపిల్లా కాదు కలల కాణాచి
కలువ కన్నులా కలల దోబూచి “ అంటూ ఒక పక్క వేటూరి రాయడం, మరో పక్క జంధ్యాల అంతే అందంగా తెరకెక్కించడం, తెర మీదీ అందమైన తెలుగు పాట వినపడుతుంటే, మనసు
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్విందీ సింగారం
ముద్ద మందారం .. ముగ్ధ శృంగారం “ 
అంటూ అందుకుపోతూ తాళం వేయదూ ?

అథరాల కావ్యాలకు ఆవేశమందించనా
వలపే పిలుపై వయసే ముడుపై నిన్నే చేరనా

మందార ముకుళాతో పాదాలు పూజించనా
అలనై కలనై విరినై ఝరినై నిన్నే కోరనా “ –
ఈ పాట వింటుంటే లేత చలిగాలుల్లో తిరిగినట్టు అనిపించని వారుంటే, వలపు వాకిలిని ఎవరో తడుతునట్టుగా అనిపించకపోతే…..పల్లవి మళ్ళీ ఇంకోసారి వినాల్సిందే! 🙂
అన్నట్టూ..నేనెప్పుడూ ఈ పాట వేటూరిదే అనుకునేదాన్ని. జ్యోతిర్మయి అన్న పేరుతో విశ్వం అనే రచయిత రాసే వారని ఈ మధ్యే తెలిసింది.

ఇహ జంధ్యాల దర్శకత్వంలో, మహదేవన్ స్వరకల్పనలో ఆత్రేయ రాసిన పాటలు, నాకు భలే ఇష్టం!
ఒక్క నాకు మాత్రమనేమిటి, కళ్యాణ వైభోగమే “ పాట సన్నాయి వాళ్ళు సంబరాల్లో మునిగి తేలుతూ మోగించకుండా తెలుగు పెళ్ళిళ్ళు ఎలా పూర్తవుతాయి ?

అలాగే రాళ్ళల్లో ఇసుకల్లో ..రాశాము ఇద్దరి పేర్లు.. పాట కూడా పసితనపు స్నేహాలేవో గుర్తు తేకుండా మరలి పోదు. ఎన్నాళ్ళైనా సరే! ఎన్నేళ్ళైనా సరే! ఇప్పటికీ నే నే సముద్ర తీరానికైనా వెళ్ళినప్పుడు, కాస్త వీలు చిక్కగానే తడి ఇసుక మీద నాకు నచ్చిన పేర్లు రాయకుండా వెనక్కు రాను. అలా రాసిన ప్రతిసారీ, తోడొచ్చిన స్నేహితులో బంధువులో నా ఆటలకు నన్నొదిలేసి కెరటాల మీదకు ఉరుకులతో వెళ్ళిపోయినా, నా పెదవులను క్షణాల్లో ఈ పాట అల్లుకుపోతుంది.  సాగర తీరాన మనసు కోరిన ఏకాంతంలో నచ్చే తోడై వెంట నిలుస్తుంది.

ఎక్కడ పడితే అక్కడ తన ప్రియుడి పేర్లు చెక్కుతూ పాటంతా అల్లరి చేసే రజని నాకిప్పటికీ గుర్తుందంటే, గొప్పదనం ఎవరికి ఆపాదించాలంటారు ? జంధ్యాలకా, ఆత్రేయకా, లేదా మామకా? కళలో కూడా వంతులేమిటమ్మాయ్…మొత్తంగా దొరకబుచ్చుకుని అనుభవించాలి కానీ అంటున్నారా? నాదీ అదే మాట!!

ఇంకా అతి ముఖ్యంగా నేను చెప్పాల్సిన పాటలింకా మిగిలే ఉన్నాయి. “మనసా తుళ్లి పడకే..“, “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు..”  పాటలు తెలుగు అమ్మాయిలందరికీ  పెళ్ళిచూపులయ్యాక తడుముకోనవసరం లేకుండా గుర్తొచ్చే పాటలు.  ఒక్కో సందర్భానికీ ఒక్కో పాట చొప్పున, ఇన్ని వేల సినిమాల్లో కొన్ని లక్షల పాటలు వచ్చి ఉంటాయి. కానీ కన్నె గుండెల్లోకి తొంగి చూసినట్టుగా ఒకరో గీతాన్ని రాయడం, ఆమె నునుసిగ్గులనూ, కళ్ళలోని మెరుపులనూ, రంగుల తెరపై తడబాటు లేకుండా చూపించడం, ఎలా సాధ్యం ? అతనికి కాక మరెవరికి సాధ్యం ?

ఆ సంగీత సాహిత్యాల గురించి ఇలా చెప్పుకుంటే పోతే పొద్దు చాలదు. మొదలెట్టాక పూర్తి చేయకుండా పోదామంటే మనసూరుకోదు. ఇది నా ఉత్సాహమే తప్ప, ఆ మహా మనిషి శ్రమనంతా ఒక చోట కూర్చడం నా శక్తికి అసాధ్యమని నాకు తెలుసు.

ఒక్కరమూ ఒంటరి అడుగేస్తే భయం కానీ, ఒకే అభిప్రాయాలున్న వాళ్ళు పది మంది జత కూడితే అలుపేముంటుంది ? మొదలెడితే అందుకునే వారు నలుగురున్నారన్న ధైర్యం, మననెందుకు వెనకడుగు వేయిస్తుంది ? అందుకే మొదలెట్టాను..

దివ్యకాంతిలో ఐక్యమైన జంధ్యాల, తెలుగు వారికి కొత్తదనాన్నీ, చక్కని హాస్యాన్నీ పంచిన వారిగా ప్రాతః స్మరణీయులు. విధి కొట్టిన దొంగదెబ్బకి ఊహించని విథంగా తిరిగిరాని లోకాలకు తరలిపోయినా, వారి మాటలు, పాటలు, పంచిన నవ్వులు, వారి వల్ల స్పందించిన హృదయాలు, జంధ్యాలను ఇప్పటికీ ఎప్పటికీ జ్ఞాపకాల్లో చిరంజీవిగా నిలబెడతాయి.  కానీ, వీటినింకా రుచి చూడని వాళ్ళు, మన ముందు తరాల వారు వీటి గొప్పతనం గురించి తెలుసుకునేందుకు, కాసిన్ని నవ్వులు మనతో పంచుకునేందుకు, మనమూ కాస్త బాధ్యత తీసుకోవాలని గుర్తెరిగి, అందుకు గానూ సగర్వంగా ముందుకొచ్చిన మంచివారు కొందరు “ఇక్కడ” జత కూడారు. వారికి మీ వంతు సహాయం తప్పకుండా అందించండి!!

జంధ్యా వందనాని”కి రెండు చేతులు సరిపోవని, మీ అందరూ తలో చెయ్యి వేసి మరీ తీర్మానించండి.

 

Comments:

rahimanuddin 17 weeks ago · +1 points

నాకు చాలా ఇష్టమైనవి ఇక్కడ ఉంచారు!

Sandeep P 18 weeks ago 

నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. వేటూరి జంధ్యాలకు వ్రాసిన పాటలు అన్నిటికంటే శ్రేష్ఠమైనవి అని. విశ్వనాథ్ కూడా ఈ విషయంలో కాస్త పక్కకు జరిగి జంధ్యాలకు స్థానం కల్పించాల్సిందే. దాదాపు చివరిలో వచ్చిన “ష్…గప్చుప్” లో తెలుగందాలే అనే పాటలో వేటూరి చూపించిన తెలుగుదనం, తెలుగు ధనం వారి అనుబంధానికి, అందులో పూచిన అనేకగీతాలకు ఒక మచ్చుతునక మాత్రమే.
చక్కనైన వ్యాసం వ్రాసారు. మీకు నెనర్లు, అభివందనాలు.

చిన్ని ఆశ 18 weeks ago ·

వీనుల విందైన పాటలన్నీ ఒక్కదగ్గర గుర్తుచేశారు. చాలా హాయిగా అనిపించింది చదువుతూ ఉంటే….

లలిత 18 weeks ago

మానసా  చక్కని పాటలు ఎంచక్కని మాటలతో కూర్చి అందించారు . వ్యాసం చాలా చాలా బావుంది .    

Be the first to comment

Leave a Reply