హాస్య బ్రహ్మ జంధ్యాల….(వెలుగు నీడలు)3వ భాగం

పాతబడుతున్నకొద్ది మాధుర్యం పెరుగుతూ, విన్నకొద్ది వినాలనిపిస్తూ, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆణిముత్యాలు అనిపించుకొదగిన  సినిమాలు తెలుగు చిత్ర సీమలో ఉన్నాయి. గత శతాబ్దపు డెభ్భయ్యో దశకం, ఎనభయ్యో దశకం దాకా జంధ్యాల కమర్షియల్ సినిమాల తోపాటు సంస్కృతి, సాంప్రదాయాలతో  విలువలు పెంచే కళాత్మక సినిమాలో కూడా తనదైన ముద్ర వేశాడు. కమర్షియల్ సినిమాలు తో జంధ్యాలకి విజయాలు , ధనం దక్కినా, కళాత్మక సినిమాల్లో రచయిత గా  మంచి పేరు తెచ్చుకున్నారు.  ఈ సినిమాల్లో ఏ పాత్రని ఎక్కువ చేసి చూపించఖ్ఖరలేదు, అనవసరమైన నాటకీయత సృష్టించఖ్ఖరలేదు, కధతో సంబంధం లేకుండా కామెడీ సన్నివేశాలు కల్పించ నవసరం లేదు, పాత్రలన్నీ కధలో ఇమిడి అంతర్భాగం కావాలి. ఇన్ని నిబంధనల మధ్య జంధ్యాల రచయితగా ఉన్నత శిఖరాలు అందుకున్నారు. సన్నివేశాలకు తగినట్టు మాటలు వ్రాసి, అనవసర కామెడీ జోలికి పోకుండా, పాత్రోచితంగా వీలైనంతగా  సున్నితమైన హాస్యం అల్లి, తనదైన శైలి లో ప్రేక్షకులను మురిపించారు.

K. విశ్వనాథ్ తో కలసి కళాఖంఢాలుఅనదగిన సినిమాలు, సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి, శుభోదయం, శంకరాభరణం, సప్తపది, శుభలేఖ, సాగర సంగమం చివరగా ఆపద్బాంధవుడు సినిమాల్లో పనిచేశారు. వీటిలో విశ్వనాధ్ పాత్రలన్నిటిని సరిగ్గా ఆకళింపు చేసుకొని , వాటి స్వభావానుసారం గా మాటలు వ్రాసారు జంధ్యాల. 

“ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు, నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా అని ఒకలా అంటాడు, ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్ధుష్టమైన నాదం ఉంది. ప్రయోగాల పేరిట ఆ అమృత తుల్యమైన సంగీతం అపభ్రంశము చేయకు దాసూ” 

శంకర శాస్త్రి, దాసు తో అన్న ఈ మాటలలో  శంకర శాస్త్రి గుండెల్లో బాధ,సంగీతం మీద అతనికున్న అభిమానం , గౌరవం స్పష్టంగా  అర్ధమవుతుంది. 

“మృతిలోన ముగిసినా  చితిలోన రగిలినా కడతేరి పోనీదీ మధురానుబంధము, ఎద వీడిపోనిదీ మమతాను రాగము.”ఈ కొన్ని మాటలతోనే  బాలు అనే ఒక తాగుబోతు నాట్య కళాకారుడు కి అతని ప్రాణమిత్రుడు, కవి ఐన రఘు ల బంధం తెలియ వస్తుంది. కవిగా రఘు ని గురించి చెప్పడానికి జంధ్యాల వ్రాసిన “పంచేంద్రియాలనే కాదు ప్రపంచాన్ని రాయిలా నిలిపేవాడు ఋషి,  రాయిలా పడి ఉన్న ప్రపంచాన్ని అహల్య లా  మలిచేవాడు మనిషి.” అన్న మాటలు చాలు.  శరత్ బాబు వ్యక్తిత్వాన్ని చెప్పడానికి జంధ్యాల వ్రాసిన ఈ మాటల కన్నా ఎక్కువుగా బహుశా విశ్వనాధ్ ఇంకేమీ కోరుకొని ఉండరు.  ఆ సినిమాలోనే ఇంకోచోట, జయప్రద ఔదార్యాన్ని భరించలేక (తట్టుకోలేక) అనిపిస్తాడు “రోగం పేరుతో దానికి, దాని మొగుడి హోదాలో నాకు బానే మర్యాదలు జరుగుతున్నాయండి.”  ఇక్కడ కూడా మధ్య తరగతి మనస్థత్వాన్ని ప్రతిఫలించేటట్టు ఉంటుంది, దానమైనా సరే తీసుకొనే ముందు నిష్టూర పడి చూపించడం అన్నమాట. జంధ్యాల మాటలు వ్రాయడంలో, కధను ముందుకు తీసుకెళ్లడమే కాదు ఆ పాత్రల స్థితి గతులకి  స్వభావానికి దగ్గరగా ఉండే మాటలు అల్లుతాడు.

ఆపద్భాంధవుడు సినిమాలో  మాధవుడు ఒక పల్లెటూర్లో పశువుల కాపరి. అతని  గురువుగారు  ఆర్ధిక సంబంధమైన చిక్కుల్లో ఉన్నప్పుడు గురువుగారికి సహాయం చేయడానికి ఆయన  రచనలు మూడో మనిషి ద్వారా కొనిపిస్తాడు.  ఆ లావా దేవీలు ముగిసిన తరువాత గురువు గారికి త్వరగా డబ్బు ఇవ్వాలనే ఉద్దేశ్యం తో ఉన్న  మాధవుడు చేత అనిపిస్తాడు “ఆ బయానా ఏదో తొందరగా ఇప్పించండి”  బయానా అన్న పదాన్ని తరచుగా వ్యాపారులు ఉపయోగిస్తారు.  మాధవుడు పశువులను క్రయ విక్రయాలు చేస్తుంటాడు. కానీ వ్యాపారానికి ఉపయోగించే బయానా అన్న మాట సాహిత్య సంబంధమైన విషయాలలో ఉపయోగించడం అవమానం  కలిగించే రీతిలో ఉన్నట్టు అనిపిస్తుంది గురువుగారికి.  ఈ ఆగ్రహం తరువాత సన్నివేశానికి దారి తీస్తుంది. పాత్రల తీరు తెన్ను, వారు సహజ సిద్ధంగా అనే మాటలు లోని ఔచిత్యం రచయిత గ్రహించగలిగితే  ఆ సంభాషణలను సహజంగా, హృద్యంగా రక్తి కట్టించగలడు. జంధ్యాల గొప్పదనం ఇక్కడ గోచరిస్తుంది.

భావోద్వేగాలని (సెంటిమెంట్) చిత్రించడం రచయితకి ఎప్పుడూ సవాలే. అది సుమారుగా తీగ మీద నడక లాంటిది. ఎక్కువైతే  కృతకం గా అనిపించి అతిగాను, మనసును కలవర పెట్టేటట్టుగాను ఉంటాయి. తక్కువైతే ఆ భావోద్వేగం గుర్తింపబడక పోవచ్చు. ఇటువంటి వాటిలో సంభాషణలు వ్రాయడం లో రచయిత గొప్పతనము తెలుస్తుంది.

శంకర శాస్త్రి గారి కూతురికి ఆయన బాల్య మిత్రుడు మాధవుడు  పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు.  అనేక సంబంధాలు శాస్తిగారికి నచ్చక పోవడం మాధవ్ కి విసుగు పుట్టిస్తుంటుంది. చివరికి ఒక స్కూల్ టీచర్ సంబంధం శాస్త్రి గారికి ఆమోద యోగ్యం గా అనిపిస్తుంది.  కానీ పెళ్లి చూపులప్పుడు శారద (శాస్త్రి గారి అమ్మాయి) పాట పాడుతూ ఒక చోట శృతి తప్పుతుంది. శాస్త్రి గార్కి కోపం వస్తుంది, ఆ తరువాత పెళ్ళికొడుకు  అమ్మాయిని సమర్ధించ బోయి తొందరపాటు తో  కంగారులో  శాస్త్రి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పోతాడు. సంగీత జ్ఙానము లేనివాడికి పిల్లనివ్వనంటూ, సంబంధం వద్దంటాడు శాస్త్రి గారు. మాధవ్ మాటల్లో తన ఆవేదన, ఆక్రోశం, కోపం ఎలా పలికించారో జంధ్యాల గమనించండి.

“అవసరం లేదురా నీకేదీఅవసరం లేదు, కానీ శారదకు పెళ్లి అవసరం, ఒక పెళ్లి తోడు అవసరం, ఒక నీడ అవసరం,  ఏ సంగీత విద్వాంసుడికో కట్టబెట్టి దాని గొంతు ఎందుకు కోస్తావురా , నువ్వు అనుభవించే సుఖం చాలకనా, సంగీత సామ్రాట్టువి, శంకరాభరణం లో దిట్టవి, గండపెండేరము తొడిగించుకున్నవాడివి, ఈ వేళ ఎవడన్నా కచేరికి పిలిచి ఒక్క రూపాయి ఇస్తున్నాడురా, శుభ్రమైన బట్ట కట్టి ఎన్నాళ్లైయిందిరా,  సంతృప్తిగా  మూడు పూటలు  భోంచేసి  ఎన్నాళ్లైయిందిరా ,పోనీ శారదకన్నా ఒక రవికలగుడ్డ  అయినా కొనిపెట్ట  గలుగుతున్నావా, ఇంకా నీకెందుకురా ఈ కంచిగరుడ  సేవ, ప్రజలకి నీ సంగీతం అఖ్ఖర్లేనప్పుడు ఆ సంగీతం నీకు కూడు గుడ్డ పెట్టలేనప్పుడు ఎందుకురా   నీ కింకా ఆ వ్యామోహం?…… “

ఈ మాటలు పట్టు విడవని శంకర శాస్త్రి ని ఉద్దేశించినవి మాత్రమే  కాదు, ఎరువు తెచ్చుకున్న పాశ్చాత్య వ్యామోహం లో పుట్టిన గడ్డ లోని సంస్కృతిని సాంప్రదాయాలని పట్టించుకోని, తమ ఉనికి కి కారణమైన కళలను, కళాకారులను గుర్తించలేని నేటి తరం యువతను కూడా ఉద్దేశించినదే. ఈ మాటలలో ఆగ్రహం, ఆవేదన, భంగపాటు,  సమాజానికి ఒక నిఘూడమైన హెచ్చెరిక  కనిపిస్తాయి. ఒక సందేశం వినిపిస్తాయి.  ఒక రచయిత చిన్న ఘర్షణ సన్నివేశంలో, తమ మూలాలు మర్చిపోతున్న యువ తరం మీద తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ కూడా, సన్నివేశం లో ఔచిత్య భంగం కలుగ కుండా, ఉద్దేశించిన సందేశం వినిపించడం లో కృతకృత్యుడయితే, సమాజం మీద తన వ్యాఖ్యానం సినిమా లో జోడించగలిగితే, ముఖ్యం గా దర్శకుడి ముద్ర వేసుకున్న సినిమాలో,  అది రచయిత ప్రతిభకి దర్పణం పట్టుతుంది. 

ఇంకా ఉంది…. 

కంచిభొట్ల శ్రీనివాస్ గారు జంధ్యాల గురించి వ్రాసిన ఆంగ్ల వ్యాసానికి బులుసు సుబ్రహ్మణ్యం గారి స్వేచ్చానువాదం జంధ్యాల అభిమానుల కోసం.

కంచిభొట్ల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలతో

 

Comments:

కొత్తావకాయ

18 weeks ago ·

చాలా బాగుందండీ! బులుసు గారి మార్క్ కనిపించలేదేమిటా అనుకుంటూనే చదివాను. అనువాదమా! బులుసు గారు జంధ్యాల సృష్టించిన పాత్రని ఒక దానిని ఎన్నుకుని విశ్లేషిస్తే చదవాలని ఉంది. 

Be the first to comment

Leave a Reply