ఇంటిపేరు జంధ్యాల అసలు పేరు స్నేహం..

ఇప్పటిమాట కాదు. చాలా ఏళ్ళ క్రితం..ఫలానా సంవత్సరం అని ఖచ్చితంగా చెప్పలేను..  అప్పట్లో-
జంధ్యాల విజయవాడలో కాలేజీ స్టూడెంటు.  శ్రీరామా బుక్ డిపో దగ్గర కనిపించాడు. అప్పట్లో అతని చెవిలో పూలు లేకపోయినా చెవికి పోగులున్నట్టు జ్ఞాపకం!
నేను ఫలానా అని తెలీగానే-నన్ను అమాంతం కావలించుకున్నాడు. మీరు నా అభిమాన రచయిత అన్నాడు. ఈమాట అప్పట్లో నాతో ఎక్కువమంది అనేవారు కాదు!
అతను అంతమాటన్నందుకు-బహుశా-గొప్పగా ఆనందించి ఉంటాను. అంచేత అతనంటే ఇష్టం ఏర్పడు ఉండచ్చు!

 

మా పరిచయం స్నేహంగా మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఆ స్నేహం ఎక్కువ కాలం-మూడు దశాబ్దాలకు పైగా బతికింది!
ఇప్పుడు సీను మారింది!

అతను అక్కడెక్కడో ఉన్నాడు.. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను! అయినా నేను చూసే ప్రతి నవ్వులోను అతను కనిపిస్తున్నాడు! హాయిగా పలకరిస్తున్నాడు!
వదిలేయండి!
చిన్నవయసులోనే అతని హోదా పరపతి గొప్పగా పెరిగాయి. రచయితగా సినీ దర్శకుడిగా అతను పెద్దపీటమీద కూర్చున్నా నన్ను ఏనాడూ మరచిపోలేదు! నా అభిమాన రచయిత చార్లెస్ లూయిసనో,క్లిఫ్ మార్టీన్ అనో అతను చెప్పలేదు. ఎప్పుడు ఏ సభలో చెప్పినా-అతని అభిమాన రచయితగా నా పేరు చెప్పి నన్ను గౌరవించేవాడు! రచయితగా అంతో ఇంతో పేరు తెచ్చుకున్నానంటే ఆదివిష్ణు అక్షరాలే కారణమని చెప్పేవాడు. ఇలాంటి సందర్భాల్లో నాకు కన్నీరుబికేది. మనిషికి ఆనందం ఎక్కువైనా కన్నీళ్ళొస్తాయనేది శాస్త్రం.
ఇది కూడా వదిలేయండి..
ఒక వ్యక్తికి సడెంగా హోదా పెరిగితే కళ్ళ్ నెత్తిమీదుంటాయని రూలు! ఆ హోదా కన్న తండ్రిని కూడా కాల్తో కొడుతుంది! తండ్రి తాపీమేస్త్రీ. ఆ వృత్తిలో ఉండి రెక్కలు ముక్కలు చేసుకుని కన్నబిడ్డని చదివించి ప్రయోజకుడిని చేస్తాడు. ఈ చిరంజీవి సిమ్హాసనం ఎక్కగానే ఆ తాపీమేస్త్రీ తెరమరుగౌతాడు. మీ జన్మ వృత్తాంతం చెప్పమని సదరు చిరంజీవిని ఎవరైనా అడిగితే తండ్రి తాహశిల్దారని చెబుతాడే గాని- తాపీమేస్త్రీ అని నిజం చెప్పుకునేందుకు నిరాకరిస్తాడు! ఈ దిక్కుమాలిన రోజుల్లో ఈ టైపు జాతి పురుషులు మన మధ్య ఎక్కువ సంఖ్యలో బ్రతుకుతున్నారు!విషయానికొస్తాను.
నా వల్ల – యస్- కేవలం నా వల్ల అతనికి పరిచయమై – చిత్రపరిశ్రమలో అతని దయవల్ల పట్టు సంపాదించుకున్న నటులు కొందరు ఇప్పుడు నాపేరేమిటని నన్నే అడుగుతున్నారు!
అట్లా అడిగే రోజు తప్పకుండా వస్తుందని జంధ్యాల నాకు ముందే చెప్పాడు! జంధ్యాల మహాజ్ఞాని! స్నేహానికి అతనే సరైన నిర్వచనం!
విజయవాడ యస్సారార్ జంధ్యాల బీకాం చదువుతుండేవాడు. అతంతోపాటూ సుత్తి వీరభద్ర రావు, అశ్వనీదత్తు, సుబ్బరాయ శర్మ,వైన్నకోట విజయరాం, మాధవపెద్ది రమేష్,ఎ.వి.రఘు,ఎం.సి.దాసు వగైరా మిత్రులు ఆ కాలేజిలో చదువుతుండేవారు.
ఆ రోజుల్లో నేను “వాంటెడ్ ఫాదర్స్” అనే హాస్య నాటికను రాశేను. ఆ నాటికను జంధ్యాల అండ్ కో వాళ్ళ కాలేజీలో ప్రదర్శించేరు. ఆ నాటికలో జంధ్యాల ప్రధాన పాత్రధారి. అతని పూర్తిపేరు అతని కీర్తికి మల్లే చాలా పెద్దది! అక్షరం తేడా లేకుండా అంతపెద్ద పేరు నేనిప్పటికీ చెప్పలేను. అంచేత పరిచయమైన కొత్త రోజుల్లో అతన్ని శాస్త్రీ అని పిలిచి- ఆ తర్వాతర్వాత జంధ్యాల అని పిలవడం అలవాటు చేసుకున్నాను!
వయస్సు పరంగా జంధ్యాల కంటే నేను పెద్దవాడ్ని. అందువల్ల జంధ్యాల కంటే ముందుగానే సినీ పరిశ్రమలో అడుగుపెట్టాను. నాకంటే ముందుండాలని పంతం పట్టాడో ఏమో నాకంటే ముందు పోయాడు!

మా మిత్ర బృందం లో అతి సన్నిహితుడు వీరబ్భద్రుడు(సుత్తి). “చూపులు కలిసిన శుభవేళ” అనే సినిమాలో మావాడు చాలా మంచి వేషం వేశాడు. ఆ షూటింగ్ లో వాడి కాలికి దెబ్బ తగిలింది. అసలే షుగర్ వ్యాధి జాస్తిగా ఉన్నవాడు. దానికితోడు కాలికి దెబ్బ. ఆ దెబ్బ కారణంగా వీరభద్రుడు మద్రాసులో కాలం చేశాడు!
అప్పుడు నేనూ జంధ్యాలా హైదరాబాదులోనే షూటింగ్ హడావుడిలో ఉన్నాం. వీరభద్రుడి మరణవార్త నాకు తెలీదు. తెలిసిన జంధ్యాల అసలు విషయం దాచి- మనం మద్రాసు వెడుతున్నామని మా యింటికి ఫోన్ చేసేడు. ఎందుకని అడగలేదు. ఎప్పుడు వెడుతున్నామని అడిగేను. ఇప్పుడే మార్నింగు ఫ్లయిటులో – అన్నాడు.
ఎయిర్పోర్టులో అసలు విషయం చెప్పేడు.. ముందుగా చెప్పచ్చుగా అన్నాను. విని తట్టుకోలేవని చెప్పలేదన్నాడు. అల్లాంటి వార్తలు వినేప్పుడు నీ పక్కన నేనుండాలి అన్నాడు!
విచిత్రం – అతను పొయిన వార్త మిత్రుడు పూసల ద్వారా విని ఎలా తట్టుకోగలిగానో?
మరో మిత్రుడు విన్నకోట విజయరాం ఆ మధ్య హైదరాబాదులో పోయేడు. అప్పుడు కూడా జంధ్యాలే నాకు సాయంగా ఉండి ఆ ఇంటికి తీసుకెళ్ళాడు. నకంటే చిన్నవాళ్ళు నాకంటే ముందు పోవడమేమిటయ్యా అని జంధ్యాలను అడిగాను. మాయ అన్నాడు. ఆ మాయలో తర్వాత వంతు అతనే అయ్యింది. జూన్ పంతొమ్మిది..
ఒక మళయాళీ సినిమా చూడటానికి మేమిద్దరం త్రివెండ్రం వెళ్ళాం. అది ఆదివారం. ఆ ఊళ్ళో తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారని జంధ్యాలే చెప్పాడు.ఎత్లా కలుసుకోవడం అని నేను అడిగేను. సింపులన్నాడు. ఆ సింపులే చెప్పమన్నాను.అతను చెప్పడం ప్రారంభించాడు-
మెయిన్ రోడ్ మీద నడుద్దాం. సిగ్గువిడిచి నువ్వు హరిశ్చంద్ర పద్యాలు పడు తెలుగువాడెవడైనా వింతే మళయాళి గడ్డ మీద తెలుగు పద్యాలేమిటని ఆగిపోతాడు. ఆగిన వాళ్ళని పట్టుకుంటే మిగిలిన వాళ్ళని అతనే పరిచయం చేస్తాడని ఉపాయం ఉప్దదేశించాడు. ఉపాయం బాగానే ఉంది కానీ ఆ పద్యమేదో నువ్వే పాడచ్చు గా అని అని అడిగేను. ఇల్లాంటి సందర్భాల్లో తన గొంతు సూటవ్వదన్నాడు.. నాగొంతు బాగా పనికొస్తుందన్నాడు. గళం విప్పితే వినే వాళ్ళు గడగడా వణికి చస్తారన్నాడు. అంత చెప్పిన తర్వాత అతని మాట కాదనలేక- ఆ ముచ్చటేదో చూద్దామనే కోరికతో-”ఇచ్చోటనే” అనే పద్యాన్ని త్రివెండ్రం మెయిన్ రోడ్ మీడ తిప్పి తిప్పి పాడాను. భాష అర్థం కానీ మళయాళీలు కన్నీరెట్టుకున్నారే కానీ – తెలుగువాళ్ళకి ఆ అద్రుష్టం లభించలేదు. కడు చమత్కారి జంధ్యాల.
ఆపద్బాంధవుడు సినిమాలో అతను వేషం కట్టాడు. తాను రాసిన కావ్యాన్ని తనకిష్టమైన వ్యక్తికి అంకితమిచ్చి ఆ సినిమాలో ప్రాణం విడిచేడు. ఆ తర్వాత జరిగింది కూడా అదే.. అతను సృష్టించిన నవ్వుల్ని తెలుగుజాతికి అంకితమిచ్చి తాను శలవు తీసుకున్నాడు.
అతని సినిమాలు ఎంచక్కా అతనే రాసుకోవచ్చు
కొన్ని నా చేత రాయించుకున్నాడు.
అయ్ లవ్ యువర్ రైటింగ్స్ అనేవాడు
ఆమాటే సభల్లో చెప్పేవాడు.

జంధ్యాల నాకంటి శ్రీకృష్ణదేవరాయల్లాగా కనిపించేవాడు
అప్పుడప్పుడు భోజరాజనిపించేవాడు
అతని సభలో నేనెవడ్నో అప్పుడు తెలీలేదు..
ఇప్పుడు తెలుసుకుందామంటే అతను లేడు.

(source: జంధ్యల గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా 2002లో ఆదివిష్ణు గారు హాసం పత్రికకు రాసిన వ్యాసం.. జూన్16-30, 2002 హాసం లో పూర్తి పాఠం చూడవచ్చు)

http://chitram.maalika.org/%E0%B0%87%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0%E0%B1%81-%E0%B0%9C%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%85%E0%B0%B8%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AA%E0%B1%87/

 

Comments:

 

karthik ..

20 weeks ago · 0 replies · 0 points

అపచారం అపచారం.. ఆ పైన “written by”  బదులు “Collected by” అని ఉంటే బాగుంటుంది.. 

Be the first to comment

Leave a Reply