సాధారణం గా కమర్షియల్ సినిమా లో కధ కి ప్రాముఖ్యం ఉండదు. ఉన్న కధ కూడా నమ్మదగ్గది గా ఉండదు. ఆసంబద్ధం, అస్వాభావికం అయిన కధలో అర్ధం చేసుకోవడానికి వీలుకాని, అసాధ్యమైన హీరో చేసే వీరోచిత కృత్యాలు కమర్షియల్ సినిమాలో ముఖ్య భాగమై పోయాయి. కమర్షి యల్ సినిమాలో అర్ధం వెతకడం, కధలో మలుపులు, మెరుపులు ఊహించడం వృధా ప్రయాస. మనస్సు తో కానీ బుద్ధితో కానీ ఆలోచించడానికి ఏమి ఉండకపోవచ్చు అందులో. ఇటువంటి సినిమాల ముఖ్యోద్దేశం ప్రేక్షకుడి ని అలరించి ఒక మూడుగంటలు ఆనందింప చేయడము మాత్రమే. వినోదమే ప్రధానమైన సినిమాలో వినోదాన్ని ఎంత బాగా పంచగలిగారు అన్నదాని మీద సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.
దేవలోకాధిపతి ఇంద్రుని కుమార్తె స్వర్గం నుండి భువి ని సందర్శించటానికి వస్తుంది. దురదృష్టవశాత్తూ ఆమె వేలి ఉంగరం పోగొట్టుకుంటుంది. ఆ ఉంగరం లేకపోతే ఆమెకు స్వర్గ ప్రవేశం ఉండదు. అది మన హీరో కి దొరుకుతుంది. ఆమె ఈ ఉంగరం హీరో దగ్గర నుంచి తీసుకోవడానికి కానీ, సంగ్రహించడానికి కానీ సినిమాలో మూడు గంటల పాటు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఆగండి! ఇంద్రపుత్రి కదా అంతో కొంతో మంత్రశక్తి కానీ ఇంద్రజాల విద్య కానీ తేలియదా అన్న ప్రశ్న రాకూడదు, కొన్ని మంత్రశక్తులని విలన్ ని వారి అనుచరులని మాయ చెయ్యడానికి, వినోదం కల్పించడానికి ఆమె ఉపయోగించినా సరే. హీరో దగ్గరినుంచి ఉంగరం సంపాదించడానికి అవి పనికి రావు.అల్లా చేస్తే సినిమా అయిపోతుంది. అసహజం గాను అసంబద్ధం గాను అనిపించినా హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడానికి, అది పెరిగి విడదీయలేని బంధం కలిగించడానికి అనేక సన్నివేశాలు కల్పించాలి, ఈ సన్నివేశాల ద్వారా వినోదం పంచాలి, ప్రేక్షకుడు హాయిగా నవ్వుకోవాలి. పతాక సన్నివేశం లో స్వర్గమా , ప్రియసఖుడా అనే సందేహం, సందిగ్ధం కలగాలి. ఇటువంటి కధలో ప్రేక్షకుడికి వినోదం కలిగించటానికి కల్పించే సన్నివేశాలు సృష్టించడంలో జంధ్యాల దిట్ట. మూడు గంటల పాటు వీక్షకులను కట్టిపడేసే శక్తి అతని స్వంతం.
వేటగాడు సినిమాలో NTR రావు గోపాల రావు ఇంటికి తిరిగివస్తాడు మారు వేషం లో. మారువేషం అంటే ఒక పెద్ద విగ్గు, పెద్ద మీసం, ఒక పుట్టు మచ్చ బుగ్గమీద పెట్టుకుంటే సినిమాలో ఎవరూ గుర్తు పట్టరు. ప్రేక్షక జనం అంత తెలివైన వాళ్ళు కాదు కాబట్టి గుర్తు పట్టేస్తారు. ఇక్కడ హాస్యం కొంత వినూత్నం గా నడుస్తుంది.
NTR…. ఏంది బే డొంగ్రీ , ఏమన్నాను అంటాడు. ఇవే మాటలని సత్యనారాయణ చేత మళ్ళీ అనిపిస్తాడు. అందమైన శ్రీదేవి ని చూస్తూ రావు గోపాలరావు తో అంటాడు. “ఎవరు బే గూట్లే , ఆ బాట్లీ” ఇటువంటి అవమాన కరమైన మాటలతో ఈ సీనులో సత్యనారాయణ చేత తను కావాలనుకున్న శ్రీదేవిని NTR తో డాన్స్ చేసి వినోదపరచటానికి కూడా ఒప్పిస్తాడు. ఇక్కడ దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. తను ప్రేమించిన కన్యని కాబోయే భర్త పరాయ పురుషుడిని వినోద పరచడానికి ఉపయోగిస్తాడు, కొన్ని లాభాలు పొందడానికి. ఇది అతి సున్నితమైన దృశ్యం. హాస్యం తగు మోతాదులో ఉంటేనే రక్తి కడుతుంది. ఏ మాత్రం ఎక్కువైనా బెడిసి కొడుతుంది. ఈ పద్ధతి హాస్యం, తరువాత 80ల్లోనూ 90ల్లోనూ కొంత మంది దర్శకులు ఉపయోగించుకున్నారు. ఇటువంటప్పుడు ఇలాంటి సీను లో హీరోయిన్ ని కించపరిచి నట్టుగా చూపించినట్టు ప్రేక్షకుడు అనుకోడు, అందులో హాస్యం పండినంత సేపు. హాస్య సన్నివేశాలు కి తోడు “చూడు నాన్నా వాడు నోటి కొచ్చినట్లుగా తిట్టడమే కాకుండా , ఏమన్నాను అని మళ్ళీ మళ్ళీ మన చేతే ఆ తిట్లన్నీ అనిపిస్తున్నాడు” అని సత్యనారాయణ చేత రావు గోపాలరావు కి ఫిర్యాదు చేసే సంభాషణలు కడుపుబ్బ నవ్వించేస్తాయి.
70 ల చివరిలోనూ 80 ల మొదట్లోను హీరో ప్రధానమైన కమర్షియల్ సినిమాలు వేళ్లూను కోవడం మొదలైంది. అంతదాకా సెంటిమెంటు జోడించిన కుటుంబ కధా చిత్రాలు ప్రాచుర్యం లో ఉండేవి. మంచికో చెడుకో కధా ప్రాధాన్యమైన సినిమాలకు ఆదరణ తగ్గి హీరో ప్రాధాన్యమైన సినిమాలకి ఆదరణ పెరగసాగింది. ఇటువంటి సినిమాలు విజయవంతం కావాలంటే దర్శకుడికి కమర్షియల్ సినిమా లోని లోటు పాట్లు, సులువులు మొదలైన వాటిలో విశేషానుభవం తోబాటు, ప్రేక్షకుల నాడి పట్టుకోగల సామర్ధ్యం ఉండాలి. ఈ సినిమాల్లో సన్నివేశాలు అన్నీ హీరో చుట్టూ తిరుగుతూ అతని ప్రాధ్యానతను ఎక్కువగా చూపించటానికే ఉపయోగ పడతాయి. సంభాషణలు హీరో కి దైవత్వం ఆపాదించే స్థాయిలో ఉన్నా ఆశ్చర్య పడఖ్ఖర్లేదు. పాటలు అతని నృత్య కౌశలం చూపించటానికి , ఫైట్స్ అతని ఇమేజ్ ని పెంచటానికి ఉపయోగిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే సినిమా హీరో కోసమే అనవచ్చు. మిగతా పాత్రలన్నీ కూడా వాటి పరిధి లో పరిభ్రమిస్తూ హీరో చుట్టూనే తిరుగుతాయి. ఇటువంటి హీరో జపం చేసే సినిమాలు తీయడం ఆసిధారా వ్రతం లాగా అనిపిస్తుంది. సరియైన సన్నివేశాలు, సంభాషణలు, పాటలు, ఫైట్స్ అన్నీ తగు మోతాదు లో లేక పోతే బాక్స్ ఆఫీసు వద్ద బోర్లా పడతాయి. ‘అడవి రాముడు’ఇటువంటి సినిమాలకి గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇందులో హీరో తన డప్పు కొట్టుకోవడం కొంత తక్కువగా అనిపించినా , మిగతా పాత్రల ద్వారా హీరో ప్రాముఖ్యం పెరిగినట్టు కనిపిస్తుంది. ఇది చిత్ర విజయానికి దోహదపడింది.
కామెడీ కి, కమర్షియల్ సినిమా విజయవంతమవడంలో పాటలు, నృత్యాలు తో సమానమైన ఒక ముఖ్యమైన పాత్ర ఉంది . రచయిత హాస్య సన్నివేశాలకి హాస్య సంభాషణలు వ్రాయడమే కాక ఆ సన్నివేశం రక్తి కట్టేటట్టు రూపొందించగలగాలి.
అమృతం ఉన్నదా మానవా
(చేతితో చూపిస్తూ) ఆ ఉంది ఫుల్ బాటిల్, కొట్టుకు రమ్మంటావా
కొట్టుకు అనగా నేమి మానవా
(అప్పటికే ఈ ప్రశ్నలతో విసిగిపోయి) నేను చెప్పలేనే తింగర బుచ్చి
తింగర బుచ్చి అనగానేమి మానవా
ఈ విధం గా పేరుకు పోతున్న సంభాషణల వల్ల విపరీతమైన హాస్యం పుట్టుకొస్తుంది. మామూలుగా ఈ వాక్యాలు చదివితే నవ్వు రాకపోవచ్చు. ఆ సన్నివేశం లో ఒకదాని వెంట ఒకటి ఈ సంభాషణలు కడుపుబ్బ నవ్విస్తాయి. జంధ్యాల గారి గొప్పతనము సన్నివేశాల కనుగుణం గా ఆయన ఏరి కోరి పదాలను ఉపయోగించే విధానం, అనితర సాధ్యం.
హోటల్ పనివాడు : న్యూస్ పేపర్ పొద్దున్నే వస్తుంది
హీరోయిన్ (సందేహంగా): అల్లానా 6 , 6-30 కి ?
హోటల్ పనివాడు : 6 కా 6-30 కా
ఇంకొక సన్నివేశం.
మీ పేరు
సు సు సునాదమాల
అదేమిటి మూడు సు లు ఉన్నాయా
లేదు ఒక సు నే
నాపేరు వి విహారి, (ఒక క్షణం ఆగి) రెండు వి లండోయ్, ఒకటి ఇంటి పేరు, రెండు వంటి పేరు.
నిజంగా ఈ మాటలు పెద్దగా నవ్వు తెప్పించవు. కానీ ఆ సన్నివేశం లో సందర్భానుసారంగా వాడిన పదాలు చిరునవ్వులు కాదు అట్టహాసాలే ఒలికిస్తాయి.
ఇంకా ఉంది….
కంచిభొట్ల శ్రీనివాస్ గారు జంధ్యాల గురించి వ్రాసిన ఆంగ్ల వ్యాసానికి బులుసు సుబ్రహ్మణ్యం గారి స్వేచ్చానువాదం జంధ్యాల అభిమానుల కోసం.
కంచిభొట్ల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలతో
Leave a Reply
You must be logged in to post a comment.