హాస్యం అనే పదానికున్న అర్ధాలు వెతకడానికి తెలుగు నిఘంటువు తిరగేస్తే అందులో ఓ మూడక్షరాలు కనిపించకపోవచ్చు. కానీ, తెలుగు సినిమాకి ఓ నిఘంటువు తయారు చేస్తే అందులో ‘హాస్యము’ కి ఎదురుగా తప్పకుండా ఉండే మూడక్షరాలు ‘జంధ్యాల.’ వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి అన్న తన వంటి పేరుతో ఎవరికీ తెలికయకపోయినా, జంధ్యాల అనే తన ఇంటి పేరుతో లక్షలాదిమంది తెలుగు వాళ్లకి సినిమా మాధ్యమం ద్వారా ప్రియమైన వ్యక్తిగా మారిన జంధ్యాలని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
జంధ్యాల కేవలం హాస్యరసాన్ని మాత్రమే పంచారా? ఈ ప్రశ్నకి సమాధానం ‘కాదు’ అని చెప్పడానికి అరక్షణం కూడా ఆలోచించాల్సిన పని లేదు. అటు పెన్నుతోనూ, ఇటు మెగా ఫోన్ తోనూ నవరసాలనూ అలవోకగా పలికించిన జంధ్యాలకి వ్యక్తిగతంగా ఇష్టమైనది హాస్యరసం. బహుశా అందుకేనేమో, హాస్యం ద్వారానే అధికశాతం ప్రేక్షకులకి దగ్గరయ్యారాయన. అందుకే మెజారిటీ ప్రేక్షకులకి జంధ్యాల పేరు చెప్పగానే గుర్తొచ్చేది కేవలం హాస్యమే. ఎంత చేదు వాస్తవానికైనా హాస్యం అనే పంచదార పూత పూసి ప్రేక్షకులచేత అవుననిపించడంలో నిష్ణాతుడు జంధ్యాల.
రచయిత, దర్శకుడు అన్నవి జంధ్యాలలో రెండు ముఖ్య పార్శ్వాలు. నాటక రచన నుంచి సినిమా రచనకి వచ్చి, సినిమాలకి రాస్తూనే దర్శకుడిగా మారి, సినిమాలు తీస్తూనే రాయడం కొనసాగించి, రెండు పడవల ప్రయాణాన్ని కడవరకూ విజయవంతంగా కొనసాగించడం అంత సులువైన పనేమీ కాదు. కళకీ కళాకారుడికీ మధ్య ఉండే సంబంధాన్ని ‘సిరిసిరిమువ్వ’ల సవ్వడుల నేపధ్యంలో ప్రేక్షకులకి చెప్పాలన్నా, ఓ శాస్త్రీయ సంగీత విద్వాంసుడికీ ఓ వేశ్యకీ మధ్య ఏర్పడ్డ మానసిక అనుబంధానికి ‘శంకరాభరణం’ రూపంలో దృశ్య రూపం ఇవ్వాలన్నా, ఓ జంటకి కులాంతర వివాహం చేసి వాళ్ళచేత ‘సప్తపది‘ తొక్కించాలన్నా, సరిగమలతో చదరంగమాడే అనంతరామ శర్మ అహంభావానికి మసకబారిన ‘స్వాతికిరణం’ కథని చెప్పాలన్నా కళాతపస్వికి వెన్నుదన్నుగా నిలిచిన కలం జంధ్యాలదే.
ఓపక్క ఇలాంటి కళాత్మక సినిమాలకి కత్తిమీద సాములాంటి సంభాషణల రచన చేస్తూనే మరోపక్క ‘వేటగాడు‘ ‘అడవిరాముడు‘‘డ్రైవర్ రాముడు’ లాంటి కమర్షియల్ సినిమాలకి గిలిగింతలు పెట్టే సంభాషణలు సృజించడం రచయితగా జంధ్యాల స్థాయిని చెప్పడానికి ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. “చాతుర్వర్ణం మయాసృష్టం గుణ కర్మ విభాగచ” అన్న గీతాకారుడి ఉవాచని ఆధారంగా చేసుకుని ఎంతో క్లిష్టమైన ‘సప్తపది‘ సినిమా ముగింపుని అందరికీ ఆమోదయోగ్యంగా మలిచారు జంధ్యాల. తర్వాత తను రచన చేసిన ”సీతాకోక చిలుక’ సినిమాకీ, దర్శకత్వం వహించిన ‘పడమటి సంధ్యారాగం’ సినిమాకీ ఇదే తరహా సన్నివేశాలకి సంభాషణలు వైవిధ్య భరితంగా అందించడం గమనార్హం.
చిరంజీవికి జంధ్యాల రాసిన ఏ రెండు సినిమాలూ ఒకే తరహాలో ఉండకపోవడం సైతం చెప్పుకోవాల్సిన విషయమే. కుటుంబ బంధాలతో కూడిన ‘విజేత,’ స్వీయ దర్శకత్వంలో తీసిన హాస్య భరిత చిత్రం ‘చంటబ్బాయి,’ ఊహల్లో తిప్పి తీసుకొచ్చే ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి,’ విశ్వనాధ్ రెండు సినిమాలు ‘స్వయంకృషి‘ ‘ఆపద్భాందవుడు‘ వీటిలో ఏ రెంటిని పోల్చగలం? ఆమాటకొస్తే జంధ్యాల తీసిన పూర్తి స్థాయి హాస్యరస చిత్రాలన్నీ కూడా వేటికవే ప్రత్యేకం. నరేష్, రాజేంద్రప్రసాద్ లాంటి కథానాయకులతో పాటు ‘సుత్తి ద్వయం,’ శ్రీలక్ష్మి లాంటి ఆయనకీ ఇష్టమైన కొందరు నటులు అన్ని సినిమాలలోనూ కనిపించడం మినహాయిస్తే ఇతరత్రా పోలికలు వెతకడం కష్టమైన పనే.
జంధ్యాల దర్శకుడిగా మారింది ‘ముద్దమందారం’ తోనే అయినా, ముందుగా తల్చుకోవాల్సింది జాతీయ అవార్డు పొందిన ‘ఆనంద భైరవి’ గురించి. ఈ సినిమా మీద కే. విశ్వనాధ్ ప్రభావం ఉండడాన్ని తెరమీద చూడొచ్చు. అప్పటికే విశ్వనాధ్ తీసిన కళాత్మక సినిమాలకి సంభాషణలు రాసిన జంధ్యాల శాస్త్రీయ నృత్యం, వర్ణ వ్యవస్థలని నేపధ్యంగా తీసుకుని తీసిన సినిమా ఇది. నృత్యంతో పాటు, సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారనడానికి ఇవాల్టికీ చిరంజీవులుగా మార్మోగుతున్న పాటలే సాక్ష్యం. అలా అని తన మార్కు హాస్యాన్నీ వదులుకోలేదు.
“నాకు ఇద్దరు చెల్లెళ్ళు. ఒకరు తోడపుట్టిన చెల్లెలు. మరొకరు తాళికట్టిన చెల్లెలు,” అంటాడు జంధ్యాల హీరో, ‘నాలుగుస్థంభాలాట‘ లో. అనివార్య పరిస్థితుల్లో తన మిత్రుడి స్నేహితురాలి మెడలో తాళి కడతాడతను. విని జీర్ణించుకోడానికే ఎంతో సమయం పట్టే “తాళికట్టిన చెల్లెలు” సెంటిమెంట్ ని సినిమాలో చూపించి అవుననిపించడం తాడు మీద నడవడం కాక మరేమిటి? టీనేజి ప్రేమకథని ఎంత సున్నితంగా తెరకెక్కించ వచ్చో ‘ముద్దమందారం‘ చెబితే, పెద్దగా కథంటూ ఏమీ లేకుండానే ప్రేక్షకులని ధియేటర్లకి మళ్ళీ మళ్ళీ రప్పించడం ఎలాగో‘శ్రీవారికి ప్రేమలేఖ’ చెబుతుంది. ‘నెలవంక’ లాంటి సందేశాత్మక సినిమాలు బాగా ఆడకపోవడంతో పూర్తిగా హాస్య చిత్రాలపై దృష్టి పెట్టారు జంధ్యాల.
పాత సినిమాలన్నా, ముఖ్యంగా వాటిలో పాటలన్నా జంధ్యాలకి ఎంత ఇష్టమో తెలుసుకోడానికి ఆయన తీసిన సినిమాల పేర్లు చాలు. ఒక్క ‘మాయాబజార్‘ పాటల్లో ‘అహనా పెళ్ళంట’ ‘ఒహోనా పెళ్ళంట’ ‘చూపులు కలిసిన శుభవేళ’ ‘వివాహభోజనంబు‘ పల్లవులని, ఆ సినిమాలో వినిపించే ‘బావా బావా పన్నీరు’ ‘హై హై నాయకా’ మాటలనూ తన సినిమాలకి పేర్లుగా పెట్టేశారు. తను తీసిన సినిమాల్లోనూ సంగీతానికి పెద్ద పీట వేశారు జంధ్యాల. “అలివేణీ ఆణిముత్యమా..” తో మొదలు పెట్టి అలా వింటూ ఉండిపోవడమే. అతి తక్కువ బడ్జెట్లోనే పాటని ఎంతో అందంగా తీయడం ఎలాగో జంధ్యాల దగ్గర నేర్చుకోవాలి. చిత్రీకరణలో భారీతనం ఉండదు, అలాఅని బోర్ కొట్టడమూ ఉండదు.
దర్శకుడు సమర్దుడైతే సినిమాలో ఎన్ని లోపాలనైనా కప్పేయగలడు అనడానికి కూడా ఉదాహరణ జంధ్యాలే. ‘పడమటి సంధ్యారాగం’సినిమాలో సహాయ పాత్రలని పోషించిన వాళ్ళందరూ విదేశంలో స్థిరపడ్డ తెలుగు వాళ్ళు. నటన వాళ్ళ వృత్తి కాదు. అందుకే పట్టి చూస్తే వాళ్ళ నటనలో ఎన్నో లోపాలు కనిపిస్తాయి. కానీ తనదైన మార్కు డైలాగు విరుపులతోనూ, చమక్కులతోనూ ప్రేక్షకులని అటువైపుగా చూడనివ్వలేదు జంధ్యాల. తన సినిమాల్లో హాస్య పాత్రలన్నీ మన మధ్య నుంచి వచ్చినవే. అధికశాతం పాత్రలు మధ్య తరగతి మందహాసాలే. సినిమా కథలు వర్ణించి చెప్పేవాళ్ళు, మనిషి కనబడితే చాలు సొంత డబ్బా మొదలెట్టేసే వాళ్ళు, కవితలతో చావగొట్టే నవకవులు, మితిమీరిన భాషాభిమానం ఉన్నవాళ్ళు.. ఇలా అందరూ మనకి సమూహంలో కనిపించే వాళ్ళు. కాకపొతే వాళ్ళలో అతిగా అనిపించే లక్షణాన్ని కొంచం పెద్దది చేసి చూపించడం ద్వారా మనల్ని నవ్వుల్లో ముంచేశారు జంధ్యాల.
పుట్టుకతో వచ్చే వైకల్యాలైన నత్తి, వినికిడి శక్తి లేకపోవడం వంటి వాటిని కామెడీకి వాడుకోవడం చూసినప్పుడు “ఇలా చేయకుండా ఉంటే బాగుండేది” అనిపించక మానదు. అయితే హాస్యం కోసం బూతు జోలికి వెళ్ళకుండా ఉండడాన్ని మాత్రం అభినందించాల్సిందే. నిజానికి ఈ క్లీన్ కామెడీనే జంధ్యాలకి పెద్ద సంఖ్యలో అభిమానులని సంపాదించి పెట్టింది. చాలా సందర్భాలలో మగవాళ్ళు కొత్త సినిమాని మొదటిసారి చూసేది స్నేహితులతో. అది నచ్చితే, కుటుంబంతో చూసేదిగా ఉందనిపిస్తే కుటుంబ సభ్యులతో మళ్ళీ చూస్తారు. ఇలా మళ్ళీ రప్పించుకోడానికి ఈ క్లీన్ కామెడీ దోహద పడింది. చిన్నపిల్లలున్న ఇళ్ళలో మిగిలిన హాస్య చిత్రాల డీవీడీలని ఉంచుకునే ధైర్యం చేయలేనివాళ్లు కూడా, జంధ్యాల సినిమాల డిస్కులని సగర్వంగా దాచుకుంటున్నారు.
హాస్య చిత్రాలు తీస్తూ ‘హాస్య బ్రహ్మ’ గా వెలిగిపోతున్నసమయంలో కూడా ‘సెంటిమెంట్’ తో తనకున్న సెంటిమెంట్ ని వదులుకోలేక పోయారు జంధ్యాల. బెజవాడ బాబాయ్ హోటల్ లో తను ఇష్టంగా తిన్న ఇడ్డెన్లు, పెసరట్లతో పాటు వాటిని ఆప్యాయంగా వండి వడ్డించిన ‘బాబాయ్’ ప్రేమ ఆయన చేత ‘బాబాయ్ హోటల్’ సినిమా తీయించింది. తాము కోరుకున్న రుచులు ఈ హోటల్లో దొరక్కపోవడంతో అధిక శాతం ప్రేక్షకులు తిరిగి చూడలేదు. మరికాసేపట్లో షూటింగ్ అనగా అప్పటికప్పుడు ఆవేల్టి పోర్షన్ స్క్రిప్ట్ రాయడం అనే జంధ్యాల అలవాటుని పొగిడిన వాళ్ళూ ఉన్నారు, తెగిడిన వాళ్ళూ ఉన్నారు. ఎప్పుడైనా, ఏదైనా రాయగలను అన్న నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే అప్పటికప్పుడు రాయగలరన్నది అందరూ అంగీకరించే మాట.
చివరిరోజుల్లో తీసిన సినిమాపై జంధ్యాల అంతగా శ్రద్ధ పట్టలేదన్నది సుస్పష్టం. నాయికానాయకుల ఎంపికే ఎన్నో సందేహాలని రేకెత్తించింది. అప్పటివరకూ తను బానిసలుగా చేసుకున్న వాటికి తాను బానిస అవ్వడం మొదలుపెట్టారన్నది సన్నిహితులు దిగులుగా గుర్తు చేసుకున్న వాస్తవం. నవ్వించడం అనే యోగాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్ళిన భోగి జంధ్యాల. నేర్చుకోవాలనే తపన ఉన్నవాళ్ళకి ఆయన సినిమాలు మాత్రమే కాదు, జీవితమూ చాలా విషయాలనే నేర్పుతుంది
ఈ వ్యాసం నెమలికన్ను మురళి గారు చిత్రం.మాలిక కోసం రాసింది.ఆ వ్యాసాన్ని ఈ కింద లింకులో చూడవచ్చు.
http://chitram.maalika.org/jandhyaavandanam/
Leave a Reply
You must be logged in to post a comment.