పడమటి సంధ్యారాగం

ఉద్యోగం కోసం సొంత ఊరినీ, దేశాన్నీ వదిలి కుటుంబంతో సహా పరాయి దేశానికి వలస వెళ్ళిన తొలితరం భారతీయుడి కథే ‘పడమటి సంధ్యారాగం’ సినిమా. చిన్నప్పటి నుంచీ అలవాటైన పద్ధతులను, ఆచారాలనూ వదులుకోలేక, వెళ్ళిన దేశం తాలూకు సంప్రదాయాలను అలవాటు చేసుకోలేక ఓ మధ్య వయస్సు వ్యక్తి పదే ఆవేదనను తనదైన శైలిలో హాస్యస్ఫోరకంగా చిత్రీకరించారు దర్శక రచయిత జంధ్యాల. ప్రవాసాంధ్రుడు గుమ్మలూరి శాస్త్రి సినిమాని నిర్మించడమే కాక ప్రధాన పాత్రనూ రక్తి కట్టించారు.

 

సదాచార సంపన్నుడైన ఆదినారాయణ (గుమ్మలూరి శాస్త్రి) ఉద్యోగం కోసం అమెరికా బయలుదేరతాడు, తన భార్యనీ, టీనేజ్ కూతురు సంధ్య (విజయశాంతి) నీ తీసుకుని. ఆదినారాయణ తమ్ముడు రవి అన్నగారికోసం ఒక ఉద్యోగం చూస్తాడు. తనకి ఉన్న రెండు ఇళ్ళలో ఒకదాన్నీ కేటాయిస్తాడు. సంప్రదాయ బద్ధంగా పెరిగిన సంధ్య పెద్దగా చదువుకోలేదు. ఆ ఇంటికి ఎదురిళ్ళలో ఉండే అమెరికా కుర్రాడు క్రిస్ (టాం) నీగ్రో రోనాల్డ్ (ఇప్పటి ప్రముఖ డ్రమ్మర్ శివమణి) లకి సంధ్యతో స్నేహం కుదురుతుంది.

కూతురు అలా నల్లవాడితోనూ, తెల్లవాడితోనూ స్నేహం చేయడం ఇష్టం ఉండదు ఆదినారాయనకి. సంధ్య స్నేహాన్ని తల్లి అభ్యంతర పెట్టదు. ఒక శుభ ముహూర్తాన అబ్బాయిలిద్దరూ సంధ్యకి ప్రపోజ్ చేస్తారు. క్రిస్ కి ‘ఎస్’ చెబుతుంది సంధ్య. సరిగ్గా అప్పుడే అమెరికా లో స్థిర పడ్డ ఒక తెలుగు డాక్టరుతో సంధ్యకి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తాడు ఆదినారాయణ. పెళ్లి చూపులకి వచ్చిన అబ్బాయి సాయంతో క్రిస్ ని కలుసుకుని దూరంగా పారిపోతుంది సంధ్య. కూతురి మతాంతర వివాహాన్ని అంగీకరించక తప్పదు ఆదినారాయణ కి.

కథంతా ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో నడుస్తుంది. ఆదినారాయణ మరణ వార్త తెలిసి, నడివయసు లో ఉన్న సంధ్య, క్రిస్ అంత్యక్రియలకోసం ఇండియా రావడం తో కథ మొదలవుతుంది. కొడుకులు లేని ఆదినారాయణ కి అల్లుడు క్రిస్ అంతిమ సంస్కారం చేయడం, సినిమా ప్రారంభ సన్నివేశం. తన ఐదేళ్ళ వయసులోనే తాతయ్యతో పాటు ఇండియా కి వచ్చేసిన సంధ్య-క్రిస్ ల కూతురు అనిత, ‘అంతిమ సంస్కారం చేసే అర్హత నీకేం ఉంది?’ అని క్రిస్ ని కోపంగా ప్రశ్నించడంతో కూతురికి తన గతం చెబుతుంది సంధ్య.

కథ తాలూకు సీరియస్ నెస్ ని ఏమాత్రం చెడగొట్ట కుండా, సినిమాని ఆసాంతమూ హాస్యరస భరితంగా రూపు దిద్దడం లో జంధ్యాల ప్రతిభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముఖ్యపాత్రల్లో నటించిన ప్రవాస భారతీయుల్లో కొందరు సరిగా నటించలేకపోయినా డైలాగుల్లో విరుపులు, మెరుపుల ద్వారా ఆ లోపాన్ని చాలా వరకు కవర్ చేశాడు దర్శకుడు. అమెరికా జీవితంలో కష్టసుఖాలు, ముఖ్యంగా కొత్తగా ఆ దేశం వెళ్ళే వాళ్లకి ఎదురయ్యే ఇబ్బందులని చిన్న చిన్న సన్నివేశాల ద్వారా నవ్విస్తూ చెప్పాడు.

ముగింపు సన్నివేశంలో ‘మతం’ గురించి విజయశాంతి ఆవేశంగా చెప్పే పొడవైన డైలాగు వినగానే సప్తపది క్లైమాక్స్ లో వర్ణ వ్యవస్థ గురించి జే.వి. సోమయాజులు చెప్పిన డైలాగు గుర్తొస్తుంది. (ఆ సినిమాకి కూడా రచన జంధ్యాలే) విజయశాంతి మినహా ప్రముఖ నటులేవ్వరూ లేరు. ప్రారంభ, ముగింపు సన్నివేశాల్లో ఆహార్యంలో పెద్దరికం కుదరకపోయినా అమెరికా సన్నివేశాల్లో అమాయకత్వం కలబోసిన పాత్రలో విజయశాంతి మెప్పించింది. తర్వాత చెప్పుకోవాల్సింది గుమ్మలూరి శాస్త్రి గురించి. తిండిపోతు ‘గణపతి’ కామెడీ ట్రాక్ పూర్తిగా జంధ్యాల మార్కులో ఉంటుంది.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చడం, పాటలు పాడడం తో పాటు ‘లైఫ్ ఈజ్ షాబీ’ అనే తమాషా పాటను రాశారు కూడా.. కేవలం ఈ పాటలో మాత్రమే విజయశాంతి వెస్ట్రన్ వేర్ లో కనిపిస్తుంది. సంప్రదాయ సంగీతాన్నీ, వెస్టర్న్ మ్యూజిక్ ని కలబోసి నేపధ్య సంగీతాన్నీ అందించారు బాలు. నాలుగు పాటలూ చెప్పుకోదగ్గవే.. నాకు ‘ముద్దుగారే యశోద.. ‘ పాట అంతే ప్రత్యేకమైన ఇష్టం. ముఖ్యంగా ఈ పాట చిత్రీకరణ. ఇక ‘ఈ తూరుపు..’ పాటలో నాయికా నాయకులు పరుగులు పెడుతూనే ఉంటారు.’పిబరే రామరసం’ కీర్తన ని కనీసం ఏడాదికి ఒకసారి శ్రీరామనవమి రోజునైనా తలచుకొని వాళ్ళు అరుదు.  

ఈ సినిమా వచ్చింది 1986 లో. కథ అప్పటికి ఇరవయ్యేళ్ళ క్రితం జరిగింది (అని విజయశాంతి చెబుతుంది) కథలో ప్రస్తావించిన అంశాలు, అంటే రెండు భిన్న సంస్కృతుల మధ్య ఘర్షణ, పుట్టిన దేశాన్నీ అక్కడి సంస్కృతినీ మర్చిపోలేక పోవడం, కొత్త చోట ఇమడలేక పోవడం వగైరా లన్నీ ఈ నాలుగు దశాబ్దాలలోనూ ఏమైనా మారాయా? అని సందేహం నాకు. భూగోళానికి అవతలి వైపున ఉన్న బ్లాగ్మిత్రులు మళ్ళీ ఒకసారి ఈ సినిమా చూసి తమ ప్రస్తుత అనుభవాలని జోడించి టపాలు రాస్తే బాగుంటుందేమో..

 

నెమలికన్ను మురళి రాసిన ఈ వ్యాసం కింద లింకులో చూడచ్చు.

http://nemalikannu.blogspot.com/2009/10/blog-post_14.html

Be the first to comment

Leave a Reply